ధరణియే పరిష్కారమా!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
  • హడావుడి ప్రారంభంతో సమస్యలు!
  • రైతుబంధు లెక్కల్లో తేడా ఉండే అవకాశం
  • రిజిస్ట్రేషన్‌పై విచారణ ఉండదు.. 
  • అర్జీకి అవకాశమూ లేదు
  • ఎంతమంది కోర్టుకెళ్లగలరన్న అభిప్రాయాలు
  • రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ 
  • అధికారం ఒక్కరికే ఇవ్వడమూ ఇబ్బందే

 హైదరాబాద్‌ : సమీకృత భూ రికార్డుల నిర్వహణ వ్యవస్థ (ధరణి) గురువారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. రైతుబంధు పథకానికి డబ్బుల పంపిణీకి ఉపయోగించిన భూ వివరాలే ఈ పోర్టల్‌లో చేరాయి. సుమారు 1.45 కోట్ల ఎకరాల భూములు ధరణిలో దర్శనమిస్తున్నాయి. భూముల క్రయ విక్రయాలకు సంబంధించిన రిజిస్ర్టేషన్‌, మ్యుటేషన్‌ కూడా వెంటనే జరిగిపోనున్నాయి. ఈ రెండూ కూడా తహసీల్దారే చేసేస్తారు. ఽఇక దరణిలోకి ఎక్కించిన భూములే ఫైనల్‌ అన్న అభిప్రాయంతో ప్రభుత్వం నవంబరు 2 నుంచి రిజిస్ర్టేషన్లకూ అనుమతి ఇచ్చింది.

అయితే.. ధరణిలో ఉన్న సమాచారం ఆధారంగా రైతుబంధు ఇచ్చాం కాబట్టి అదే ప్రామాణికం అనడం వల్ల క్షేత్రస్థాయిలో సమస్యలు రావచ్చని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  రైతుబంధు భూ వివరాల లెక్కల్లో తేడా ఉండడం ఖాయమని, సమగ్ర సర్వే తరువాతే వాస్తవ వివరాలు తెలుస్తాయని అంటున్నారు. సమగ్ర సర్వే జరగకుండా హడావుడిగా ధరణి ప్రారంభించడం వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం లేకపోలేదని పేర్కొంటున్నారు. ఇప్పటివరకూ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రిజిస్ర్టేషన్‌ జరిగినా పాస్‌బుక్‌ జారీకి తహసీల్దారు కార్యాలయానికి పంపేవారు. ఆ రిజిస్ర్టేషన్‌కు సంబంధించి గ్రామంలో వారం రోజులపాటు అభ్యంతరాల స్వీకరణను వీఆర్వో చేసేవారు. ఆ తరువాతే పాస్‌బుక్‌ జారీ అయ్యేది.

అయితే ధరణిలో రిజిస్ర్టేషన్‌, మ్యుటేషన్‌ వెంటనే జరిగిపోనున్నందున ఈ విచారణకు అవకాశం లేదు. తప్పయినా, ఒప్పయినా వెంటనే జరిగిపోతుంది. తమ భూముల్లో వ్యత్యాసం ఉన్నపుడు ఇంతకుముందు ఆర్డీవో, జాయింట్‌ కలెక్టర్ల వద్దకు వెళ్లేవారు. ఇప్పుడు ఆ అవకాశమూ లేదు. కొత్తగా ఏదైనా సమస్య వస్తే రైతు సివిల్‌ కోర్టులను ఆశ్రయించాల్సిందే. అయితే ఎంత మంది రైతులు కోర్టులకు వెళ్లగలరు? వెళ్లినా సమస్య ఎప్పటికి పరిష్కారమవుతుంది? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

ఒక్కరికి అధికారంతోనే పారదర్శకమవుతుందా?
సమగ్ర భూ సర్వే డిమాండ్‌ ఇప్పటిది కాదు. సర్వే మ్యాప్‌లూ చిరిగిపోయాయి. ఉమ్మడి రాష్ట్రంలో 2010లోనే జరిగిన ఒక సర్వేలో భూములకు సంబంధించి క్షేత్రస్థాయిలో సుమారు 70 రకాల సమస్యలను గుర్తించారు. రాష్ట్ర అవతరణ తరువాత సమగ్ర సర్వే చేయాలని తలపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది. కేంద్రం సుమారు రూ.230 కోట్లను మంజూరు కూడా చేసింది. అయితే ఇప్పటివరకూ సర్వే కొలిక్కి రాలేదు. దీనివల్ల క్షేత్రంలో ఉన్న భూ వివరాలకు, రికార్డుల్లో ఉన్నదానికి తేడా అలాగే కొనసాగుతోంది. రైతులే కాకుండా అటవీ, రెవెన్యూ వంటి శాఖల మధ్య భూ వివాదాలు ఎప్పటినుంచో ఉన్నాయి.

