ధిక్కార్‌

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
  • నేతలపై పట్టు కోల్పోతున్న కేసీఆర్‌!
  • అధినేతపై తగ్గుతున్న భయం, భక్తి
  • నివురుగప్పిన నిప్పులా అసమ్మతి
  • టీఆర్‌ఎ్‌సలో గతానికి భిన్నమైన పరిస్థితి
  • పరోక్ష వ్యాఖ్యలతో పార్టీపై దాడి
  • ఆనక దురుద్దేశం లేదంటూ ఖండనలు
  • బీజేపీ వైపు టీఆర్‌ఎస్‌ నేతల చూపు
  • చేరతామంటూ మీడియాకు సమాచారం
  • అధిష్ఠానం దిగివచ్చాక తూచ్‌.. తూచ్‌
  • దీంతో పార్టీ ఇమేజ్‌కి తీరని నష్టం
  • హామీలకు భిన్నంగా అధిష్ఠానం చేతలు
  • పిలవకుండా కలవడానికి వెళ్తే నో..
  • లోలోన రగులుతున్న పార్టీ నేతలు

టీఆర్‌ఎస్‌లో చాలా మంది నేతలకు అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ముందు కేసీఆర్‌, కేటీఆర్‌ ఎన్నో హామీలు ఇచ్చారు. అయితే ఎన్నికలు ముగిసి, ఫలితాలు వచ్చి.. చాలా రోజులు అవుతున్నా వారిలో చాలా మందికి ఇచ్చిన హామీలు నెరవేరలేదు. అదే సమయంలో ఇతరులకు పదవుల పందేరం జరుగు తుండటం.. కేసీఆర్‌, కేటీఆర్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకునే చాన్స్‌ కూడా చిక్కకపోవడంతో వారికి కడుపు మండుతోంది.

హైదరాబాద్‌, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): ‘టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అంటే నిన్నమొన్నటి వరకు పార్టీలో అందరికీ హడల్‌. కానీ, ఇప్పుడది సడలిపోతున్నది’ అనే అభిప్రాయాలు ‘గులాబీ’ గూటి నుంచే వ్యక్తమవుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల ఫలితాల ముందువరకు చాపకింద నీరులా ఉన్న అసమ్మతి సెగలు.. క్రమంగా తెరపైకి వస్తున్నాయి. అధినేతపై విధేయత చాటుకోవడం మినహా.. ఎన్నడూ ఎదురుచెప్పని గళాలు కూడా ఇప్పుడు అసంతృప్తి స్వరాలను పలికిస్తున్నాయి. ప్రధానంగా కేసీఆర్‌ నిర్ణయాలు, వ్యవహారశైలిని తప్పుబడుతున్నాయి. వీటిని అధినేతపై తగ్గుతున్న భయం, భక్తికి సంకేతాలుగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అదే సమయంలో ఈ పరిణామం టీఆర్‌ఎ్‌సలో గతానికి భిన్నమైనదిగా పార్టీ ముఖ్యులు అంచనా వేస్తున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి.. టీఆర్‌ఎస్‌ తొలిసారి అధికారంలోకి వచ్చాక దాదాపు నాలుగున్నరేళ్లపాటు సీఎం కేసీఆర్‌కు పార్టీలో, ప్రభుత్వంలోనూ ఎదురులేదు.

