- మేమూ ప్రజల్లో భాగమేనని మరిచిపోవద్దు: జాక్టో
- సీఎం వ్యాఖ్యలపై జేఏసీ వైఖరేంటో చెప్పాలి: జేఎస్‌సీ
ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరితే.. సీఎం కేసీఆర్ వారిని చులకన చేసి మాట్లాడటమేంటని ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి (జాక్టో) ప్రశ్నించింది. ఆదివారం శాసనసభలో ‘కుక్క తోకను ఊపుతుందా… తోక కుక్కను ఊపుతుందా’ అంటూ సీఎం చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. ఉద్యోగులు ప్రజల్లో భాగమేననే విషయాన్ని మరిచిపోవద్దని, ఇప్పటికైనా ప్రజాస్వామిక విధానాలతో పాలన సాగించాలని జాక్టో చైర్మన్ సదానందం గౌడ్, సెక్రటరీ జనరల్ ఇ.రఘునందన్ తదితరులు అన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు బాగా పనిచేస్తున్నారని మెచ్చుకుంటూ సీఎం మాట్లాడిన మాటలన్నీ అబద్ధమా? వాటికి విలువ లేదా? అని ప్రశ్నించారు. గతంలో ముఖ్యమంత్రులు ఉద్యోగ సంఘాలతో చర్చించేవారని, సమస్యలన్నీ వినేవారని, కానీ.. ప్రస్తుతం సీఎంను కలవడమే గగనమై పోయిందని ఆక్షేపించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల పట్ల సీఎం కేసీఆర్ ఏర్పరచుకున్న తప్పుడు అభిప్రాయాన్ని మార్చుకోవాలని తెలంగాణ అధికారులు, ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్స్, కార్మిక సంఘాల సంయుక్త పోరాట సమితి(జేఎ్‌ససీ) సూచించింది. ప్రభుత్వం తలుచుకుంటే చర్యలు తప్పవని బెదిరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు జేఎ్‌ససీ చైర్మన్ తిరువరంగం ప్రభాకర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వానికి వంతపాడుతున్న జేఏసీ నాయకత్వం.. సీఎం వ్యాఖ్యలపై తమ వైఖరేంటో చెప్పాలని డిమాండ్ చేశారు.
Courtesy AndhraJyothy..