విషపు కోరల్లో.. పెద్దదేవులపల్లి

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

– ‘రెడ్డీస్‌’ వ్యర్థాలతో జలం కలుషితం
– బీడుబారిన వేల ఎకరాల పంట భూములు
– ఏడాదికి రూ.120కోట్ల పంట నష్టం
– నల్లగొండ ప్రతినిధి
అక్కడ ఫార్మా కంపెనీ పెట్టక ముందు ఎకరాకు 40 బస్తాల ధాన్యం దిగుబడి వచ్చేది. కంపెనీ వచ్చాక నీళ్లన్నీ విషపు కాసారంగా మారాయి. భూగర్భం నుంచి వచ్చే నీరు పారిన నారు మడులు మాడిపోతున్నాయి. క్రమంగా పంట దిగుబడులు తగ్గిపోయాయి. ఫలితంగా పంట పొలాలు బీడుబారుతున్నాయి. తాగునీరూ దొరికే పరిస్థితి లేదు. కంపెనీ విడుదల చేసే విష వాయువులతో స్థానికులు వ్యాధుల బారిన పడుతున్నారు. ఇదీ నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం దేవులపల్లిలోని డాక్టర్‌ రెడ్డీస్‌ ఫార్మా పరిసర ప్రాంతాల దుస్థితి. ”నాకు మూడెకరాల పొలం ఉంది. ఎకరాకు 40 బస్తాల ధాన్యం పండించే వాడిని. ఎప్పుడైతే మా గ్రామంలో రెడ్డీస్‌ ఫార్మా కంపెనీ వచ్చిందో అప్పటి నుంచి మా నోట్లో మట్టికొట్టినట్టైంది. ఎక్కడ బోరు వేసినా విషపు నీరు తప్ప మంచి నీరు వచ్చే పరిస్థితి లేదు. ఈ నీళ్లుపొలాలకు పెడితే పంటలు మాడిపోతున్నాయి. వ్యవసాయం మీద ఆధారపడి బతికేటోళ్లం.. పంటలు పండకుంటే ఎట్టా బతకాలో అర్థం కావడం లేదు” అని పెద్దదేవులపల్లి రైతు బుడిగె వెంకటయ్య ఆవేదన వ్యక్తం చేశారు.
దేవులపల్లిలో 1984లో రెడ్డీస్‌ యాజమాన్యం ”కెమికల్‌ డ్రగ్స్‌ అండ్‌ ఆర్గానిక్స్‌ ఫార్మా కంపెనీ”ని 150 ఎకరాల్లో ప్రారంభించింది. అప్పటి నుంచి కంపెనీ చుట్టు పక్కల ఉన్న గ్రామాలు విషపు వాయువులతో నిండిపోయాయి. వ్యర్థ రసాయనాలు భూమిలోకి ఇంకి భూగర్భజలాలు విషతుల్యంగా మారాయి. రాత్రి పూట కంపెనీ నుంచి విషపు వాయువులు వదులుతున్నారు. ఈ ప్రాంత ప్రజలు శ్వాసకోశ వ్యాధులు, తలనొప్పి, వాంతులు, విరేచనాలు, గర్భస్రావాలు తదితర ఇబ్బందులతో అల్లాడుతున్నారు. బోరు నీళ్లతో స్నానం చేస్తే శారీరం బొబ్బలు వస్తున్న పరిస్థితి. ఎక్కడ బోరు వేసినా విషపు నీళ్లే వస్తున్నాయి. సాగర్‌ నీరు తప్ప మరో మార్గం లేదు. లేదంటే 20కిలో మీటర్ల దూరం నుంచి నీరు తెచ్చుకోవాలి.

