రూ.లక్షా 70వేల కోట్లు తేడా!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

– ఎక్కువ చూపిన కేంద్రం 
– పన్ను ఆదాయంపై ఆర్థికసర్వే, బడ్జెట్‌లలో వేర్వేరు లెక్కలు
– 2018-19 బడ్జెట్‌లో వాస్తవాల్ని దాచిన మోడీ సర్కార్‌

కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టి 5 రోజులవుతోంది. దీనికి సంబంధించిన ఒక కీలకమైన అంశం ఆర్థిక విశ్లేషకులు బహిర్గతం చేశారు. గత ఆర్థిక సంవత్సరం(2018-19) పన్ను ఆదాయంపై…ఆర్థిక సర్వే చెప్పినదానికి, బడ్జెట్‌లో చూపినదానికి మధ్య తేడా రూ.లక్షా 70వేల కోట్లు వస్తోంది. 2018-19 సంవత్సరం రెవెన్యూ ఆదాయం (సవరించిన అంచనా)రూ.17.3లక్షల కోట్లుగా ప్రస్తుత బడ్జెట్‌ లెక్కల్లో కేంద్ర ఆర్థికశాఖ చూపింది. దీనికంటే ఒకరోజు ముందు విడుదలైన కేంద్ర ఆర్థికసర్వే(జులై 4న)లో 2018-19 రెవెన్యూ ఆదాయాన్ని రూ.15.6లక్షల కోట్లుగా చూపింది. ఈ రెండింటి మధ్య తేడా ఉండటానికి వీల్లేదు.ఎందుకంటే గత ఆర్థికసంవత్సరం పన్ను ఆదాయ వివరాలు (సవరించిన గణాంకాలు) ఇప్పటికే వచ్చేశాయి. కానీ దీనిని బడ్జెట్‌లో దాచడం గమనార్హం. ఈవిధంగా బడ్జెట్‌ గణాంకాలు రూపొందించటంపై ఆర్థికవేత్తలను ఆశ్చర్యపర్చింది.
పన్ను ఆదాయానికి సంబంధించి కచ్చితమైన లెక్కలు ఆర్థిక సర్వేలోనే ఉన్నాయనీ, ప్రభుత్వం ఆదాయం పడిపోయిందన్న విషయాన్ని దాచే ప్రయత్నం కేంద్ర బడ్జెట్‌ చేసిందనీ ఆర్థిక విశ్లేషకులు విమర్శించారు. తేడా లక్షా 70వేల కోట్ల రూపాయల్లో ఉండటం ఆందోళన కలిగించే అంశమని వారు చెప్పారు. లెక్కల్లో తేడా రావటం సాంకేతిక పొరపటా? వాస్తవమా?అని గత ఏడాది పన్ను ఆదాయాల్ని పరిశీలిస్తే.. తేడా నిజమేనని తేలింది. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం బడ్జెట్‌ వ్యయం రూ.24.6లక్షల కోట్లుగా మోడీ సర్కార్‌ చూపింది. కానీ ఆర్థికసర్వేలో ప్రభుత్వం చేసిన మొత్తం వ్యయం రూ.23.1లక్షల కోట్లుగా తెలిపారు. ఇక్కడ కూడా తేడా రూ.లక్షా 50వేల కోట్లదాకా వచ్చింది.
ఎందుకొచ్చిందీ తేడా?
ఒక్కమాటలో చెప్పాలంటే ప్రభుత్వ ఆదాయం పడిపో యింది. గత ఆర్థిక సంవత్సరంలో మోడీ సర్కార్‌ అంచనా వేసిన పన్ను ఆదాయం రూ.14.8లక్షల కోట్లు. అయితే దీనిని సవరించుకోలేదు. తాజా లెక్కల్ని పరిగణలోకి తీసుకొని సవరించిన అంచనా చూపాలి. కానీ మోడీ సర్కార్‌, 2018 బడ్జెట్‌ అంచనాలనే… సవరించిన అంచనాలుగా ఈ ఏడాది బడ్జెట్‌లో చూపింది. కానీ అసలు లెక్కలతో ఆర్థిక సర్వే పన్ను ఆదాయ వివరాలు బయటపెట్టింది. రూ.13.2లక్షల కోట్లు పన్ను ఆదాయం వచ్చినట్టు పేర్కొన్నది. ఈ విషయాన్ని మాజీ కేంద్ర ఆర్థికమంత్రి పి.చిదంబరంతో సహా పలువరు లేవనెత్తారు. కానీ దీనిపై ఇంతవరకూ కేంద్ర ఆర్థిక శాఖ స్పందించలేదు.
ఇదేమీ చిన్నవిషయం కాదు.. : ప్రణబ్‌ సేన్‌
జాతీయ గణాంకాల కమిషన్‌ మాజీ చైర్మెన్‌
వెయ్యి….రెండు వేల కోట్ల తేడా కాదు ఇది. లక్షా 70వేల కోట్ల తేడా వస్తోంది. అందునా పన్ను ఆదాయం లో. వాస్తవ అంచనాలను ఆర్థికసర్వే బయటపెట్టిందని నేను భావిస్తున్నా. కేంద్ర బడ్జెట్‌లో ఇది లోపించింది. ద్రవ్యలోటు లక్ష్యాన్ని చేరుకోవడం కోసం ఎక్కడో కోతలు పెట్టారు. దీనిని ప్రజలకు తెలపటం లేదు. దాస్తున్నారు.

 

(Nava Telangana Sowjanyamtho)

RELATED ARTICLES

Latest Updates