
భావనలను ప్రచారంలో పెట్టే విషయంలోనూ వర్గ పోరాటం జరుగుతుంది. ప్రపంచ బ్యాంకు తరపున వకాల్తా పుచ్చుకున్న వారు వామపక్ష భావనలను ఎదుర్కోడానికి ఒక ప్రత్యేక పద్ధతిని అనుసరిస్తారు. వామపక్షాలు ఉపయోగించే భావనలనే వాళ్లూ వాడడం మొదలుబెడతారు. అదే భావనలకు వారు చెప్పే అర్థాలు మాత్రం పూర్తిగా భిన్నంగా, వామపక్షాలు చెప్పే అర్థాలకు పూర్తి వ్యతిరేకంగా ఉంటాయి. కొన్ని సందర్భాలలో వాటి అర్థాలు గందరగోళంగా మారిపోయి మొత్తానికి వామపక్షాల భావనలు యథాతథంగా ప్రజలకు అందకుండా పోతాయి.
‘వ్యవస్థీకృత’ అన్న పదాన్నే తీసుకుందాం. మొదట్లో దీనిని వామపక్షాలు మాత్రమే ఉపయోగించేవారు. మూడవ ప్రపంచ దేశాలు స్వతంత్రం పొందాక ఏ విధాన అభివృద్ధి చెందాలన్న చర్చ ముందుకు వచ్చింది. ఆ రోజుల్లో మితవాద బూర్జువా సిద్ధాంతవేత్తలు అన్నింటినీ మార్కెట్ శక్తులకే వదిలిపెట్టేయ్యాలని వాదించేవారు. వామపక్షాలు ఇందుకు వ్యతిరేకం. మూడవ ప్రపంచ దేశాల ప్రధానమైన సమస్య వ్యవస్థీకృతమైన స్వభావం కలిగివుందని, దానిని సమూలంగా మార్చాలని, భూమిని పున:పంపిణీ చేసేందుకు వీలుగా భూసంస్కరణలు వంటి వ్యవస్థీకృత మార్పులు తీసుకురావాలని వామపక్షాలు వాదించేవి. ఇప్పుడు ప్రపంచ బ్యాంకు ప్రచారం పుణ్యమా అని ‘వ్యవస్థీకృత’ అన్న పదానికి అర్థమే పూర్తిగా మారిపోయింది. మార్కెట్ శక్తులకే పెత్తనాన్ని పూర్తిగా వదిలి పెట్టేయడమే ‘వ్యవస్థీకృత’ సంస్కరణల సారాంశం అయిపోయింది! మౌలికమైన వ్యవసాయ సంబంధాల మార్పు అన్న అంశం ఎక్కడా తెరపైన లేకుండా పోయింది.
అలాంటిదే ఇంకో పదం ‘సరళీకరణ’. మితవాద బూర్జువా వర్గం తాను ముందుకు తెచ్చిన ఆర్థిక విధానాలకు ఈ పేరు పెట్టి, దానిని వ్యతిరేకించే వారంతా ఆధిపత్యవాదాన్ని, పెత్తనాన్ని ప్రబోధించే వారిగా చిత్రీకరించింది. సరళీకరణను వ్యతిరేకించడం అంటే నియంతృత్వ విధానం అని, ప్రజాస్వామ్య వ్యతిరేకత అని ప్రచారం చేసింది. వీళ్లు ప్రతిపాదించే సరళీకరణ వాస్తవానికి విచ్చలవిడిగా ప్రజల ఉమ్మడి సంపదను కొల్లగొట్టే దోపిడీ విధానం. దీని పర్యవసానంగా ప్రజానీకం చాలా కోల్పోతారు. చిన్న స్థాయి ఉత్పత్తిదారులు దివాళా ఎత్తుతారు. నిజానికి ఇవన్నీ అప్రజాస్వామికమైనవి. కాని ‘సరళీకరణ విధానాల’ పేర ఇవన్నీ చలామణీ అయిపోతున్నాయి!
వీటన్నింటికన్నా దారుణం ‘పాపులిజం’ అన్న పదం విషయంలో జరుగుతోంది (‘పాపులిజం’ అంటే ప్రజాకర్షక విధానాలు అని వాడుతున్నాం). మొదట్లో ఈ ‘పాపులిజం’ అన్న పదం రష్యాలో వాడుకలోకి వచ్చింది. రష్యా దేశాన్ని విప్లవాత్మకంగా మార్చి అభివృద్ధి చేయడం ఎలా అన్న అంశంపై చర్చ జరుగుతూండేది. ఆ చర్యల్లో నరోద్నిక్‌లు, గ్రామ కమ్యూన్లను నేరుగా సోషలిస్టు పద్ధతిలోకి మార్చాలని వాదించేవారు. బోల్షివిక్‌లు ఈ ప్రతిపాదనను వ్యతిరేకించారు. నరోద్నిక్‌లు భావిస్తున్నట్లు ఈ గ్రామ కమ్యూన్లలో పరిస్థితులు లేవని, పెట్టుబడిదారీ విధానాల అమలు పర్యవసానంగా గ్రామాల్లో సైతం వర్గ అంతరాలు ఏర్పడి స్థిరపడ్డాయని, అందుచేత నేరుగా వాటిని సోషలిజంలోకి తీసుకుపోవడం కుదరదని, ముందు భూ సంబంధాలలో మార్పు తేవడం అవసరమని బోల్షివిక్‌లు వాదించారు. నూతన సమాజ మార్పుకు రైతాంగం కాక కార్మిక వర్గమే నాయకత్వం వహించాలని వారు వాదించారు. లెనిన్ రచించిన ‘రష్యాలో పెట్టుబడిదారీ అభివృద్ధి’ అన్న గ్రంథంలో ఈ వాదన చేశారు.
