జాషువా కవిత్వంలో మహిళా చైతన్యం

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

కోటేశ్వర్ రావు 

పితృస్వామ్య సమాజ ఉక్కు పాదాల కింద దళితులతో పాటు స్త్రీలు కూడా నలిగిపోయారు. కాబట్టి స్త్రీల కష్టనష్టాలను జాషువా బాగా అర్థం చేసుకోగలిగారు. ‘నిన్నాకాశము దాకగ పొగుడుచున్‌ నీ అందచందాలతో/ వన్నెల్‌ దీర్చి కవిత్వమల్లు కొనుచున్‌, పైపై పరామర్శలన్‌/ నిన్నున్‌, నీదు శరీరమున్‌, హృదయమున్‌ ఛేదించి వేధించి యిం/ తన్నంబున్‌ బడవేయు సంఘమును/ బిడ్డా! యెట్లు హర్షింతువో’’ అంటూ వాత్సల్యంతో స్త్రీని ప్రశ్నిస్తాడు జాషువా

ఆధునిక తెలుగు సాహిత్యంలో ప్రజల నాలుకల మీద జీవిస్తున్న మహాకవి గుర్రం జాషువా. కులాధిపత్యం వల్ల కలిగే సామాజిక విధ్వంసాన్ని, మతోన్మాదం రగిలించే కరుడుకట్టిన మూఢత్వాన్ని వేయి గొంతుకలతో ధిక్కరించి మరణంలేని మానవత్వానికి తన సాహిత్యంలో పట్టాభిషేకం చేసిన నవయుగ కవి చక్రవర్తి జాషువా. సూర్యగమనానికి అభిముఖంగా పొద్దుతిరుగుడు పువ్వు దృష్టి సారిం చినట్లుగా ప్రజా సమస్యల చిత్రణ దిశగా జాషువా తన సాహిత్య సృష్టిని సాగించాడు.

సంఘ సంస్కరణ ఉద్య మానికి పురిటిగదియైున రాజ మండ్రిలో కొంతకాలం జీవిం చటం వల్ల, స్త్రీ జనాభ్యుద యానికి మార్గదర్శిగా నిలిచిన వీరేశలింగం సాహిత్యంతో పరి చయం కలుగటం వలన- మహిళా చైతన్యం జాషువా కవిత్వం నిండా పరిమళిస్తుంది. పితృస్వామ్య వ్యవస్థ స్వరూప స్వభావాలను పురుషాధిపత్యం తీరుతెన్నులను జాషువా ‘నేటి నెలత’, ‘వంచిత’ కవితా ఖండికల్లో ఎంతో సముచి తంగా ఆవిష్కరించాడు.

బాల్యంలో, వివాహ వ్యవస్థలో, సంసార జీవితంలో పురుషాహంకారం ఏఏ రూపాల్లో బుసలు కొడుతుందో తన రచనల్లో ప్రగాఢంగా చిత్రించాడు. ‘‘పెండ్లి ఆడిన భార్యల పిప్పిజేసి/ తరుము చున్నవి పురుష భూతములు కొన్ని/ స్త్రీత్వమిడి అట్టి వానిని శిక్షించా’’లని ఆయన ప్రబోధించాడు. ‘‘స్త్రీని వంట ఇంటి కొరముట్టుగా’’ ‘‘ఊడిగపు యంత్రంగా’’ ఉపయోగించుకుంటు న్నారని పరిశీలనాత్మకంగా వ్యాఖ్యానించాడు. ‘‘మదన జ్వరౌ షదములు’’గా, ‘‘కొట్టుటకు తిట్టుటకు ఒకపట్ట జన్మించినట్లుగా’’ మహిళలను అర్థం చేసుకుంటున్నారని సూక్షంగా తెలియ జేశాడు. సాంఘిక మహాభూత పెనుకోరల మధ్య, దుష్ట భర్తల కృపాహీన ప్రవృత్తులతో నలిగిపోతూ ఆత్మహత్యలకు పాల్పడు తున్న స్త్రీలను ఎలా ఊరడిస్తారని అధినాయకుల గుండెలదిరేలా జాషువా ప్రశ్నించాడు.

