కులాంతర, మతాంతర పెళ్లిళ్లు చేసుకున్న జంటలకు రక్షణ కల్పించేందుకు కేరళ ప్రభుత్వం ముందడుగు వేసింది.
తిరువనంతపురం: మన దేశంలో కులాంతర, మతాంతర వివాహాలు చేసుకున్న జంటలు తీవ్రమైన కష్టాలు, హెచ్చరికలు ఎదుర్కొవలసి ఉంటుంది. కుల, మతోన్మాదులు ప్రేమికులను చంపడానికి కూడా వెనుకాడటం లేదు. ఈ నేపథ్యంలో కులాంతర, మతాంతర పెళ్లిళ్లు చేసుకున్న జంటలకు రక్షణ కల్పించేందుకు కేరళ ప్రభుత్వం ముందడుగు వేసింది. ఇలాంటి జంటల కోసం ‘రక్షణ నిలయాలు’ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కేరళలోని అన్ని జిల్లాల్లో వీటిని నెలకొల్పేందుకు సామాజిక న్యాయ విభాగం కసరత్తు చేస్తోంది.
రక్షణ నిలయాల ఏర్పాటుకు చర్యలు మొదలు పెట్టినట్టు కేరళ సామాజిక న్యాయశాఖ మంత్రి కేకే శైలజ వెల్లడించారు. కులాంతర, మతాంతర వివాహాలు చేసుకున్న జంటలకు సంవత్సరం పాటు రక్షణ నిలయాల్లో ఉండొచ్చని వెల్లడించారు. వారికి భద్రత కల్పించడమే లక్ష్యంగా వీటిని ఏర్పాటు చేస్తున్న శాసనసభలో వెల్లడించారు. స్వచ్ఛంద సంస్థల సహకారంతో రక్షణ నిలయాలను నడుపుతామని తెలిపారు.
కులాంతర, మతాంతర పెళ్లిళ్లు చేసుకున్న జనరల్ కేటగిరి వారికి ఇప్పటికే రూ. 30 వేలు, షెడ్యూలు కులాల వారికి రూ. 75 వేలు ప్రభుత్వం తరపున ఇస్తున్నట్టు చెప్పారు. మతాంతర వివాహాలు చేసుకున్న వారిని ప్రభుత్వ ఉద్యోగ బదిలీల్లో ప్రత్యేకంగా పరిగణిస్తున్నామన్నారు. ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించడానికి చట్టమేది లేదని మంత్రి శైలజ వెల్లడించారు.