అమ్మదేవతలు– ‘ఆధిపత్య’ ఆరాధనలు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

స్థానీయ జానపద దేవతల ఆచారాలలోనికి సంస్కృత దేవతల సంప్రదాయాలు బలంగా చొచ్చుకొని వస్తున్నాయి. దీనివల్ల జానపద సంప్రదాయాలకు దెబ్బ తగులుతూ ఉంది. అంతరించే స్థితి వస్తూ ఉంది. ఇది నేడు గట్టిగా చర్చించవలసిన అంశం. కొన్ని గ్రామదేవతల పైన గట్టి నమ్మకం ఏర్పడడం ఆ గుడులకు భక్తులు ఎక్కువగా రావడం వాటికి ఆదాయం పెరగడం కొత్త సమస్యలకు దారితీసింది. ఇదే పేరంటాల గుడులలోనూ జరిగింది. అలాంటి గుడుల దగ్గర భక్తులు సంస్కృత సంప్రదాయాలను పెట్టమని బలవంతం చేయడం పూజారులను మార్చడం జరిగింది.

జానపద సంప్రదాయాలు చాలా బలమైనవి. జానపద దేవతల అమ్మదేవతల ఆరాధన వేల సంవత్సరాలుగా వస్తూ ఉంది. బోనాలు కొలుపులు, లేదా జాతరలు తిరునాళ్ళు.. ఈ ద్రవిడ సంప్రదాయాలు నేటికీ జానపద దేవతల ఆరాధనలోనే వ్యక్తం అవుతున్నాయి. ఔత్తరాహ సంప్రదాయాలకు భిన్నంగా కనిపించే ద్రవిడ సంప్రదాయాలు.. విశేషించి జానపద సంప్రదాయాలలోనికి సంస్కృత సంప్రదాయాలు చొరబడి వాటిని మాయం చేస్తున్నాయి.

జానపద దేవతలలో పురుష దేవతలు కొద్దిమందే కానీ అమ్మదేవతలు చాలా ఎక్కువమంది. వందకు పైగా అమ్మతల్లుల పేర్లు ఉన్నాయి. సింధు నాగరికతలోనే అమ్మదేవతల ఆరాధన ఉండి ఉండేదని 1930నాటి జాన్ మార్షల్ పరిశోధనలలోనే వెలికి వచ్చింది. జానపద కథలు, జానపద దేవతలకు చెందిన పురాకథలు సంస్కృత దేవతల పురాణ కథలతో సమన్వయం కావడం చాలా కాలం క్రితమే జరిగింది. స్థానికంగా జరిగిన చాలా కథలు సంస్కృత పురాణ కథలతో కలగలిసిపొయ్యాయి. మనవద్ద జరిగిన ఎల్లమ్మకథ సంస్కృతంలోని పరశురాముని కథతో, రేణుక జమదగ్ని కథతో కలిసి పోవడం వందల సంవత్సరాలనాడే జరిగింది. చాలా జానపద దేవీదేవతలు పురాణకథల్లో అటు పార్వతీశివులతో, వేరు వేరు దేవతలతో కలిసిపోయారు. గిరిజన దేవతలకు కూడా పురాణ దేవతలతో సంబంధాలు ఏర్పడడం ఎప్పుడో జరిగింది. ఈ సమ్మేళనం ఎప్పటి నుండో ఉన్నా ఇటీవలి కాలంలో జానపద సంప్రదాయాలలోనికి జానపద ఆరాధన పద్ధతులలోనికి సంస్కృత దేవతల ఆచారాలు వారి ఆరాధనా విధానం చాలా బలంగా చొచ్చుకొని వచ్చి ద్రవిడ సంప్రదాయాలు, స్థానీయమైన జానపద సంప్రదాయాలు క్రమంగా కనుమరుగవుతున్నాయి. అమ్మతల్లులు.., పురుష దేవతలు జానపదులకు సామాన్య జనాలకు చాలా దగ్గరగా ఉంటారు. వారికి ఈ అమ్మతల్లుల మీద, ఈ పురుష దేవతలపైన భక్తి ప్రేమ ఎక్కువ. వారిని ఆరాధించడం తాము తినే మాంసాన్ని పెట్టడం.. అంటే బలి ఇవ్వడం వేల ఏండ్లుగా వస్తున్న ఆచారం. వీరిని కొలిచే పూజారులను ఆచారమంతులు అని అంటారు. ఈ గ్రామదేవతల గుడులలో ‘కింది’ కులాల వారు దళిత కులాలవారు పూజారులుగా ఉన్నారు.

