
‘ఈ భూమి మనదిరా.. ఈ నేల మనదిరా.. ఈ నిజాం ఎవడురా..’ అంటూ జనాన్ని జాగృతం చేసిన ప్రజాకవి సుద్దాల హనుమంతు. కవిగా, కళాకారుడిగా తన జీవితాన్ని కష్ట జీవుల కోసం అంకింతం చేశారు. వీధి బడిలో ఉర్దూ, తెలుగు నేర్చుకున్నారు. శతకాలు, కీర్తనలు, సీస పద్యాలు, కంద పద్యాలు కంఠస్థం చేశారు. చిన్న తనం నుంచీ ఆయనకు కళారూపాల పట్ల ఆసక్తి ఎక్కువ. అంజన దాసు వద్ద హరికథలు నేర్చుకున్నారు. బుర్రకథ, యక్షగానం, పాటలు పాడటం వంటివీ సాధన చేశారు. సుద్దాల హనుమంతు బుర్ర కథ చెబితే గడ్డిపోచ కూడా యుద్ధానికి సిద్ధమయ్యేదట! ప్రజాగాయకుడిగా మరువ లేని పాత్రను పోషించిన సుద్దాల నల్లగొండ జిల్లా మోత్కూరు మండలంలోని పాలడుగు గ్రామంలో 1910లో పేద కుటుంబంలో జన్మించారు. ఆయన ఇంటిపేరు గుర్రం అయితే, సుద్దాల గ్రామంలో నివసించడంతో ఇంటిపేరు సుద్దాలగా స్థిరపడింది. అక్కడే ఆర్యసమాజం పట్ల ఆకర్షితుడై దాని కార్యకర్తగా చేశారు.
నిజాం వ్యతిరేక పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. హైదరాబాద్ రాజ్యంలో జరుగుతున్న అనేక అక్రమాలను, భూస్వాముల దురాగతాలను, దొరల దౌర్జన్యాలను ఎండగడుతూ బుర్రకథల రూపంలో చాటి చెప్పి జనాన్ని ఉర్రూతలూగించారు. గొల్లసుద్దులు, లత్కోర్ సాబ్, బుడబుక్కలు, ఫకీరు వేషం, సాధువు తదితర కళారూపాలు ప్రదర్శిస్తూ పీడిత ప్రజల బాధలు, వారు పడుతున్న యాతనలను కళ్లకు కట్టేవారు. తెలంగాణ సాయుధ పోరాట సమయంలో కమ్యూనిస్టు పార్టీ దళ సభ్యుడిగా తన పాటల ద్వారానూ ప్రజల్లో ఉద్యమస్ఫూర్తిని రగిలించారు. 11వ ఆంధ్ర మహాసభకు వాలంటీర్‌గా పని చేశారు. భువనగిరిలో జరిగిన ఆ మహాసభ ప్రభావంతో సుద్దాలలో దాని శాఖను స్థాపించారు. దాని తరఫున ఆందోళనలు, పోరాటాలు నిర్వహించారు. ప్రజల్ని రెచ్చగొడుతున్నారంటూ నిజాం ప్రభుత్వం ఆయనపై అరెస్టు వారెంటు జారీ చేసింది. దీందో హనుమంతు అజ్ఞాతంలోకి పోయారు. జీవితమంతా కమ్యూనిస్టుగా జీవించిన సుద్దాల హనుమంతు రాసి, పాడిన ప్రతి పాట నేటికీ సజీవంగా ఉన్నాయి. ‘పల్లెటూరి పిల్లగాడా.. పసుల గాసే మొనగాడా.. పాలు మరచి ఎన్నాళ్లయిందో… ఓ పాల బుగ్గలా జీతగాడా’ అనే పాట వింటే కరిగిపోని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. జీవితమంతా ప్రజల కోసమే వెచ్చించిన హనుమంతు 1982 అక్టోబర్ 10 న కన్నుమూశారు. అయినా ఆయన పాటలు నేటికీ స్ఫూర్తి రగిలిస్తూనే ఉన్నాయి.
ఎస్. బాబురావు
(నేడు సుద్దాల హనుమంతు వర్ధంతి)