మంత్రి పదవి ఇస్తానని ఇవ్వలేదు: నాయిని
ఆర్టీసీలో రసం లేదు.. జీతాలకే చస్తున్నరు
ఏ కార్పొరేషన్ పదవి ఇచ్చినా తీసుకోను
మండలి చైర్మన్ పదవిస్తానంటేనే వద్దన్నా
టీఆర్‌ఎ్‌సలో ఉన్నోళ్లంతా ఆ పార్టీ ఓనర్లే
కిరాయిదార్లు ఎప్పుడు పోతారో వాళ్లిష్టం
యాదాద్రిలో కేసీఆర్, కారు బొమ్మలు తప్పే
మాజీ మంత్రి నాయిని కీలక వ్యాఖ్యలు
అజ్ఞాతంలోకి మరో నేత జోగు రామన్న
ఆయన అనుచరుడి ఆత్మహత్యాయత్నం
అసెంబ్లీ రోజే విదేశాలకు వెళ్లిన మైనంపల్లి
మాదిగలకు అన్యాయం: టి.రాజయ్య
ఖాళీలు లేకుండా.. పూర్తిస్థాయి మంత్రివర్గం కొలువుదీరింది! ఇక, తమకు పదవి రాదనుకున్న అసంతృప్తులు ఒక్కొక్కరే గళాలు విప్పుతున్నారు. మరికొందరు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఉద్యమంలో తొలి రోజు నుంచీ కేసీఆర్‌తో అడుగులో అడుగు వేస్తూ కలిసి సాగిన మాజీ మంత్రి నాయిని నర్సింహా రెడ్డి బహిరంగంగానే తన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకంగా కేసీఆర్ మాట తప్పారని అన్నారు. మంత్రి పదవి దక్కకపోవడంతో మనస్తాపానికి గురైన జోగు రామన్న అజ్ఞాతంలోకి వెళ్లిపోతే.. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఏకంగా విదేశాలకు వెళ్లినట్లు చెబుతున్నారు. ఇక, మాజీ డిప్యూటీ సీఎం టి.రాజయ్య కులం కార్డుతో తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.
తనకు మంత్రి పదవి ఇస్తానని చెప్పిన సీఎం కేసీఆర్ మాట తప్పారని మాజీ హోంమంత్రి, ఎమ్మెల్సీ నాయిని నర్సింహారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని కేసీఆర్‌ను కోరానని, మరోసారి ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి ఇస్తానని మాట ఇచ్చారని చెప్పారు. తన అల్లుడు, కార్పొరేటర్ శ్రీనివా్‌సరెడ్డికి కూడా ఎమ్మెల్సీ పదవి ఇస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారన్నారు. సోమవారం అసెంబ్లీ లాబీలో నాయిని విలేకరులతో చిట్‌చాట్ చేశారు. తనకు ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వబోతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై స్పందిస్తూ.. ‘హోంమంత్రిగా పనిచేసినోణ్ని. నాకెందుకు కార్పొరేషన్ పదవి? ఏ కార్పొరేషన్ పదవి ఇచ్చినా తీసుకోను. పిలిచినప్పుడు నా అభిప్రాయం చెబుతా. మండలి చైర్మన్ పదవి ఇస్తానని కేసీఆర్ అంటే వద్దని చెప్పా. ఇక ఆర్టీసీలో అసలు రసమే లేదు.. అక్కడ జీతాలకే చస్తున్నరు.’ అని ఆయన వ్యాఖ్యానించారు.
టీఆర్‌ఎ్‌సలో ఓనరు ఎవరు అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. టీఆర్‌ఎ్‌సలో ఉన్నోళ్లంతా పార్టీ ఓనర్లే.. తెలంగాణ ఉద్యమంలో తాను మొదటోడినని, ఇప్పుడైతే కుటుంబానికి పెద్ద కేసీఆరే అని అన్నారు. తామంతా ఇంటి ఓనర్లమే అని, కిరాయిదార్లు ఎంతకాలం అందులో ఉంటారనేది వాళ్ల ఇష్టమని పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో పనులు జరగకపోవడం వల్ల తమ పార్టీకి కొంత ఇబ్బందికరంగానే ఉందన్నారు. అయితే హైదరాబాద్‌లో బీజేపీ బలోపేతానికి పునాదులు లేవన్నారు. తాను ఏ పార్టీలోకి వెళ్లేది లేదని మరో ప్రశ్నకు సమాధానమిచ్చారు. కాంగ్రె్‌సకు ఓటు బ్యాంకు ఉందని.. నాయకత్వం లేకనే ఆ పార్టీ దెబ్బ తిన్నదన్నారు. యాదాద్రిలో రాతి స్తంభాలపై సీఎం కేసీఆర్ చిత్రాలు, కారు గుర్తు చెక్కడం తప్పేనని స్పష్టం చేశారు. అయితే, చిత్రాలు చెక్కుతున్నప్పుడు సీఎం కేసీఆర్‌కు తెలిసి ఉండకపోవచ్చన్నారు.
నర్సన్నా.. గాండ్రిస్తున్నవానే!.. ఈటల సరదా పలకరింపు
నాయిని మీడియాతో చిట్‌చాట్ చేస్తున్న సమయంలో మంత్రి ఈటల అటువైపుగా వచ్చారు. నమస్తే నర్సన్నా.. గాండ్రిస్తున్నవానే.. అంటూ నాయినిని హత్తుకొని అప్యాయంగా పలుకరించారు. లేదు గాండ్రిస్తలేరని.. ఓనరు, కిరాయి సమస్యపై మాట్లాడుతున్నరని మీడియా ప్రతినిధులు ఈటలతో చెప్పారు. ఎందుకు అందరూ ఓనర్లే కదా.. రాజేందరన్న చెప్పిండు కదా.. అని నాయిని వ్యాఖ్యానించగా.. తనలాంటి బక్కోన్ని పట్టుకుని ఎందుకే అట్ల జేస్తవు.. అంటూ ఈటల సున్నితంగా నవ్వుకుంటూ నో కామెంట్ అన్నట్లుగా అక్కడినుంచి వెళ్లిపోయారు.