– సూక్ష్మ గణాంకాలు ఆందోళనకరం
– ఆగస్టు డిమాండ్‌లోనూ స్తబ్దత
– ప్రమాదకర స్థితిలో ఆర్ధిక వ్యవస్థ
న్యూఢిల్లీ : దేశ ఆర్ధిక వ్యవస్థలో ఇది వరకూ ఎప్పుడూ లేని విధంగా ప్రతికూల అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఆర్ధిక వ్యవస్థలోని అనేక సూక్ష్మ గణంకాలు ప్రమాదకర స్థాయిలో నమోదవుతూ తీవ్ర కలవరాన్ని సృష్టిస్తున్నాయి. గడిచిన ఆగస్టులో అత్యంత కీలకమైన 16 గణంక సూచీల్లో 10 కూడా బలహీనంగా చోటు చేసుకున్నాయి. కొన్ని గణంకాలు ఏకంగా చరిత్రలోనే అత్యల్ప స్థాయిని నమోదు చేసుకున్నాయని మింట్ ఓ కథనంలో విశ్లేషించింది. కేవలం ఐదు గణంకాలు మాత్రమే సానుకూలంగా నమోదయ్యాయి. 2018 ఆగస్టులో నమోదైన గణంకాలతో గడిచిన ఆగస్టు పనితీరును పోల్చడం జరిగింది. 2019 ఫిబ్రవరి నుంచి ఆర్ధిక వ్యవస్థ ప్రమాదకర స్థితిలోకి జారింది. గడిచిన ఆగస్టు నాటికి ఇది తీవ్ర స్థాయికి చేరింది. ముఖ్యంగా కొనుగోలు శక్తి పడిపోవడంతో వినియోగదారుల డిమాండ్ క్షీణించడంతో ఆర్ధిక వ్యవస్థ చిన్నా భిన్నం అవుతోంది. ఆర్ధిక వ్యవస్థ ప్రగతిని సూచించే అత్యంత కీలక రంగం వాహన అమ్మకాలు. ఇవి గడిచిన 10 నెలలుగా వరుసగా పడిపోతూ వచ్చాయి. క్రితం నెలలో ప్రయాణికుల వాహనాలు, ద్విచక్ర వాహనాల అమ్మకాల్లో ఏకంగా 41 శాతం తగ్గుదల చోటు చేసుకుంది. ట్రాక్టర్ అమ్మకాలు 16.5 శాతం క్షీణించాయి. 2015 అక్టోబర్ తర్వాత ఈ స్థాయిలో ట్రాక్టర్ విక్రయాలు పడిపోవ డం ఇదే తొలిసారి.
ఐదేళ్ల కనిష్టానికి…
గడిచిన ఆగస్టులో 16 సూక్ష్మ గణంకాల పనితీరు కూడా ఐదేళ్ల కనిష్టానికి దిగజా రాయి. 2014 అక్టోబర్ నాటి పేలవ ప్రగతి స్థాయిని నమోదు చేశాయి. కేవలం ఐదు సూచీలు మాత్రమే పర్వాలేదనిపించాయి. విదేశీ మారకం రాబడి సూచీ ఒక్కటి యథాతథంగా నమోదయ్యింది. కాగా జులైలో పారిశ్రామిక రంగం అత్యల్ప మెరుగుదలను నమోదు చేయగా.. ఆగస్టులో తిరిగి అత్యంత పేలవ ప్రదర్శన కనబర్చింది.
ఇందులోని నాలుగు సూచీల్లో మూడు కూడా బలహీనంగానే నమోదయ్యాయి. పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పిఎంఐ) 15 ఏళ్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. రైలు సరుకు రవాణ ఆర్ధిక వ్యవస్థ తీరును తెలుపుతుంది. ఈ విభాగంలో కూడా 6.1 శాతం తగ్గుదల నమోదయ్యింది. అదే విధంగా కీలక రంగాల వృద్ధి ప్రతికూలతను ఎదుర్కొంది. కేవలం అహారేతర రుణ వితరణలో మాత్రం స్వల్ప పెరుగుదల చోటు చేసుకుంది. ఈ విభాగం బ్యాంకుల రుణాల్లో రెండంకెల వృద్ధి చోటు చేసుకుంది.
అట్టడుగుకు పడిందా..?
ద్రవ్యోల్బణం మాత్రం నియంత్రణలోనే ఉన్నప్పటికీ గ్రామీణ ప్రాంత ప్రజల వేతనాల వృద్ధిలో తగ్గుదల కొనుగోలు డిమాండ్‌ను బలహీనపర్చుతోంది. మందగిస్తున్న ఆర్ధిక వ్యవస్థలో ఉత్సాహాం నింపడానికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కార్పొరేట్ పన్ను తగ్గింపు.. బాండ్ల రాబడిపై ఒత్తిడిని పెంచనుంది. దీంతో ప్రభుత్వానికి రుణాలు భారం కావడంతో పాటు విత్త లోటు పెరగనుంది. ఈ పన్ను తగ్గింపు ప్రయోజనాలు స్వల్ప కాలానికి పెద్ద ప్రయోజనాన్ని ఇవ్వకపోవచ్చని, మధ్యస్థ కాలానికి పని చేయవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. దేశంలో పెట్టుబడులు పెరిగి, ఎగుమతుల్లో వృద్ధి చోటు చేసుకుంటే తప్పా ఆర్ధిక వ్యవస్థకు ఆసర లభించదని అంటున్నారు. అయితే ఈ రెండూ కూడా దేశీయంగా బలహీనంగానే ఉన్నాయి. దేశ ఆర్ధిక వ్యవస్థ పరిస్థితి చారిత్రక కనిష్టానికి మందగించినప్పటికీ.. అలాగని ఆర్ధిక పనితీరు అట్టడుగుకు పడిపోయిందనడానికి ఆధారం లేదని నిపుణులు పేర్కొంటున్నారు.
Courtesy Prajasakthi