భావ, అభ్యుదయ, విప్లవ కవుల్లో కనిపించని మహిళాభ్యు దయ చింతన జాషువా కవిత్వంలో దర్శనమిస్తుంది. మహిళా వికాసంతోనే సామాజిక ప్రగతి సాధ్యమవుతుందని ఆయన బలంగా విశ్వసించాడు. స్త్రీలపై అణచివేత కొనసాగినంత కాలం ‘‘భారత స్వాతంత్ర రథము బెత్తెడు కూడా ముందుకు సాగద’’ని జాషువా ఆనాడే చాటి చెప్పటం విశేషం. ‘‘సతుల నైసర్గిక జ్ఞాన సస్యరమను చిత్రచిత్రంబుగా హత్య చేసినారు’’ అంటూ కిరాతకమైన మనుస్మృతిని, హిందూ పితృస్వామ్య సమాజాన్ని తీవ్రంగా నిరసించాడు. ‘కన్నతల్లి’, ‘మాతృప్రేమ’ లాంటి కవితా ఖండికల్లో మాతృత్వంలోని మాధుర్యాన్ని, త్యాగ నిరతిని అద్భుతంగా కవిత్వీకరించాడు. ‘‘నాదు కంటినీరు నా తల్లి దేహాన/ నరనరాన దుఃఖనదులు చిమ్ము’’ అంటూ తల్లీ బిడ్డల అనుబంధాన్ని ఎంతో ఆర్ద్రంగా అభివ్యక్తం చేశాడు. భార్య మరియమ్మ మరణించినప్పుడు జాషువా రాసిన పద్యాలను పరిశీలిస్తే ఆయన స్త్రీకి ఎంతటి ఉదాత్తమైన స్థానమిచ్చాడో అర్థమవుతుంది. ‘‘నా తనుయష్టి ప్రత్యణువున్‌ గల పుష్టికి కార ణంబు నీ/ చేతి సుధాశనంబె కద! చిక్కునె నా కనరాదుగాని, నా/ మాతకు మారుగా, యనుగు మానిని రూపము దాల్చినట్టి నా/ జాతక పుణ్యరేఖవో ప్రశస్త శుభైక వరప్రదాత్రివో’’ అంటూ భార్యను తల్లిగా అభివర్ణించడం జాషువా ఔన్నత్యానికి తిరుగులేని నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

నిన్నాకాశము దాకగ పొగుడుచున్‌ నీ అంద చందాలతో/ వన్నెల్‌ దీర్చి కవిత్వమల్లు కొనుచున్‌, పైపై పరామర్శలన్‌/ నిన్నున్‌, నీదు శరీరమున్‌, హృదయమున్‌ ఛేదించి వేధించి యిం/ తన్నంబున్‌ బడ వేయు సంఘమును/ బిడ్డా! యెట్లు హర్షింతువో’’ అంటూ వాత్సల్యంతో స్త్రీని ప్రశ్నిస్తాడు జాషువా.

‘తెరచాటు’ నాటకంలో కన్యాశుల్క నాటక స్ఫూర్తి ప్రత్యక్షరంలో నవ నవోన్మేషంగా దర్శనమిస్తుంది. 1935 సంవత్సరంలో వెలువడిన ఈ నాటకంలో బాల వితంతువుల హృదయావేదన, దీనివల్ల కలిగే అనర్థాలు, సనాతనుల స్వార్థపరత్వం, పడుచు భార్యలు ముసలి భర్తలతో అనుభవించే కష్టనష్టాలను జాషువా అంగీకారయోగ్యంగా అక్షరబద్ధం చేశాడు. ‘‘జిలుగు మాంధాళి జలతారు చీరలోన/ పొదివి సేవింపదగు మల్లెపూల గుత్తి/ పీనుగుల మీద కప్పు పాపిష్టి కలుష/ వస్త్రపు ముసుగులో జుట్టి వయిచి నారు’’ అంటూ బాల వితంతువైన కళ్యాణి స్వరూపాన్ని శిల్ప సుందరంగా వర్ణించాడు. పట్టుచీర జిలుగులతో పరిమళించా ల్సిన మల్లెపూల గుత్తిని పీనుగులమీద గప్పే కలుష వస్త్రంలో చుట్టివేశారని చెప్పడం ద్వారా వితంతువు పూర్వోత్తరస్థితిగతులను అద్భుతంగా కవిత్వీకరించాడు. ‘‘ఆ ప్రసన్నేక్షణముల శైత్యంబు నందు/ ఉబుకుచున్నవి వేడి పయోధరములు/ ఆ వినూతన యౌవనోద్యాన సీమ/ గ్రక్కుచున్నాడు సూర్యుడంగారవృష్టి’’ అంటూ- సర్వసుఖాలకు దూరమైన వితంతువు యౌవనోద్రే కాన్ని, సహజసిద్ధమైన శారీరక ఆకాంక్షలను జాషువా వర్ణించాడు.

