అమిత్‌ షా అర్థశాస్త్రం!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

ప్రభాత్‌ పట్నాయక్‌

కాశ్మీర్‌ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేయటాన్ని సమర్థించటానికి రాజ్యసభలో చేసిన ప్రసంగంలో అమిత్‌ షా కాశ్మీర్‌ ‘అభివృద్ధి’ అనే విషయాన్ని లేవనెత్తాడు. మిగిలిన భారతదేశంతో కాశ్మీర్‌ మరింతగా విలీనం కావటం వల్ల ఆ రాష్ట్రానికి చాలా పెట్టుబడులు తరలి వస్తాయని ఆయన వాదించాడు. కాశ్మీరీ యువతకు మరిన్ని ఉద్యోగావకాశాలు రానున్నాయని ఆయన వారికి విజ్ఞప్తి చేశారు. గత 45 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగం రాజ్యమేలుతున్న నేటి స్థితిలో భారతదేశంలో మరింతగా విలీనం అయితే కాశ్మీర్‌లో ఉద్యోగావకాశాలు మెరుగవుతాయనటం ఆశ్చర్యం. అయితే మనం ఈ వాదనను మరింత దగ్గరగా పరిశీలిద్దాం.

ప్రత్యేక ప్రతిపత్తి ఉన్నా లేకపోయినా అమిత్‌ షా పేర్కొన్నట్టుగా స్థానిక ముడి పదార్థాల వినియోగం లేకుండా భారీ పరిశ్రమలు కాశ్మీర్‌ లోకి వస్తాయని చెప్పటం మూర్ఖత్వమే అవుతుంది. కాశ్మీర్‌లో ఫ్యాక్టరీ పెడితే రవాణా ఖర్చులు భరించలేనంతగా ఉంటాయి. ‘బయటి వారు’ భూమిని కొనటానికి నిరాకరించే 35 (ఎ) అధికరణాన్ని రద్దు చేయటంతో భూమి ధర పెరుగుతుందని, అది ‘సానుకూల అభివృద్ధి’ అని షా స్వయంగా చెప్పారు. కాబట్టి ఎటువంటి ప్రతిబంధకాలు లేనందున కాశ్మీర్‌ లోయ లోకి భారీ పరిశ్రమలు అలవోకగా అరుదెంచుతాయని భావించటం మూర్ఖత్వమే అవుతుంది. ఇదే తర్కం చిన్నతరహా పరిశ్రమలకు కూడా వర్తిస్తుంది.

కాబట్టి ఉన్ని, పండ్లు, కలప, మాంసం వంటి స్థానిక ముడి పదార్థాలను ఉపయోగించే కార్యకలాపాలు మాత్రమే కాశ్మీర్‌లో వర్థిల్లుతాయి. ఆ రాష్ట్రంలో ఇప్పటికే అటువంటి కార్యకలాపాలు బాగా నిలదొక్కుకున్నాయి. వాటిని బాగా ప్రోత్సహించటమే నేటి ఆవశ్యకత. అందుకోసం ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేయటం, బయటి వాళ్ళు భూమిని కొనటాన్ని అడ్డుకునే నియమ నిబంధనలను తొలగించటం వంటి చర్యలు కాదు కావలసింది. సహానుభూతిని వ్యక్తం చేసే ప్రభుత్వం రాష్ట్రంలో ఉండాలి.
మిగిలిన దేశానికి తలుపులు బార్లా తెరిస్తే బహుళ జాతి కంపెనీలు లేక భారతీయ బడా వ్యాపార సంస్థలు ఈ కార్యకలాపాలను అభివృద్ధి చేసి కాశ్మీర్‌ ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహి స్తాయని అనుకుంటున్నారేమో. అయితే స్థానికులు ఏ ఆర్థిక కార్యకలాపాలలో నిమగమై ఉన్నారో అదే కార్యకలా పాలలో భారతీయ లేక విదేశీ బడా పెట్టుబడిదారులు పెట్టుబడులు పెడితే ఉద్యోగిత పెరగదు. దానితో స్థానిక ఉత్పత్తిదారులకు స్థానభ్రంశం జరిగి ఉద్యోగిత కుదింప బడవచ్చు. ఒకవేళ అటువంటి కార్యకలాపాలు పెరిగే అవకాశం ఉంటే కాలక్రమంలో అటువంటి కార్యకలాపాలలో పెరుగుదలను రాష్ట్ర ప్రభుత్వ సంస్థల సహకారంతో స్థానిక ఉత్పత్తిదారులే ఉపయోగించుకోగలుగుతారు. కాబట్టి స్థానిక ఉత్పత్తులను ఉత్పత్తి చేసేందుకు బడా పెట్టుబడిని ప్రవేశ పెడితే కాలక్రమంలో ఉద్యోగిత సృష్టి స్థానిక ఉత్పత్తిదారులు సృష్టించిన దానికంటే తక్కువ స్థాయిలో ఉంటుంది. ఉద్యోగిత సృష్టి ఎటువంటి పరిస్థితుల లోను ఎక్కువగా ఉండదు.

