అడవి బిడ్డలకు దక్కని హక్కుపత్రాలు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

10లక్షల ఎకరాలకు అందని వైనం
పాలకుల తప్పిదాలు
అధికారులు, గిరిజనుల మధ్య యుద్ధ వాతావరణం
రాష్ట్రవ్యాప్తంగా రగులుతున్న పోడు రగడ
అమలు కాని సీఎం కేసీఆర్‌ హామీ

పోడు రైతులు దొంగలు కాదు. పొట్టకూటి కోసమే పోడు నరుక్కుని బతుకీడుస్తున్నారు. వారికీ రైతుబంధు, రుణమాఫీ, హక్కుపత్రాలు, రైతుబీమా అందాల్సి ఉంది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రెండోసారి వచ్చాక ఆరు నెలల్లో పోడు రైతులకు అండగా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తుంది. ఈ కీలక పథకానికి నేనే సీఎం హోదాలో జిల్లాకు రెండు రోజుల పాటు కేటాయించి అటవీ శాఖ మంత్రి, సీఎస్‌, అటవీశాఖ ముఖ్యకార్యదర్శితో వచ్చి పోడు భూముల సమస్యకు చెక్‌పెడతా’. ఇవీ గత డిసెంబర్‌లో శాసనసభ ఎన్నికల సందర్భంగా ఏజెన్సీ నియోజకవర్గాల్లో పర్యటించినపుడు సీఎం కేసీఆర్‌ చెప్పిన మాటలు.
టీఆర్‌ఎస్‌ పార్టీ రెండోసారి అధికారంలోకొచ్చి ఆరునెలలు దాటింది. కానీ సీఎం కేసీఆర్‌ చెప్పినట్టుగా ఏమీ జరగలేదు. పైగా గిరిజనులపైకి అటవీ అధికారులను ఉసిగొల్పుతోంది. పాలకులు చేసే తప్పులతో అధికారులు, గిరిజనుల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ప్రతి యేటా ఈ సీజన్‌లో గిరిజనులు పోడు భూముల్లో సాగు ప్రారంభించడం అధికారులు అడ్డుకుని కేసులు పెట్టడం పరిపాటిగా మారింది. హక్కుపత్రాలు ఇవ్వాలని పదేండ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఏదో ఒక సాకుచూపి కొర్రీలు పెడుతున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలు పరిశీలిస్తే ఓ వైపు గిరిజనులకు పోడుపై హక్కులు ఉన్నాయంటూనే.. మరో వైపు హరితహారం పేర ప్రభుత్వం ఫారెస్ట్‌ అధికారులను ఉసిగొల్పి దాడులకు ప్రేరేపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.
ఆరేండ్లుగా పట్టాలివ్వని ప్రభుత్వం
భూపాలపల్లి, మహబూబాబాద్‌, వరంగల్‌రూరల్‌, నాగర్‌కర్నూల్‌, ఆదిలాబాద్‌, భద్రాచలం, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, ఆసిఫాబాద్‌, కామారెడ్డి, కొమరంభీం, ఖమ్మం తదితర జిల్లాల్లో కలిపి 13లక్షల ఎకరాల పోడు భూములున్నాయి. రాష్ట్రంలో 70.18లక్షల ఎకరాల అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. ఇందులో 50,45,760 ఎకరాల రిజర్వ్‌ ఫారెస్టు భూములున్నాయి. అన్ని జిల్లాల్లో కలిపి 1,83,252 మంది పోడు సాగుదారులు తమకు హక్కుపత్రాలు ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 82,075 దరఖాస్తులు ఎలాంటి వివరణ లేకుండా తిరస్కరించబడ్డాయి. యూపీఏ ప్రభుత్వ హయాంలో మాత్రం 2,95,000 ఎకరాలకు హక్కుపత్రాలు అందజేశారు. ఇంకా సుమారు 10లక్షల ఎకరాలకు ఇవ్వాల్సి ఉంది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆరేండ్ల నుంచి ఒక్కటంటే ఒక్క ఎకరానికీ హక్కుపత్రాలు ఇచ్చిన దాఖలాల్లేవు.
