పోషకాహారానికి నోచుకోని బాల్యం..!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

– సీఎన్‌ఎన్‌ సర్వేలో వెల్లడి
న్యూఢిల్లీ : దేశంలో తొలిసారిగా నిర్వహించిన కాంప్రహెన్సివ్‌ నేషనల్‌ న్యూట్రిషన్‌ (సీఎన్‌ఎన్‌) సర్వేలో బాలల పోషకాహార పరిస్థితిపై దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగు చూశాయి. వాస్తవానికి భారత భావిపౌరులు పోషకాహార లోపానికి గురవుతున్నట్టు అనేక సర్వేలు చెబుతుండగా.. ఈ అంశాన్ని ప్రభుత్వం పట్టించుకోకపోవటం కలవరపాటు కలిగిస్తోంది. ఒకపక్క పోషకాహార లోపం, మరోపక్క ఒబెసిటీ వంటి సమస్యలను ఈ సర్వే ఎత్తి చూపింది. ముఖ్యంగా దేశంలో చిన్నారులు, వయోజనుల పోషకాహారం, ఆరోగ్య పరిస్థితిలో కొనసాగుతున్న వైరుధ్యాన్ని కూడా ఈ సర్వే దేశ ప్రజల కళ్లకు కట్టింది. తమ ప్రభుత్వ హయాంలో కొనసాగుతున్న ప్రతి అంశాన్నీ గత ప్రభుత్వాలతో పోల్చుకునే కేంద్రంలోని బీజేపీ సర్కారు, తానే నిర్వహించిన ఈ భారీ సర్వే వివరాలను పట్టించుకోకపోవటం గమనార్హం. 2016లో నేషనల్‌ స్టాటిస్టికల్‌ కమిషన్‌ ఆమోదించిన ఈ ప్రక్రియతో కేంద్రంలోని ఎన్డీయే సర్కారు 2016-2018 మధ్య కాలంలో ఈ సర్వేను నిర్వహించింది. కేంద్ర ఆరోగ్య, కుటుం బ సంక్షేమ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఐరాస బాలల నిధి (యునిసెఫ్‌) నిర్వహించిన ఈ సర్వే ఫలితాలు కేంద్రం నిర్వ హించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌ 3, 4) డేటా ఆధారంగా దేశంలో బాలలకు అందుతున్న పోషకాహారం, వారి ఆరోగ్య పరిస్థితిని విశ్లేషించింది.

తీవ్ర స్థాయిలో పోషకాహార లోపం
దేశంలోని ఐదేండ్లలోపు చిన్నారుల్లో తీవ్రస్థాయిలో వున్న పోషకాహార లోపం 1992-2016 మధ్య కాలంలో కేవలం మూడో వంతు మాత్రమే తగ్గిందని ఈ సర్వే సూచిస్తోంది. దేశంలో కాంగ్రెస్‌ సర్కారు ప్రారంభించిన నయా సరళీకరణ విధానాల సంస్కరణలను తరువాతి యూపీఏ, ఎన్డీయే ప్రభుత్వాలు దూకుడుగా అమలుపరిచిన సుదీర్ఘకాలం తరువాతి పరిస్థితి ఇది. ఐదేండ్లలోపు చిన్నారుల్లో ఎదుగుదల లోపం ప్రమాదకరమైన అత్యధిక స్థాయిలో 38.4శాతం మేర వుందని ఈ సర్వే చెబుతోంది. పునరుత్పాదక వయస్సులో వున్న మహిళల్లో దాదాపు సగానికి పైగా రక్తహీనతతో బాధపడుతున్నారని చెబుతున్న ఈ సర్వే గృహ యజమాని సంపాదనకు, దీనితో బలమైన సంబంధం వుందని కండ్లకు కడుతోంది. ప్రస్తుతం దేశంలో నమోదవుతున్న రక్తహీనత (అనీమియా) కేసుల్లో దాదాపు 60 శాతానికి పైగా పోషకాహార లోపం, ఇనుప ధాతు (ఐరన్‌) లోపంతో కూడినవేనని ఈ సర్వే కుండ బద్దలు కొట్టింది. దీనితోపాటు ప్రజల్లో ఆహారపు అలవాట్లు, జీవన విధానంలో వస్తున్న మార్పులు ఒబేసిటీ, రక్తపోటు, నాన్‌ కమ్యూనికబుల్‌ (అంటువ్యాధులు కాని) డిసీజెస్‌ వంటి ఇతర ఆరోగ్య సమస్యలకు దారి తీస్తున్నాయని ఈ సర్వే చెబుతుంది. జాతీయ స్థాయిలో ప్రీ స్కూలర్లు (0-4 ఏండ్ల మధ్య వయస్కులు) స్కూలుకు వెళ్లే (5-9 ఏండ్ల మధ్య) వయస్సు గల చిన్నారులు, యుక్తవయసుకు (10-19 ఏండ్లు) వచ్చిన వారికి సంబంధించిన పోషాకార స్థితిపై సమగ్ర సమాచార సేకరణ లక్ష్యంగా ఈ సీఎన్‌ఎన్‌ఎస్‌ను నిర్వహించారు. ముఖ్యంగా 5-14 ఏండ్ల మధ్య వయస్సు వారికి సంబంధించిన ఈ సమాచారాన్ని జాతీయ స్థాయిలో సేకరించగలిగినప్పటికీ అందులో సూక్ష్మ పోషకాల లోపాలు, ఈ వయస్సులో సోకే నాన్‌ కమ్యూనికబుల్‌ (అంటు వ్యాధులు కాని) డిసీజెస్‌ కు సంబంధించిన అనారోగ్య సమస్యలకు సంబంధించిన సమాచారం కేవలం పరిమిత స్థాయిలో మాత్రమే లభించిందని ఈ సర్వే తెలిపింది.

