ఒక్క మంచం.. ఇద్దరు రోగులు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

నేలపైనే వైద్యసేవలు
సర్కారు దవాఖానాల్లో మారని తీరు
రద్దీని అంచనా వేయడంలో ప్రభుత్వం విఫలం
ప్రహసనంగా మారిన వైద్యం.
మాకు దిక్కెవరు..వ్యాధిగ్రస్తులు
భవిష్యత్‌ అవసరాలను అంచనా వేసి దానికి తగినట్టుగా సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందనేలా సర్కారు దవాఖానాల తీరు మారింది. ఆస్పత్రిలో అడుగుపెడితే చాలు జబ్బున పడ్డ రోగులు ఒక్కో మంచంపై ఇద్దరు కనిపిస్తున్న దృశ్యాలెన్నో. ఒకవేళ అవి కూడా ఖాళీలేకపోతే..నేలపైనే పడుకోబెట్టే పరిస్థితులతో ఇదేం వైద్యం.. మాకు దిక్కెవరు అంటూ వ్యాధిగ్రస్తులు విలపిస్తున్నారు.
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ప్రభుత్వాస్పత్రుల పట్ల విశ్వసనీయత పెరిగిందనీ, దాంతోనే వచ్చే రోగుల సంఖ్య పెరుగుతున్నట్టు నాలుగేండ్ల నాడే గమనించిన ప్రభుత్వం తదనుగుణంగా బెడ్లను పెంచకపోవడంతో రోగులకు ఇక్కట్లు తప్పడం లేదు. సాధారణ రోజుల్లో వచ్చే రోగులకే బెడ్లు సరిపోవడం లేదు. ఇక సీజనల్‌ వ్యాధులు ప్రబలిన సమయంలో పరిస్థితి వర్ణనాతీతంగా మారింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. కానీ ఆస్పత్రుల్లో సరైన సౌకర్యాలు లేక రోగులు నానా అవస్థలు పడుతున్నారు. రాష్ట్రంలో దాదాపు 25000 వరకు బెడ్లు అందుబాటులో ఉండగా, సీజనల్‌ సమయంలో అవసరానికి కొంత మేరకు పెంచగా 30 వేల వరకు చేరాయి. ప్రతి రోజూ సగటున ఒకటిన్నర లక్షల మంది ఆస్పత్రులకు వస్తున్నారు. వీరిలో కనీసం ఐదు నుంచి 10 శాతం మందిని ఇన్‌పేషెంట్లుగా చేర్చుకోవాల్సి ఉంటుందని వైద్య సిబ్బంది చెబుతున్నారు. గాంధీ, ఉస్మానియా, ఫీవర్‌ ఆస్పత్రులతో పాటు ఏ ఆస్పత్రిలో చూసినా బెడ్లు ఖాళీ లేవని సమాధానం చెబుతున్నారు. దీంతో రోగులు చికిత్స కోసం కాకుండా బెడ్ల కోసం వేచి చూడాల్సిన వస్తున్నది. నగరం నలువైపులా 500 చొప్పున బెడ్లతో నాలుగు సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు, 250 పడకలతో మాతా, శిశు చికిత్సా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని గతంలో ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు నగర శివారులలో మరో 2500 బెడ్లు అందుబాటు లోకి వస్తాయని తద్వారా నగరంలోని ఆస్పత్రుల్లో బెడ్ల కొరత తీరుతుందని భావించారు. వాటి కోసం స్థలాలను పరిశీలిం చినప్పటికీ ఇంతవరకు నిర్మాణం జరగలేదు. 2017 జన వరి 23న రాష్ట్ర ప్రభుత్వం ఆస్పత్రుల నిర్మాణానికి అవసర మైన ప్రణాళిక రూపొందించేందుకు, అంచనా వ్యయం నిర్ణయించేందుకు కన్సల్టెంట్లకు అనుమతించింది. ఆస్పత్రుల నిర్మాణ సాధ్యాసాధ్యాలపై అధ్యయనానికి ఒక కమిటీని సైతం నియమించింది. ఆ కమిటీ విక్టోరియా మెమోరియల్‌ హౌం (ఎల్‌.బీ.నగర్‌), మైలార్‌ దేవ్‌ పల్లి (రాజేంద్రనగర్‌), పేట్‌ బషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌, మియాపూర్‌ బస్‌ టర్మినల్‌ ను ఆస్పత్రుల నిర్మాణానికి భూములను పరిశీలించి, ఇక్కడ ఆస్పత్రుల నిర్మాణ సాధ్యాసాధ్యాలపై నివేదిక సమర్పించింది. ఆ భూములను వైద్యఆరోగ్య శాఖకు అప్పగించాలని ప్రభుత్వం కలెక్టర్లను కోరింది. ఆయా భూములు వివాదంలో ఉండడంతో అప్పగింత జరగలేదు. దీంతో వివాదాలు ఉన్న భూములను కాకుండా ప్రత్యామ్నాయ భూములను పరిశీలించాలని కోరింది. గత సంవత్సరం సెప్టెంబర్‌ నుంచి ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండడంతో పనులు ఎక్కడికక్కడే ఆగిపోయినట్టు సమాచారం.