అయితే కాశ్మీర్‌ లోయలో భూమిని కొనటానికి బయటివాళ్లు ప్రవేశించటం పైనే అసలు ‘ఆశ’ ఆధారపడి వుందని అమిత్‌ షా అంటున్నారు. హిమాచల్‌ప్రదేశ్‌, ఇతర పర్వత సరిహద్దు రాష్ట్రాలలో బయటివారు భూమిని కొనటానికి ఆంక్షలు కొనసాగుతుండగా కేవలం కాశ్మీర్‌లో ‘అభివృద్ధి’ పేరుతో వాటిని తొలగించటం విడ్డూరం. అయితే కాశ్మీర్‌లో అభివృద్ధి జరగటానికి భూమి అమ్మకం కారణమౌతుందా?
ఒక వ్యక్తి భూమిని కొనుగోలు చేసినప్పుడు అందుకోసం అతను మరొక ఆస్థిని వదులుకుంటాడు. భూమిని అమ్మేవాడికి దీనికి వ్యతిరేకంగా జరుగుతుంది. ఏ ఇతర ఆస్తి అనేదే ఇక్కడ ప్రశ్న. ఒకవేళ భూమి కొనుగోలుదారులు తమ ఉత్పాదక ఆస్తులను వదులుకుని కాశ్మీర్‌ లోయలో భూమిని కొంటే దానితో మిగిలిన భారతదేశంలో తిరోగమన ప్రభావం ఉంటుంది. అయితే ఇలా జరగదనుకుని అమిత్‌షా కు అనుకూలమైన దృశ్యాన్ని పరిశీలిద్దాం. అదేమంటే భూమి కొనుగోలుదారులు తమ వద్దనున్న నగదుతో భూమిని కొంటారనుకుందాం. దీనితో మిగిలిన దేశంలో ప్రాథమికంగా పెట్టుబడులలో కోత ఉండదనుకుందాం. వాస్తవంలో కాశ్మీర్‌ లోయలో భూమిని కొనటానికి బ్యాంకుల వ్యవస్థ అప్పు ఇస్తుందని అనుకుందాం. అందుకోసం అవసరమయ్యే నగదు సరఫరాకు ఆటంకం ఉండదని కూడా అనుకుందాం.