ఈ వాదనకు భిన్నంగా, ప్రజలంతా ఒకే తరహాగా ఉన్నట్లు, వారిలో వివిధ వర్గాలు ఏర్పడనట్లు పరిగణించడాన్ని ‘పాపులిజం’ అని బోల్షివిక్‌లు అన్నారు. ఒక వైపు పెట్టుబడిదారీ విధానం ప్రజలను వర్గాలుగా విభజిస్తూ వున్నా, దానిని పట్టించుకోకుండా అన్ని వర్గాల వారినీ ఒకే గాటన కట్టి వ్యవహరించడాన్ని ‘పాపులిజం’ అన్నారు. అయితే కమ్యూనిస్టులు కూడా ‘ప్రజలు’ అని వాడే సందర్భాలు ఉన్నాయి. ‘జనతా ప్రజాతంత్ర విప్లవం’, ‘జనతా ప్రజాతంత్ర ఆధిపత్యం’ అని వాడతాం. ఇక్కడ ప్రజలు అంటే కొన్ని నిర్దిష్ట వర్గాల కూటమి అన్న అర్థంలో వాడతామే తప్ప అంబానీల నుంచి రోజు కూలీల వరకు అందరినీ కలిపి ఒకే గాటన కట్టేసే అర్థంలో మాత్రం కాదు.
కాని ఇప్పటి రోజుల్లో ‘పాపులిజం’ అనేది వేరే అర్థంలో వాడుతున్నారు. సమాజం లోని కొద్దిమంది ఉన్నత వర్గాల వారికి భిన్నంగా ఉండే తక్కిన ప్రజానీకాన్ని అంతటినీ కలిపి ‘ప్రజలు’ అని వాడుతున్నారు. దీంతో రకరకాలుగా ‘పాపులిజం’ అన్న పదం వాడకానికొచ్చింది. సంపదని పున:పంపిణీ చేసే సంక్షేమ పథకాలూ పాపులిజమే. దేశంలో మెజారిటీ మతస్థుల మనోభావాలను, సెంటిమెంట్లను రాజకీయాల్లో వాడుకొంటే అదీ పాపులిజమే.
సంక్షేమ పథకాలు వంటివి ‘వామపక్ష పాపులిజం’ అయితే ‘హిందూత్వ’ రాజకీయాలు ‘మితవాద పాపులిజం’ అయ్యాయి. ఈ రకంగా ‘పాపులిజం’ అన్న పదాన్ని వాడుతూ తాము మాత్రం ఈ రెండు రకాల పాపులిజానికీ దూరంగా ఉంటూ నయా ఉదారవాద విధానాలను పక్కాగా అమలు జరుపుతామని బూర్జువా వర్గం చెప్పుకుంటూ సమర్థించుకుంటోంది.
సంక్షేమ పథకాలను చిన్నచూపు చూస్తూ, వాటి ద్వారా కొంత సంపద, పేదల మధ్య పున్ణపంపిణీ అవుతోందన్న సత్యాన్ని మరుగుపరుస్తూ, ఇదంతా ‘పాపులిజం’ అని కొట్టి పారెయ్యడం జరుగుతోంది. ఈ సంక్షేమ పథకాలు వృధా ఖర్చు అని, కార్పొరేట్లను ప్రోత్సహించే విధంగా నిధులను మళ్లిస్తే ఆ సంపద ఆ కార్పొరేట్ల కోశాల నుండి దానంతట అదే పొంగిపొర్లి ప్రవహించి పేదలకు పంపిణీ అవుతుందని ఒక బోగస్ సిద్ధాంతాన్ని బూర్జువా సిద్ధాంతవేత్తలు పదేపదే ప్రచారం చేస్తున్నారు.
