పోలవరం : ప్రజా పోరాటాలే శరణ్యం !

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

వి. శంకరయ్య

రాష్ట్రంలోని వైసిపి, టిడిపి రెండు పార్టీలు ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకోవడంతోనే సరిపెడుతున్నాయి. అంతకుమించి పోలవరం ప్రాజెక్టుకు ఎసరు పెడుతున్న కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట అనడం లేదు. ఈ రెండు పార్టీలు ఎలాగూ నిలదీసే సమస్య లేదు కాబట్టి కేంద్రం కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. అందరూ కలసి అమరావతికి సమాధి కడుతున్నట్లే ఇప్పుడు పోలవరం వంతు వచ్చింది. కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదించిన రూ. 20,398.61 కోట్లతో పదేళ్లయినా ఈ ప్రాజెక్టు పూర్తి కాదు. నష్ట పరిహారం పునరావాసానికే దాదాపు రూ.29 వేల కోట్లు కావాలి. ఈ ప్రాజెక్టు పూర్తయితే అటు విశాఖపట్నం ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం వరకు ఇటు గొంతెండి పోతున్న రాయలసీమ జిల్లాల ప్రజల సాగు, తాగు నీటి అవసరాలు తీర్చుతుంది. అయితే కేంద్ర ప్రభుత్వం రోజుకొక కొర్రీ వేస్తూ సమస్య తీవ్రతను మరింత పెంచుతోంది-తప్ప సానుకూల వైఖరితో లేదు. ప్రధాని మోడీ తన పార్టీకి రాజకీయ ప్రయోజనం లేనిదే పిల్లికి కూడా భిక్షం పెట్టడనేందుకు ఇది మరొక నిదర్శనంగా మిగిలింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఏ ఒక్క పార్టీ బాధ్యత, సొత్తు కాదు. పార్టీలకతీతంగా వ్యవహరించవలసి వుంది. రాష్ట్రంలో ఆ పరిస్థితి కన్పించడం లేదు. వైసిపి, టిడిపి పార్టీల వాదులాటకు ఎజెండాగా మార్చుతున్నారు. ఎవరి పాలనలో తప్పు జరిగి వుంటే వారు ప్రజలకు సంజాయిషీ చెప్పుకోవలసి వుంటుంది. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన ప్రాజెక్టు అధారిటీ సర్వ సభ్య సమావేశంతో కూడా పెద్దగా ఒరిగేదేమీ లేదు. అది పోస్టాఫీసు పని చేస్తుంది. లేదా కేంద్ర జల శక్తి శాఖ ఆదేశాలు అమలు చేస్తుంది.

పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కర్కశ వైఖరితో రాష్ట్ర బిజెపి నేతలకు గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. గుళ్ళు, గోపురాలకు నానా యాగీ చేసిన నేతల నోళ్లకు తాళాలు పడ్డాయి. రేపు ఎన్నికల్లో జనసేనతో కలసి అధికారం లోకి వస్తామని విర్రవీగుతున్న రాష్ట్ర బిజెపి నేతలు విభజన చట్టం మేరకు పోలవరం నిర్మాణం పూర్తి బాధ్యతను కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందో లేదో రాష్ట్ర ప్రజలకు జవాబు చెప్పవలసి వుంది. ప్రశ్నించడానికే పార్టీ పెట్టానని డప్పు కొట్టిన జనసేన నేత పవన్‌ కళ్యాణ్‌ కేంద్ర ప్రభుత్వానికి విన్నపాలు పంపుతూ ఉత్త భద్రయ్య అవుతారో ప్రజల పక్షాన నిలబడి వీర భద్రయ్య అవుతారో తేలవలసి వుంది. మరోవైపు అధికార, ప్రధాన ప్రతిపక్షాలు రెండూ ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూ అసలు సమస్యను పక్కదారి పట్టించి కేంద్ర ప్రభుత్వానికి వెసులుబాటు కల్పించి ఊడిగం చేస్తారో లేక ప్రజల ముందు కేంద్రాన్ని బోనులో నిలబెడతారో లేక తామే బోను ఎక్కుతారో తేలవలసి ఉంది. ప్రస్తుతం అధికారంలో వైసిపి వుంది. తొలి నుండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సాగిన సంప్రదింపులు, ఉత్తర ప్రత్యుత్తరాలు ప్రభుత్వ రికార్డుల్లో నిక్షిప్తమై వుంటాయి. ఒకవేళ టిడిపి హయాంలో అంచనాల అంశంలో చంద్రబాబు నాయుడు కేంద్రంతో 2016లో ఏదైనా ఒప్పందం చేసుకొని వుంటే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని బహిర్గతం చేయాలి. అలా కాకుండా రాజకీయ విమర్శలకే పరిమితమైతే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ప్రజల జీవన్మరణ సమస్యగా పరిగణించకుండా రాజకీయ కక్ష సాధింపు చర్యగా మిగుల్చుకున్న వారౌతారు.

