కశ్మీర్‌ అంటే కశ్మీరీలు కాదా?

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

భారతీయ జనతా పార్టీ దృష్టిలో కశ్మీర్ లోయ ఒక స్థిరాస్తి మాత్రమే గానీ, 70 లక్షల మంది పౌరులు నివసిస్తున్న భౌగోళిక ప్రాంతం కాదు; కశ్మీరీల చరిత్ర, భాష, సంస్కృతి, మతం, పోరాటాలు సమస్తమూ అసంగతమైనవి. ఉగ్రవాద హింసాకాండ, వేర్పాటు వాదాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కశ్మీరీలు ఒక శ్రేణి కాగా మరో శ్రేణిలో మిలిటెంట్లు, తుపాకీ పట్టిన యువజనులు ఉన్నారు. మొదటి శ్రేణిలోని అసంతృప్తులు రెండో శ్రేణిలో చేరడం జరిగితే పర్యవసానం నిస్సందేహంగా అత్యంత ప్రమాదకకరమైన ఉపద్రవమే.

కశ్మీర్ ఏమిటి? జమ్మూ కశ్మీర్ వివాద వ్యవహారాలు, పరిణామాలపై అనేక సార్లు రాశాను. అయితే ప్రస్తుత సందర్భం భిన్నమైనది. ఎందుకని? జమ్మూ కశ్మీర్ ఇంకెంతమాత్రం ఇదివరకటి జమ్మూ కశ్మీర్ కాదు. ఆ రాష్ట్రాన్ని విభజించారు. ఒకే రాష్ట్రం స్థానంలో ఇప్పుడు రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఒకటి- లద్దాఖ్; రెండు- జమ్మూ కశ్మీర్. భారత రాజ్యాంగం కింద ఒక రాష్ట్రాన్ని ఒక కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చడం ఇంతకు ముందెన్నడూ జరగలేదు. ఇలా స్థాయి తగ్గింపు నగుబాటు, కాదు అన్యాయం కశ్మీర్‌కే సంభవించింది

2019 ఆగస్టు 5, 6 తేదీలలో మూడు అంశాలకు పార్లమెంటు ఆమోదాన్ని పొందడంలో ప్రభుత్వం విజయవంతమయింది. (1) అధికరణ 370 రద్దు, ప్రత్యామ్నాయం : అధికరణ 370లోని మొదటి నిబంధనను రద్దు చేశారు; 3వ నిబంధనను సవరించారు. ఇది, ప్రమాదకరమైన న్యాయ తప్పిదమా లేక అతి తెలివితో అమలుపరిచిన న్యాయ వ్యూహమా అనేది కాలం, న్యాయస్థానాలు మాత్రమే చెప్పగలుగుతాయి. మనలాంటి మానవ మాత్రులు మాత్రం ప్రభుత్వ చర్యను ఒక తెలివైన రాజ్యాంగ విన్యాసంగా మాత్రం అభివర్ణించగలరు. కేవలం ఒకే ఒక్క నిబంధనతో కూడిన కొత్త 370 అధికరణ ఇంకెంతమాత్రం ఒక ప్రత్యేక ఏర్పాటు కాదు; అది, మన రాజ్యాంగమంతటినీ యావత్ జమ్మూ కశ్మీర్‌కు వర్తింప చేస్తుంది. (2) జమ్మూ కశ్మీర్ రాష్ట్రాన్ని విభజించి, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలను సృష్టించే విభజన ప్రతిపాదనపై పార్లమెంటు ఉద్దేశాలు తెలుసుకోవడం: ఈ విధమైన ప్రతిపాదనలను పరిశీలించి ఆమోదించే లేదా తిరస్కరించే హక్కు, జమ్మూ కశ్మీర్ రాజ్యాంగాన్ని రూపొందించిన రాజ్యాంగసభకు సంక్రమించింది. విచిత్రంగా, ఒక గొప్ప ఉపాయంతో ఆ రాజ్యాంగ సభ జమ్మూ కశ్మీర్ శాసనసభ అయింది; అదే ఆ తరువాత పార్లమెంటు అయింది! మరింత స్పష్టంగా చెప్పాలంటే పార్లమెంటు అభిప్రాయాలు తెలుసుకున్నాక రాష్ట్ర విభజన తీర్మానాన్ని పార్లమెంటు ఆమోదిస్తుంది! ఇందులో, మానవమాత్రుల అవగాహనా శక్తికి అతీతమైన ఒక అధిభౌతిక లేదా పారలౌకిక సూత్రం ఉందని నేను భావిస్తున్నాను. (3) జమ్మూకశ్మీర్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ, రెండు కేంద్రపాలిత ప్రాంతా లను సృష్టించడం: ఒక రాష్ట్రాన్ని విభజించి రెండు రాష్ట్రాలను సృష్టించిన పూర్వ దృష్టాంతాలను అనుసరించే జమ్మూ కశ్మీర్ (పునర్వ్యవస్థీకరణ) బిల్లు-–2019ని రూపొందించినట్టు చెప్పారు కాని ఆ పూర్వోదాహరణలకు, దీనికీ మధ్య ఒక తేడా ఉన్నది. ఈ కొత్త బిల్లు ఒక రాష్ట్రాన్ని విభజించి రెండు రాష్ట్రాలను కాక రెండు కేంద్ర పాలిత ప్రాంతాలను ఏర్పాటు చేసింది! అంటే ఒక రాష్ట్ర స్థాయిని కేంద్ర పాలిత ప్రాంతంగా కుదించివేసింది.

