– మెడ వరకూ తమను తాము భూమిలో పాతిపెట్టుకుని రైతుల వినూత్న నిరసన
జైపూర్: భూసేకరణను వ్యతిరేకిస్తూ రాజస్థాన్‌లోని నిందార్ గ్రామ రైతులు వినూత్న నిరసనకు దిగారు. తమను తాము భూమిలోపల మెడలోతు వరకూ పూడ్చిపెట్టుకుని ఆందోళన చేస్తున్నారు. జైపూర్ డెవలప్‌మెంట్ అథారిటీ (జేడీఏ) తన గృహ నిర్మాణ ప్రాజెక్టు కోసం ఆ ప్రాంతంలోని వ్యవసాయ భూములను స్వాధీనం చేసుకుంటున్నది. అయితే, సవరించిన భూసేకరణ చట్టం ప్రకారం తమ భూములను స్వాధీనం చేసుకోవాలనీ, తదనుగుణంగా పరిహారం ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇదివరకే ఈ విషయమై రైతులు జనవరిలో ‘జమీన్ సమాధి సత్యాగ్రహా’ నిరసన దీక్షకు దిగారు. ఈ క్రమంలో తమ సమస్యలను 50 రోజుల్లో పరిష్కరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు. అయితే, ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకూ ఎలాంటి స్పందనా రాకపోవడంతో.. మళ్లీ జమీన్ సమాధి సత్యాగ్రహా నిరసన కార్యక్రమాన్ని ప్రారంభించామని ‘నిందార్ బచావో యువ కిసాన్ సంఘర్ష్ సమితి’ నాయకులు నాగేంద్ర సింగ్ షెఖావత్ తెలిపారు. రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించు కోవడం లేదని ఆరోపించారు.
జేడీఏలో అవినీతి పెరిగిందని రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారనీ, ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో దాని నుంచి తమకు సరైన పరిహారం లభిస్తుందంటే ఎలా నమ్మాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. జేడీఏ ఇచ్చే పరిహారంపై ఆశ లేదనీ అన్నారు. కాగా, ఈ హౌసింగ్ ప్రాజెక్టు కోసం 2017లో జేడీఏ భూములను స్వాధీనం చేసుకున్న క్రమంలో రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. పలువురు రైతులు కోర్టును ఆశ్రయించారు.
దీంతో 600 బిగాల (దాదాపు 670 ఎకరాలు) భూమిని స్వాధీనం చేసుకున్నందుకు పరిహారంగా 60 కోట్లను కోర్టులో జేడీఏ జమ చేసింది. దీనిని సదరు రైతులు అంగీకరించలేదు. ఇది ప్రస్తుత మార్కెట్ రేట్లకు అనుగుణంగా లేదని తెలిపారు. తమకు న్యాయం దక్కేవరకూ ఆందోళనను విరమించబోమని అన్నారు.
Courtesy: NT