
రాజకీయ పార్టీలలో అంతర్గత ప్రజాస్వామ్యం అనే భావన భారతీయ రాజకీయాలలో ఒక అతిశయోక్తిగా మాత్రమే ఉన్నది. నాయకత్వ పోటీలను, భావాల సంఘర్షణను ప్రోత్సహించేందుకు అమెరికాలో ఎలక్టోరల్ ప్రైమరీలను నిర్వహిస్తారు. మన దేశంలో నాయకత్వానికి పోటీపడడానికి బదులు ‘ప్రజాస్వామిక ఏకాభిప్రాయం’ పేరిట అధినేతను అత్యంత విధేయపూర్వకంగా అనుసరించే ధోరణి స్పష్టంగా కన్పిస్తున్నది.
ఒకసుప్రసిద్ధ ఫ్రెంచ్ నాటకంలో ఒక పాత్ర తాను మాట్లాడుతున్నది వచనంలోనేనని గ్రహించి విస్మయం చెందుతుంది. మన పురాతన రాజకీయ పక్షమైన భారత జాతీయ కాంగ్రెస్ నాయకులు ఇన్నాళ్ళకు తమ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లోపించిందని గుర్తించి అమితంగా ఆవేదన చెందారు! పూర్తిగా పేలని ‘లెటర్ బాంబ్’ ఫలితమిది. గాంధీ-–నెహ్రూల నాయకత్వమే పార్టీ ప్రాభవ ప్రాబల్యాలకు తిరుగులేని అభయమనేది కాంగ్రెస్ నేతల ప్రగాఢ విశ్వాసం. ఈ విశ్వాసమే వారికి రాజకీయ జీవితాన్ని ప్రసాదించింది. కాంగ్రెస్‌కు చెడ్డ రోజులు దాపురించిన వర్తమానంలో కూడా ఆ విశ్వాసమే, భవిష్యత్తు పట్ల వారి ఆశాభావానికి ఆలంబనగా ఉంది. ఇది ప్రజాస్వామిక వివేచన కాదు అన్నది స్పష్టం. వివేచనకు, విశ్వాసానికి పొద్దెదురు అన్న సత్యాన్ని మనం విస్మరించకపోతే ‘కుటుంబ నిర్వహణలోని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ’ అన్న ఆరోపణకు కాంగ్రెస్ తరచుగా ఎందుకు గురవుతున్నదో మనకు అర్థమవుతుంది. మన స్వాతంత్ర్యోద్యమానికి ఫలసిద్ధి సాధించిన పార్టీ కాంగ్రెస్. 51 సంవత్సరాల క్రితం ఇందిరాగాంధీ ఈ మహోన్నత రాజకీయ పక్షాన్ని చీల్చి, పార్టీ అస్తిత్వాన్ని పునర్నిర్వచించిన అనంతరం ఏడు సంవత్సరాలు మినహా అది నెహ్రూ-గాంధీ కుటుంబ నియంత్రణలోనే ఉంది.
ఈ వాస్తవం దృష్ట్యా కాంగ్రెస్ ఒక వంశపారంపర్య నాయకత్వంలోని పార్టీ లేదా ఒక కుటుంబ సంస్థ అన్న ఆరోపణ న్యాయబద్ధమైనదే. కావచ్చు కానీ, ఆ నిజం కాంగ్రెస్ పార్టీ తన ప్రధాన ప్రత్యర్థి పక్షాల కంటే తక్కువ ‘ప్రజాస్వామ్యయుత’ మైనదని సూచిస్తుందా? పూర్తిగా కాదు. ఉదాహరణకు ప్రస్తుత జాతీయ పాలకపక్షమైన భారతీయ జనతా పార్టీనే తీసుకోండి. దేశ రాజకీయాలను పునర్నిర్వచిస్తున్న పార్టీ అది. అయితే పార్టీ అధ్యక్ష పదవికిగానీ లేదా ప్రధానమంత్రి పదవికి అభ్యర్థిని ఎంపిక చేసుకోవడానికిగానీ బీజేపీ ఎప్పుడు బహిరంగ ఎన్నికను నిర్వహించింది? 2014లో రాజ్‌నాథ్‌సింగ్ తన అధ్యక్ష పదవీ కాలాన్ని పూర్తి చేసినప్పుడు అమిత్ షా పార్టీ కొత్త అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ‘ఎంపికయ్యారు’. అమిత్ షానే పార్టీ అధ్యక్షుడుగా ఎందుకు నియమిస్తున్నారని ఎవరూ ఎలాంటి ప్రశ్నలు అడగలేదు. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఆయన ఆంతరంగికుడు, విశ్వసనీయ సహాయకుడు. 2019లో అమిత్ షా, తన పొడిగించిన పదవీ కాలాన్ని కూడా పూర్తి చేసినప్పుడు ఆయన స్థానంలో పార్టీ కొత్త అధ్యక్షుడుగా జెపి నద్దాను ‘ఎంపిక’ చేశారు. అశేష ప్రజలకు ఆప్తబాంధవుడనే గౌరవంతో నద్దాను కొత్త అధ్యక్షుడుగా ఎంపిక చేయలేదు. ఆయనతో వ్యవహరించడం చాలా సుకరంగా ఉంటుంది. స్నేహ మర్యాదలు పాటించే నేత. మరీ ముఖ్యంగా సొంత ప్రజాబలంలేని నాయకుడు. పైపెచ్చు నద్దా తమకు ఎటువంటి ఆపత్కర పరిస్థితులు సృష్టించరని పార్టీ పెద్దలకు బాగా తెలుసు. ఇదే, నద్దా ఉత్థానానికి ప్రధాన కారణం.