బంగారు తెలంగాణ సాధన పేరుతో ఇతర పార్టీల నుంచి టీఆర్‌ఎ్‌సలో చేరినవారి (బీటీ బ్యాచ్‌)లో కొందరికి మంత్రి పదవులు, కీలక బాధ్యతలు అప్పగించినా.. తొలినుంచీ పార్టీలో ఉండి రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొన్న యూటీ (ఉద్యమ తెలంగాణ) బ్యాచ్‌ నుంచి చడీచప్పుడు లేదు. వారంతా అంతర్గతంగా మథనపడ్డారే తప్ప.. నోరుతెరిచి మాట్లాడటానికి సాహసించలేదు. నిరుడు అసెంబ్లీని గడువుకు ఆరునెలల ముందే రద్దు చేసి.. ముందస్తు ఎన్నికలకు వెళ్లినా ఎవరూ ప్రశ్నించలేదు. ఆ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ భారీ మెజారిటీతో తిరిగి అధికారంలోకి రావడంతో సీఎం కేసీఆర్‌ చెప్పింది వినడం మినహా.. మారు మాట్లాడే వారి సంఖ్య బొత్తిగా తగ్గిందనే అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో వ్యాపించింది. టీఆర్‌ఎస్‌ తొలి ప్రభుత్వంలో బంగారు తెలంగాణ నిర్మాణం, మలి సర్కారులో రాజకీయ పునరేకీకరణ పేరుతో ఇతర పార్టీల నుంచి చేరికలను పెద్దఎత్తున ప్రోత్సహించినా, ‘గులాబీ’ నేతలెవరూ బహిరంగంగా ప్రశ్నించలేదు. తద్వారా అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలో ‘ఓడలు బండ్లు..బండ్లు ఓడలు’ అయినప్పటికీ కిమ్మనలేదు. కానీ, అసెంబ్లీ ముందస్తు ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేసి ఓడిపోయిన నేతలతోపాటు కొందరు గెలిచిన నేతలు కూడా సొంత పార్టీ వర్గాలపైనే అసంతృప్తి వ్యక్తం చేస్తుండటం రాజకీయంగా చర్చనీయాంశమైంది.

పార్టీ నేతలే కొందరు కుట్ర పన్ని తమను ఓడించారని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు వంటివారు బాహాటంగానే వ్యాఖ్యానించారు. గెలిచిన నేతల్లో కూడా కొందరు.. తమను ఓడించడానికి చివరిదాకా ప్రయత్నాలు జరిగాయని పార్టీ వేదికలపైనే కుండబద్దలు కొట్టారు. తమను ఓడించడానికి ప్రయత్నించిన వారికి టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం ముఖ్యుల్లో కొందరి ఆశీస్సులు ఉన్నట్లు ఆయా నేతలు గట్టిగా నమ్ముతున్నారు. ఇది సీఎం కేసీఆర్‌పై ఆగ్రహానికి తొలి బీజంగా మారింది.

ఈటలను టెన్షన్‌ పెట్టడంపైనా..

తెలంగాణ ఉద్యమంలో మమేకం కావడంతోపాటు ఆవిర్భవించిన తొలినాళ్లలో టీఆర్‌ఎస్‌ కష్టనష్టాలు చవిచూసిన సమయంలో అండగా నిలిచిన మంత్రి ఈటల రాజేందర్‌ను అధిష్ఠాన శిబిరం ఉద్దేశపూర్వకంగా టెన్షన్‌కు గురి చేస్తోందనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. టీఆర్‌ఎస్‌ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఈటలను తొలి విస్తరణలోనే కేబినెట్‌లోకి తీసుకున్నప్పటికీ, అప్పుడు అందరికంటే ఆలస్యంగా ఆయనకు సమాచారం వెళ్లింది. అంతకంటే ముందు టీఆర్‌ఎస్‌ సొంత మీడియాలో ఈటలకు వ్యతిరేకంగా కథనం వచ్చింది. ఈ మధ్య సీఎం కేసీఆర్‌ తన వద్ద జరిగిన సమావేశాల వివరాలు లీక్‌ చేశారనే కారణంతో ఆయనపై ఆగ్రహంగా ఉన్నారని వార్తలు కొన్ని మీడియాల్లో వచ్చాయి. దీనిని టీఆర్‌ఎ్‌సలోని నేతలెవరూ ఖండించలేదు. ఇది ఈటల రాజేందర్‌ సన్నిహితులను ఆవేదనకు గురిచేసింది. మరోవైపు ఆయనను కేబినెట్‌ నుంచి బయటికి పంపిస్తారనే వార్తలు గుప్పుమన్నాయి.

