ప్రేమ పెళ్లిపై రగిలిన యువతి వర్గం
పెళ్లాడిన యువకుడి ఇల్లు ధ్వంసం
48 కుటుంబాలపై 300 మంది దాడి
పది రోజులుగా బంధువుల ఇళ్లలోనే
దళితులు, అణగారిన వర్గాల వారిపై వరుస దాడులు జరుగుతున్నాయి. డాక్టర్
సుధాకర్‌కు వేధింపులు, సస్పెన్షన్‌లో ఉన్న జడ్జి రామకృష్ణపై దాడి యత్నం, రెండు చోట్ల దళిత యువకులకు శిరోముండనాలు… ఇవన్నీ ఇలా జరుగుతుండగానే కర్నూలు జిల్లాలో దళితులపై సామూహికంగా దాడి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. కృష్ణా జిల్లాలో దళిత యువతిని ప్రేమ పేరిట వంచించి… కేసు వాపసు తీసుకోలేదనే ఆగ్రహంతో ఆమె ఇంటికి నిప్పంటించిన ఘటన చోటు చేసుకుంది.
కర్నూలు, సెప్టెంబరు : తమ కులానికి చెందిన అమ్మాయిని ఓ దళిత యువకుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడనే కోపంతో రగిలిపోయారు. దళితుల ఇళ్లపై మూకుమ్మడిగా దాడి చేశారు. దొరికిన వాళ్లను దొరికినట్లుగా కొట్టారు. దళితులంతా ప్రాణభయంతో ఊరు వదిలి పారిపోయారు. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం కృష్ణగిరి మండలం కోయికొండ గ్రామంలో జరిగిన దారుణమిది.
పదిరోజుల కిందట జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం… కోయికొండ గ్రామానికి చెందిన దళిత యువకుడు సుధాకర్, అదే గ్రామానికి చెందిన ఒక బీసీ యువతి ప్రేమించుకున్నారు. పెద్దలకు భయపడి ఆగస్టు 22న ఇంటి నుంచి వెళ్లిపోయారు. మరుసటిరోజు రాత్రి అమ్మాయి తరఫు వారు సుధాకర్ ఇంటిపై దాడి చేసి… విధ్వంసం సృష్టించారు. సామగ్రిని బయటికి విసిరేశారు. ఈ విషయం తెలుసుకున్న ప్రేమజంట మరింత భయపడింది. ఆ యువతీ యువకులు డీఎస్పీ నరసింహారెడ్డిని ఆశ్రయుంచడంతో.. ఇరువురి నుంచి వాంగ్మూలం తీసుకుని, పరిస్థితి చక్కబడే వరకు జాగ్రత్తగా ఉండాలని సూచించి పంపించారు. అనంతరం ప్రేమికులిద్దరూ వివాహం చేసుకున్నారు.
ఈ విషయం తెలియడంతో అమ్మాయి తరఫు వారిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. సుమారు 300 మంది దళితవాడపై దండెత్తారు. మొత్తం 48 దళిత కుటుంబాలు ఉండగా… ఈ దాడిలొ పది కుటుంబాలకు చెందిన 23 మంది గాయాలపాలయ్యారు. దాడులు తీవ్రం కావడంతో… దళితులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయారు. కొందరు ఇళ్లకు తాళాలు కూడా వేయకుండా పారిపోయారు. వాటి తలుపులకు దాడికి దిగిన వారే తాళాలు వేసి… తాళం చెవులు తమ వద్దే పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇళ్లూ వాకిలి వదిలిపెట్టి పోయిన దళితులు ఇతర గ్రామాల్లోని సమీప బంధువులు, స్నేహితుల వద్ద తలదాచుకుంటున్నారు.

మంగళవారం బాధితులు కలెక్టరేట్ ముందు నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకోకుండా వెళ్లిపోతున్న కలెక్టర్‌ను అడ్డగించారు. దీంతో బాధితులను తన చాంబర్లోకి పిలిపించుకున్న కలెక్టర్ వినతి పత్రాలు స్వీకరించి, న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అయితే… బుధవారం సాయంత్రం దాకా బాధితులు తమ ఇళ్లకు చేరలేదు. గ్రామంలో పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. ‘‘‘దాడి గురించి తెలిసిన మరుసటి రోజే ఘటనకు కారకులైన ఐదుగురు వ్యక్తులపై కేసు ఫైల్ చేశాం. వారిని రిమాండ్‌కు తరలించాం. ఆ తర్వాత మరో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నాం’’ అని ఎస్పీ ఫక్కీరప్ప చెప్పారు.
Courtesy Andhrajyothi