జమ్మూ కశ్మీర్ రాష్ట్ర స్థాయిని ఇలా రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా తగ్గించి వేయడం పట్ల సహజంగానే అధికార పక్ష సభ్యులకు ఎటువంటి అభ్యంతరం లేకపోయింది. ఇందులోని అసంబద్ధతను వారేమీ పట్టించుకోలేదు. అయితే, వివిధ రాష్ట్రాలలో అధికారంలో ఉన్న అన్నాడిఎంకె, బిజూ జనతాదళ్, జనతాదళ్ (యు), తెలంగాణ రాష్ట్ర సమితి, ఆమ్ ఆద్మీ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదలైన వాటికి ఈ విభజన బిల్లులో ఎటువంటి దోషం కన్పించకపోవడం ఆశ్చర్యకరమే. ఆ ప్రాంతీయ పార్టీలన్నీ జమ్మూ కశ్మీర్ విభజనకు అనుకూలంగా ఓటు వేశాయి. బెంగాల్ అధికార పక్షం తృణమూల్ కాంగ్రెస్ మాత్రం ఓటింగ్ సమయంలో వాకౌట్ చేసింది.

జమ్మూ కశ్మీర్ (పునర్వ్యవస్థీకరణ) బిల్లు- 2019 ని అనుసరిస్తే పశ్చిమ బెంగాల్ నుంచి డార్జిలింగ్‌ను విడదీసి ఒక కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేయడం సమీప భవిష్యత్తులో చోటు చేసుకునే ఒక అనివార్య పరిణామమని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇదేమంత కష్టమైన ప్రక్రియ కాబోదు. డార్జిలింగ్‌ను ఒక కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేయడంపై ‘తన అభిప్రాయాలు ఏమిటో’ చెప్పమని బెంగాల్ శాసనసభను కోరుతారు; లేదా బెంగాల్ లో రాష్ట్రపతి పాలనను విధించి శాసనసభను రద్దు చేస్తారు. కేవలం డార్జిలింగ్‌నే కాదు బస్తర్ జిల్లా, ఒడిషాలోని కెబికె జిల్లాలు, మణిపూర్ కొండ ప్రాంత జిల్లాలు, అస్సోంలోని బోడోలాండ్‌ను కూడా కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేసే అవకాశం ఎంతైనా ఉన్నది.

జమ్మూ కశ్మీర్ విభజన వ్యవహారంలో అత్యంత ప్రధానాంశాలు న్యాయసంబంధమైన ప్రశ్నలు కావు; అవి నిస్సందేహంగా రాజకీయ సంబంధమైనవి. ఆగస్టు 6న పరిసమాప్తి అయిన ప్రక్రియ అమలవుతున్న సమయంలో ప్రభుత్వం రాజ్యాంగం నిర్దేశించిన విధంగా సంప్రదింపులు జరపనే లేదు. తొలుత 2018 నవంబర్ 22న న జమ్మూ కశ్మీర్ శాసనసభను రద్దుచేయక ముందు, రాష్ట్ర విభజన విషయమై ఆ సభను సంప్రదించనే లేదు. ప్రధాన స్రవంతి రాజకీయ పార్టీలను గానీ, వాటి నాయకులనుగానీ (వీరిలో నలుగురు మాజీ ముఖ్యమంత్రులు కూడా) ప్రభుత్వం సంప్రదించ లేదు. హురియత్ కాన్ఫరెన్స్‌నూ సంప్రదించనే లేదు. అసలు హురియత్‌ను గుర్తించడానికి గానీ, దాని నాయకులతో మాట్లాడడానికి గానీ మోదీ ప్రభుత్వం నిర్ద్వంద్వంగా నిరాకరిస్తోంది. ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడానికి కూడా మోదీ ప్రభుత్వం ఏ విధంగానూ ప్రయత్నించలేదని మరి చెప్పనవసరం లేదు.

తన చర్యను మోదీ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఎన్నికల మానిఫెస్టో హామీని నెరవేర్చడంగా సమర్థించుకున్నది. ఇది పాక్షికంగా మాత్రమే నిజం. నిజానికి అధికరణ 370 రద్దు అనేది బీజేపీ హామీ. ఈ విషయమై ఎవరూ విభేదించనవసరం లేదు. అయితే జమ్మూ కశ్మీర్‌ను విభజిస్తామని, విభజించి రెండు కేంద్ర పాలిత ప్రాంతాలను సృష్టిస్తామని భారతీయ జనతాపార్టీ ఎప్పుడూ ఎక్కడా హామీ ఇవ్వలేదు. ఇది, ఆ పార్టీ నాయకులూ నిరాకరించలేని ఒక నిశ్చిత సత్యం. లద్దాఖ్‌ను ఒక కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేసినప్పటికీ అవశేష జమ్మూ కశ్మీర్‌ను ఒక రాష్ట్రంగా కొనసాగించవచ్చు కదా. ఇలా ఎందుకు చేయలేదని ప్రశ్నిస్తే ప్రభుత్వం నుంచి సమాధానం లేదు.