మరో వైపు రాష్ట్రంలో నూతనంగా సిద్దిపేట, మహబూబ్‌ నగర్‌, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో మెడికల్‌ కాలేజీలు మంజూరైనా అవన్ని పూర్తి స్థాయిలో సేవలు ప్రారంభిస్తే ఇంకో 2000 నుంచి 2500 బెడ్లు రోగులకు అందుబాటులోకి వచ్చేవి. దీంతో గతంలో మాదిరిగానే ఉస్మానియా, గాంధీ, ఫీవర్‌, నీలోఫర్‌ తదితర ఆస్పత్రుల్లో బెడ్లకు నిరంతర డిమాండ్‌ ఏర్పడింది. వైరల్‌ జ్వరాలు అలుముకున్న ప్రస్తుత సమయంలో ఇక బెడ్ల కొరత అటు వైద్యసిబ్బందిని, ఇటు రోగులను సతమతం చేస్తున్నాయి.
ఫివర్‌ ఆస్పత్రిలో 330 బెడ్లు ఉండగా జులైలో 1,079 మంది, ఆగస్టులో 1,037 మంది ఇన్‌పేషెంట్లుగా చికిత్స తీసుకున్నారు. ఒక్కో దానిపై ఇద్దరేసి రోగులను సర్దుబాటు చేసినా, సరిపోకపోవడంతో నేలపైనే పరుపులతో చికిత్స అందించాల్సి వస్తున్నది. నీలోఫర్‌ ఆస్పత్రిలో 1000 బెడ్లు ఉండగా జులై, ఆగస్టు మాసాల్లో 6,417 మందికి ఇన్‌ పేషెంట్లుగా చికిత్స అందించారు. ఒక్క ఆగస్టు మాసంలోనే నీలోఫర్‌కు 37,633 మంది, పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రికి 11,000 మంది అవుట్‌ పేషెంట్లుగా చికిత్స కోసం వచ్చినట్టు ఆయాఆస్పత్రుల రికార్డులు చెబుతున్నాయి. అవుట్‌ పేషెంట్లుగా మారుతున్న ఇన్‌ పేషెంట్లు
ప్రభుత్వాస్పత్రిలో ఉచిత వైద్యం నిజమే. కాని ఆస్పత్రిలో బెడ్‌ కు మాత్రం గట్టి రికమెండేషన్‌ తప్పనిసరి అన్న చందంగా ఆస్పత్రులు తయారయ్యాయి. బెడ్లు సరిపోనూ లేక ఇన్‌పేషెంట్లుగా చేర్చుకోవల్సిన పలువురు రోగులను అవుట్‌ పేషెంట్లుగా చూసి పంపిస్తున్నామని వైద్యసిబ్బంది చెబుతున్నారు. సాధ్యమైనంత వరకు ఇబ్బందులను తగ్గించి బెడ్లపై సర్ది, నేలపై పరుపులు వేసి చికిత్స అందించేందుకు వైద్యులు, వైద్య సిబ్బంది ప్రయత్నిస్తున్నా పారిశుధ్య సమస్యలను తట్టుకోలేక కొంత మంది చికిత్స మధ్యలో వెళ్లిపోతున్నారు.
ప్రాథమిక, మాధ్యమిక స్థాయిలో ఆగని రోగులు
బోధనాస్పత్రులపై భారం తగ్గించేందుకు కేరళ, తమిళనాడు తరహాలో ప్రాథమిక, మాధ్యమిక ఆరోగ్య సేవలను బలోపేతం చేసేందుకు గతంలో ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ మేరకు వైద్యఆరోగ్యశాఖకు చెందిన ఒక ఉన్నతస్థాయి బ ందం తమిళనాడు తదితర ప్రాంతాల్లో పర్యటించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. చిన్న,చిన్న జబ్బులకు ప్రాథమిక, మాధ్యమిక ఆస్పత్రుల్లోనే సేవలు అందుతుండడంతో ఆయా రాష్ట్రాల్లో బోధనాస్పత్రులపై భారం తక్కువగా ఉందని పేర్కొంది. దీనిని పూర్తిగా అమలు చేయకపోవడమే ప్రస్తుత పరిస్థితికి కారణమని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా,జిల్లా ఆస్పత్రులను ముందుగా అనుకున్నట్టు బలోపేతం చేసి ఉంటే బోధనాస్పత్రుల్లో రోగులకు ఇంతటి ఇబ్బందులు ఉండేవి కావని వైద్యఆరోగ్యశాఖ మాజీ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు.

Courtesy Navatelangana

RELATED ARTICLES

Latest Updates