
ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపు పట్ల వెల్లువెత్తిన ఉత్సాహంపై చన్నీళ్ళు చల్లినందుకూ, తన లౌకిక అభిమానులకి తగిన శాస్తి చేసినందుకూ మనం అరవింద్ కేజ్రీవాల్‌కు ధన్యవాదాలు తెలుపుకోవాలి. రాజకీయ ప్రత్యామ్నాయాలకీ ప్రత్యామ్నాయ రాజకీయాలకీ మధ్య చాలా తేడా ఉందని మనకి తెలిసొచ్చేలా చేసినందుకు కూడా ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. మోదీని గద్దె దించటానికి ఆప్ మనకు సాయపడవచ్చు, కానీ మన గణతంత్రాన్ని పరిరక్షించుకోవడంలో మాత్రం అది సాయపడదు.
ఢిల్లీ అల్లర్ల విషయంలోనూ, కన్హయ్య కుమార్‌పై కేసు విషయంలోనూ వ్యవహరిస్తున్న తీరును బట్టి ఆమ్ ఆద్మీ పార్టీ, అరవింద్ కేజ్రీవాల్ పెద్ద దగా చేశారని చాలామంది ఆందోళన చెందుతున్నారు. కానీ ఆ పార్టీ రచించుకుంటున్న ఒక దీర్ఘకాలిక వ్యూహాన్ని ఎవ్వరూ గమనించటం లేదు. నేటి మోదీ పాలిత భారత దేశానికి తగ్గట్టుగా తన్ను తాను విజయవంతంగా మలచుకున్న మొట్టమొదటి బీజేపీయేతర పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీయేనని చెప్పాలి. దేశంలో ఒక అనివార్య రాజకీయ వాస్తవమై నిలిచిన హిందూత్వ తరహా జాతీయవాదానికి కేజ్రీవాల్ లొంగిపోవటమే కాదు, రాజకీయ దందాలో తనకోసం తెరుచుకున్న ఒక కొత్త అవకాశాన్ని చప్పున పసిగట్టారు.
హిందూత్వ రాజకీయాలకు అంతకంతకూ డిమాండు పెరుగుతూండటంతో– ఆ విషయంలో బీజేపీతో పోటీపడటానికి మరో సరఫరాదారుకు జాగా దొరికింది. ఇప్పుడు ఆ జాగాను సొంతం చేసుకోవటానికే ఆమ్ ఆద్మీ పార్టీ ప్రయత్నిస్తోంది.
ఢిల్లీ ఎన్నికల్లో ఘన విజయం తర్వాత ఆప్ తీసుకున్న రాజకీయ నిర్ణయాలు ఆ పార్టీ ఇకముందు ఏ మార్గంలో పయనిస్తుందో చెప్పకనే చెప్పాయి. దేశద్రోహ నేరం మీద కన్హయ్య కుమార్, ఉమర్ ఖాలిద్, అనిర్బన్ దాసులపై విచారణ జరిపేందుకు అనుమతినివ్వటం ఆప్ ఉద్దేశపూర్వకంగా తీసుకున్న రాజకీయ నిర్ణయం. ఆప్ అధికార ప్రతినిధి మాత్రం ఇది రొటీనుగా ఇచ్చే పాలనాపరమైన అనుమతి మాత్రమే అంటున్నారు. ఆ మాట నమ్మటానికి చాలా అమాయకత్వం కావాలి. ఎందుకంటే– ఒకటి: ఈ అనుమతి ఇచ్చింది ఏదో మామూలు నేరం పై విచారణకు కాదు, దేశద్రోహంపై విచారణకు; అది ఒక రాజకీయ నేరం. రెండు: ఏది దేశద్రోహ నేరం కిందకు రాదో చెప్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన నిర్దేశాలను ఈ కేసు ఏ మాత్రం లెక్కలోకి తీసుకో వటం లేదు. మూడు: స్వయానా ఢిల్లీ ప్రభుత్వ న్యాయ సలహాదారే ఈ కేసు నిలవదనీ, దీని విచారణకు అనుమతి ఇవ్వవద్దనీ ప్రభుత్వానికి సలహా ఇచ్చి వున్నాడు. ఇక చివరగా: ఇది నిజంగా ఒక రొటీను విషయమే అయితే, ఈ విషయంపై నిర్ణయం తీసుకోవటానికి ఢిల్లీ ప్రభుత్వం సంవత్సతానికి పైగా ఎందుకు తాత్సారం చేసింది?