వెయ్యి ఎకరాల పంట నష్టం
ఫార్మా కంపెనీ వల్ల త్రిపురారం మండలంలోని పెద్దదేవుపల్లి, నర్లకట్టిగూడెం, బాబుసాయిపేట, గజలపూరం, అబందపూరం, పూసలపహాడ్‌, చిల్లపురం, కంపాసాగర్‌ గ్రామాల్లో పంటలన్నీ దెబ్బతిన్నాయి. సుమరుగా వెయ్యి ఎకరాల్లో పంటలు పండే పరిస్థితి లేదు. బోర్ల నుంచి విషపు నీళ్లు వస్తుండటంతో నార్లు కూడా బతకడం లేదు. కంపెనీ ప్రారంభానికి ముందు ఈ భూముల్లో ఎకరాకు వరి దిగుబడి 40 నుంచి 45 బస్తాల వరకు వచ్చేది. కంపెనీ వచ్చాక పంట దిగుబడి తగ్గుముఖం పట్టిందంటున్నారు రైతులు. 2005 నుంచి పూర్తి స్థాయిలో పంట దిగుబడి తగ్గింది. పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదు. ప్రతి సీజన్‌లోనూ పెట్టుబడి, పంట నష్టం కలుపుకుని ఎకరాకు రూ.60వేల వరకు రైతులు నష్టపోతున్నారు. ఆయా గ్రామాల్లో 1000 ఎకరాలకుగాను రూ.60 కోట్ల వరకు నష్టం వాటిల్లుతోంది. ఇలా ఏడాదిలో రూ.120 కోట్ల దిగుబడులు నష్టపోతున్నారు.

ఒప్పందాలను విస్మరించారు
కంపెనీ నిర్మాణ సమయంలో గ్రామస్తులతో చేసుకున్న ఒప్పందాలను యాజమాన్యం విస్మరించింది. కంపెనీలో స్థానిక యువకులకు 70 శాతం ఉద్యోగాలు, పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు పైచదువుల కోసం స్కాలర్‌షిప్‌, పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.5వేలు ఇవ్వడానికి ఒప్పందం చేసుకుంది. అటు తర్వాత ఆ ఒప్పందాలను విస్మరించి ‘ఏం చేసుకుంటారో చేసుకోండి’ అంటూ యాజమాన్యం బెదిరిస్తోంది. పలుమార్లు పొల్యూషన్‌ బోర్డు అధికారులకు విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కస్తుర్బాగాంధీ హాస్టల్‌ మూసివేత
ఈ ప్రాంతంలో 450 మంది విద్యార్థినులకు కస్తుర్బాగాంధీ హాస్టల్‌ను రూ.3కోట్లతో నిర్మించారు. కంపెనీ నుంచి విష వాయువులు వస్తుండటంతో విద్యార్థినులు అనారోగ్యానికి గురయ్యారు. దీంతో హాస్టల్‌ ప్రారంభించిన ఏడాదిలోనే దాన్ని ఖాళీ చేసి మూసేశారు.

మా నోట్లో మట్టి కొట్టింది:రైతు బుడిగె యాదయ్య – పెద్ద్దదేవులపల్లి
మా ఊరిలో కెమికల్‌ కంపెనీ పెట్టి మా భూములను నాశనం చేశారు. తాగే నీళ్లు విషంగా మారాయి. మంచి నీళ్లు తాగాలన్నా రెడ్డీ ల్యాబ్‌ మీద ఆధారపడాలి. వాళ్లిచ్చే నీళ్లు తాగాల్సి వస్తోంది. సర్కారుకు, అధికారులకు ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు.

రైతుల నోళ్లు మూయిస్తున్నారు:లక్ష్మయ్య- రైతు సంఘం నాయకులు
కంపెనీ నుంచి వచ్చే పొల్యుషన్‌ వల్ల నష్టపోయిన రైతు లకు పరిహారం ఇవ్వాల్సిన కంపెనీ యాజమాన్యం కొంత మంది రాజకీయ నాయకులకు, వారి అనుచరులకే ఇస్తోంది. పేద రైతుల నోళ్లు నొక్కిపెడుతోంది. పంటలు పండక.. పరిహారం అందక పేద రైతులు వలసబోతున్న పరిస్థితి.

గ్రామంలో బతికే పరిస్థితి లేదు:బాలరాణి బాయి- పెద్దదేవులపల్లి సర్పంచ్‌
కంపెనీ నుంచి వస్తున్న కాలుష్యంతో గ్రామంలో ఉండే పరిస్థితి లేదు. పొల్యూషన్‌ బోర్డుకు ఫిర్యాదులు చేసినా పరిష్కరించడం లేదు. పరిస్థితి ఇలాగే ఉంటే గ్రామం క్రమంగా ఖాళీ అయ్యే పరిస్థితి వస్తుంది.

Courtesy NavaTelangana…

RELATED ARTICLES

Latest Updates