మరోవైపు టిడిపి ద్వితీయ నేతలు కాకుండా చంద్రబాబు నాయుడు స్వయంగా నోరు విప్పాలి. ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి కేంద్రానికి రాసిన లేఖపై చంద్రబాబు నాయుడు స్పందనలో స్పష్టత లేదు. కేంద్ర ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట అనలేదు. ముఖ్యమంత్రికి లాబీ చేయడం తెలియదని దెప్పి పొడిచారు. ఇది సరి కాదు. తన హయాంలో కేంద్రానికి అవసరమైన సమాచారం ఇచ్చానని వివరణ ఇచ్చి అంచనాలకు చెందిన కేంద్ర మంత్రి వర్గ తీర్మానం విడుదల చేశారు. అందులో ఇరిగేషన్‌ కాంపొనెంట్‌ ప్రస్తావన వుంది. కాని అంచనాల ప్రస్తావన లేదు. మరి కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఈ అఘాయిత్యానికి తలపడుతోంది? చంద్రబాబు నాయుడు కీలకమైన రెండు అంశాలు తెర మీదకు తెచ్చారు. కేంద్ర మంత్రి వర్గం తీర్మానం చేసిన తర్వాతనే కేంద్ర జల శక్తి శాఖకు చెందిన సాంకేతిక సలహా మండలి రూ. 55,548.87 కోట్ల అంచనా ఆమోదించిందన్నారు. అదే సమయంలో ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలో ఒకరు సమాచార చట్టం కింద సమాచారం కోరితే భూసేకరణ పరిహారం, పునరావాసం ఇరిగేషన్‌ కాంపొనెంట్‌లో కలసి వున్నాయని సమాధానం వచ్చిందని వెల్లడించారు. వాస్తవాలు ఇలా వుండగా కేంద్ర ప్రభుత్వం ఏ ప్రాతిపదికన ఈ దుర్మార్గానికి తలపడుతోంది?

రాష్ట్ర విభజన చట్టం సెక్షన్‌ 90 (1) మేరకు పోలవరం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించబడింది. సెక్షన్‌ 90 (4) మేరకు ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం తన నిధులతో నిర్మించాలి. ప్రాజెక్టుకు చెందిన పర్యావరణం ఫారెస్టు అనుమతులు కేంద్రమే తీసుకు రావాలి. నష్టపరిహారం, పునరావాసం పూర్తి బాధ్యత కేంద్రమే భరించాలి. ఇది పార్లమెంటు ఆమోదించిన చట్టంలో వున్నది. చట్టబద్దమైన నిబంధనను పార్లమెంటుతో నిమిత్తం లేకుండా కేంద్ర మంత్రి వర్గ తీర్మానంతో ఎలా మార్పు చేస్తారు? 2016 సెప్టెంబర్‌లో ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన సమయంలోనే పోలవరం నిధులు గురించి ప్రత్యేక ఏర్పాటు జరిగింది. ఈ సందర్భంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఎట్టి అధికారిక ప్రకటన వెలువడలేదు. కాని 2014 మార్చి వరకు ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చు రూ. 5,135.85 కోట్లు కేంద్రం రీయింబర్స్‌మెంట్‌ చేయదని, 2014 ఏప్రిల్‌ ఒకటి నుండి ఇరిగేషన్‌ కాంపొనెంట్‌ మాత్రం కేంద్రం భరిస్తుందని అనధికారికంగా వార్తలు వెలువడ్డాయి. ఈ అంశంపైననే అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి.

2014 నాటి షెడ్యూల్‌ రేట్లు అనే అంశం ప్రస్తావన రాలేదు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు వెల్లడి చేసిన కేంద్ర మంత్రి వర్గం ఆమోదించిన తీర్మానంలో కూడా లేదు. ఇంకే దైనా అదనపు సమాచారం వుంటే రాష్ట్ర ప్రభుత్వం వెల్లడిం చాలి. పోలవరం ప్రాజెక్టులో విద్యుదుత్పత్తి పథకం వుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇరిగేషన్‌ కాంపొనెంట్‌ అనే పదం వాడారని అప్పట్లో టిడిపి ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అదే చెబుతున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సన్నద్ధం కావడం లేదు.