ప్రధానమంత్రి పదవికి తమ అభ్యర్థిగా నరేంద్ర మోదీని 2013లో బీజేపీ ప్రకటించినప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగానే ఆ నిర్ణయం తీసుకున్నారా? ఎన్నిక ప్రక్రియ ద్వారానే ఆయనకు అలా పట్టం కట్టారా? కనీసం గుజరాత్ నుంచి ప్రభవించిన మోదీని దేశ అత్యున్నత పదవికి తమ అభ్యర్థిగా ప్రకటించే విషయమై పార్టీలో అన్ని స్థాయిలలోనూ సంప్రదింపులు జరిపారా? సత్యమేమిటంటే మోదీకి అత్యున్నత బాధ్యతలు అప్పగించాలనే నిర్ణయాన్ని నాగపూర్‌లోని ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయంలో తీసుకున్నారు. సంఘ్ పెద్దలు నిర్ణయం తీసుకున్న తరువాతనే 2013 సెప్టెంబర్‌లో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఆ నిర్ణయాన్ని లాంఛనంగా ప్రకటించారు. సార్వత్రక ఎన్నికలలో పార్టీ సారథ్యాన్ని మోదీకి అప్పగించడంపై బీజేపీ నేత లాల్ కృష్ణ ఆడ్వాణీ సహజంగానే అభ్యంతరం తెలిపారు. నాగపూర్ పెద్దల నిర్ణయంతో విభేదించారు. తత్ఫలితంగా ఆయనను రాజకీయ అవమానాలకు లోను చేశారు. అంతేకాదు మార్గదర్శక్ మండల్‌కు పరిమితం చేశారు. తాము ‘ఎంపిక చేసిన వ్యక్తి’ని సవాల్ చేయడాన్ని బీజేపీ సహించలేదు. ఎంపిక చేసుకున్న నేతను సర్వశక్తిమంతుడిగా చేసేందుకే బీజేపీ ప్రాధాన్యమిచ్చింది.
మోదీ ఉత్థానానికి భిన్నమైనది సోనియా గాంధీ రాజకీయ వైభవం. ఆమె నిస్సందేహంగా వంశపారంపర్య నాయకత్వ సూత్రపు లబ్ధిదారు. నెహ్రూ-–గాంధీ కుటుంబ కోడలు అయినందునే రాజకీయాలలో ఆమె ప్రవేశం అత్యున్నత స్థాయిలో జరిగింది. 1998లో ఒక ‘రక్తపాత రహిత తిరుగుబాటు’లో ఆమె కాంగ్రెస్ పార్టీ సారథ్యాన్ని సీతారాం కేసరి నుంచి స్వాయత్తం చేసుకున్నారు. అయితే ఆమె కనీసం పార్టీ అధ్యక్ష పదవీ ఎన్నికలలో పోటీ చేయడమనే ప్రజాస్వామ్య సంప్రదాయాన్ని పాటించారు. ఎఐసిసి అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికలలో సీనియర్ నాయకుడు జితేంద్ర ప్రసాద్‌ను ఆమె గణనీయమైన మెజారిటీతో ఓడించారు. సోనియా నాయకత్వాన్ని జితేంద్ర ప్రసాద సవాల్ చేసి విఫలమయ్యారు. అయినప్పటికీ ఆయన కుమారుడు జితిన్ ఆ తరువాత కాలంలో యూపీఏ ప్రభుత్వంలో మంత్రి అయ్యారు. ‘క్షమించి జరిగిందంతా మరచిపోవడమనే’ దృక్పథాన్ని సోనియా అనుసరించారు- జితేంద్రప్రసాద్ విషయంలోనే కాదు, శరద్ పవార్ వ్యవహారంలో కూడా. సోనియా విదేశీ మూలాల విషయమై కాంగ్రెస్ నుంచి నిష్క్రమించిన నాయకుడు శరద్ పవార్. అయితే అటు మహారాష్ట్రలోనూ, ఇటు కేంద్రంలోనూ ఆయన సహకారం చాలా విలువైందనే సత్యాన్ని కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ గుర్తించారు. నెహ్రూ–-గాంధీల నాయకత్వాన్ని ప్రశ్నిస్తూ పార్టీకి లేఖ రాసిన 23మంది ‘తిరుగుబాటుదారుల’పై తనకు ఎలాంటి దుర్భావం, ద్వేషం లేనేలేవని సోనియా ఇప్పటికీ చెబుతున్నారు.