ఇప్పుడు ముందుకు వచ్చే ప్రశ్న ఇలా ఉంటుంది. భూమిని అమ్మేవారు తమకు వచ్చే నగదుతో ఏం చేస్తారు? మనం చర్చించిన కారణాల వల్ల వారు స్థానిక ఉత్పత్తిని విస్తృతం చేయటానికి తప్ప మరో రూపంలో కాశ్మీర్‌ లోయలో పెట్టుబడి పెట్టే అవకాశం ఉండదు. అయితే స్థానిక ఉత్పత్తుల ఉత్పత్తిని విస్తృతపరచటానికి ఫైనాన్స్‌ కొరత ఉంది అనుకోవటానికి ఎటువంటి కారణం లేదు. అటువంటి ఉత్పత్తిని గణనీయంగా పెరచటానికి అవకాశం ఉండవచ్చు. అయితే అందుకోసం రాష్ట్ర ప్రభుత్వ జోక్యం బలంగా ఉండాలి. కాబట్టి కేవలం భూమిని అమ్మగా వచ్చిన డబ్బు ఉన్నంత మాత్రాన అది ఉత్పత్తిని పెంచే పెట్టుబడిగా మారదు (లేకపోతే భూమిని అమ్మనవసరం లేకుండానే పెట్టుబడి పెరిగి ఉండేదే). కాబట్టి ఈ నగదును బ్యాంకులలో డిపాజిట్‌ చేసే అవకాశమే ఎక్కువగా ఉంటుంది. అలా వచ్చిన నగదును బ్యాంకులలో డిపాజిట్‌ చేసినప్పుడు ఆ నగదును సాధారణంగా స్థానికంగా అప్పు ఇవ్వటానికి ఉపయోగించకపోవచ్చు. మిగిలిన దేశంలో అప్పుగా ఇవ్వటానికి ఆ నగదును కాశ్మీర్‌ నుంచి బయటకు తీసుకు రావచ్చు లేదా మహా అయితే స్థానిక బ్యాంకులలో నిల్వ వుంచవచ్చు. కాబట్టి దానితో జరిగే మార్పేదైనా వుంటే అది స్థానికులు డబ్బు కోసం తమ భూమిని కోల్పోవటమే అవుతుంది. కొందరి కాశ్మీరీల చేతుల్లో వున్న ఆ డబ్బు కూడా తరువాత కాశ్మీర్‌ లోయ నుంచి నిష్క్రమిస్తుంది. అలా ‘అభివృద్ధి’ అనేది లేశమైనా ఉండదు. దానితో ఉద్యోగిత పెరగటమనేదీ ఉండదు.
అయితే మరోవైపు భూభాగం ఎంతమేరకు చేతులు మారుతుందో అంత భూభాగంలో గతంలో జరిగిన కార్యకలాపాలు భూమి చేతులు మారటంతో ఆగిపోతాయి. భూమిని కొన్న బయటివాళ్లు ఇతర కార్యకలాపాలకు కాకుండా రియల్‌ ఎస్టేట్‌గా భూమిని మార్చి అధిక ధరను రాబట్టుకోవాలని చూడటమో లేక ఆ భూమిని కాశ్మీర్‌లో వేసవి విడిదిగా ఉంచుకోవటానికో ఉపయోగిస్తారు. దీనితో కాశ్మీర్‌లో ఆర్థిక కార్యకలాపాలు తగ్గిపోయి ఉద్యోగిత తగ్గిపోతుంది.
అలా ఏవిధంగా చూసినా కాశ్మీర్‌కు గల ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేయటం, బయటి వారు భూమిని కొనటంపై వున్న ఆంక్షను తొలగించటం వల్ల ఉద్యోగిత లేశమైనా పెరగదు. అందుకు భిన్నంగా ఢిల్లీ, ముంబాయి నగరాలకు చెందిన సంపన్నుల చేతుల్లోకి భూమి చేరటం వల్ల కాశ్మీర్‌లో ఉద్యోగిత తగ్గే అవకాశం ఉంటుంది.
ఒకవేళ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేయటంతోనే రాష్ట్ర అభివృద్ధికి అవకాశాలు మెరుగుపడటమే నిజమైతే ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసేటప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులతో సహా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకులను నిర్బంధించ వలసిన అవసరం కేంద్ర ప్రభుత్వానికి ఉండేది కాదు. ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసిన తరువాత రాష్ట్రంలో అనివార్యంగా హింస పెరిగింది. అలా హింస పెరగటం కారణంగా రాష్ట్రంలోని ప్రజలకు ప్రధానాధారమైన పర్యాటక పరిశ్రమ కూడా ప్రతికూలంగా ప్రభావితమైంది. అది కాశ్మీరీ యువత ఉద్యోగావకాశాలను దెబ్బతీసింది.
క్లుప్తంగా చెప్పాలంటే ‘అభివృద్ధి’ నినాదం కేవలం ఒక ముసుగు మాత్రమే. అటువంటప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇలా ఎందుకు చేసింది? ఈ ప్రశ్నకు ఇది హిందూత్వ శక్తుల దీర్ఘకాలిక డిమాండ్‌ అనేది సర్వసాధారణ సమాధానం.
ఇది వాస్తవ రూపం ధరిస్తుండగా మనం దీనికి మరొక లక్ష్యం ఉందన్న విషయాన్ని విస్మరించకూడదు. నిజానికి ఈ ప్రభుత్వం హిందూత్వ-కార్పొరేట్ల మైత్రి ప్రాతిపదికన ఏర్పడింది. హిందూత్వను ప్రోత్సహించటాన్ని పక్కన బెడితే ఈ ప్రభుత్వం చేసేదంతా దాదాపు కార్పొరేట్‌ ఎజెండాకు అనుబంధంగానే ఉంటుంది. ఉత్పాదక కార్యకలాపాల విస్తృతికి అంతగా కాకుండా తన కార్పొరేట్‌ పోషకుల రియల్‌ ఎస్టేట్‌ అభివృద్ధి కోసం భూమిని సేకరించటానికి లేదా భూమి ధరను పెంచే చట్టా వ్యాపారానికి కాశ్మీర్‌ లోయను బార్లా తెరిస్తే అది కార్పొరేట్లకు అదనపు ప్రోత్సాహకం అవుతుంది. అలా రియల్‌ ఎస్టేట్‌ను అభివృద్ధి చేయటం వల్ల ఉద్యోగిత స్థాయి ఏమంతగా పెరగక పోవటం అటుంచి అదే భూభాగాన్ని అంతకు ముందు ఏవైనా ఉత్పాదక కార్యకలాపాలకు వినియోగించినట్టయితే ఉద్యోగిత తగ్గుతుంది.

