ఆరోగ్యశ్రీ సేవలకు ఆటంకం!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

ఉద్యోగ, పాత్రికేయుల వైద్య సేవలకూ..
రూ.1500 కోట్ల బకాయిలు
15లోగా చెల్లించకపోతే సేవలు బంద్‌
ప్రైవేటు ఆసుపత్రుల ఏకగ్రీవ తీర్మానం

ఇప్పటికే రాష్ట్రంలో పలు కార్పొరేట్‌, ప్రైవేటు ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ చికిత్సలను, ఉద్యోగులు, పాత్రికేయుల ఆరోగ్య పథకం(ఈజేహెచ్‌ఎస్‌) కింద చికిత్సలను అరకొరగా అందిస్తుండగా.. ఆ కొద్దిపాటి పరిమిత చికిత్సలకు కూడా ఇక నుంచి ఆటంకం ఏర్పడనుంది. ఆరోగ్యశ్రీ పథకానికి అనుసంధానంగా ఉన్న ప్రైవేటు ఆసుపత్రులకు దాదాపు రూ.1500 కోట్ల బకాయిలు పేరుకుపోవడంతో.. ఇక ఆరోగ్యశ్రీ, ఈజేహెచ్‌ఎస్‌ చికిత్సలందించడం తమ వల్ల కాదని అవి చేతులెత్తేశాయి. ఈ నెల 10లోగా బకాయిలన్నింటినీ పూర్తిస్థాయిలో చెల్లించని పక్షంలో ఈ నెల 11వ తేదీ నుంచి కార్పొరేట్‌ ఆసుపత్రులు, ఈ నెల 15లోగా చెల్లించని పక్షంలో 16వ తేదీ నుంచి ఆరోగ్యశ్రీ ట్రస్టు అనుసంధాన ఆసుపత్రులు ఆయా పథకాల కింద సేవలన్నింటినీ నిలిపివేస్తామని ఏకగ్రీవంగా తీర్మానించాయి. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ ఆరోగ్యశ్రీ అనుసంధాన ఆసుపత్రుల సంఘం(తన్హా) సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తన్హా రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ రాకేశ్‌ తెలిపారు. దీనికి సంబంధించిన వినతిపత్రాన్ని సోమవారం సచివాలయంలో వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు, ఆ శాఖ ముఖ్యకార్యదర్శి శాంతికుమారికి, ఆరోగ్యశ్రీ ట్రస్టు కార్యాలయంలో పథకం ముఖ్య కార్యనిర్వహణాధికారికి అందజేయనున్నట్లు ఆయన చెప్పారు.వైద్య సేవల నిలిపివేతపై తెలంగాణ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘం(టీషా) ఇప్పటికే ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈఓకు వినతిపత్రం అందజేసింది.

అంత మొత్తం బకాయిలు లేవు
మొత్తం 1500 కోట్ల బకాయిల్లో టీషాకు చెల్లించాల్సినవే సుమారు 800 కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఆరోగ్యశ్రీ వర్గాలు మాత్రం రూ.1500 కోట్ల బకాయిలు లేవని, రెండు పథకాలకు కలుపుకొని టీషా, తన్హాలకు సుమారు రూ.800 కోట్ల వరకు చెల్లింపులు జరపాల్సి ఉందని చెబుతున్నాయి. ఈ వారంలోనే సుమారు రూ.200 కోట్ల వరకు విడుదలయ్యే అవకాశాలున్నాయని, దశలవారీగా బకాయిలను చెల్లిస్తామని పేర్కొంటున్నాయి. నిధుల విడుదలలో జాప్యం, ఆసుపత్రులు చికిత్సలు నిలిపివేయడం.. ఈ రెండింటి ఫలితంగా ప్రధానంగా నిరుపేదలు, ఉద్యోగులు, పింఛనుదారులు, పాత్రికేయులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోంది. చాలా సందర్భాల్లో పైరవీలు చేయించుకుంటే తప్ప చికిత్సలు పొందలేని దుస్థితి నెలకొంది.

తన్హా, టీషాల ప్రధాన కోర్కెలు
* తొలుత బకాయిలను పూర్తిగా చెల్లించడం
* మున్ముందుఎప్పటికప్పుడూ చెల్లింపులు జరపడం
* అనుసంధాన ఆసుపత్రులతో కుదుర్చుకునే ముందస్తు ఒప్పంద ప్రక్రియలో ఉన్న లోపాలను చక్కదిద్దడం
* పదేళ్లుగా పెంపుదలకు నోచుకోని చికిత్స ధరలను హేతుబద్ధంగా పెంచడం

ఎందుకీ సమస్య?

* తెలంగాణ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘం(టీషా), తన్హా.. రెండూ కూడా ఏడాదిగా ఈజేహెచ్‌ఎస్‌లో ఔషధ చికిత్స(మెడికల్‌ ప్రొసీజర్లు)లను నిలిపివేశాయి.
* చికిత్సల ధరలను ముందే నిర్ణయించిన కొన్ని రకాల శస్త్రచికిత్సలను మాత్రమే అందజేస్తున్నాయి.
* దీనికి ప్రధాన కారణం టీషా, తన్హాలకు కలుపుకొని బకాయిలు సుమారు రూ.1500 కోట్లు పేరుకుపోవడం.
* ఈ నిధులు ఒక్క ఏడాదిలో పేరుకుపోయినవి కావు. ఏటా రూ.200-300 కోట్ల చొప్పున గత ఐదేళ్లలో బకాయిలు పేరుకుపోయినట్లు తన్హా వర్గాలు తెలిపాయి.
* గతేడాది డిసెంబరులోనే తన్హా ఆధ్వర్యంలో సేవల నిలిపివేతకు తాఖీదులివ్వగా ప్రభుత్వం సుమారు రూ.200 కోట్లను విడుదల చేసింది.
* ఆ తర్వాత నుంచి మళ్లీ నిధులు విడుదల కాకపోవడంతో ఏడు నెలలుగా బకాయిలు పేరుకుపోయాయి.
* ఇటీవల 20 రోజుల కిందట తన్హా బృందం వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను కలిసి బకాయిల అంశంపై వినతిపత్రాన్ని అందజేసింది.
* ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో ఆరోగ్యశ్రీ, ఈజేహెచ్‌ఎస్‌ చికిత్సలు నిలిపివేయడం తప్పనిసరి అవుతోందని తన్హా అధ్యక్షులు రాకేశ్‌ తెలిపారు.

(Courtacy Eenadu)

 

RELATED ARTICLES

Latest Updates