కాంగ్రెస్‌తో పోలిస్తే బీజేపీలో భిన్నాభిప్రాయాలు కలిగినవారు పార్టీ వ్యవహారాలలో చురుకైన పాత్ర నిర్వహించేందుకు పెద్దగా ఆస్కారం లేదని చెప్పక తప్పదు. 1970లలో జనసంఘ్ యోధుడు బలరాజ్ మథోక్, వాజపేయి-–ఆడ్వాణీ నాయకత్వాన్ని సవాల్ చేశారు. ఈ తిరుగుబాటు కారణంగా ఆయన్ని పార్టీ నుంచి శాశ్వతంగా వెలివేశారు. హిందుత్వ సిద్ధాంతకర్త గోవిందాచార్య అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయిని ఒక ‘ముఖౌటా’ (ముసుగు)గా అభివర్ణించారు. ఇలాంటి వాక్ స్వాతంత్ర్యం తీసుకున్నందుకు గాను గోవిందాచార్యను పార్టీ పదవులన్నిటినుంచీ తొలగించారు. ఆయనకు ఎలాంటి ప్రాధాన్యమివ్వకుండా ఉపేక్షించారు. ఇప్పుడు ఆయన దాదాపుగా విస్మృతుడయ్యాడనే చెప్పవచ్చు. నరేంద్రమోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన్ని వ్యతిరేకించిన నాయకులు అందరినీ ఒక పద్ధతి ప్రకారం శంకరగిరిమాన్యాలు పట్టించారు. మోదీ వ్యతిరేకులకు ఇప్పుడు పార్టీలో దాదాపుగా ఉనికి లేదు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వ శైలిని సూటిగా, విస్పష్టంగా ప్రశ్నిస్తూ లేఖ రాసే సాహసం చేయగలవారు ఇప్పుడు బీజేపీలో ఎవరైనా ఉన్నారా? అందుకు తెగించి పార్టీలో సురక్షితంగా ఉండగలమని గుండె ధైర్యంతో చెప్పగలవారు ఎంతమంది వుంటారు? గత ఆరు సంవత్సరాలుగా బీజేపీ అంతర్గత వేదికలపై జాతీయ ప్రాధాన్యమున్న ఏ అంశంపైనన్నా ఒక్కసారైనా చర్చ జరిగిందా? నోట్ల రద్దు, జాతీయ భద్రత, ప్రధానమంత్రి కార్యాలయానికి పార్టీ దాసోహం కావడం మొదలైన అంశాలపై చర్చకు ఎవరూ చొరవ తీసుకోవడం లేదు. అలాంటి చొరవ పర్యవసానాలు ఎలావుంటాయో వారికి బాగా తెలుసు మరి.
సత్యమేమిటంటే కాంగ్రెస్ పార్టీ మరే ఇతర పార్టీ కంటే ఎక్కువగా వంశపారంపర్య నాయకత్వంలో ఉన్న లేదా ఒక కుటుంబ సంస్థగా ఉన్న పార్టీ. బహుశా, నేటి బీజేపీ కంటే మరింత ప్రజాస్వామ్యయుతమైనదని కూడా చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీలో అత్యున్నత పదవి పార్టీ ప్రథమ కుటుంబ సభ్యుడు లేదా సభ్యురాలికి మాత్రమే ప్రత్యేకించగా, సాధారణ నేపథ్యం నుంచి వచ్చినవారు పార్టీ అధ్యక్ష పదవి నధిష్టించేందుకు ఎక్కువ అవకాశాలను బీజేపీ ఇచ్చింది. అయితే ఆ పాలక పార్టీ తన రాజకీయ అధినేతను ఎట్టి పరిస్థితులలోనూ ఏ విధంగానూ ప్రశ్నించేందుకు వీలులేని విధంగా వ్యవహరిస్తోంది. మరింత ముఖ్యమైన విషయమేమిటంటే బీజేపీకి సొంత ‘పరివార్’ ఉంది. ఇందులో ఆరెస్సెస్ రాజ్యాంగేతర శక్తిగా కీలక రాజకీయ నియామకాలపై తుది నిర్ణయాన్ని ప్రభావితం చేస్తోంది. 2017లో యోగి ఆదిత్యనాథ్‌ను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి చేయాలన్న నిర్ణయాన్ని ఎన్నికైన ఎమ్మెల్యేలు లక్నోలో తీసుకున్నారా లేక నాగపూర్, ఢిల్లీలో ఆరెస్సెస్-–బీజేపీ నాయకత్వం తీసుకున్నదా?