ఆదాయం, విద్య
మహిళల్లో వున్న విద్యాస్థాయి, చిన్నారుల పోషకాహార పరిస్థితికి మధ్య వున్న సంబంధాన్ని ప్రతిబింబించే మరో అంశం మహిళల వైవాహిక వయస్సు. దీర్ఘకాలం విద్యాభ్యాసంలో వున్న యువతుల్లో గర్భధారణ కూడా ఆటోమేటిక్‌గా జాప్యం అవుతుందని ఈ అధ్యయన నివేదిక చెబుతున్నది. దీనితో యువతులకు అత్యధిక స్థాయి విద్యను అందచేస్తే అది ఆరోగ్యకరమైన సంతానోత్పత్తికి దోహదపడుతుందని తెలుస్తోంది. అయితే ఈ సర్వే వెల్లడిస్తున్న గణాంకాలలో మహిళల విద్యకు సంబంధించిన అంశాలు ఆందోళనకరంగా వున్నాయి. సర్వేలో పాల్గొన్న 53శాతం మంది మాతృమూర్తులు ఎటువంటి విద్యా లేనివారే… ప్రిస్కూలర్ల తల్లుల్లో 20శాతం, స్కూలు వెళ్లేవారి తల్లుల్లో 12శాతం, యుక్త వయస్కుల తల్లుల్లో కేవలం ఏడు శాతం మంది మాతృమూర్తులు మాత్రమే కనీసం ఇంటర్మీడియట్‌ విద్యను పూర్తి చేశారని ఈ సర్వే నివేదిక చెబుతోంది. మాతృమూర్తుల విద్యాస్తాయిలో రాష్ట్రాల మధ్య తీవ్ర వైరుధ్యాలున్నాయి. కేరళ, తమిళనాడు రాష్ట్రాలలో 4 ఏండ్లలోపు వయస్సున్న చిన్నారుల తల్లుల్లో వరుసగా 60శాతం, 51శాతం మంది ఇంటర్మీడియట్‌ స్థాయిని పూర్తి చేశారు. ఇక దేశంలోని 16కు పైగా రాష్ట్రాల్లో కేవలం 20 శాతం మంది ప్రీ స్కూలర్ల తల్లులు మాత్రమే ఇంటర్మీడియట్‌ స్థాయి వరకూ చేరుకున్నారు.