ఈటల కుటుంబ సభ్యులపైనా అనుచిత ఆరోపణలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేశాయి. దీంతో ఆయా కథనాలపై మంత్రి ఈటల రాజేందర్‌ తనదైలిలో ఆవేదనాగ్రహం వెలిబుచ్చారు. అయితే, ‘గులాబీ జెండా ఓనర్లు.. కిరాయిదార్లు’ అంటూ ఈటల చేసిన వ్యాఖ్యలు.. సీఎం కేసీఆర్‌ను, టీఆర్‌ఎస్‌ అధిష్ఠానాన్ని ఉద్దేశించి చేసినట్లుగా ప్రచారం జరగడం వల్ల స్పందనలు కూడా ఆ రీతిలోనే బయటికి వస్తున్నాయి. అధిష్ఠానానికి విధేయత పేరుతో ఈటల వ్యాఖ్యలను పార్టీ నేతలు కొందరు తప్పుబడుతుంటే, పార్టీలో వాస్తవ పరిస్థితిని ఈటల వ్యాఖ్యలు ప్రతిబింబించాయనేది జనాభిప్రాయంగా ఉందని మరికొందరు అంటున్నారు. రాష్ట్రంలో బలమైన బీసీ నాయకుడిగా గుర్తింపు పొందిన ఈటల సేవలను టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక సీఎం కేసీఆర్‌ సరిగా ఉపయోగించుకోవడంలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఝలక్‌కు బదులుగా ఝలక్‌..టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం తమకు ఏదో ఒక రూపంలో ఝలక్‌ ఇస్తే.. ఇన్నాళ్లూ మౌనంగా భరించిన నేతలు కూడా ఇప్పుడు ఏదో ఒక రూపంలో తామూ అధిష్ఠానానికి ఝలక్‌ ఇవ్వాలనే పట్టుదలతో ఉన్నట్లు కనిపిస్తోంది. కొందరు రికార్డులకు దొరికేట్లు, మరికొందరు దొరక్కుండా సీఎం కేసీఆర్‌కు, టీఆర్‌ఎస్‌ అధిష్ఠానానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. చివరికి తమ మనోగతం మీడియాలోనైనా కథనాలుగా రావాలని కోరుకుంటున్నారు. తీరా ఈ లీకులపై మీడియాలో కథనాలు వచ్చాక.. అధిష్ఠానం ఒత్తిడి, బుజ్జగింపులతో దిగి వచ్చినట్లే కనిపిస్తూ తమకు అలాంటి ఉద్దేశం లేదని చెబుతున్నారు. దీనివల్ల వారు అధిష్ఠానం వద్ద తాము కోరుకున్న ప్రయోజనాన్ని నెరవేర్చుకుంటున్నారని, కానీ.. పార్టీకి జరగాల్సిన నష్టం మాత్రం జరుగుతోందని టీఆర్‌ఎస్‌ ముఖ్యులు అభిప్రాయపడుతున్నారు. అధినేత కేసీఆర్‌పై, పార్టీ నాయకత్వంపై ఒకసారి బహిరంగంగా వ్యాఖ్యలు చేశారంటే.. వారిలో గూడుకట్టుకున్న అసంతృప్తి స్థాయిని అర్థం చేసుకోవచ్చని, తర్వాత వారు మాట మార్చినప్పటికీ, పూర్తి స్థాయి విధేయతను ఊహించలేమని అధిష్ఠానం ముఖ్యుడొకరు వ్యాఖ్యానించారు.

ఎందుకీ తెగింపు అంటే..టీఆర్‌ఎ్‌సలో నివురుగప్పిన నిప్పులా ఉన్న అసమ్మతి ఎప్పుడైనా భగ్గుమనే అవకాశాలను చాలా మంది పార్టీ ముఖ్యులు కూడా తోసిపుచ్చడంలేదు. టీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి వచ్చాక చెప్పుకోదగిన కొత్త పనులు చేయకపోవడం, సీఎం కేసీఆర్‌ మినహా మంత్రులకు అధికారాలు ఏమీలేవనే అభిప్రాయం ప్రజల్లోకి వెళ్లడం, పిలవకుండా వెళ్తే ప్రగతి భవన్‌ గేట్ల వద్దనే మంత్రులకు చేదు అనుభవాలు ఎదురవుతుంటే, ఎమ్మెల్యేల పరిస్థితి ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నం కావడం, అధిష్ఠానం ఏకపక్ష ధోరణి, ఇదివరకటిలా ముఖ్యులు కూడా సీఎం కేసీఆర్‌ను కలిసే పరిస్థితి లేకపోవడం.. వెరసి టీఆర్‌ఎ్‌సలో అసమ్మతి రోజురోజుకూ పెరుగుతుండటానికి కారణమవుతున్నాయని టీఆర్‌ఎస్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ‘‘ఇన్నాళ్లూ రాష్ట్రంలో ప్రతిపక్షం బలంగా లేదు. సీఎం కేసీఆర్‌ వ్యూహాల్లో చిక్కుకొని కాంగ్రెస్‌ వట్టిపోయింది. కానీ, బీజేపీ తెలంగాణలో దూకుడుగా ముందుకు వెళ్తోంది. రాజకీయంగా సీఎం కేసీఆర్‌ను దీటుగా ఎదుర్కొంటామనే విశ్వాసాన్ని కలిగిస్తోంది. కేసీఆర్‌ రాయితో కొడితే, మేం ఇటుకతో కొడతాం.. అన్నట్లుగా బీజేపీ నేతల తీరు ఉంది. ఈ పరిణామం సీఎం కేసీఆర్‌పై, అసంతృప్తిగా ఉన్నవారికి సంతోషం కలిగిస్తోంది. ఇది కూడా టీఆర్‌ఎస్‌ నేతల్లో తెగింపునకు కారణం’’ అని పార్టీ ముఖ్యుడొకరు విశ్లేషించారు. కేబినెట్‌ విస్తరణలో చోటు దక్కలేదన్న కారణంతో మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి ఇప్పటికీ టీఆర్‌ఎస్‌ నేతలకు అందుబాటులోకి రాకుండా పోవడం ఈ విశ్లేషణలకు బలం చేకూర్చేలా ఉంది.

