లాగి.. కొట్టారు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

  • జూనియర్‌ వైద్యులను ఈడ్చిపారేసిన పోలీసులు
  • బెజవాడ, అలిపిరిలో ఉద్రిక్తత
  • ఒకర్ని చెంపపై కొట్టిన డీసీపీ
  • హోంమంత్రికి వైద్యుల ఫిర్యాదు
  • ఎన్‌ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా జూనియర్‌ వైద్యుల ఆందోళన
  • అలిపిరిలో తిరగబడ్డ యాత్రికులు
  • నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌(ఎన్‌ఎంసీ) బిల్లుకు వ్యతిరేకంగా విజయవాడ, తిరుపతిలో జూనియర్‌ వైద్యులు బుధవారం నిర్వహించిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసుల తీరుపై ఆందోళనకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలోని ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ వద్ద జాతీయ రహదారిపై సిద్ధార్థ మెడికల్‌ కాలేజీకి చెందిన జూనియర్‌ వైద్యులు బైఠాయించడంతో.. వారిని రెక్క పట్టుకుని ఈడ్చేశారు. మహిళా వైద్యులను కాళ్లూ చేతులు పట్టుకుని ఎత్తుకెళ్లి వాహనాల్లోకి విసిరేశారు. డీసీపీ హర్షవర్దన్‌రాజు ఒక వైద్యుడి కాలర్‌ పట్టుకుని చెంప చెళ్లుమనించారు. దీంతో ఉద్రిక్తతకు దారితీసింది. డీసీపీ క్షమాపణ చెప్పాలని జూనియర్‌ వైద్యులు నినాదాలు చేశారు. ఆపై హోంమంత్రి సుచరిత, పోలీస్‌ కమిషనర్‌ ద్వారకా తిరుమలరావు, డీజీపీ గౌతం సవాంగ్‌లను కలిసి డీసీపీపై ఫిర్యాదు చేశారు. డీసీపీ ప్రవర్తనపై విచారణకు ఆదేశించామని సీపీ చెప్పగా, డీజీపీ కూడా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

కాగా, విజయవాడలో పోలీసుల తీరును నిరసిస్తూ తిరుపతిలోని అలిపిరిలో జూనియర్‌ వైద్యులు మధ్యాహ్నం 2 గంటలపాటు రోడ్డుపై బైఠాయించారు. దీంతో మొదటి ఘాట్‌ రోడ్డులో 15 కిలోమీటర్లకుపైగా వాహనాలు నిలిచిపోయాయి. భక్తులు ఆకలితో ఇబ్బంది పడ్డారు. కొందరైతే 15 కిలోమీటర్లు నడుచుకుంటూ అలిపిరి చేరుకున్నారు. పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారని, బీపీ, షుగర్‌ ఉన్న వృద్ధులకు ఏమైనా అయితే పరిస్థితి ఏమిటని జూనియర్‌ వైద్యులపై తిరగబడ్డారు. ఇదే సమయంలో పోలీసులు ఆందోళనకారులను బలవంతంగా పక్కకు లాగేశారు.

ఈ క్రమంలో భాను అనే జూనియర్‌ వైద్యుడి కుడి భుజానికి గాయమైంది. కుమార్‌గౌడ్‌ అనే జూనియర్‌ వైద్యుడిని ఒక పోలీస్‌ కాలితో తన్నారు. చొక్కాలు, ప్యాంట్లు పట్టుకుని లాగారు. చివరకు అందరినీ అరెస్ట్‌ చేయడంతో 4.30 గంటలకు ట్రాఫిక్‌ క్లియరైంది. మరోవైపు.. గురువారం ఉదయం 6 గంటల నుంచి శుక్రవారం ఉదయం 6 గంటల వరకూ రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రుల్లో వైద్యసేవల్ని నిలిపివేస్తున్నట్లు ఐఎంఏ జాతీయ ఉపాధ్యక్షుడు డాక్టర్‌ పొట్లూరి గంగాధరరావు గుడివాడలో విలేకరులకు తెలిపారు.

 Courtesy andhrapradesh

RELATED ARTICLES

Latest Updates