విధానాల లోపం.. రైతులకు కష్టం..

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

– మార్కెట్‌ నిబంధనలతో 17 ఏండ్లలో రూ. 45 లక్షల కోట్లు నష్టం
– గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ వ్యవసాయంపైనే ఆధారం
– కానీ తగ్గుతున్న జాతీయాదాయం వాటా
– సాగు నిధుల దారి మళ్లింపు.. పెట్టుబడులపై నిరాసక్తి
– కార్పొరేట్ల సేవలో తరిస్తున్న ప్రభుత్వాలు

న్యూఢిల్లీ : వ్యవసాయాధారిత దేశమైన భారత్‌లో గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ సాగు రంగమే కీలకం. కానీ నానాటికీ కుదేలవుతున్న ఈ రంగాన్ని ఆదుకునేందుకు గానీ, ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతులను రుణాల ఊబిలోంచి గట్టెక్కించేందుకు గానీ ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడం లేదు. దీంతో గడిచిన 17 ఏండ్లలో కేంద్ర, రాష్ట్రాల్లోని వివిధ ప్రభుత్వాలు అనుసరించిన రైతు వ్యతిరేక విధానాల ఫలితంగా.. రైతులు సుమారు రూ. 45 లక్షల కోట్ల ఆదాయాన్ని కోల్పోయారని నివేదికలు వెల్లడిస్తున్నాయి. మార్కెట్‌ నిబంధ నలు, వర్తక, వాణిజ్య విధానాల కారణంగా పండించిన పంటలకు గిట్టుబాటు ధర దక్కక రైతులు ఏటా రూ. 2.5 లక్షల కోట్లను కోల్పోతున్నారని ఆర్గనైజేషన్‌ ఫర్‌ ఎకనామిక్‌ కోఆపరేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌, ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఆన్‌ ఇంటర్నేషనల్‌ ఎకనామిక్‌ రిలేషన్స్‌ (ఓఈసీడీ-ఐసీఆర్‌ఐఈఆర్‌) అధ్య యనం వెలువరించింది.
మోడీ సర్కారు అనాలోచిత ఆర్థిక నిర్ణయాలతో దేశ ఆర్థిక వ్యవస్థ మందగిస్తున్న తరుణంలో.. ఆర్థిక రంగం గడ్డు పరిస్థితులనెదుర్కొంటున్నది. దీని నుంచి గట్టెక్కించడానికి మోడీ సర్కారు కార్పొరేట్ల సేవలో తరిస్తున్నదే తప్ప సామాన్య జనాలకు ఉపశమనం కలిగించడం లేదు. వారికే తాయిలాలు ప్రకటిస్తూ, బ్యాంకుల్లో రుణాలు ఇప్పించేందుకు గానూ వాటి విలీనీకరణ చేస్తూ, కార్పొరేట్‌ ట్యాక్స్‌ను తగ్గిస్తూ, ప్రభుత్వ సంస్థలను వారికి గంపగుత్తగా దారాదత్తం చేస్తుందే తప్ప గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న వ్యవసాయ రంగాన్ని మాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతు న్నాయి.
ప్రపంచ ఆహార, ఆరోగ్య సంస్థ (ఎఫ్‌ ఏఓ) నివేదిక ప్ర కారం.. భారత్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో 70 శాతం మంది వ్యవ సాయం మీదే ఆధారపడి బతుకుతున్నారు. 2017-18 లో కేంద్ర ఆర్థిక సర్వే ప్రకారం.. భారత్‌లోని శ్రామికుల్లో 49 శాతం ఈ రంగం నుంచే ఉన్నారు. కానీ జాతీ యాదాయంలో మాత్రం వ్యవసాయ రంగం వాటా క్రమంగా తగ్గుతూ వస్తుండటం ఆందోళన కలిగిస్తున్నదని నివేదికలు చెబుతున్నాయి. దేశంలోని ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న వ్యవసాయ రంగంలో జాతీయాదాయం వాటా.. 2005లో 22.6 శాతం ఉండగా ఈ ఏడాదిలో అది 14.4 శాతానికి పడిపోవడం గమనార్హం. అంతేగాక దేశ సగటు వృద్ధిరేటు (జీవీఏ)లోనూ వ్యవసాయ సాధారణ సగటు వృద్ధిరేటు తగ్గుముఖం పడుతున్నది.