ఒకటి మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. కన్హయ్య కుమార్, ఉమర్ ఖాలీద్‌లకు సానుభూతిపరుడిగా కనపడటమన్నది తన పార్టీ జాతీయవాద కీర్తికి భంగమనీ, దాని వ్యాప్తికి ఆటంకమనీ కేజ్రీవాల్ ఒక అంచనాకి వచ్చారు. ఈ కోణంలో ఆలోచించి చూసినప్పుడు, ఈ పార్టీ ఆర్టికల్ 370 ఎత్తివేతను సమర్థించటమూ, జమ్మూకశ్మీరు రాష్ట్ర పున ర్విభజనను స్వాగతించటమూ పెద్ద ఆశ్చర్యం కలిగించదు. ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికీ సామాజిక వైవిధ్యతకూ సమాఖ్య స్ఫూర్తికీ మొక్కుబడిగా మద్దతు తెలుపుతుంది. కానీ ఇక మీదట అలా వుండదు. ఐక్యత అంటే ఒకేలా ఉండటమే అని నమ్మే తీవ్ర జాతీయవాదపు పరిధుల్లోనే ఆ పార్టీ పని చేస్తుంది. అంతేకాదు, ఈ జాతీయవాదం బీజేపీ మార్కు జాతీయవాదం కంటే మరింత కఠినంగానూ విచక్షణారహితంగానూ కూడా ఉండవచ్చు.
ఆప్ రాజకీయంగా ఆశిస్తున్న స్థితి ఏమిటో ఈమధ్య ఢిల్లీ అల్లర్ల సందర్భంగా ఆ పార్టీ వ్యవహరించిన శైలిలోనూ వెల్లడవుతోంది. లౌకిక వాదం పట్ల వ్యూహాత్మక మౌనం, ఎన్నికల ప్రచారంలో షహీన్ బాగ్ వైపు అస్సలు రాకపోవటం… వీటిని తెలివైన ఎన్నికల ఎత్తుగడలుగా భావించవచ్చు. కానీ నగరంలో ఒకప్రక్క హిందూ–-ముస్లింల మధ్య ఘోరమైన హింస జరుగుతుంటే, ఈ పార్టీ ఉద్దేశపూర్వకంగా నిర్లిప్తంగా ఉండటమన్నది, ఈ పార్టీ ఎంచుకున్న విస్పష్టమైన రాజకీయ మార్గాన్ని సూచిస్తుంది. మతపరమైన హింసపై మంచి అవగాహన ఉన్న హర్ష్ మందర్ ఈ హింస జరుగుతున్నప్పుడు ఆమ్ ఆద్మీ ప్రభుత్వం తీసుకోగలిగివుండీ తీసుకోని చర్యలేమిటో చెప్పారు. గొప్ప మెజారిటీతో నగరంలో ఎన్నికైన ఈ పార్టీ, హింస జరుగుతున్న ప్రాంతాల్లో శాంతిని నెలకొల్పే ప్రయత్నాలు గానీ, బాధితులకు విశ్వాసం కలిగించే ప్రయత్నాలు కానీ చేయనేలేదు, అసలు దరిదాపుల్లోనే కనిపించలేదు. హింసను అదుపు చేయటానికి పాలనాయంత్రాంగాన్ని వాడుకోలేదు. ఉపశమన చర్యలు తీసుకోవటంలో తాత్సారం చేసింది. బాధితులకు చేయాల్సింది చేయటం మానేసి, ఆ గందరగోళంతో తనకు సంబంధం లేనందుకు సంతోషిస్తున్నట్టు కనపడింది. ఇది పాలనా వైఫల్యం కాదు, రాజకీయ ఇచ్ఛ లేకపోవటం. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, అధికసంఖ్యాక హిందువుల్ని నొప్పించకూడదనుకోవటం.
అంతమాత్రాన, ఆప్‌ను ముస్లిం వ్యతిరేక పార్టీ అనలేం, కనీసం ప్రస్తుతానికి. కానీ అది ఎంతవరకూ మైనారిటీల పక్షాన నిలబడుతుందన్నది ఆయా సందర్భాల్లో అధిక సంఖ్యాకుల్లో ఉన్న సెంటిమెంటును బట్టి ఆధారపడి వుంటుంది. ఢిల్లీలో ముస్లింలకు తాను తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని ఆప్‌కు తెలుసు. కాబట్టి ఊరికే ముస్లిం అనుకూలత కనబరిచి హిందూ ఓట్లను పోగొట్టుకోదల్చుకోలేదు. అందుకే ఆ పార్టీ అయోధ్యపై వెలువడిన తీర్పును ఒప్పుకోవటమే కాదు, ఎదురేగి స్వాగతించింది కూడా.
