భారీగా పెరిగిన రైతు బీమా ప్రీమియం

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email
  • గత ఏడాది రూ.2,271, ఇప్పుడు రూ.3,555..
  • రూ.1,284.44 పెంచిన జీవిత బీమా సంస్థ
  • ప్రీమియం మొత్తం రూ.1100 కోట్లు
  • ప్రభుత్వంపై 400 కోట్ల అదనపు భారం
  • 13తో ముగియనున్న గడువు
  • మరో ఏడాది పథకం పొడిగింపు

రైతు బీమా పథకాన్ని మరో ఏడాది పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అకాల మరణం చెందిన రైతుల కుటుంబాలకు ఆర్థికంగా చేయూతనివ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం గత ఏడాది ఈ పథకం ప్రారంభించింది. 2018 ఆగస్టు 14 నుంచి ప్రారంభమైన పథకం ఈ నెల 13వ తేదీతో ముగియనుంది. ఈ నెల 14 నుంచి 2020 ఆగస్టు 13 నాటికి పథకాన్ని రెన్యువల్‌ చేస్తూ వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి జీవో ఎంఎస్‌ నెంబర్‌- 22 ను విడుదల చేశారు. ఈ పథకంలో 30,94,656 మంది రైతులను పాలసీదారులుగా ప్రభుత్వం చేర్చనుంది. ఏ కారణంతో రైతు మృతిచెందినా రూ.5 లక్షల పరిహారం చెల్లిస్తారు. రైతు బీమా పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎల్‌ఐసీతో ఒప్పందం చేసుకుంది. 2018-19కి ప్రతి రైతుకు రూ.2,271 చొప్పున ప్రభుత్వమే ప్రీమియం చెల్లించింది. ఇప్పటి వరకు 30,94,656 మంది రైతులు పథకంలో చేరగా రూ.704.16 కోట్ల ప్రీమియం కట్టింది.

ఏడాది కాలంలో 15,027 మంది రైతులు మరణించగా వారి కుటుంబాలకు రూ.751.35 కోట్ల పరిహారాన్ని ఎల్‌ఐసీ చెల్లించింది. ఈ ఏడాది రైతు బీమా ప్రీమియం రూ.3,555.94 పైసలకు పెరిగింది. గత ఏడాది కంటే రూ.1,284.44 పైసలు ఎక్కువ. ఈ లెక్కన ఈ ఏడాది రూ.1,100.45 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. గత ఏడాది కంటే మరో రూ.400 కోట్లు అదనపు భారం పడుతుండటం గమనార్హం. ఒక్కో రైతుకు రూ.3,013.50 ప్రీమియం కాగా, సెంట్రల్‌ జీఎస్టీ (9శాతం) రూ.271.22, స్టేట్‌ జీఎస్టీ (9శాతం) రూ.271.22 అదనంగా చెల్లించాల్సి వస్తోంది. దీంతో పాటు స్టాంపు డ్యూటీ పేరుతో రూ.30.94 కోట్లు చెల్లించేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. ప్రీమియంను గణనీయంగా పెంచడానికి క్లెయిమ్‌ల శాతం ఎక్కువగా ఉండటమే కారణమని ఎల్‌ఐసీ చెబుతోంది. లాభం లేకున్నా నష్టాన్ని భరించలేమని ప్రభుత్వానికి తెలిపింది. దీంతో ప్రీమియం పెంచక తప్పలేదు.

Courtesy eenadu

RELATED ARTICLES

Latest Updates