– కార్పొరేట్లకు అనుకూలంగా సీఆర్‌జెడ్
– తీరప్రాంత వాసులు, పర్యావరణ వేత్తల వినతులను పట్టించుకోని కేంద్రం
– పాతచట్టం నిబంధనలు తుంగలోకి…
చెన్నై : కేంద్ర ప్రభుత్వం గతేడాది తీసుకొచ్చిన తీర నియంత్రణ చట్టం (సీఆర్‌జెడ్) సముద్ర తీర ప్రాంతాల చుట్టూ జీవించే ప్రజలకు శాపంగా మారనుంది. తీరప్రాంతం అభివృద్ధి పేరిట నిబంధనలను మార్చడం ద్వారా ఆ ప్రాంతాల్లో పర్యాటకం పేరు మీద అక్కడ కార్పొరేట్లు తిష్టవేయనున్నారు. దీని ద్వారా తీరాన్ని రక్షించే మడ అడవులు, ఇసుక దిబ్బలను తొలగిస్తే అది పర్యావరణానికీ తీవ్ర ముప్పు వాటిల్లే ప్రమాదముందని తీరప్రాంతవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మడ అడవులను తొలగిస్తే సముద్రం కోతకు గురవుతుందని ప్రజలు ఆందోళనలు చేస్తున్నా కేంద్రం దానినీ పట్టించుకోలేదనే వాద నలు వినిపిస్తున్నాయి. కాగా, ఈ చట్టం సవరణలపై అభ్యంత రాలు వ్యక్తం చేస్తూ వాటిని మార్చాలని ప్రజలు కోరినా.. కేంద్రం వినతులను పట్టించుకోకపోగా వారిని అక్కడి నుంచి వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తున్నదని విమర్శలు వెల్లువెత్తుతు న్నాయి. కొత్త చట్టం బడావ్యాపారస్తులకు లాభం చేకూ ర్చుతూ.. పర్యావరణానికి ముప్పు కలిగించే ప్రమాదం ఉన్న దని పర్యావరణవేత్తలు ఆరోపిస్తున్నారు. తీరంచుట్టూ ఉన్న ప్రాంతాన్ని రక్షించేదిశగా పాత చట్టంలోని నిబంధనలుంటే.. కేంద్రం వాటిని సవరించి కొత్తవాటిని తీసుకొచ్చింది. అంతకుముందు.. సముద్రతీరానికి ఆనుకుని ఉండే పట్టణప్రాంతాల్లో 200 మీటర్ల లోపు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలూ చేపట్టరాదని (అదే గ్రామాల్లో అయితే వంద మీటర్లలోపు) ఉండేది. కానీ దీనిని 50 మీటర్లకు తగ్గిస్తూ కేంద్రం కొత్త చట్టంలో చేర్చింది. ఈ కొత్త చట్టంతో సముద్రానికి 50 మీటర్లలోపే హౌటళ్లు.. బీచ్ రిసార్ట్ట్‌లు, రియల్‌ఎస్టేట్ అభివృద్ధి వంటికి అవకాశం కల్పిస్తుంది. చాలా ప్రాంతాల్లో మడ అడవులు, ఇసుక దిబ్బలు 50 మీటర్లలోపే ఉంటాయి. రాకాసి అలలు పోటెత్తినప్పుడు, తుఫానులు సంభవించినప్పుడు, సముద్రం అల్లకల్లోలమైనప్పుడూ భారీ ప్రమాదాలు జరగకుండా మడ అడవులే రక్షిస్తాయి. కానీ కొత్తగా తీసుకొచ్చిన చట్టంతో వాటిని తొలగించే ప్రమాదం ఉన్నదని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పర్యావరణానికీ, చుట్టూరా ఉండే ప్రజానీకానికి భారీ నష్టం ఏర్పడే ప్రమాదం ఉన్నదని వాపోతున్నారు.