కేసీఆర్‌కు ప్రతిబంధకంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధినేతపై నేతలెవరికైనా అసంతృప్తి ఉన్నా.. గతంలో కేసీఆర్‌కు ఉన్న ప్రజాబలం కారణంగా ఎవరూ నోరు విప్పేవారు కాదు. ఎన్నికలకు ముందు ఎవరైనా అటువంటి సాహసానికి ప్రయత్నించినా.. ఎన్నికల తరువాత టీఆర్‌ఎ్‌సకు ప్రజలు కట్టబెట్టిన మెజారిటీని చూసి ఆయనకు దాసోహమన్నారు. ఇందుకు సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన ప్రజాకర్షక, సంక్షేమ పథకాలే కారణం. ఆయా పథకాల ద్వారా లబ్ధి పొందిన ప్రజలంతా కేసీఆర్‌ వెంటే ఉన్నామని తమ ఓట్ల ద్వారా చెప్పారు. దీంతో నేతలెవరూ నోరు మెదపలేకపోయారు. అయితే ఇటీవల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తలకిందులు కావడం, నిధుల లేమితో.. అంతకుముందులా వరాలు కురిపించలేని పరిస్థితిని సీఎం కేసీఆర్‌ ఎదుర్కొంటున్నారు. దీంతో సహజంగానే ప్రజలకు ఆయన పట్ల గతంలో ఉన్న అభిమానం కాస్త సన్నగిల్లుతోందని, నేతలు అసంతృప్తి గళమెత్తేందుకు ఇది కూడా ఒక కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కేబినెట్‌ విస్తరణ ఆలస్యంతో భగ్గు అసెంబ్లీ ఫలితాలు వెలువడిన తర్వాత దాదాపు రెండు నెలలపాటు సీఎం కేసీఆర్‌ కేబినెట్‌ విస్తరణ, నామినేటెడ్‌ పదవుల భర్తీ చేపట్టకపోవడం ఆశావహులను తీవ్ర అసంతృప్తికి గురిచేసింది. అదే సమయంలో తన కుమారుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారకరామారావుకు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవి కట్టబెట్టారు. గతేడాది డిసెంబరు 11న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడితే.. 13న సీఎంగా కేసీఆర్‌, మంత్రిగా మహమూద్‌ అలీ మాత్రమే ప్రమాణం చేశారు. శాసనసభలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం కూడా వెంటనే జరగలేదు. ఈ ఏడాది ఫిబ్రవరి 19న పది మందితో కేబినెట్‌ తొలి విస్తరణ చేపట్టేవరకు సీఎం కేసీఆర్‌, మంత్రి మహమూద్‌ అలీతోనే ప్రభుత్వాన్ని నెట్టుకురావడం పార్టీలో చాలా మందికి నచ్చలేదు.