స్థానీయ జానపదదేవతల ఆచారాలలోనికి సంస్కృతదేవతల సంప్రదాయాలు బలంగా చొచ్చుకొని వస్తున్నాయి. దీనివల్ల జానపద సంప్రదాయాలకు దెబ్బ తగులుతూ ఉంది. అంతరించే స్థితి వస్తూ ఉంది. ఇది నేడు గట్టిగా చర్చించవలసిన అంశం. కొన్ని గ్రామదేవతల పైన గట్టి నమ్మకం ఏర్పడడం, ఆ గుడులకు భక్తులు ఎక్కువగా రావడం, వాటికి ఆదాయం పెరగడం కొత్త సమస్యలకు దారితీసింది. ఇదే పేరంటాల గుడులలోనూ జరిగింది. అలాంటి గుడుల దగ్గర భక్తులు సంస్కృత సంప్రదాయాలను పెట్టమని బలవంతం చేయడం పూజారులను మార్చడం జరిగింది. తెలుగు జిల్లాలలో ఉన్న పేరంటాళ్ళ దేవతల ఆరాధనా సంప్రదాయాలలోనికి బాగా వచ్చింది. హైదరాబాదులో ఎల్లమ్మ, పెద్దమ్మ, పోచమ్మ, నల్లపోచమ్మ, మైసమ్మ వంటి అమ్మతల్లుల గుడులు చాలా ఎక్కువ. జానపద పరిశోధకులకు, మానవశాస్త్రాల వారికి హైదరాబాదు నగరం ఒక పెద్ద పల్లెటూరు. జానపద సంప్రదాయాలు ఇక్కడ సజీవంగా ఉన్నాయి. ఇక్కడే మార్పు కూడా బలంగా జరుగుతూ ఉంది. చాలా చోట్ల అమ్మతల్లుల గుడులకు వచ్చిన భక్తులు, ఆలయం మేనేజిమెంటు అష్టోత్తరం, సహస్రనామం వంటి సంస్కృత సంప్రదాయంలోని అర్చన పద్ధతులు పెట్టించమని సంస్కృత మంత్రాలు చదివే బ్రాహ్మణ పూజారులను పెట్టమని చెప్పడమే కాదు, చాలా దేవాలయాలలో పెట్టడమూ జరిగింది. పైన చెప్పిన భిన్న కులాల పూజారులు కూడా ఈ గుడులలో విడిగా కొనసాగడం కనిపిస్తుంది. కొన్ని చోట్ల బ్రాహ్మణ పూజారులు వచ్చిన కారణంగా జానపద సంప్రదాయపు పూజారులను తొలగించారు. ఈ వివాదాలు కోర్టుల దాకా పోయినట్లు తెలుస్తూ ఉంది.

హైదరాదులోనే జరిగిన పరిణామాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తూ ఉన్నాయి. కూకట్‌పల్లి వరకే హైదరాబాదు నగరం ఉండి, కాలనీ లేని కాలంలోనే అక్కడ ఎల్లమ్మ గుడి ఉంది. కాలనీ వచ్చి నగరం వ్యాపించిన తర్వాత అక్కడి ఎల్లమ్మగుడి ప్రశస్తి బాగా పెరిగింది. ఆ తల్లిమీద భక్తులకు బాగా ఎక్కువ నమ్మకం ఏర్పడింది. ఫలితంగా అక్కడ సంస్కృత సంప్రదాయాలను పెట్టారు. ఎల్లమ్మకు వేరే విగ్రహం కూడా పెట్టి జానపద దేవత పక్కనే మరొక గుడిలా కట్టారు. ఇది సంస్కృత దేవతల గుడుల శైలిలో ఉంటుంది. పక్కనే జానపద దేవత ఎల్లమ్మ మాత్రం చిన్న గుడిలో అలాగే ఉంటుంది. జానపద ఆచారాలు కోళ్ళు, మేకల బలి, బోనం వగైరా ఉన్నాయి. దానికి ఆనుకొనే ఉన్న ఎల్లమ్మకు మాత్రం సంస్కృత మంత్రాలు జరుగుతాయి. ఇక్కడ జానపద పూజారి, అక్కడ బ్రాహ్మణ పూజారి ఉన్నారు. అదే పద్ధతిలో మియాపూరు దగ్గరలో ఆల్విన్ చౌరస్తాలో అమ్మవారి గుడి రెండు అంతస్తులలో ఉండడం కింద జానపద ఆచారాలు కొనసాగడం, పైన సంస్కృత మంత్రాలతో అలాంటి సంప్రదాయం జరగడం ప్రత్యక్షంగా కనిపిస్తుంది. ఇలా చాలా గుడులలో జానపద సంప్రదాయాల పక్కన సంస్కృత సంప్రదాయాలు వచ్చి చేరుతున్నాయి. కొన్ని గుడులలో సంస్కృత దేవతలు చేరి మొత్తం ఆరాధనా సంప్రదాయాలు మారిపోవడం ఇటీవలి కాలంలో జరిగిన పెనుమార్పు.