వితంతువు యవ్వన ఉద్యాన సీమలో సూర్యుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడని సంభావించడంలో జాషువ కవితా శిల్పం పరాకాష్ఠకు చేరుకుంది. ‘తెరచాటు’ నాటకంలో కళ్యాణి, ప్రమోద్‌ పాత్రల ద్వారా జాషువా పలికించిన సంభాషణల్లో మత కర్కశత్వం కనబడుతుంది. ‘‘హిందూ సంఘమంటే మనుషులను ప్రాణాలతో పీక్కుతినే క్రూర పిశాచం కాదా? వెర్రిదాన? ఆడదై పుట్టడమే మహాపాపమనుకో’’, ‘‘ఆచారాలన్నీ ఆత్మనాశనాలకు, పరనాశనానికి కారణభూతాలు’’, ‘‘ఈ సంఘశక్తికి కన్నులున్నవి కాని కరుణ లేదు, హృదయం ఉన్నది కానీ వజ్రకల్పం’’, ‘‘ధర్మ దేవతకు నాలుగు కాళ్ళని శాస్త్రంలో రాశారే, ఆ పోలిక మహా కుదిరింది. పశుధర్మం కనుక’’- ఇలాంటి సంభాషణల్లో పూర్వ, సమకాలీన కవులు మరచిపోయిన చీకటికోణాలను సాహసో పేతంగా దృశ్యమానం చేశాడు. ఈ మాటలలోని భావతీవ్రత వితంతువుల వేదనలోనుంచి ఉబికివచ్చిన ధర్మాగ్రహం మాత్రమే. నిజానికి జాషువా హిందూమతంతో పాటు క్రైస్తవ, ముస్లిం మతాలలోని అతివాద, ప్రగతి విద్రోహ ధోరణులను కూడా విమర్శించిన విషయం ఇక్కడ గమనార్హం

‘విద్యయంటె మూఢత్వం అనే పులికి పెట్టే ఇంపైన భోజనం కాదని, మనుజత్వాన్ని పెంపొందింప జేయలేని చదువుల వల్ల ప్రయోజనం లేదని’’ తన రచనల్లో విశ్లేషించిన జాషువా మహిళా విద్యావశ్యకతను శాస్త్రీయంగా ప్రబోధించాడు. ‘‘అబల విద్యా పూర్ణయైు తోడురాకున్నన్‌ దేశము నిద్ర మేలుకొనునే’’ (ప్రబోధం), ‘‘స్త్రీల విజ్ఞానంబు చిదిమి బందీ జేయు దేశాన సిరులు వర్ధిల్లగలవే’’ (బాపూజి) అంటూ ఒక సామాజిక శాస్త్ర వేత్తలా ప్రశ్నించాడు. గురజాడ సాహిత్యంతో పాటు, చదువెరుగని స్త్రీలు తమ బిడ్డలకు శత్రువులు అన్న కందుకూరి స్ఫూర్తి జాషువా కవిత్వంలో ప్రతిఫలిస్తుంది.

కు మాతా న భవతి’ అన్నమాట నిజమే కావచ్చు కాని ఎందెందు వెదకినా అందందు ప్రత్యక్షమయ్యే కులభూత ప్రభావా నికి తల్లి కూడా మినహాయింపు కాదని ‘మాత’ అనే అరుదైన కవిత ద్వారా తెలియజేశాడు. బాల్యం నుండే ‘‘కులగోత్రాల… విద్వేషపున్‌ మొలకలు నాటి అహంకృతిని కలిపి తప్పుద్రోవ జూపించు మాతలు శాంత్యున్నతికిన్‌ విషక్రిముల’’ని తీవ్రంగా ఆరోపించాడు. ‘‘ఈడు రాకముందు వేడుక కోసమ/ ర్థంబులేని పెండ్లితంతు నెఱిపి/ భావి జీవితములు పాడుసేయు’’ మహిళ తల్లికాదని జంగుబిల్లి వంటిదని జాషువా ప్రకటించాడు. బిడ్డల పెంపకంలో మహిళలు జాగ్రత్త వహించకపోతే జాతి నష్ట పోతుందని హితవు చెప్పాడు.

