న్యాయ’మేనా..?

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

ప్రధాని నరేంద్రమోదీకి మొన్న జులైలో బహిరంగ లేఖ రాసిన 49మంది ప్రముఖులపై బిహార్‌లో దేశద్రోహం కేసు నమోదైంది. దేశంలో మూకదాడులు జరుగుతూండటం, ఆ సందర్భంగా జై శ్రీరామ్‌ అంటూ నినదిస్తుండంపై ఆందోళన వ్యక్తం చేస్తూ,  ఈ వాతావరణాన్ని మార్చేందుకు నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రధానికి విజ్ఞప్తి చేసిన లేఖ అది. మణిరత్నం, ఆదూర్‌ గోపాలకృష్ణన్‌, అపర్ణాసేన్‌, రామచంద్రగుహ ఇత్యాది వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు సంతకం చేసిన ఈ లేఖను ఘాటుగా విమర్శిస్తూ, మోదీని అప్రదిష్టపాల్జేసే లక్ష్యం వీరికున్నదని విమర్శిస్తూ వెనువెంటనే ఓ అరవైమంది ప్రముఖులు మరో బహిరంగ లేఖ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆదూర్‌, మణిరత్నం తదితరులంతా ఆ లేఖతో సమాజంలో కల్లోలాన్ని రేపేందుకు కుట్రపన్నారంటూ ఓ న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌తో బిహార్‌ ముజఫర్‌పూర్‌ చీఫ్‌ జుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ ఏకీభవించి, ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయమని ఆగస్టు 20న ఇచ్చిన ఆదేశాలను పోలీసులు ఇప్పుడు అమలు చేశారు. ఇకపై, రహస్య కుట్రలే కాక, బహిరంగ లేఖలు కూడా దేశద్రోహమే.

ఈ లేఖ రాసినవారిలో రాజకీయనాయకులెవ్వరూ లేరు. సంతకాలు చేసినవారంతా ఆయా రంగాల్లో లబ్ధప్రతిష్ఠులు. ఆ లేఖలో వారు పేర్కొన్న అంశాలు సైతం కొత్తవేమి కావు. దేశంలో బలపడుతున్న ఓ దుర్మార్గమైన వాతావరణం మీద ప్రధాని ప్రత్యేక దృష్టిని అభ్యర్థిస్తూ, అప్పటికే ఆయన మూకదాడుల గురించి మాట్లాడిన విషయాన్ని సైతం వారు అందులో ప్రస్తావించారు. మోదీని వెనకేసుకొస్తున్న లేఖమాదిరిగా ఇందులో ఘాటైన వ్యాఖ్యలు కూడా వారు చేయలేదు. మైనారిటీలు, దళితులు, జై శ్రీరామ్‌ ఇత్యాది ప్రస్తావనల వల్ల సదరు న్యాయవాదికీ, న్యాయమూర్తికీ వీరంతా దేశద్రోహులుగా కనిపించి ఉంటారు. అర్థం పర్థంలేని ఓ ఫిర్యాదు ఎఫ్‌ఐఆర్‌ నమోదు వరకూ వచ్చిందంటేనే వీరు తమ లేఖలో ప్రస్తావించిన వాతావరణం గతంలో కంటే బలపడిందని అర్థం. ఈ లేఖరాసినందుకు శిక్షగా ఈ కొత్త ‘అర్బన్‌ నక్సల్స్‌’ ఇకపై తమ వృత్తిగత, వ్యక్తిగత జీవితాలను కోల్పోయి ఏళ్ళ తరబడి న్యాయస్థానాల చుట్టూ తిరగవలసి రావచ్చు.

ఈ కేసు నమోదైన నాడే, భీమాకోరేగావ్‌ కుట్రకేసులో పోలీసులు తదనంతర కాలంలో చేర్చిన గౌతమ్‌ నవ్‌లఖాను సుప్రీంకోర్టు పక్షం రోజుల పాటు అరెస్టునుంచి కాపాడింది. తనమీద నమోదైన ఎఫ్‌ఐఆర్‌ కొట్టివేయాలంటూ గౌతమ్‌ చేసుకున్న విజ్ఞప్తిని ముంబై హైకోర్టు తిరస్కరించి, సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు కొంత గడువు ఇచ్చిన విషయం తెలిసిందే. నవ్‌లఖాకు వ్యతిరేకంగా కూడగట్టిన ఆధారాలన్నీ తనముందు ఉంచితే, అక్టోబర్‌ 15న విచారణ జరుపుతానని సుప్రీంకోర్టు ఇప్పుడన్నది. భీమా కోరేగావ్‌ కేసులో అరెస్టయిన మిగతావారు ఏడాదికాలంగా జైళ్ళలో మగ్గుతూ, న్యాయస్థానాల చుట్టూ తిరుగుతున్న విషయాన్ని అటుంచితే, ఇప్పుడు నవ్‌లఖా అభ్యర్థన పరిశీలించే విషయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వరుసబెట్టి ‘రెక్యూజ్‌’ కావడం ఆశ్చర్యం కలిగిస్తున్నది. సెప్టెంబరు 30న ప్రధాన న్యాయమూర్తి, అక్టోబర్‌ 1న ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్‌ ముందుకు వచ్చినప్పుడు వారిలో కొందరు, గాంధీ జయంతి సెలవు మరునాడు మరోబెంచ్‌ ముందుకు వచ్చినప్పుడు వారూ ఈ కేసు విచారణకు దూరం జరగడం విశేషం. చివరకు పర్యావరణ చట్టాలకు సంబంధించిన ప్రత్యేక బెంచ్‌ ఇప్పుడు దానిని పరిశీలించిందని అంటున్నారు. న్యాయమూర్తులకు ఓ కేసునుంచి రెక్యూజ్‌ అయ్యే అవకాశం ఉన్నదన్నమాట నిజమే కానీ, కారణాలు చెప్పకుండా దానిని ప్రయోగించడంపై ఇప్పుడు విస్తృత చర్చ జరుగుతున్నది. న్యాయమూర్తులకు విపరీతమైన పని ఒత్తిడి ఉన్నమాట నిజం. నవ్‌లఖా కేసు విషయంలో ‘రెక్యూజ్‌’ వరుసగా జరిగిపోవడానికి ఏమైనా కారణాలు ఉండవచ్చు. కానీ, ఎందుకు వద్దంటున్నారో చెప్పకుండా ఇలా దూరం జరుగుతూంటే సదరు కేసును వారు ప్రమాదకరమైనదిగా భావిస్తున్నారన్న అనవసరపు అనుమానాలకు అవకాశం ఏర్పడుతుంది. న్యాయవ్యవస్థ స్వతంత్రత, నిష్పక్షపాతంపై సామాన్యుల్లో సందేహాలు రాకుండా చూడటం ముఖ్యం.

Courtesy Andhrajyothi…

RELATED ARTICLES

Latest Updates