ఈ పరిణామానికి పెద్ద ఉదాహరణ హైదరాబాదులోని జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి. ఇది జానపద దేవత గుడి అని అందరికీ తెలుసు, ముప్పై ఏళ్ల కింద పరిశోధక విద్యార్థిగా నేను ఇక్కడికి వచ్చినప్పుడు చిన్న గుడి ఉండేది. జంతుబలి ప్రత్యక్షంగా అమ్మవారి ఎదురుగా జరిగేది. ఈ గుడి నేడు పూర్తిగా సంస్కృత దేవాలయంగా మారింది. బలులను నిషేధించారు. బలి ఇవ్వాలి అనే నమ్మకం ఉన్న భక్తులు దూరంగా పోయి బలి ఇచ్చుకొని అక్కడే వండుకొని భోజనం చేసి వెళుతున్నారు. బోనం పెట్టడం వంటి జానపద ఆచారాలు పూర్తిగా ఆగిపోయాయి. అమ్మతల్లి పూర్తిగా శాకాహారిగా మారింది. అర్చన విధులు పూజాదికాలు ఉత్సవాలు అన్నీ సంస్కృత సంప్రదాయాలు అయ్యాయి. అక్కడి పూజారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇంతకు ముందున్న ‘వామాచారాన్ని’ తీసివేసి ‘సౌమ్యాచారంగా’ మార్చాము దానికి అనుగుణంగానే అమ్మవారి విగ్రహాన్ని నూతనంగా ప్రతిష్ఠించాము అని చెప్పారు. ఇక్కడ ఏమాత్రం జానపద సంప్రదాయాలు మిగలలేదు.

మరొక ఉదాహరణ బల్కం పేట ఎల్లమ్మ గుడి. ఈ గుడి 700 సంవత్సరాల క్రితమే ఉందని చరిత్ర చెప్తున్నది. బల్కంపేట నాడు ఒక పల్లె. అక్కడి ఒక వ్యవసాయ భూమిలో బావి తవ్వుతుండగా దేవత విగ్రహం కనిపించింది. ఆ రైతుకు ఆ రాత్రి కలలో కనిపించి తాను ఎల్లమ్మ దేవతనని అక్కడే గుడి కట్టి పూజించించండి అని కోరినట్లు.. అప్పటి నుండి ఆ బావిలోని నీటి మధ్యలోనే ఆ దేవతని కొలుస్తున్నట్లు అక్కడి వారు చెప్పారు. నేటికీ ఆకుటుంబ వారసులు అక్కడ ఆచారం చేస్తున్నారు. ఈ జానపద పూజారులు కింద బావి ఉన్న ప్రదేశంలో పూజిస్తారు. కాని దీనికి పైన చాలా పెద్ద ఆలయం నిర్మించారు. పైన కూడా అమ్మవారి విగ్రహం ఉంటుంది. ఇక్కడ పూర్తిగా సంస్కృత సంప్రదాయాలు, పూజాదికాలు, ఉత్సవాలు జరుగుతాయి. ఈ గుడిలో కూడా బలులు నిషేధించారు. కాని ఇక్కడికి వచ్చిన జానపద నమ్మకాలు ఉన్న భక్తులు దూరంగా పోయి కోళ్ళు మేకలు బలి ఇచ్చి దేవతకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ గుడిలో పూజాదికాలు అన్నీ వేంకటేశ్వర స్వామికి జరిగే పద్ధతిలో జరుగుతున్నాయి. వాహనాలతో సేవ, బ్రహ్మోత్సవాలు, దేవీ అలంకారాలతో ఉత్సవాలు జరుగుతున్నాయి. బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం హైదరాబాదులో చాలా పెద్ద ఉత్సవంగా మారింది.

