ఆదాయం నిల్‌.. అప్పులు ఫుల్‌..

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

-వ్యయాలకూ అడ్డంకిగా మారనున్న రుణాలు!
– ఆర్థికమాంద్యంపై ఊతమివ్వని మోడీ సర్కార్‌ నిర్ణయాలు నిపుణులు
– పడిపోయిన కుటుంబ పొదుపు : ఆర్బీఐ

సామాన్య,మధ్యతరగతి కుటుంబాలు బతకటమే కష్టమవుతున్న రోజులివి. ఇక పొదుపు కలగానే మారిపోయింది. ఒకటోతారీఖు వస్తుందంటే చాలు.. అద్దెలు.. పాలు.. సరుకులు.. ఇలా ఎన్నో ఖర్చులకు పైసలివ్వాలి. ఈ ఖర్చులకు డబ్బులు సరిపోక.. కొత్త అప్పులు చేయాల్సిన దుస్థితి. మోడీ సర్కార్‌ పాలనలో నిరుద్యోగం ఆకాశానికి చేరింది. ధరలూ అక్కడికే చేరాయి. ఉద్యోగాలు ఊడుతున్నాయి. కార్మికులు రోడ్డున పడుతున్నారు. ఆదాయాలు తగ్గి… ఖర్చులు పెరిగాయి. ఇక పొదుపు చేయటానికి ఎం మిగిలింది? ఆర్థిక మాంద్యం దెబ్బకు దేశప్రజల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న వాగ్ధానాలు ఫలితం ఇవ్వటం లేదు.పెద్దలకిచ్చే ఉద్దీపన పథకాల వల్ల పేదలకు ఒరిగేదేమి లేదని విశ్లేషకులు అంటున్నారు.
న్యూఢిల్లీ : దేశ ఆర్థిక వ్యవస్థ మరింత ఊబిలోకి కూరుకుపోతున్నది. మాంద్యం కోరలు భవిష్యత్‌లోకి చొచ్చుకెళ్తున్నాయి. ప్రజల కొనుగోలు శక్తి పడిపోవడంతో ఉత్ప త్తుల విక్రయాల్లో మాంద్యం ఛాయలు నెలకొన్నాయి. దీంతో లక్షలాది మంది వర్కర్లు ఇప్పటికే ఉద్యోగాలు కోల్పోయారు. కాగా, ఈ మందగమనం నుంచి గట్టెక్కేందుకు మోడీ సర్కారు తీసుకుంటున్న చర్యలు ఏ మాత్రం ఉపశమనం కలిగించటంలేదు. సామాన్య ప్రజల కొనుగోలు శక్తి పెంచేందుకు మాత్రం ఉపకరించడం లేదన్న అభిప్రాయం ఆర్థిక విశ్లేషకుల్లో వ్యక్తమవుతున్నది. అదీగాక, కుటుంబాల ఆదాయాలు తగ్గిపోయి.. అప్పులు పెరుగుతున్నాయన్న రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్బీఐ) నివేదిక బాంబు పేల్చింది. మాంద్యం మబ్బులు భవిష్యత్‌నూ కమ్మేసే ప్రమాదమున్నదన్న హెచ్చరికలను ఈ నివేదిక ముందుకు తెచ్చింది. నిరుద్యోగం, కొనుగోలు శక్తి క్షీణించడంతో కనీస అవసరాలు తీర్చుకునేందుకే సామాన్య ప్రజలు నానాకష్టాలు పడుతున్నారు. మూడు రూపాయల బిస్కెట్‌ ప్యాకెట్‌ కొనేందుకూ జంకుతున్నారు.
ఈ గడ్డు కాలాన్ని ఎదుర్కొనేందుకు దాచుకున్న కొద్దోగొప్పో ఆదాయాన్నీ వినియోగించక తప్పని పరిస్థితి. అప్పులు చేయాల్సిన దుస్థితీ నెలకొంది. ఇలా ఆదాయాలు పడిపోయి.. అప్పులు చేసిన కుటుంబాలు సమీప భవిష్యత్‌లోనూ సంపాదించిన డబ్బును అప్పును తీర్చేందుకే వినియోగిస్తాయి. మితంగా వ్యయం చేస్తాయి. అవసరాలను కుదించుకుని కొనుగోళ్లను తగ్గించుకుంటాయి. దీంతో నేడు కొనుగోళ్లు లేవని లబోదిబోమంటున్న కంపెనీలకు భవిష్యత్‌లోనూ ఇదే పరిస్థితి ఎదురవొచ్చని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. అంటే, ఆర్థిక మాంద్యం సమీప భవిష్యత్‌ లోనూ కొనసాగే ప్రమాదముందని తెలుస్తున్నది.