ప్రాధాన్యం తగ్గించడంతో హరీశ్‌రావుపై సానుభూతి వెల్లువ టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం తర్వాత పార్టీలో సీఎం కేసీఆర్‌ తర్వాత శ్రేణులకు చిరపరిచితమైన హరీశ్‌రావు ప్రాధాన్యాన్ని ఈ మధ్య అధిష్ఠానమే ఉద్దేశపూర్వకంగా తగ్గించిందనే వార్త మారుమూల పల్లెలకూ పాకింది. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలకంగా వ్యవహరించి, పార్టీలో ట్రబుల్‌ షూటర్‌గా పేరొందిన హరీశ్‌రావుకే ఇటువంటి పరిస్థితి ఎదురవుతుంటే.. తమ పరిస్థితి ఏమిటనే ప్రశ్న పార్టీ సీనియర్‌ నేతలు, వారి సన్నిహితుల్లోనూ వ్యక్తమైంది. కేబినెట్‌ తొలి విస్తరణలో హరీశ్‌రావుకు చోటులేకపోవడంతో.. ఒకప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ అభ్యున్నతి కోసం శ్రమించిన ఆయనను సొంత నియోజకవర్గమైన సిద్దిపేటను దాటకుండా చేశారనే భావన పార్టీ శ్రేణులకు కలిగింది. చివరికి టీఆర్‌ఎస్‌ సొంత మీడియాలో చాలా కాలం హరీశ్‌రావు వార్తలు, ఫొటోలు రాకపోవటాన్ని కూడా ఆయన సన్నిహితులు, పార్టీలోని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోయారు.

అదే సమయంలో మెదక్‌ జిల్లాలో ఆయనకు పోటీగా పార్టీకి చెందిన ఇతర నేతలకు పదవులు ఇచ్చి అధినాయకత్వం ప్రోత్సహించడాన్ని వారు తట్టుకోలేకపోయారు. అయినప్పటికీ.. హరీశ్‌రావు మౌనంగా నియోజకవర్గంలో తన పని తాను చేసుకుంటూ వెళ్లారు. ‘తాజాగా విస్తరణలో హరీశ్‌రావును కేబినెట్‌లోకి తీసుకొని, ఆర్థిక శాఖను కట్టబెట్టినప్పటికీ, జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆయనపై సానుభూతి వెల్లువెత్తింది. పార్టీలో అసంతృప్తి రాజుకోవడానికి ప్రధాన కారణాల్లో హరీశ్‌రావుకు జరిగిన అవమానం కూడా ఒకటి’ అని టీఆర్‌ఎస్‌ ముఖ్యుడొకరు విశ్లేషించారు.

7 లోక్‌సభ స్థానాల్లో ఓడిపోవడంతో.. లోక్‌సభ ఎన్నికల్లో ‘సారు.. కారు.. పదహారు’ నినాదంతోపాటు సీఎం కేసీఆర్‌ దేశ ప్రధాని ఎందుకు కాకూడదనే ప్రశ్నతో టీఆర్‌ఎస్‌ శ్రేణులు ప్రజల ముందుకు వెళ్లాయి. కానీ, ఆ ఎన్నికల్లో ఊహించని విధంగా రాష్ట్ర ఓటర్లు బీజేపీని నాలుగు, కాంగ్రె్‌సను మూడు స్థానాల్లో గెలిపించి.. టీఆర్‌ఎ్‌సను తొమ్మిది స్థానాలకే పరిమితం చేశారు. ముఖ్యంగా సీఎం కేసీఆర్‌ కూతురు కవిత నిజామాబాద్‌లో, ఆయన కుటుంబ సన్నిహితుడు బి.వినోద్‌కుమార్‌ కరీంనగర్‌లో ఓడిపోవడం టీఆర్‌ఎ్‌సకు శరాఘాతంగా మారింది. ఇది కవిత, వినోద్‌ల ఓటమి కాదని, సీఎం కేసీఆర్‌ పరాజయమంటూ పార్టీలో సన్నాయి నొక్కులు మొదలయ్యాయి. ఇటీవలి కాలంలో ప్రత్యేకించి మంత్రులు టి.హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌ విషయంలో పార్టీ అధిష్ఠానం వ్యవహరించిన తీరు కూడా అసమ్మతికి ఆజ్యం పోసిందనే చర్చ ఆ పార్టీ వర్గాల్లోనే జరుగుతోంది.