ఇదంతా చూసి ఆప్‌ను బీజేపీకి అనుబంధ పార్టీ అనుకుంటే పొరపాటే. అదే నిజమైతే ఆ పార్టీ మున్ముందు బీజేపీకి ఎన్నికలపరంగా మద్దతునివ్వాలి. కానీ అలా జరగదు సరికదా, బీజేపీకి అది దేశంలోని కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన పోటీదారుగా నిలబడగలదు. ఒకేరకమైన భావజాలం ఉన్నంత మాత్రాన అది స్నేహపూర్వకమైన స్పర్థకు దారి తీస్తుందనుకోవటం పొరపాటు; అది చాలాసార్లు తీక్షణమైన, కఠినమైన, వ్యక్తిగత స్థాయి యుద్ధానికి దారితీస్తుంది. బహుశా ఆప్ ఇక ఏదో ఒక్క రాజకీయ దృక్కోణానికి నిబద్ధమై ఉండాలనే బరువు మోయదు. లౌకికవాదం, ప్రజాస్వామ్యం ఈ విషయాలని తీసుకొని బీజేపీ మీద దాడి చేయటం తగ్గిస్తుంది. పాలనా సంబంధ విషయాలపై మాత్రమే విమర్శలు ఎక్కుపెడుతుంది. ఈ రకమైన వ్యవహార శైలికి మనం ఇంకేదైనా పేరు వెతకాలి. ‘మృదు హిందూత్వ’ (సాఫ్ట్ హిందూత్వ) అన్న పేరు సరైనదే కానీ, అది మాత్రమే సరిపోదు. ఈ పార్టీ రాజకీయంగా ఆశిస్తున్న స్థితికి కరుడుగట్టిన జాతీయవాదం కీలకం. ఈ పార్టీ నియో లిబరల్ ఆర్థిక నమూనాను వ్యతిరేకిస్తుందని ఆశపడేవారు ఈ పార్టీ ఆర్థిక విధానాన్నిగానీ, దాని లేమినిగానీ చూసి భంగపడతారు. మృదు హిందూత్వ, కరుడుగట్టిన జాతీయవాదం, అస్పష్ట ఆర్థిక విధానం, ప్రజాభిప్రాయానికి దాస్యం చేయటం… ఇదీ ఆప్ బ్రాండ్‌కు సరైన వర్ణన.
కాబట్టి ఆప్ వ్యవహరిస్తున్న తీరులో ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు. ఈ పార్టీ ‘మీడియన్ ఓటర్ థియరీ’ని (మధ్యస్థ ఓటరు సిద్ధాంతాన్ని) చాలా శ్రద్ధగా పాటిస్తున్నదని చెప్పొచ్చు. ఈ సిద్ధాంతం ప్రకారం, ఏ పార్టీ అయితే అటూయిటూ కాని ఓటర్ల (‘మధ్యస్థ’ ఓటర్ల) అభిప్రాయాన్నిసరిగ్గా పట్టుకోగలుగుతుందో ఆ పార్టీయే ఓట్ల దందాలో గెలుస్తుంది. ఈ మధ్యస్థ ఓటరు మితవాదంవైపు మొగ్గుచూపిస్తే పార్టీ కూడా అటువైపే మొగ్గు చూపాలి. మొక్కవోని ఓట్ల వెంపర్లాటలో ఆప్ పాటిస్తున్నది ఈ సూత్రాన్నే. సంఘ్ పరివార్ ఈ మధ్యస్థ ఓటర్ల అభిప్రాయాన్ని మితవాదం వైపు మొగ్గేట్టు చేసింది. ఆప్ ఇప్పుడు ఈ ఓటర్ల అభిప్రాయంతో తన అభిప్రాయాల్ని పోల్చుకునేందుకు తహతహలాడుతోంది. ఈ పార్టీ దగా చేసినప్పుడల్లా రాజకీయ విశ్లేషకులు ఇంకా ఆశ్చర్యపోవటమన్నదే అసలు ఆశ్చర్యపడాల్సిన విషయం. అందమనేది చూసేవాళ్ల కళ్ళల్లో ఉంటుందంటారు, వంచన అనేది కూడా అంతే.
ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపుపట్ల వెల్లువెత్తిన ఉత్సాహంపై చన్నీళ్ళూ చల్లినందుకూ, తన లౌకిక అభిమానులకి తగిన శాస్తి చేసినందుకూ, మనం నిజానికి అరవింద్ కేజ్రీవాల్‌కు ధన్యవాదాలు తెలుపుకోవాలి. రాజకీయ ప్రత్యామ్నాయాలకీ ప్రత్యామ్నాయ రాజకీయాలకీ మధ్య చాలా తేడా ఉందని మనకి తెలిసొచ్చేలా చేసినందుకు కూడా ఆయనకి ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఆయన ఇప్పుడు రాజకీయంగా ఆశిస్తున్న స్థితి ఆయనకు ఢిల్లీ అవతల ఏమన్నా ఒనగూరుస్తుందా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేం. కాని ఒకటి మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు: మోదీని గద్దె దించటంలో ఆప్ మనకు సాయపడవచ్చు, కానీ మన గణతంత్రాన్ని మళ్ళీ దక్కించుకోవటంలో మాత్రం అది సాయపడలేదు.
Courtesy Andhrajyothi