పర్యావరణం దెబ్బ తింటుందని చెప్పనవసరం లేని పర్యవసానం స్పష్టంగా ఉండటం అటుంచి… కాశ్మీర్‌ లోయను రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలకు బార్లా తెరవటం వల్ల కాశ్మీర్‌ అందచందాలు నాశనమౌతాయి. ఉత్పాదక కార్యకలాపాలకు ఆలవాలమైన కాశ్మీర్‌ ఆర్థిక వ్యవస్థ చట్టా వ్యాపారులకు, భూకబ్జాకోరులకు స్వర్గధామం అవుతుంది. అలాంటి చట్టా వ్యాపారంతో అనివార్యంగా నేరాలు పెరుగుతాయి. ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేయటంతో పెరిగే నేరాలు అనివార్యంగా పెంపొందే తీవ్రవాదానికి అదనం అవుతాయి. నిజానికి ఈ రెండు వెల్లువలు వేరే సందర్భాలలో మాదక ద్రవ్యాలు, టెర్రరిజం వలే ఒకదానిని మరొకటి బలోపేతం చేస్తాయి.
నిజానికి భూస్వామ్య వ్యతిరేక భూసంస్కరణ లను అమలు చేయటంలో దేశానికి నాయకత్వం వహించిన రాష్ట్రానికి ఇదొక విషాదకర ప్రారబ్ధం. అయితే అమిత్‌ షా దీనినే ‘అభివృద్ధి’ అని అభివర్ణిస్తాడనటంలో సందేహం లేదు.

 

(Courtacy Prajashakti)

RELATED ARTICLES

Latest Updates