సింగరేణి కార్మిక సంఘంలోనూ చీలిక కోల్‌ బెల్ట్‌లో టీఆర్‌ఎ్‌సకు బలమైన పునాదులు ఏర్పడటానికి, అసెంబ్లీ ఎన్నికల్లో ఆ ప్రాంతంలోని అన్ని స్థానాల్లోనూ ఆ పార్టీ అభ్యర్థుల గెలుపునకు ప్రధాన కారణం.. సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘమైన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకేఎస్‌). కాగా, ఇప్పుడు ఆ సంఘంలోనూ చీలిక వచ్చింది. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో పురుడు పోసుకున్న టీబీజీకేఎ్‌సను గుర్తింపు సంఘంగా ఎదిగేలా చేయడంలో కీలకపాత్ర పోషించిన ఆ సంఘం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెంగర్ల మల్లయ్య తన పదవికి, సంఘానికీ రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. మల్లయ్యతోపాటు సింగరేణి వ్యాప్తంగా పెద్దసంఖ్యలో ఉన్న టీబీజీకేఎస్‌ నాయకులు రాజీనామా చేయనున్నారు. వీరంతా బీజేపీ అనుబంధ కార్మిక సంఘమైన బీఎంఎ్‌సకు సింగరేణిలో అనుబంధంగా ఉన్న కోల్‌మైన్స్‌ కార్మిక్‌ సంఘ్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. టీబీజీకేఎ్‌సలో గత ఐదారేళ్లుగా అంతర్గత కలహాలు తలెత్తడం, వలస నాయకుల ఆధిపత్యం పెరగడంతోనే మల్లయ్య వర్గం ఆ సంఘానికి దూరమవుతోందన్న అభిప్రాయాలున్నాయి. ఇప్పటికే రామగుండం మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ బీజేపీలో చేరగా టీబీజీకేఎ్‌సలో చోటుచేసుకున్న తాజా పరిణామం కోల్‌బెల్ట్‌లో టీఆర్‌ఎ్‌సకు ఎదురుదెబ్బగానే భావిస్తున్నారు.

ఎన్నికల ముందు ఎన్నో హామీలు టీఆర్‌ఎ్‌సలో చాలా మంది నేతలకు అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ముందు స్వయంగా సీఎం కేసీఆర్‌, ఆయన తనయుడు కేటీఆర్‌ ఎన్నో హామీలు ఇచ్చారు. మంత్రి, రాజ్యసభ, ఎమ్మెల్సీ, నామినేటెడ్‌ పదవులు అందులో ఉన్నాయి. అయితే ఎన్నికలు ముగిసి, ఫలితాలు వచ్చి.. చాలా రోజులు అవుతున్నా వారిలో చాలా మందికి ఇచ్చిన హామీలు నెరవేరలేదు. అదే సమయంలో ఇతరులకు పదవుల పందేరం జరుగుతుండటం వారికి నిద్రలేకుండా చేస్తోంది. ఈ పరిస్థితుల్లో సీఎం కేసీఆర్‌ను, మంత్రి కేటీఆర్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకునే చాన్స్‌ కూడా వారికి చిక్కడంలేదు. ఉదాహరణకు వైశ్య సామాజిక వర్గం నుంచి ఏకైక టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే బిగాల గణే్‌షగుప్తా (నిజామాబాద్‌)కు మంత్రి పదవి, లేదంటే ఏదైనా కీలక పదవి ఇవ్వాలని కోరడానికి ఆ సామాజికవర్గం నేతలు ఏడాదిగా ప్రయత్నిస్తున్నా.. వారికి సీఎం కేసీఆర్‌తోపాటు కేటీఆర్‌ అపాయింట్‌మెంట్‌ కూడా దొరకడంలేదని తెలుస్తోంది. పార్టీలో పదవులు దక్కనివారు, అసంతృప్తి, అసమ్మతివాదులంతా ఒక్కటయ్యే చాన్స్‌ ఇవ్వకుండా, తాజా కేబినెట్‌ విస్తరణకు ముందు ఓడిన వారికి పదవులు అంటూ సీఎం కేసీఆర్‌ చేసిన ప్రకటనతో వారిలో ఆశలు సజీవంగా ఉంచే ప్రయత్నం చేసినప్పటికీ, ఆ తర్వాతనే నిరసన గళాలు ఊపందుకోవడాన్ని టీఆర్‌ఎస్‌ వర్గాలు ప్రస్తావిస్తున్నాయి.

Courtesy Andhrajyothi

RELATED ARTICLES

Latest Updates