‘రామరాజ్యముల్‌/ వేయి సముద్భవించినా’’, ‘‘పదివేల స్వరాజ్య ములుప్పతిల్లినన్‌’’ స్త్రీలపట్ల జాలిజూపే మహనీయులు పుట్టరని ‘‘స్త్రీ జగము దుఃఖము వాపెడి శాసనాలకున్‌/ నాయకులే విరోధులయినారని!’’ (ఖండకావ్యం-5, 1953) అని జాషువా నాటి రాజకీయ నాయకుల సంకుచిత తత్వాన్ని ఎంతో వ్యంగ భావ స్ఫోరకంగా ఎత్తిచూపించాడు. స్త్రీల సర్వతోముఖ పురోగమనాన్ని వాగ్దానం చేసే హిందుకోడ్‌ బిల్లును శ్యామ్‌ప్రసాద్‌ ముఖర్జీ, వల్లభాయిపటేల్‌, డా.రాజేంద్రప్రసాద్‌ లాంటి ఘనత వహించిన నాయకులతోపాటు ప్రధానమంత్రి నెహ్రూ కూడా వ్యతిరేకించాడు. ఇందుకు నిరసనగా డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌ రాజీనామా చేసి పార్లమెంటు సాక్షిగా హిందూకోడ్‌ బిల్లు హత్య చేయబడిందని, దీని కోసం ఎవరూ రెండు కన్నీటి బొట్లు కూడా రాల్చటం లేదని వాపోయాడు (1951 సెప్టెంబర్‌). స్త్రీలకు జరిగిన ఈ చారిత్రాత్మక ద్రోహాన్ని జాషువాపై పద్యంలో సమర్థవంతంగా సమకాలీన రాజకీయ ఎరుకతో అక్షరబద్ధం చేశాడు.

భావ స్వాతంత్య్రం, ఆర్థిక స్వాతంత్ర్యాలను స్త్రీకి కల్పించాల్సిన అవసరం ఉందని పురుషులతోపాటు సమాన గౌరవ మర్యాదలు ఉండాలని ‘కొత్త లోకం’ కావ్యంలో జాషువా పదేపదే గుర్తు చేశాడు.

‘ముంతాజ్‌మహల్‌’ కావ్యంలో స్త్రీ ఔన్నత్యాన్ని, ‘అనాధ’లో దళిత స్త్రీ అనుభవించే దుర్భర దారిద్ర్యాన్ని, వాస్తవిక దృష్టితో చిత్రించాడు. నోములు, వ్రతాలు, పూజలతో ప్రతి నిత్యం ప్రద క్షిణలు చేస్తూ కుటుంబాన్ని మర్చిపోయే స్త్రీల మూఢత్వాన్ని కూడా ఆయన వ్యతిరేకించాడు. మహిళల్లో పెరుగుతున్న అలంకార ప్రియత్వాన్ని సున్నితంగా తిరస్కరించాడు. ‘భావదాసురాలు’, ‘వెర్రి బాగులమ్మ’, ‘పరమ మూఢ’ ‘చపల హృదయ’ వంటి పదబంధాల ద్వారా స్త్రీలలోని పోరాటలేమిని ఎత్తి చూపాడు. పితృస్వామ్య సమాజ ఉక్కు పాదాల కింద దళితులతో పాటు స్త్రీలు కూడా నలిగిపోయారు. కాబట్టి స్త్రీల కష్టనష్టాలను జాషువా బాగా అర్థం చేసుకోగలిగారు. వితంతువు, గబ్బిలం, స్మశానం, చీకటి ఇలాంటి సంఘ విముఖ అంశాలను తన కవితా చాతుర్యంతో సౌందర్య శోభితం చేసి పాఠక లోకాన్ని కవి పరవశింపజేశాడు. వస్తువు అధమమైనా, ఉత్తమమైనా, వికృతమైనా జాషువ సృజన స్పర్శతో అది లోకోత్తర రూపమై అలరారుతుంది. వస్తుతత్వంతో మమేకమయ్యే శిల్పనైపుణ్యం కారణంగా జాషువా కవిత్వంలో Aesthetic imagination దర్శనమిస్తుంది.

నీ మానసము దయారామాభివృద్ధికి అమృతంబు చిల్కు వర్షా గమంబు/ నీ చరిత్రము గాఢనిద్రా దరిద్రాణ కుతల చక్రమునకు కోడికూత’’ (ఖండకావ్యం.4) అని కవి వ్యక్తిత్వ గరిమను కొనియాడిన జాషువా ఈ రకమైన కవితా హృదయంతో, తెలుగు సాహిత్యంలో మేలుకొలుపుల గానం ఆలపించాడు.

RELATED ARTICLES

Latest Updates