కాగా 2016 తదుపరి సంభవించిన పరిణామాల్లో ప్రాజెక్టు అంచనాల్లో ఆర్‌ అండ్‌ ఆర్‌ వ్యయం కలసి వుందనే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించడమూ వాస్తవమే. కేంద్ర మంత్రి నితిన్‌ గడ్గరీ నుండి నీతి ఆయోగ్‌ వరకు సంకేతాలు ఇచ్చారు. టిడిపి హయాంలోనే 2019 జనవరిలో 2017-18 షెడ్యూల్‌ రేట్లతో రూ.57,297.42 కోట్ల అంచనాలతో పోలవరం ప్రాజెక్టు అధారిటీ ఆమోదంతో కేంద్ర జల శక్తి శాఖకు ప్రతిపాదనలు వెళ్లాయి. ఈ దశలోనే పోలవరం ప్రాజెక్టు అధారిటీ ఎందుకు అభ్యంతరం పెట్టలేదు? 2019 ఫిబ్రవరిలో సాంకేతిక సలహా కమిటీ పరిశీలించి రూ.55,548.87 కోట్లకు అంచనాలను కుదించి ఆమోదం తెలిపింది. ఈ దశలో కూడా 2014 అంచనాల ఊసు లేదు. ఈలోపు ఎన్నికలు జరిగి రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఈ ప్రతిపాదనలు అక్కడితో ఆగిపోయాయి. తిరిగి 2020 జూన్‌లో కేంద్ర జల శక్తి శాఖ మంత్రి ఏర్పాటు చేసిన రివైజ్డ్‌ కాస్ట్‌ అంచనాల కమిటీ ఫిల్టర్‌ చేసి రూ.47,617.74 కోట్లకు అంచనాలను కుదించింది. ఒకవేళ 2014 నాటి అంచనాలే ప్రామాణికమైతే రివైజ్డ్‌ కాస్ట్‌ అంచనాల కమిటీ రూ.47,617.74 కోట్లతో అంచనా ఎందుకు రూపొందించింది? ఇక్కడే పోలవరం కు వెన్నుపోటు పడిందంటున్నారు. రివైజ్డ్‌ కాస్ట్‌ అంచనా కమిటీ 2017-18 అంచనాలతో పాటు 2014 నాటి అంచనాలు రూ.28,918.95 కోట్లతో రెండు అంచనాలను ఆర్థిక శాఖకు పంపినట్లు చెబుతున్నారు. ఈ సమాచారం రాష్ట్ర జలవనరుల శాఖాధికారులకు తెలుసునని చెబుతున్నారు.

ఇదే వాస్తవమైతే ఆ దశలోనే ముఖ్యమంత్రి స్థాయిలో ఎందుకు కలుగ చేసుకోలేదు? రివైజ్డ్‌ కాస్ట్‌ అంచనాల కమిటీ ఎవరి ఆదేశాల మేరకు 2014 షెడ్యూల్‌ రేట్లతో అంచనాల ప్రతిపాదనలు ఆర్థిక శాఖకు పంపింది? ఇదంతా పరిశీలించితే ఆర్థిక శాఖతో పాటు కేంద్ర జల శక్తి శాఖ మంత్రి కూడా దొంగ దెబ్బ కొట్టారా? ఇక్కడే కేంద్ర ప్రభుత్వ దుర్బుద్ధి వెల్లడౌతోంది. కేంద్ర ప్రభుత్వం నిస్సిగ్గుగా విభజన చట్టాన్ని దుమ్ములో కలిపింది. మొత్తం ఈ ఎపిసోడ్‌కు సంబంధించి కీలకమైన అంశాలు వెలుగు చూడవలసి వుంది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు దీనికి సంబంధించిన అధికార పత్రాలను బహిర్గతం చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం టిడిపి ప్రభుత్వంపై నెపం నెట్టే ముందు…2016 సెప్టెంబర్‌లో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మధ్య పోలవరం ప్రాజెక్టు గురించి జరిగిన ఒప్పందం వివరాలను బహిర్గతం చేయాలి. 2014 నాటి షెడ్యూల్‌ రేటు మాత్రమే ఇవ్వబడుతుందని కేంద్రం చెబితే ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందా? అధికారయుతంగా ఏదైనా రికార్డు వుందా? అలాంటి సమాచారం వుంటే రాష్ట్ర ప్రభుత్వం బయట పెట్టాలి. ఒకవేళ అలాంటి ఒప్పందం వున్నా చట్టబద్దంగా అది చెల్లుబాటు కాదు. ఎందుకంటే పార్లమెంటు ఆమోదించిన రాష్ట్ర విభజన చట్టానికి తూట్లు పొడిచే హక్కు కేంద్ర మంత్రి వర్గానికి లేదు. ఇదిలా వుండగా పులి మీద పుట్ర లాగా తాజాగా కేంద్రం మరొక కొర్రీ వేస్తుందంటున్నారు. తాము విడుదల చేసిన నిధులు ప్రాజెక్టుకే ఉపయోగించి వుండాలనే శల్య పరీక్ష పెట్టబోతున్నారట. ఇది మరీ దుర్మార్గం. పోలవరం ప్రాజెక్టును అధికార, ప్రధాన ప్రతిపక్షాలు తమ రాజకీయాలకు వాడుకుంటే ప్రజలు క్షమించరు.

Courtesy Prajashakti

RELATED ARTICLES

Latest Updates