పెరుగుదలకు విఘాతం
ఐదేండ్లలోపు చిన్నారుల్లో దాదాపు 35శాతం మందిలో పెరుగుదల తగ్గిపోయిందని, 17శాతం మందిలో నిలిచిపోయిందని, 33శాతం మంది తక్కువ బరువుతో వున్నారని, 11శాతం మంది తీవ్ర పోషకాహార లోపాన్ని ఎదుర్కొంటున్నారని ఈ సర్వే చెబుతోంది. చిన్నారుల్లో ఎదుగుదల నిలిచిపోవటంలో సైతం కుటుంబాదాయమే కీలకంగా మారుతోంది. సంపన్న కుటుంబాల కన్నా పేద కుటుంబాలలోనే 49శాతం మంది చిన్నారుల్లో ఎదుగుదల నిలిచిపోయినట్టు ఈ సర్వే చెబుతోంది. ఇందులో బీహార్‌, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ వంటి రాష్ట్రాలు అగ్రస్థానంలో వున్నాయి. ఇక బరువు తక్కువ పిల్లల జాతీయ సగటు 33.4 శాతం వుండగా, గుజరాత్‌ వంటి ఏడు రాష్ట్రాల్లో ఇది జాతీయ సగటు కన్నా అత్యధికంగా నమోదయింది. సిఎన్‌ఎన్‌ఎస్‌లో వెలుగు చూసిన ఈ గణాంకాలన్నీ జాతీయ కుటుంబారోగ్య సర్వేలలో వెలుగు చూసిన గణాంకాలతో పోలి వున్నాయి.

పోషకాహార లోపంతోనే పెద్దల్లో స్థూలకాయం
పోషకాహార లోపంతోనే పెద్దల్లో ఒబేసిటీ సమస్య ఎదురవుతోందని ఈ సర్వే చెబుతోంది. పోషకాహార లోపం, అధిక బరువు, ఒబేసిటీ, సూక్ష్మపోషకాల లోపం వంటి ఆరోగ్య సమస్యలకు పేదరికమే ప్రధాన కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేస్తోంది. పేదరికంతోనే పేద కుటుంబాలు పోషకాహారానికి దూరమవుతున్నాయని ప్రపంచారోగ్య సంస్థ నివేదికను ఉటంకిస్తూ ఈ సర్వే తన నివేదికలో పేర్కొంది. దాదాపు 41 శాతం మంది ప్రి స్కూలర్లు, 24 శాతం మంది స్కూల్‌కు వెళ్లే పిల్లలు, 28 శాతం మంది యుక్త వయస్కులు రక్త హీనతతో బాధపడుతున్నారు. అదే విధంగా కేరళ మినహా అన్ని రాష్ట్రాల్లోనూ 5-9 ఏండ్ల మధ్య చిన్నారుల్లో ఈ సమస్య ఎక్కువగా వుందని సర్వే వెల్లడించింది.
నినాదాలకు అతీతంగా పనిచేయాలి
చిన్నారులు, యుక్తవయస్కుల ఎదుగుదలకు కేవలం ఆహారం తీసుకోవటం మాత్రమే సరిపోదన్న విషయాన్ని ఈ సర్వే తేటతెల్లం చేసింది. ప్రతి అంశమూ సజావుగా వుంటే ‘ఈట్‌ రైట్‌’ ‘ఫిట్‌ ఇండియా’ వంటి నినాదాలు పనిచేస్తాయి. పోషకాహారం తీసుకోవటం వంటి ఆహారపుటలవాట్లతో పాటు పరిశుభ్రతనూ పాటించాలని ఈ సర్వే చెబుతున్నది. ప్రజా పంపిణీ వ్యవస్థను విస్తృతం చేసి పండ్లు, గుడ్లు, కూరగాయలు వంటి వాటిని అనుదిన ప్రాతిపదికపై చౌక ధరలకు అందించే ప్రయత్నం చేయాలి.. దీనితో పాటు ప్రజలు తమ జీవనాన్ని, కుటుంబాలను కొనసాగించే విధం గా వారి కొనుగోలు శక్తికి పెంచాలి. ఇది ప్రస్తుత అవసరం.

Courtesy: NT..

RELATED ARTICLES

Latest Updates