ఇంకోవైపు కొందరు వామపక్షవాదులు సైతం ‘పాపులిజం’ అనే పదాన్ని మితవాద శక్తులు అనుసరించే మతతత్వ, జాతి దురహంకార విధానాలకు పర్యాయపదంగా వాడేస్తున్నారు. ఆ క్రమంలో సంక్షేమ పథకాల కోసం, సంపద పున్ణపంపిణీ కోసం పోరాడే వామపక్షాల విధానాలతో మితవాద విధానాలను, ఆధిపత్య భావజాలాన్ని కలగాపులగం చేసేస్తున్నారు. ఈ రకమైన వైఖరి మితవాద శక్తులు ముందుకు తెచ్చే వాదనలు, ఉద్యమాల వర్గ స్వభావాన్ని మరుగుపరిచి వేస్తుంది. దానివలన ఆ మితవాద శక్తుల ప్రమాదం పట్ల స్పష్టత లేకుండా పోతుంది. ఈ మతతత్వం అనేది ఒక వర్గానికి, దాని ప్రయోజనాలకు ప్రతినిధిగా ముందుకొచ్చిన పరిణామంగా గుర్తించే బదులు, ఏదో యాదృచ్ఛికంగా ఎన్నికల ఎత్తుగడల కోసం అనుసరించిన విధానంగా భావించే అవకాశం వుంది. మతతత్వపు వర్గ పునాది కనపడకుండా మరుగున పడిపోతుంది.
ఇలాంటిదే ‘జాతీయత’ అనే పదం కూడా. మతతత్వ శక్తులు ముందుకు తెచ్చే సిద్ధాంతాన్ని, వాదనలను ‘జాతీయవాదం’ గా కొందరు వామపక్షవాదులు సైతం అభివర్ణిస్తున్నారు. సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాట క్రమంలో ఆవిర్భవించిన జాతీయవాదాన్ని కాస్తా ఆ సామ్రాజ్యవాదులకే బంటుగా వ్యవహరించే మతతత్వవాదులకి ఆపాదించడం జరుగుతోంది. సామ్రాజ్యవాద వ్యతిరేకత అనేది జాతీయవాదానికి ఆయువుపట్టు. దానిని మరిచిపోయి మతతత్వవాదులకి ఆ పదాన్ని ఆపాదించడం వలన సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటానికే తీవ్ర నష్టం కలుగుతుంది. సామ్రాజ్యవాద బోధిత ప్రపంచీకరణకు పరోక్షంగా ఊతం ఇచ్చినట్లు అవుతుంది. అంతర్జాతీయ ఫైనాన్సు పెట్టుబడి ఆధిపత్యం నుండి విడగొట్టుకుని జాతీయ దృక్పథంతో వ్యవహరించాలన్న ప్రత్యామ్నాయ సిద్ధాంతాన్ని నీరుగార్చినట్టవుతుంది. సామ్రాజ్యవాదులతో చేయి కలిపే మోడీది జాతీయవాదం అయినప్పుడు దానిని వ్యతిరేకించేవారు కాస్తా జాతి వ్యతిరేకులైపోతారు!
కనుక జాతీయవాదం, జాతీయత అన్న పదాలను అన్ని సందర్భాలలో, అన్ని దేశాలలో ఒకే అర్థంతో చూడలేం. జర్మనీలో హిట్లర్ ప్రచారం చేసిన జాతీయవాదానికి, మన దేశంలో గాంధీజీ ప్రచారం చేసిన జాతీయవాదానికి ఏమైనా పోలిక వుందా?
కొన్నిసార్లు ఈ ‘జాతీయవాదాన్ని’, ‘పాపులిజాన్ని’ కలగలిపి ‘పాపులిస్ట్ జాతీయవాదం’ అంటూ వాడేస్తున్నారు కొందరు. విడివిడిగానే ఈ రెండు పదాలు వాడుతున్న తీరు గందరగోళానికి దారితీస్తుంటే, రెండింటినీ కలిపేసి గందరగోళాన్ని మరింత పెంచుతున్నారు ఇలాంటివాళ్లు.
సంపదను పున్ణపంపిణీ చేసే సంక్షేమ విధానాల పట్ల, ఆ విధానాలు ఏ వర్గాలకు మేలు చేస్తాయన్న అంశం పట్ల వామపక్షాలకు స్పష్టమైన అవగాహన వుంది. అదేవిధంగా ఫాసిస్టు తరహా జాతీయవాదం బడా కార్పొరేట్లకు, సామ్రాజ్యవాదులకు మాత్రమే ప్రాతినిథ్యం వహిస్తుంది తప్ప విస్తృత ప్రజానీకానికి మాత్రం కాదన్న స్పష్టత కూడా వామపక్షాలకు ఉంది. కాని కొందరు లిబరల్ బూర్జువా సిద్ధాంతవేత్తల పుణ్యమా అని ఈ పదాలు వాటి వెనక దాగివున్న వర్గ ప్రయోజనాలతో నిమిత్తం లేకుండా గందరగోళాన్ని పెంచే రీతిలో వాడకంలోకి వచ్చేశాయి. ఈ గందరగోళం నుంచి కనీసం వామపక్షవాదులన్నా ముందు దూరంగా ఉండాలి కదా! లేకపోతే మన సిద్ధాంత పోరాటంలో వాడటానికి మనకి ఆయుధాలే లేకుండా పోయే ప్రమాదం వుంది.
( స్వేచ్ఛానుసరణ )
Courtesy Prajashakti