క్రమంగా పడిపోయిన కుటుంబాల ఆదాయాలు..
దేశంలోని కుటుంబాల ఆదాయాలు క్రమంగా క్షీణిస్తున్నట్టు ఆర్బీఐ నివేదికలో వెల్లడైంది. 2011-12 ఏడాదిలో కుటుంబాల ఆదాయాలు జీడీపీలో 23.6శాతం ఉండగా.. 2017-18లో 17.2శాతానికి పడిపోయాయి. కాగా, ప్రస్తుతం నెలకొన్న మాంద్యంతో కుటుంబాల ఆదాయాల్లో క్షీణత ఈ ఏడాదిలోనూ కొనసాగే అవకాశము న్నదని నిపుణులు చెబుతున్నారు. ఒకవైపు కుటుంబాల ఆదాయాలు పడిపోతుంటే.. అప్పులు పెరిగిపోతున్న ఆందో ళనకర చిత్రాన్ని ఈ నివేదిక బయటపెట్టింది. ముఖ్యంగా మోడీ సర్కారు అధికారంలోకి వచ్చిన 2014-15 ఏడాది నుంచి ఈ అప్పులు వేగంగా పెరిగాయి. 2011-12లో కుటుంబాల రుణాలు జీడీపీలో 3.3 శాతం ఉండగా.. 2014-15లో మూడు శాతానికి తగ్గాయి. 2015-16లో 2.8 శాతానికి చేరింది. ఇక అప్పటి నుంచి వేగంగా పెరిగాయి. తర్వాతి ఏడాది 3.1శాతానికి 2017-18లో 4.3శాతానికి చేరాయి. కాలానుగుణంగా రాని రుతుప వనా లు, ప్రకృతి విపత్తులతోపాటు, 2016లో కేంద్రం తీసుకున్న నోట్లరద్దు నిర్ణయంతో చాలామంది అప్పుల్లో కూరుకుపో యారు. ఈ సమస్యలను పరిష్కరించడంలో కేంద్రం విఫలం కావడంతో ప్రస్తుతం మాంద్యం నెలకొన్నదన్న చర్చ నడుస్తున్నది. అందుకే ఆదాయాలు తగ్గాయనీ, అప్పులూ పెరిగిపోయాయని నిపుణులు వివరిస్తున్నారు.
భారీగా పెరిగిన పర్సనల్‌ లోన్లు..
2014లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పర్సనల్‌ లోన్లూ విపరీతంగా పెరిగాయి. 2012 నుంచి 2014 వరకు దేశ జీడీపీలో తొమ్మిది శాతంగా ఉన్న వ్యక్తిగత రుణాలు.. 2015లో 9.4శాతానికి, ఆ తర్వాత క్రమంగా పెరుగుతూ.. 2018-19 ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా 11.7శాతానికి చేరడం గమనార్హం. ఇందులో గృహ రుణాలు, విద్యా రుణాలు, క్రెడిట్‌ కార్డులూ ప్రధానంగా ఉన్నాయి. ఆదాయాలు క్షీణించడంతో ఈ అప్పులు పెరిగాయనీ, 2014 వరకు స్థిరంగా ఉన్న రుణాల శాతం అటుతర్వాత పెరుగుతూనే వచ్చింది.
నోట్లరద్దు..జీఎస్టీ నుంచి మందగమనంవైపు..
నోట్లరద్దు, జీఎస్టీలతో ఆర్థిక వ్యవస్థ భారీ కుదుపునకు గురైతే…అప్పటినుంచి ఆర్థిక వ్యవస్థ కోలుకోలేకపోతున్నది. అసంఘటిత రంగాలు, దినసరి కూలీలు, రైతుల జీవితాలపై ఈ నిర్ణయాలు తీవ్ర ప్రభావాన్ని చూపాయి. సాధారణ ప్రజలు తమ దగ్గరున్న కొద్దిపాటి ఆదాయాలను ఆచితూచీ అవసరం మేరకే ఖర్చుచేస్తూ వస్తున్నారు. దేశంలోని మెజార్టీ ప్రజలు నివసించే గ్రామాల్లో మొదలైన ఈ తీరు క్రమంగా పట్టణాల్లోకీ వ్యాపించింది. నిరుద్యోగం ఈ కాలంలోనే గరిష్టస్థాయికి చేరిన విషయం విధితమే. వేతనాల్లోనూ పెంపు నిలిచిపోయింది. వృద్ధి రేటు పడిపోయింది. దీంతో గ్రామాలతోపాటు.. పట్టణ ప్రజల్లోనూ కొనుగోలు శక్తి క్షీణించింది. ముందస్తు ప్రణాళికలు లేకుండానే అమలు చేసిన ఆరెండు నిర్ణయాలతో ఏర్పడ్డ దుష్ఫలితాలను ఎదుర్కొ నేందుకూ మోడీ సర్కారు సరైన నిర్ణయాలు తీసుకోలేదు. వాటి వైఫల్యాలనూ గుర్తించేందుకు నిరాకరించింది. అదే తరహాలో నేడూ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న మాంద్యాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గుర్తించేందుకు నిరాకరిస్తున్నారు. ప్రజల కొనుగోలు శక్తి పెంచేందుకు దోహదపడే నిర్ణయాలకు బదులు మోడీ సర్కారు చెప్పిన సంపద సృష్టికర్తల(పారిశ్రామికవేత్తలు, బడా వ్యాపారులు) కోసం రక్షణాత్మక చర్యలు, ఉద్దీపనలను ప్రకటిస్తున్నది. ఈ ఉద్దీపనలూ తాత్కాలిక ఊరటనే ఇస్తాయన్న విశ్లేషణలు రావడం గమనార్హం.

Courtesy NavaTelangana..

 

 

RELATED ARTICLES

Latest Updates