ఆదాయం ఎందుకు తగ్గుతున్నది..?
ఓఈసీడీ-ఐసీఆర్‌ఐఈఆర్‌ సహా వ్యవస్థాపకుడు ప్రొఫెసర్‌ అశోక్‌ గులాటి ప్రకారం.. పదిహేడేండ్లుగా ఆయా ప్రభుత్వాలు అవలంభిస్తున్న విధా నాల ఫలితంగా రైతులు ఏటా రూ. 2.5 లక్షల (మొత్తం రూ. 45 లక్షల కోట్లు) కోట్లను కోల్పోతున్నారు. భారత్‌ లోని మార్కెట్‌ నిబంధనలు, నిర్బంధమైన వర్తక, వాణిజ్య పాలసీల కారణంగా రైతుల ఆదాయం తగ్గుతున్నది. ఇందుకోసం ఎసెన్షియల్‌ కమొడిటీస్‌ యాక్ట్‌ (ఏసీఏ) నిబంధనలు, అగ్రికల్చరల్‌ ప్రొడ్యూస్‌ మార్కెటింగ్‌ కమిటీస్‌ (ఏపీఎంసీ)లు విధిస్తున్న కఠిన నిబంధనల ఫలితంగానే రైతులు నష్టాపోతున్నారని ఆయన చెప్పారు.

తగ్గుతున్న పెట్టుబడులు
గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్న సాగురంగాన్ని మరింత పటిష్టం చేయాల్సిన ప్రభుత్వాలు.. దానిని నిర్వీర్యం చేయడానికే విధానాలు . ఈ రంగంలో పెట్టుబడులు పెంచాల్సింది పోయి ఉన్న భూములను సైతం సెజ్‌లు, పారిశ్రామికాభివృద్ధి, కార్పొరేట్‌ వ్యవసాయం పేరిట ప్రయివేటు వ్యక్తులకు దారాదత్త చేస్తున్నాయి. దీంతో ఈ రంగంలో పెట్టుబడులను క్రమంగా తగ్తిస్తున్నవి. 2012-17 ఆర్థిక సంవత్సరాల మధ్య జీడీపీలో దీని వాటా 0.3 శాతం నుంచి 0.4 శాతం మధ్యే ఉండగా.. ప్రయివేటు రంగ పెట్టుబడులు 2.7 శాతం నుంచి 1.8 శాతానికి పడిపోవడం గమనార్హం. ఈ ప్రభావం జీడీపీలో వ్యవసాయరంగ వృద్ధిపైనా పడుతున్నదని నివేదికలు వెల్లడిస్తున్నాయి.

నిధుల దారి మళ్లింపు
ఈ నెలలో ఆర్బీఐ విడుదల చేసిన ఇంట ర్నల్‌ వర్కింగ్‌ గ్రూప్‌ టు రివ్యూ అగ్రికల్చరల్‌ క్రెడిట్‌ నివేదిక ప్రకారం.. వ్యవసాయరంగానికి కేటాయించిన నిధులను కొన్ని రాష్ట్రాలు దారి మళ్లిస్తు న్నాయని తెలుస్తున్నది. రాష్ట్రాల వ్యవసాయ జీడీపీ కంటే ఎక్కువ రుణాలను పొందుతున్న పలు రాష్ట్రాలు.. వాటిని ఇతర రంగాలకు వాడుకుంటున్నాయని ఆ నివేదిక నొక్కి చెప్పింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌ (7.5 రెట్లు అధికం), గోవా (5 రెట్లు), తెలంగాణ, తమిళనాడు, ఉత్తరాఖండ్‌ (4 రెట్లు) వంటి రాష్ట్రాలున్నాయి.

నేరుగా రైతుల ఖాతాల్లోకి మళ్లిస్తేనే…!
పెట్టుబడి ఖర్చుల నుంచి రైతులను గట్టెక్కించాలంటే వాటిని నేరుగా వారికే అందించాలని వ్యవసాయరంగ నిపుణులు సూచిస్తున్నారు. తెలంగాణలో ఈ పథకం ప్రారంభించిన తర్వాత గతేడాది ఎన్నికల ముందు కేంద్రంలోని మోడీ సర్కారు సైతం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. కానీ విడతల వారీగా రూ. 2 వేలతో అవి రైతుల అవసరాలను ఏమాత్రం తీర్చడం లేదని వారు ఆరోపిస్తున్నారు. విత్తనాలు, ఎరువులు, సాగు ఖర్చు పెరిగిన నేపథ్యంలో కేంద్రం ఇచ్చే సాయం ఎంతమాత్రమూ సరిపోదని వారు చెబుతున్నారు. దీంతోపాటు రైతులకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)ను అందించడం, ఉపాధి హామీ నిధులను పెంచడం వంటి వాటి ద్వారా వారి ఆదాయాన్ని పెంచే నిర్ణయాలు తీసుకోవాలని వ్యవసాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

 

RELATED ARTICLES

Latest Updates