
హైదరాబాద్, సెప్టెంబరు: దళితులు, గిరిజన కుటుంబాలకు ఇచ్చేందుకు భూమి దొరకని పక్షంలో ఆ మూడెకరాల భూమి కొనుగోలుకు కేటాయించిన మొత్తాన్ని డిపాజిట్ చేసి దానిపై వచ్చే ఆదాయాన్ని ఆయా కుటుంబాలకు ఇవ్వాలంటూ ప్రభుత్వానికి సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క సూచించారు. ఆ మొత్తానికి భూమి దొరికిన చోట భూమినే కొనుగోలు చేసి ఇవ్వాలన్నారు. అసెంబ్లీ కమిటీ హాల్లో మంగళవారం జరిగిన ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశంలో ఈ మేరకు ప్రతిపాదించారు. అసైన్డ్‌భూములకు సంబంధించి సాంఘిక సంక్షేమ, గిరిజన శాఖల మంత్రులు కొప్పుల ఈశ్వర్, సత్యవతి రాథోడ్‌ల ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి సంబంధించి అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వాల్సిందిగా ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను మంత్రులు కోరారు.
ఈ సందర్భంగా భట్టి విక్రమార్క అభిప్రాయాలను వినిపించారు. డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇస్తానని చెప్పి.. ఆరున్నరేళ్లుగా ఇళ్ల స్థలాలనూ ఇవ్వలేదన్నారు. దళితులు, గిరిజనులకు కుటుంబానికి మూడెకరాల భూమి పంచుతానని చెప్పి కేవలం ఆరువేల మందికి 16 వేల ఎకరాలు పంచారనన్నారు. పంచడానికి భూమి లేనప్పుడు.. మూడెకరాలకు నిర్ణయించిన రూ.22 లక్షలను డిపాజిట్ చేసి.. దానిపై వచ్చే ఆదాయాన్ని ఆయా లబ్ధిదారు కుటుంబాలకు దక్కేలా చేయాలన్నారు. ఆదే రూ.22 లక్షలకు మూడెకరాలు దొరికిన చోట.. కొనుగోలు చేసి ఇవ్వాలన్నారు. మండల హెడ్ క్వార్టర్లలో అసైన్డ్ భూమికి విలువ పెరిగిన తర్వాత తిరిగి తీసుకుంటే ఎలా అని ప్రశ్నించారు. అలాగే ఎస్సీ, ఎస్టీ స్పెషల్ డవల్‌పమెంట్ కౌన్సిల్ మీటింగే ఇంతవరకు జరగలేదన్నారు. ప్రైవేటు వర్సిటీల్లో రిజర్వేషన్‌ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాగా, అధికార పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలూ.. నియోజకవర్గాల్లో ఎస్సీ, ఎస్టీలు ప్రత్యేక స్కీంలు ఏవని అడుగుతున్నారంటూ చెప్పినట్లు, గతంలో ఉన్న స్కీంల గురించీ ఆరా తీస్తున్నట్లు చెప్పినట్లు సమాచారం. ఈ సమావేశంలో ప్రతి సభ్యుడూ తమ వర్గాలకు ప్రభుత్వం ఏం చేయాలన్నది స్పష్టంగా వివరించినట్లు తెలిసింది.
కాగా.. సమావేశం ప్రారంభించినప్పుడు కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ దళిత, గిరిజనులకు ప్రభుత్వం ఇంకా ఎలాంటి కార్యక్రమాలు అమలు చేస్తే బాగుంటుందని చర్చించేందుకు ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గతంలో ప్రకటించి.. అమలు కాని పథకాలు అమలుపైనా చర్చించాలన్నారు. మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో దళితులు, గిరిజనులకు భూమి సమస్యలు ఇంకా కొన్ని ఉన్నాయని, ముఖ్యంగా ఆర్‌ఓఎ్‌ఫఆర్ పట్టాలు లేకుండా ఇబ్బందులు పడుతున్నారన్నారు. పోడు భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్నా ఫారెస్ట్ అధికారులతో వేధింపులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రభుత్వం దళితులకు, గిరిజనులకు ఇచ్చిన అసైన్డ్ భూముల్లో వారికి పూర్తిస్థాయి భూమి హక్కులు ఎలా కల్పించాలన్నది చాలా ముఖ్యమన్నారు.
ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేల సూచనలు
దళిత, గిరిజనులకు ఎకనామిక్ స్కీమ్‌లు అమలు చేయాలి
వ్యవసాయ ఉపకరణాలు ఇవ్వాలి ట్రాక్టర్లు, నాటువేసే యంత్రాలు, కోతమిషన్లు, హార్వెస్టర్లు అందించాలి
భూమిలేని ఎస్సీ, ఎస్టీ రైతులకు కూడా రైతుబంధు, రైతు బీమా అమలు చేయాలి
గురుకులాల సంఖ్య పెంచాలి, వీలుకాకపోతే విద్యార్థుల సంఖ్య పెంచాలి
దళిత, గిరిజన వాడల్లో కరెంటు బిల్లులు మాఫీ చేయాలి
ప్రభుత్వ పథకాల్లో ఎస్సీ, ఎస్టీలకు ఎక్కువ కేటాయింపులు చేయాలి
ఎస్సీ, ఎస్టీలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలి. సొంత స్థలాల్లో డబ్బులివ్వాలి
మూడెకరాలు భూమి పథకం కింద కనీసం రూ.10 లక్షలివ్వాలి
విద్యార్హత ఉన్న ప్రతి ఒక్కరికి గురుకులాల్లో సీటు, విదేశాల్లో చదువుకునే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థి ఖర్చునుభరించాలి. ప్రతి నియోజక వర్గంలో ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేకంగా టెక్నాలజీ కాలేజీలు ఏర్పాటు చేయాలి.
ఎస్సీ, ఎస్టీ రుణాల్లో లబ్ధిదారుల వాటాను ప్రభుత్వమే భరించాలి. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉపాధ్యాయ పోస్టులను స్థానిక గిరిజనులతోనే భర్తీ చేయాలన్న జీవో 3ని కొట్టివేయడంతో దీనికి సమానంగా మరొక జీవో తీసుకురావాలి.
ఎస్సీ, ఎస్టీలకు హెల్త్ కార్డులు ఇవ్వాలి. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఆన్‌లైన్ వసతులు కల్పించాలి.
సివిల్స్ ప్రిలిమ్స్ ఉత్తీర్ణత సాధించిన వారికి గ్రూప్ 1 ఉద్యోగం ఇవ్వాలి. ఎస్సీ, ఎస్టీ ఎస్డీఎఫ్ చట్టం ద్వారా ప్రత్యేక పథకాలుండాలి. ఏడాదికి ఎస్సీలకు రూ.5వేల కోట్లు, ఎస్టీలకు రూ.3వేల కోట్లు కేటాయించి ఖర్చు చేయాలి.