ఇప్పుడూ 2002 పంథానే..!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

జార్ఖండ్‌ మూక దాడులపై మోడీ వ్యవహారశైలి
న్యూఢిల్లీ : జార్ఖండ్‌లో ఇటీవల జరుగుతున్న దాడులపై ప్రధాని మోడీ తాను గుజరాత్‌కు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన అల్లర్లపై అనుసరించిన వైఖరినే కొనసాగిస్తున్నారు. అల్లరిమూకల దాడులు విచారకరమని అంటూనే ఇందుకు రాష్ట్రం మొత్తాన్ని అవమానించే హక్కు మనకు లేదని బుధవారం లోక్‌సభలో ప్రసంగం సందర్భంగా మోడీ అన్నారు.

తర్వేజ్‌ అన్సారీ అనే వ్యక్తిని మూకలు దాడి చేసిన హత్య చేసిన సంగతి తెలిసిందే.. దీనికి సంబంధించి పార్లమెంట్‌లో జరిగిన చర్చ సందర్భంగా మోడీ మాట్లాడారు. వాస్తవానికి రాష్ట్రంలో మూకదాడులు తగ్గుముఖం పట్టాయని ఆయన వ్యాఖ్యానించారు.అయితే 2016 నుంచి రాష్ట్రంలో మూక దాడులు పెరిగాయి. సుమారు 18 మందిపై దాడులు చేయడం లేదా, హత్య లాంటి ఘటనలు చోటుచేసుకున్నాయని ‘ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’ ఈ నెల 27న ప్రచురించిన సంపాదకీయంలో పేర్కొంది. ఈ బాధితుల్లో కూడా ఎక్కువ మంది ముస్లిములు ఉన్నారు.
ఇటువంటి ముఖ్యమైన సమస్యను గుర్తించలేనప్పుడు ఆ రాష్ట్రంలో తగిన చర్యలు కూడా చేపట్టలేరు. హిందూత్వ శక్తులు ”జై శ్రీరామ్‌’ అనే నినాదాలు చేయాలని ఒత్తిడి చేస్తూ ముస్లిములపై ఇటువంటి దాడులు చేస్తున్నారు. అన్సారీ విషయంలో కూడా ఇదే జరిగింది. అయితే ఇంతకుముందు వరకూ రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితులు లేదు. బీజేపీ చేస్తున్న రాజకీయాలకు కొంతమంది ప్రభావితమై ఇటువంటి దాడులకు పాల్పడుతున్నారు. ఇటువంటి రాజకీయాలపై హిందువులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని విశ్లేషకులు చెబుతున్నారు.
2002 గుజరాత్‌లో జరిగిన అల్లర్ల సమయంలో వ్యవహరించిన తీరునే మోడీ ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నారు. ఆ సమయంలో ముస్లిములపై జరిగిన దాడులకు ప్రపంచవ్యాప్తంగా ఖండనలు వచ్చాయి. అయితే హిందూత్వ మూకల బారినపడిన బాధిత కుటుంబాలకు అండగా ఉండాల్సిన అప్పటి ముఖ్యమంత్రి మోడీ గుజరాత్‌ను అందరూ అవమానిస్తున్నారనే ప్రచారాన్ని ముందుకు తీసుకువచ్చారు. అనంతరం ‘గుజరాత్‌ గౌరవ్‌ యాత్ర’ చేపట్టారు. ముస్లిములపై జరిగిన హత్యాకాండను ఖండించకపోగా, తన ప్రసంగాలతో ఈ ఘటనను హిందువులు పట్టించుకోని స్థితికి తీసుకువచ్చారు. గుజరాత్‌కు శత్రువులు పెరిగిపోతున్నారనే ప్రచారం చేశారు. ఘటనను గుజరాత్‌ రాష్ట్రాన్ని మొత్తాన్ని శంకించాల్సిన అవసరం లేదని మోడీ అప్పట్లో కూడా ఇదే విధంగా వ్యాఖ్యానించారు. కొన్ని రాజకీయ, మతతత్వ శక్తులు పక్కావ్యూహంతో సాగించిన ఈ హింసను పక్కదారి పట్టించేందుకు అప్పట్లో మోడీ విశ్వప్రయత్నాలు చేశారు. దీన్ని ప్రజల్లోకి కూడా తీసుకెళ్లారు. గుజరాతీలు అంటే ఒక్క హిందువులు మాత్రమే అనేలా వారి ప్రచారం సాగింది. ఇప్పుడు ఇదే పంథాలను ప్రస్తుతం ప్రధానిగా ఉన్న మోడీ జార్ఖండ్‌లో కూడా అనుసరిస్తున్నారు.
ఇక్కడ అన్సారీ హత్యను ఇతర నేరాలతో కలిసి చూడకూడదు. మతమే లక్ష్యంగా ఇటువంటి దాడులు సాగితే ఇది వ్యక్తిగతంగా మాత్రమే కాదు, సామాజికంగా చాలా నష్టం కలిగిస్తుంది. మోడీ తన ప్రసంగంలో బెంగాల్‌, కేరళ రాష్ట్రాల్లో కూడా దాడులు జరుగుతున్నాయని, ప్రతిపక్షాలపై విమర్శలు చేస్తూ లోక్‌సభలో చర్చను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. దాద్రి నుంచి రామ్‌ఘర్‌ ఘటనలో పాల్గొన్న నిందితులు బీజేపీ మంత్రుల, నేతలతో పలుమార్లు కనిపించిన ఘటనలు కూడా ఉన్నాయి.
2019 సార్వత్రిక ఎన్నికల అనంతరం జరుగుతున్న పార్లమెంట్‌ సమావేశాల్లో ముస్లిం ఎంపీలు ప్రమాణస్వీకారం చేస్తున్న సందర్భంగా బీజేపీ సభ్యులు ‘జై శ్రీరామ్‌’ నినాదాలు చేశారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా హిందువుల దృష్టిని తమవైపు మరల్చేందుకు మోడీతో పాటు బీజేపీ శక్తులు మతతత్వ, జాతీయ వాద అంశాలను విపరీతంగా ప్రచారం చేశారు.

RELATED ARTICLES

Latest Updates