మోదీ ప్రభుత్వం ప్రజలను పూర్తిగా ఉపేక్షించింది. అయితే అంతిమంగా ప్రజా సంకల్పమే గెలుస్తుంది. ప్రభుత్వ అసాధారణ చర్యల సాఫల్య వైఫల్యాలను కశ్మీర్ లోయలో మోహరించిన వేలాది సైనికులు గాక, అక్కడ నివసిస్తున్న 70 లక్షలకు పైగా ఉన్న కశ్మీరీ ప్రజలే నిర్ణయిస్తారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. సరే, మోదీ ప్రభుత్వ అసాధారణ చర్యలకు కశ్మీర్ లోయ వాసులు ఎలా ప్రతిస్పందిస్తారు? అధికరణ 370 రద్దును రాజ్యాంగ హామీ ఉల్లంఘనగా కశ్మీరీలు తప్పక భావిస్తారు. అంతే కాదు జవహర్లాల్ నెహ్రూ, (ఎన్. గోపాలస్వామి అయ్యంగార్, వి.పి.మీనన్ సహకారంతో) సర్దార్ వల్లభ్ భాయి పటేల్, బాబాసాహెబ్ అంబేడ్కర్, ఇంకా ఇతర రాజ్యాంగ నిర్మాతలు తమకు ఇచ్చిన హామీని మోదీ ప్రభుత్వం పూర్తిగా ఉల్లంఘించిందనే నిర్ణయానికి కశ్మీరీలు తప్పక వస్తారు. కశ్మీర్ వివాదానికి పరిష్కారం ఇన్సానియత్, జమ్హూరియత్, కశ్మీరియత్ ప్రాతిపదికన మాత్రమే సుసాధ్యమవుతుందన్న అటల్ బిహారీ వాజపేయి సుప్రసిద్ధ ఉద్ఘోషను కూడా మోదీ ప్రభుత్వ చర్యలు పూర్తిగా తిరస్కరించాయని ప్రజలు విధిగా విశ్వసిస్తారు. లద్దాఖ్ ను ఒక కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేయడాన్ని (లేహ్ ఆమోదిస్తుండగా కార్గిల్ వ్యతిరేకిస్తోంది) జమ్మూ కశ్మీర్ ప్రజలను మత ప్రాతిపదికన విడదీయడంగా ప్రజలు తప్పక చూస్తారు. కశ్మీర్ లోయప్రజలను అవమానించే, వారి రాజకీయ, ఆర్థిక, శాసన నిర్మాణ హక్కులను తగ్గించే ప్రయత్నంలో భాగంగానే జమ్మూ కశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతాన్ని సృష్టిస్తున్నారనే భావం కశ్మీరీలలో నెలకొనడం ఖాయం.

జమ్మూ కశ్మీర్ విభజన వ్యవహారంతో నాకు ఒక వాస్తవం స్పష్టమయింది. భారతీయ జనతా పార్టీ దృష్టిలో కశ్మీర్ లోయ ఒక స్థిరాస్తి (రియల్ ఎస్టేట్) మాత్రమే గానీ, 70 లక్షల మంది పౌరులు నివసిస్తున్న భౌగోళిక ప్రాంతం కాదు. బీజేపీ దృష్టిలో కశ్మీరీల చరిత్ర, భాష, సంస్కృతి, మతం, పోరాటాలు సమస్తమూ అసంగతమైనవి. ఉగ్రవాద హింసాకాండ, వేర్పాటు వాదాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంఖ్యానేక కశ్మీరీలు ప్రభుత్వ వైఖరితో ఏకీభవించడం లేదు. అయినా వీరూ తోటి కశ్మీరీల నిరసనలలో పాల్గొంటున్నారు. జమ్మూ కశ్మీర్ కు మరింత స్వయంప్రతిపత్తిని డిమాండ్ చేస్తూ వారందరూ ఏకత్రాటిపై నిలబడ్డారు. వీరంతా ఒక శ్రేణి కాగా మరో శ్రేణిలో మిలిటెంట్లు, తుపాకీ పట్టిన యువజనులు ఉన్నారు. మొదటి శ్రేణిలోని అసంఖ్యాక అసంతృప్తులు రెండో శ్రేణిలో చేరడం జరిగితే దాని పర్యవసానం నిస్సందేహంగా అత్యంత ప్రమాదకరమైన, సర్వనాశనకరమైన ఉపద్రవమే అనడంలో సందేహం లేదు (ఇది సంభవించకుండుగాక!). అటువంటి మహావిపత్తు చోటు చేసుకున్నప్పుడు స్థిరాస్తి విలువ అంత చౌక కాదనే సత్యం బీజేపీకి అర్థమవుతుంది.

Courtesy Andhrajyothi

RELATED ARTICLES

Latest Updates