ఇక, ప్రాంతీయ పార్టీల విషయాన్ని చూద్దాం. ఇంచుమించు ప్రతి రాష్ట్రంలోనూ ఉన్న ఈ పార్టీలు కాంగ్రెస్, బీజేపీలలోని అప్రజాస్వామిక ధోరణులను బాగా స్వాయత్తం చేసుకున్నాయి. దాదాపుగా అన్ని ప్రాంతీయ పార్టీలు కుటుంబ జాగీరులుగా సాగుతున్నాయి. పార్టీ నాయకత్వం కుటుంబ వారసులకు మాత్రమే దక్కుతోంది. అధినేత అభీష్టానికి విరుద్ధమైన అభిప్రాయాలను సహించే వాతావరణం ఏ ప్రాంతీయ పార్టీలోనూ లేదు. సంప్రదింపుల ప్రక్రియ ద్వారా నిర్ణయాలు తీసుకోవడమనేది లేనేలేదు. ఉదాహరణకు తృణమూల్ కాంగ్రెస్‌లో మమతా బెనర్జీ నాయకత్వాన్ని మృదువుగానైనా ప్రశ్నించగలవారెవరైనా ఉన్నారా? సామాజిక ఉద్యమాలు, రాజకీయ మథనాల నుంచి ఆవిర్భవించిన ప్రాంతీయ పార్టీలు సైతం కుటుంబ సంస్థలుగా పరిణమించాయి. తమిళనాడులో డిఎంకె ఇందుకొక ఉదాహరణ. విస్తృత ప్రజా ఉద్యమాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నామని చెప్పుకునే వామపక్షాలు సైతం పార్టీ అంతర్గత వేదికలపై నిష్పాక్షిక, స్వేచ్ఛాయుత చర్చలను ప్రోత్సహించేందుకు విముఖంగా ఉన్నాయి.
మరి ఈ వాస్తవాల దృష్ట్యా పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యం అనే భావన భారతీయ రాజకీయాల సందర్భంలో ఒక అతిశయోక్తిగా మాత్రమే ఉన్నది. నాయకత్వ పోటీలను, భావాల సంఘర్షణను ప్రోత్సహించేందుకు అమెరికాలో ఎలక్టోరల్ ప్రైమరీ (అభ్యర్థులను ఎంచుకునేందుకు జరిగే ప్రాథమిక ఎన్నికలు)లను నిర్వహిస్తారు. మన దేశంలో ఎటువంటి నాయకత్వ పోటీ అయినాసరే పార్టీలో మరింతగా చీలికలు సృష్టించే చిక్కులను తీసుకొస్తుందని భావించడం పరిపాటి. అలా పోటీపడడానికి బదులు ‘ప్రజాస్వామ్య ఏకాభిప్రాయం’ పేరిట అధినేతను అత్యంత విధేయపూర్వకంగా అనుసరించే ధోరణి స్పష్టంగా కన్పిస్తున్నది. 23 మంది కాంగ్రెస్ నాయకులు తమ లేఖలో ప్రస్తావించిన అంశాలపై కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానవర్గం ఏడుగంటల పాటు చర్చించి తీసుకున్న నిర్ణయం సంక్షోభాన్ని వాయిదా వేయడమే కదా. ఏ పార్టీ అయినా అంతర్గత చర్చలు, సంవాదాలకు తనకుతానుగా అవకాశం ఇవ్వడమంటూ జరిగితే అది సిడబ్ల్యుసి సమావేశం ముచ్చటకు భిన్నంగా ఉండదేమో? కొద్దినెలల అనంతరం జరిగే ప్రతిపాదిత కాంగ్రెస్ సమావేశంలో సిడబ్ల్యుసికి, పార్టీ అధ్యక్ష పదవికి కూడా ఎన్నికలు జరుగుతాయా లేదా అన్నది ఆ పార్టీ ప్రజాస్వామిక స్ఫూర్తి, నిబద్ధతకు నిజమైన పరీక్ష అవుతుంది. అటువంటి ఎన్నికలు జరగడమనేది మనం నిజంగా వేచిచూడదగ్గ విలువైన రాజకీయ సంఘటన అనడంలో సందేహం లేదు.
రాజ్‌దీప్ సర్దేశాయి (వ్యాసకర్త)