వరంగల్‌ ఉమ్మడి జిల్లాలో నర్సంపేట, ములుగు, మహబూబాబాద్‌ పాత డివిజన్‌ల పరిధిలో 155 ఎఫ్‌ఆర్‌సీలను నియామకం చేశారు. 28,481 మంది పోడు రైతులు సాగు చేస్తున్న లక్షా 3938 ఎకరాలకు హక్కు పత్రాలు ఇవ్వాలనీ ఎఫ్‌ఆర్‌సీలు సిఫార్సు చేశాయి. వీటిని బుట్టదాఖలు చేసి 7,838 మందికి మాత్రమే ప్రభుత్వం హక్కు పత్రాలు జారీ చేసింది. ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు డీఎల్‌సీ ఆమోదం తెలిపిన 16వేల ఎకరాల పోడు భూమిపై 7,254 మంది గిరిజన రైతులే అర్హులనీ తేల్చింది. అయినా హక్కు పత్రాలు పంపిణీ చేయలేదు. ఇటీవల ఖానాపురం మండలం అశోక్‌నగర్‌కు చెందిన 15మందిపై కేసులు నమోదు చేశారు. సీపీఐ(ఎం) నాయకులు ముంజాల సాయిలు, రమేష్‌ను జైలుకు పంపారు. నర్సంపేట రేంజ్‌ పరిధిలో 1991 నుంచి గత ఏడాది అక్టోబర్‌ వరకు 435 కేసులు నమోదయ్యాయి. ఇందులో అటవీహక్కుల చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత 412 కేసులు నమోదు కాగా, 323 కేసుల్లో చార్జిషీట్‌ దాఖలయ్యాయి.
హరితహారం పేరుతో హద్దులు
ఇప్పటికే రాష్ట్రంలో అటవీ, రెవెన్యూ, పోలీసు అధికారులు వెళ్లి గిరిజనులు సాగులో ఉన్న పోడు భూముల్లో అటవీభూముల హద్దుల పేరుతో కందకాలు తీస్తున్నారు. అడ్డొచ్చిన వారిపై కేసులు బనాయిస్తున్నారు. ముఖ్యంగా మంచిర్యాల, భద్రాద్రి, ఖమ్మం, వరంగల్‌ ఉమ్మడి జిల్లాల్లో వందలాది మందిపై కేసులు పెట్టి ఇటీవల జైళ్లకు పంపారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పోడు రైతుల ఆత్మహత్య
ఐదేండ్లలో పోడు రైతులు తమ భూములకు హక్కు పత్రాలు ఇవ్వలేదని భూములు లాక్కుంటున్నారన్న ఆవే దనతో ఆత్మహత్య చేసుకున్న ఘటనలు ఉన్నాయి. ఇటీవల ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామా నికి చెందిన దరావతు నాగేశ్వరరావు(40) పోడుభూముల విషయంలో అధికారుల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. గతేడాది సింగరేణి మండలం చీమలపాడుకు చెందిన మాలోతు లక్ష్మా పెనుబల్లి మండలం ఉప్పల చెలక లో వెంకయ్య ఆత్మహత్య చేసుకున్నారు. కారేపల్లి మండలం చింతలపాడు గ్రామానికి చెందిన మాలోత్‌ లక్ష్మా కొణిజర్ల మండలం అన్నవరం గ్రామానికి చెందిన పసుపులేటి నాగయ్య సత్తుపల్లి మండలం చెరుకుపల్లి గ్రామానికి చెందిన నున్నానాగమణి ఆత్మహత్యాయత్నం చేశారు. భద్రాద్రి జిల్లా ఇల్లందు మండలం వీరాపురంలో మంకిడి కృష్ణ సీతానగరంలో ఊకే సారయ్య రఘుబోయినగూడెంలో కున్సోత్‌ చంద్రుకు చెందిన ఐదెకరాలకు హక్కుపత్రాలున్నా భూమిని స్వాధీనం చేసుకున్నారు. దీంతో గతేడాది జూలై17న చంద్రు ఆత్మహత్యాయత్నం చేశాడు.
1970 కన్నా ముందున్న వాటికీ పట్టాల్లేవు
యాభై ఏండ్లుగా సాగు చేస్తున్నాం. హక్కుపత్రాలు ఇవ్వలేదు. అదేమంటే రాలేదంటున్నారు. అనేక సార్లు అధికారులను కలిశాం. ఫిర్యాదులు చేశాం కానీ హక్కుపత్రాల గురించి పట్టించుకోవడం లేదు.
– అజ్మీర బాలాజీ- కొణిజర్ల మండలం
కొమురం భీం ఘటనకు ప్రభుత్వానిదే బాధ్యత
రాష్ట్రంలో గిరిజనులు దగాకు గురవుతున్నారు. ఆదివారం కొమురం భీం జిల్లా సర్సాలలో అటవీ అధికారులపై జరిగిన దాడికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. పోడు సాగుదారులకు హక్కుపత్రాలు అందజేస్తే ఈ తరహా దాడులు జరిగేవి కావు. ప్రభుత్వ నిర్వాకం వల్లే అధికారులు దాడికి గురయ్యారు. ఇకనైనా అర్హులైన పోడు రైతులకు హక్కుపత్రాలు మంజూరు చేయాలి. అక్రమంగా పెట్టిన కేసులను బేషరతుగా ఎత్తివేయాలి.
– మూడావత్‌ ధర్మా నాయక్‌
గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి
పదేండ్లుగా తిరుగుతున్నా
తాతాల నాటి నుంచి వస్తున్న పోడు భూములకు కూడా హక్కుపత్రాలు ఇవ్వలేదు. పదేండ్లుగా పట్టాల కోసం తిరుగుతున్నాం. ఎప్పుడూ సర్వేలు అంటూ దాటవేస్తున్నారు. అధికారులు మాత్రం హక్కు పత్రాలుంటేనే సాగుకు ఒప్పుకుంటున్నారు.
– గుగులోత్‌ గమ్లీ ఏన్కూరు మండలం

(నవ తెలంగాణ సౌజన్యంతో..)

RELATED ARTICLES

Latest Updates