చాలా గ్రామదేవతల,, ఆదాయం, ఇతర వనరులు ఉన్న గుడులలో సంస్కృత ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కొన్నిచోట్ల రెండూ కలిసి ఉండడం, మరికొన్ని చోట్ల జానపద సంప్రదాయాలను పక్కకు నెట్టేసి సంస్కృత సంప్రదాయాలు నిలవడం కనిపిస్తుంది. ఇలాంటి ఉత్సవాల్లో వెంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగే పద్ధతులే ఉంటున్నాయి. రోజుకొక్క విధంగా సేవలు, సంస్కృత అర్చన విధానాలు అమలు చేయడం, కళ్యాణం జరిపించడం వంటివి ఈ గుడులలోనికి చొచ్చుకొని వచ్చాయి. ఈ క్రమం మొత్తాన్ని వేంకటేశ్వరీకరణం అనవచ్చు. పురుష దేవతల సంప్రదాయాలలో వచ్చిన ఇటువంటి పరిణామాలకు కొమిరెల్లి మల్లన్న గుడిని మంచి ఉదాహరణగా చెప్పవచ్చు. ఇక్కడ కూడా సంస్కృత సంప్రదాయాలు అన్నీ వచ్చి చేరాయి. వాహన సేవలు వచ్చాయి. జానపద సంప్రదాయాలు బలంగా ఉన్నా కూడా వాటి పక్కనే సంస్కృత సంప్రదాయాలు చేరాయి. అక్కడి పూజారులు సంస్కృత మంత్రాలు ఆచారాలు కూడా నేర్చుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నేపథ్యంలో అధికారిక హోదాలో మల్లన్న కళ్యాణం పెద్దఎత్తున భద్రాచలం రాములోరి కళ్యాణం మాదిరిగా ఇటీవలి కాలంలోనే జరుగుతూ ఉంది.

ఈ తీరులో జానపద ఆచారాలలో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కొన్ని చోట్ల అంతరిస్తున్నాయి. బ్రిటిషు పాలనలోనే జానపద, గ్రామదేవతల సంప్రదాయాలు, ప్రజల నమ్మకాల వ్యవస్థపై ఇంగ్లీషు పరిశోధకులు హెన్రీవైట్ హెడ్, ఎల్మోర్ వంటి వారు లోతైన పరిశోధన చేశారు. కొన్ని సంప్రదాయాలు వారికి అర్థం కాక తప్పుడు వ్యాఖ్యానాలు కూడా చేశారు. జానపద సంప్రదాయాలు కింది స్థాయివి అని, సంస్కృత సంప్రదాయాలు పై స్థాయి లేదా ఉన్నత స్థాయివి లేదా మరింత మంచివి అనే భావన వ్యాప్తి చెందుతూ ఉంది. ఇటీవలి కాలంలో బలంగా జరుగుతూ ఉన్న ఈ పరిణామాలను సామాజిక శాస్త్రవేత్త ఎమ్.ఎన్. శ్రీనివాస్ చెప్పిన సంస్కృతీకరణం అనే సామాజిక పరిణామంతో పోల్చడం కుదరదు. ఇక్కడ చిన్న దేవతలు, ఆ సంప్రదాయాలు పై వాటిని అనుకరించడం లేదు. కాగా బలమైన సంప్రదాయాలు వచ్చి జానపద సంప్రదాయాలను ఆక్రమిస్తున్నాయి. ఇవి ఇలాగే కొనసాగితే జానపద సంప్రదాయాలు, పూజావిధానాలు, తెలుగులో ఉండే మంత్రాలు, కథలు కనుమరుగు అయ్యే రోజు రావచ్చు!

ప్రొఫెసర్ పులికొండ సుబ్బాచారి

(Courtacy Andhrajyothi)

RELATED ARTICLES

Latest Updates