ఇప్పటికే 15మంది మృతి.. వ్యాధితో బాధపడుతున్న మరో 10 మంది
– వైద్యం కోసం రూ.కోటి ఖర్చు చేసిన గ్రామస్తులు
ఆ తండా వాసులను కిడ్నీ వ్యాధి కాటేస్తోంది. ఎప్పుడు ఎవరి మరణ వార్త వినపడుతోందనని నిత్యం ఆందోళనతో బతుకుతున్నారు. ఇప్పటికే 15 మంది ఆ వ్యాధితో ప్రాణం కోల్పోయారు. మరో పది మంది మంచంపట్టారు. వైద్యం కోసం స్థోమతకు మించి రూ.లక్షలు ఖర్చు చేస్తున్నారు. ఇదీ ఖమ్మం నగరానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న రఘునాథపాలెం మండలం రాంక్యా తండావాసుల పరిస్థితి.
రాంక్యా తండాలో 380 కుటుంబాలున్నాయి. 2790 జనాభా (గిరిజనులు) ఉంది. ఉన్నదాంట్లో కలో గంజో తాగి బతుకుతున్న ఆ తండాలో కిడ్నీ వ్యాధి ఒక్కసారిగా కలవరపాటుకు గురిచేసింది. గ్రామంలో కిడ్నీ వ్యాధి బారిన పడి జాటోతు బాబు, కోలోతు సీత, తేజావత్ భూజ్యా, భూక్యా బావ్‌సింగ్, గుగులోత్ జీబ్లా, మాలోత్ లక్పతి, మాలోత్ లచ్చు, పమ్మి జిలికిరి, పమ్మి గురువులు, రాయింగా, గుగులోత్ వాస్యా.. ఇలా పదిహేను మంది వరకు కిడ్నీలు చెడి పోయి ప్రాణం కోల్పోయారు. గ్రామానికి సరఫరా అవుతున్న మిషన్ భగీరథ నీరు కలుషితమవుతోందని, అందుకే వ్యాధి ప్రబలుతోందని తండావాసులు ఆవే దన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు అంతర్గత రోడ్లు మురుగు కాలువల్లా మారాయి. మురుగునీరంతా రోడ్లపైకి చేరుతోంది. పారిశుధ్యం గురించి పట్టిం చుకునేవారే కరువయ్యారు. బోర్లలో నీరూ ఫ్లోరైడ్‌తో నిండిపోయిందని తండా వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తండా మొత్తంగా ఇప్పటి వరకు కిడ్నీ వ్యాధి నయం కావడానికి కోటి రూపాయల వరకు ఖర్చు చేసినట్టు తెలుస్తోంది.
ఒక్కో ఇంట్లో ఒక్కో ఆవేదన
కాళ్ల వాపులు, కిడ్నీల వ్యాధి కారణంగా వైద్యం కోసం ఖమ్మం, హైదరాబాద్, విజయవాడ తదితర ప్రాంతాలకు వెళ్లి రూ.లక్షల్లో ఖర్చు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యాధితో మంచం పట్టిన 60 ఏండ్ల భూక్యా బోద్యా ఇప్పటికే రూ.3లక్షలు ఖర్చు చేసినా తగ్గలేదు. వైద్యం కోసం రూ.6 లక్షలు ఖర్చు చేసి ఐదేండ్లుగా చికిత్స చేయించుకున్నా వ్యాధి తగ్గక మంచంపై బతకలేక బతుకుతు న్నట్టు గుగులోత్ తులిస్యా కన్నీటిపర్యంతమయ్యారు. తన రెండెకరాల భూమిని అమ్మి వైద్యం చేయించుకున్నా నయం కాలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇదే గ్రామంలో గతనెల 15వ తేదీన మృతి చెందిన తేజావత్ భూజ్యా(60) వైద్యం కోసం హైదరాబాద్ తీసుకెళ్లి రూ. 4లక్షలు ఖర్చు చేసినా బతకలేదని కుటుంబీ కులు బోరున విలపించారు. గ్రామంలో మరో పదిమంది ఇదే వ్యాధితో బాధపడుతున్నారు.
ఉన్న రెండెకరాలు అమ్మిన : గుగులోత్ బోద్యా బాధితుడు
మాయదారి రోగం మా ఇంటిని గుల్లచేసింది. జబ్బు నయం చేయించుకోవడానికి రెండెకరాలు పొలం అమ్మిన. చివరకు కొడుకులకు ఏమీ లేకుండా అయింది. అయినా రోగం తగ్గడం లేదు.
ఎంత ఖర్చు చేసినా.. : జీజ-మృతుని భార్య
మా ఆయనకు కిడ్నీ జబ్బు వచ్చింది. ఖమ్మం, హైదరాబాద్ కూడా తీసుకుపోయినం. ఊళ్లో కొంతమంది చచ్చిపోయారు. ఆ భయంతో మా ఆయన్ను బతికించుకునేందుకు ఎంత ఖర్చు పెట్టి వైద్యం చేయించినా బతకలేదు. ఇంటికి పెద్దదిక్కులేకుండా పోయింది.
ఐదేండ్లుగా వ్యాధితో పోరాడుతున్నా : బాధితురాలు తులిస్యా
మొదట కాళ్లనొప్పులు, వాపులతో ఇబ్బంది పడ్డా. తరువాత కిడ్నీల్లో భరించలేని నొప్పి. ఆస్పత్రికి వెళితే కిడ్నీల్లో తేడా ఉందని మందులు రాశారు. ఇప్పటికి రూ.6లక్షలు ఖర్చు చేసినా. ఐదేండ్లయినా రోగం నయం కాలేదు. చివరికి మంచానికే పరిమితమయ్యాను.
ఆందోళన చెందుతున్నారు : అమిలి సర్పంచ్
మా గ్రామంలో కిడ్నీల వ్యాధితో కొందరు చనిపోయారు. ఇంకా కొంతమంది ఈ రోగంతో బాధపడుతున్నారు. ఆయా కుటుంబాల్లో భయం నెలకొంది. వైద్యులు పరిశీలించి నాణ్యమైన మందులు ఇచ్చి వారిని కాపాడాలి.
పరిశీలిస్తాం : కళావతిభాయి డీఎంహెచ్ఓ
రాంక్యాంతండాలో కిడ్నీ వ్యాధి విషయం మా దృష్టికి వచ్చింది. వారం దరినీ పరిశీలించాల్సిందిగా మండల వైద్యాధికారిని ఆదేశించాం. వ్యాధి ఎందరికి ఉందో గుర్తిస్తాం. బాధితులకు మెరుగైన వైద్యం అందించేం దుకు కృషి చేస్తాం.
courtesy nava telangana