తాజాగా సబ్‌ రిజిస్ట్రార్‌ వద్ద ఉన్న వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ అధికారాలను ప్రభుత్వం తహసీల్దార్లకు అప్పగించింది. ఇద్దరి బదులు ఇప్పుడు ఒక్కరు అయ్యారు. దానివల్లనే అంతా పారదర్శకం అవుతుందా? రిజిస్ర్టేషన్‌, మ్యుటేషన్‌ చేసే అధికారి.. ఆమ్యామ్యా అడగరనే గ్యారంటీ ఏమిటని కొందరు అంటున్నారు. అయితే తహసీల్దార్లకు అధికారం ఇవ్వడం కొత్తేమీకాదని, రాజస్థాన్‌ వంటి రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ పద్ధతి ఉందని చెబుతున్నారు. ఇక సాంకేతికత అనేది నిరంతరం మారే ప్రక్రియ.

దీనిని ఉపయోగించుకొని చాలా రాష్ట్రాలు రెవెన్యూ రికార్డులను ఆన్‌లైన్‌ చేశాయి. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఏపీలో ‘మీ భూమి’ పద్ధతిని ప్రవేశపెట్టారు. ‘మీ భూమి’లో సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయంలో రిజిస్ర్టేషన్లు జరిగితే తహసీల్దారు కార్యాలయంలో పాస్‌బుక్‌లు ఇస్తున్నారు. ఈ రెండు కార్యాలయాలను లింక్‌ చేశారు. ధరణిలో ఒక్క తహసీల్దారుకే ఈ బాధ్యత అప్పగించారు. ఏపీలో ‘మీ భూమి’ని చూసి 2017లో రాష్ట్రంలో ‘మా భూమి’ని ప్రవేశపెట్టారన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు దాని స్థానంలోనే ధరణి వచ్చింది.

ధరణినీ మార్చాల్సి రావొచ్చు..!
భూముల సమగ్ర సర్వే జరిపినపుడు గజాలు, సెంట్లు లేదా ఎక్కడో ఓ చోట ఎకరాల్లో తేడాలు రావొచ్చు. అప్పుడు ధరణిలో వివరాలను మార్చాల్సి వస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ధరణి ప్రకారం.. ఒక రైతుకు 5 ఎకరాలు ఉండి.. అందులో 2 ఎకరాలను విక్రయిస్తే ఆ మేరకు కొన్న వ్యక్తి పేరుపై మ్యుటేషన్‌ జరిగిపోతుంది. పాస్‌బుక్‌ కూడా జారీ అవుతుంది.

అయితే 5 ఎకరాల్లో 2 ఎకరాలు ఎటువైపు ఉంది అన్నది ప్రధానం. ఇది ఉండాలంటే సరిహద్దును సూచించే మ్యాపు ఉండాలి. సరిహద్దుల నిర్దేశం తప్పనిసరి చేయాలి. లేకపోతే అమ్మిన వ్యక్తి, కొన్న వ్యక్తి మధ్య వివాదం తలెత్తే అవకాశముంటుంది. ప్రభుత్వం జారీ చేయబోయే మార్గదర్శకాల్లో ఈ విషయం వెల్లడయ్యే అవకాశముంది.

వివాదాస్పద భూములు అలానే…
2017లో భూ రికార్డుల అప్‌డేషన్‌ జరిగింది. ఎలాంటి వివాదం లేని భూముల రికార్డుల శుద్దీకరణ జరిగింది. వివాదం ఉన్న భూములు, ఆధార్‌ లేని ఎన్‌ఆర్‌ఐల భూములను పక్కన పెట్టేశారు. దీంతో ధరణిలో వ్యవసాయ భూములు కూడా పూర్తిగా చేరలేదు. వివాదాలను తేల్చి పాస్‌ పుస్తకాలు జారీ చేస్తేనే ఆ భూముల క్రయ విక్రయాలకు అవకాశం ఉంటుంది.

కానీ, ఇది ఎప్పుడనే విషయమై ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఇక ఆటోలాక్‌తో దేవాదాయ, వక్స్‌ భూములకు రక్షణ కలగనున్నా.. ఇప్పటికే ఈ భూములు చాలావరకు అన్యాక్రాంతం అయ్యాయనే ఆరోపణ ఉంది. ఈ నేపథ్యంలో దేవాదాయ, వక్ఫ్‌ వద్ద ఉన్న భూములనే ధరణిలోకి ఎక్కించడం వల్ల అన్యాక్రాంతమైన వాటిపై ఆశ వదులుకున్నట్లేనా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇదే నిజమైతే ఆక్రమణలకు చట్టబద్ధత కల్పించినట్లవుతుందనే అనుమానం వ్యక్తమవుతోంది.

Courtesy Andhrajyothi

RELATED ARTICLES

Latest Updates