భారత్‌లో 7,500 కిలోమీటర్ల తీరప్రాంతం ఉండగా.. దానికి ఆనుకుని సుమారు 17.1 కోట్ల మంది (మొత్తం దేశ జనాభాలో 14 శాతం) ప్రజలు నివసిస్తున్నారు. మొత్తంగా 70 జిల్లాలు.. 66 ప్రధాన, నాలుగు ద్వీపకల్ప ప్రాంతాలున్నాయి. ఇక్కడ నివసిస్తున్నవారిలో ఎక్కువశాతం మందికి సముద్రమే జీవనాధారం. చేపలు పట్టడం, వస్తువుల రవాణా, పర్యాటకులకు గైడ్‌గా ఉండటం ప్రధానవృత్తిగా జీవిస్తున్నవారే. కానీ సవరణ చట్టం వీరి జీవనోపాధిపైనే గాక వారి బతుకుల మీద, పర్యావరణంపైనా తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉన్నదని నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తీరప్రాంతాలను రక్షించే ఉద్దేశంతో సీఆర్‌జెడ్ చట్టాన్ని 1986లో ప్రతిపాదించిన కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ.. 1991లో నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిపై ప్రజల అభ్యంతరాలను కోరిన కేంద్రం.. ఎనిమిదిసార్లు సమీక్ష చేయగా.. ప్రతిపాదిత చట్టంలో 20 సవరణలు చేర్చి 2011లో కొత్తచట్టాన్ని చేసింది. దీనిపై తీర ప్రాంతాల రాష్ట్రాలు, ప్రజలు, పర్యావరణవేత్తలు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో వారి సందేహాల నివృత్తికి 2014లో శైలేశ్ నాయక్ అధ్యక్షతన ఓ కమిటీని వేసింది. ఈ కమిటీ 2015 నుంచి 2018 దాకా వినతులు స్వీకరించింది. చివరగా 2018 ఏప్రిల్ 19న దీనిని ప్రజల ముందుంచుతూ.. అభ్యంతరాలుంటే తెలపాలని సూచించింది. దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తూ 3,469 మంది (ప్రజలు, శాస్త్రజ్ఞులు, పర్యావరణప్రేమికులు) పర్యావరణ మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. కానీ 2019 అక్టోబర్‌లో చట్టంగా మారిన సీఆర్‌జెడ్‌లో.. సంబంధిత కమిటీ 90 శాతం అభ్యంతరాలను పరిష్కరించలేదని పర్యావరణవేత్తలు అంటున్నారు. అంతేగాక బాధిత ప్రజలను కమిటీ కలవలేదనీ, ముఖ్యమంత్రులు, అధికారులతో సమావేశమైతే తమ ఇబ్బందులెలా తెలుస్తాయని వారు వాపోతున్నారు. కమిటీకి అందిన మొత్తం వినతుల్లో దాదాపు 2 వేలకు పైగా చేపలు పట్టే వారి నుంచి వచ్చినవే. తమ వృత్తిని గుర్తించాలని వారు దీర్ఘకాలంగా కోరుతున్న డిమాండ్‌నూ కమిటీ పక్కకుపెట్టిందని మహారాష్ట్ర మచ్చిమర్ కృతి సమితికి సెక్రెటరీగా వ్యవహరిస్తున్న కిరణ్ కొలి ఆరోపిస్తున్నారు. ఆయన స్పందిస్తూ.. ‘ఇది ప్రజాస్వామ్యం కాదు.. ప్రభుత్వం చేస్తున్న బలప్రయోగం’ అని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కష్టాలను వినకుండానే కమిటీ కొత్త చట్టానికి ఆమోదముద్ర వేసిందని ఆయన చెప్పారు.
మమ్మల్ని మరిచారు : డి. పాల్, రాజమండ్రి
శైలేశ్ నాయక్ కమిటీ చేపలు పట్టే వృత్తివారి సమస్యలను పట్టించుకోలేదు. కొత్త చట్టంతో వ్యాపారస్తులు సముద్ర తీరాన్ని ఆక్రమించుకునే ప్రమాదం ఉన్నది. మడ అడవులను నరికేస్తే తీరానికి తీరని ముప్పు. ఇప్పటికే కాలుష్య కారకాలన్నీ సముద్రంలోకి చేరి చేపలు మృతి చెందుతుంటంతో చాలా దూరం ప్రయాణిస్తే గానీ చేపలవేట సాధ్యం కావడం లేదు. కొత్త చట్టంతో తీరప్రాంతం మరింత కాలుష్యమవుతుంది. అంతేగాక ఈ చట్టం వ్యవహారిక భాషలలో లేదు. నిరక్షరాస్యులైన ప్రజలకు ఇంగ్లీషు, హిందీ ఏం అర్థమవుతుంది..?
Courtesy: NT