మరో ఆరుగురు నిందితులు కూడా
- 11 వరకు జ్యుడీషియల్ రిమాండ్
- కుంభకోణంలో ఐఏఎస్ పాత్ర?
- పాత ఇండెంట్లకు కలర్ జిరాక్సు
- అంకెలు పెంచి కొత్త ఇండెంట్లు
- సీడీఎస్‌లో రికార్డుల తారుమారు
- నాయిని అల్లుడి పైనా ఆరోపణలు
- ఖండించిన అల్లుడు శ్రీనివాసరెడ్డి
ఈఎ్‌సఐ మందుల కొనుగోళ్ల గోల్‌మాల్ కేసులో బీమా వైద్య సేవా(ఐఎంఎస్) డైరెక్టర్ డాక్టర్ సీహెచ్ దేవికారాణిని అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఆమెతో పాటు ఈ కేసుతో ప్రమేయం ఉన్న జాయింట్ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ సహా మొత్తం ఏడుగురిని అరెస్ట్ చేశారు. మందుల కొనుగోళ్లలో అక్రమాలపై ఏసీబీ అధికారులు గురువారం రోజంతా డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్లతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు వ్యక్తులకు సంబంధించి 23 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. శుక్రవారం ఉదయం నిందితులను అరెస్టు చేసి, ఏసీబీ ప్రత్యేక కోర్టులో వారిని హాజరు పరిచారు. న్యాయస్థానం వారికి అక్టోబరు 11 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. నిందితుల్ని చంచల్‌గూడ జైలుకు తరలించారు. వీరందర్నీ కోర్టు అనుమతితో వచ్చేవారం కస్టడీకి తీసుకుని, విచారించేందుకు అధికారులు సన్నద్ధ మవుతున్నారు. స్వాధీనం చేసుకున్న పత్రాలను విశ్లేషిస్తున్నారు.
పత్రాల పరిశీలనలో మరి కొంతమంది అధికారుల పేర్లు బహిర్గతమయ్యే అవకాశం ఉంది. అవసరం లేని మందులు కొనుగోలు చేశారు. ఈఎ్‌సఐ కోసం ప్రత్యేకంగా నాట్ ఫర్ సేల్ మందులనే వాడాలి. ఇష్టానుసారంగా కొనుగోలు చేసి సరఫరా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. వాటిని విశ్లేషిస్తున్నాం అని ఈ కేసులో కీలక అధికారి ఒకరు వెల్లడించారు. నిందితుల ఆస్తులను నిగ్గు తేలేందుకు మరో వారం రోజులు పట్టే అవకాశం ఉంది. ఈ కుంభకోణంలో వందల కోట్ల అవినీతి జరిగిందన్న ఆరోపణలు వచ్చాయి. గురువారం మొదటి రోజు తనిఖీల తర్వాత రూ.10 కోట్ల వరకు అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. అవినీతి నిరోధక చట్టం కింద కేసు పెట్టారు. అరెస్టయిన ఏడుగురిలో ఐఎంఎస్ డైరెక్టర్ డాక్టర్ దేవికారాణి, వరంగల్‌కు చెందిన జేడీ ఐఎంఎస్ డాక్టర్ కె.పద్మ, స్టోర్స్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ కె.వసంత ఇందిర, శంషాబాద్ ఈఎ్‌సఐ డిస్పెన్సరీ గ్రేడ్-2 ఫార్మాసిస్ట్ ఎం.రాధిక, ఒమిని మెడి ప్రతినిధి సీహెచ్ శివనాగరాజు, ఆర్‌ఎ్‌ఫడీడీ సెక్షన్ సీనియర్ అసిస్టెంట్ వి.హర్షవర్ధన్, ఓమిని మెడి సంస్థ ఎండీ కె.శ్రీహరి బాబు అలియాస్ కె.బాబ్జీ ఉన్నారు. ఏసీబీ వీరి అక్రమాలకు సంబంధించి మొత్తం వివరాల్ని 44 పేజీల రిమాం డ్ రిపోర్టులో పూసగుచ్చింది. మేడ్చల్ జాయింట్ డైరెక్టర్ కార్యాలయంలో ఎలాంటి స్టాక్ లేదని విచారణలో తేలింది. పటాన్‌చెరువు, బోరబండ డిస్పెన్సరీలకు మేడ్చల్ జేడీ కార్యాలయం నుంచి ఎలాంటి మందులు సరఫరా చేయలేదు.
నకిలీ ఇండెంట్లను సృష్టించి, రికార్డులు పక్కాగా నిర్వహించారు. మేడ్చల్ నుంచి పటాన్‌చెరువు, బోరబండకు మందులు సరఫరా చేసినట్లు రికార్డుల్లో పొందుపర్చారు. పాత ఇండెంట్లను కలర్ జిరాక్స్ తీసి అందులో ఉన్న మందులు, అంకెల్ని మార్చి ఫోర్జరీ ద్వారా కొత్త ఇండెంట్లుగా చూపించారు. వెయ్యి మందు గోలీలు అవసరమని ఇండెంట్ వస్తే దాన్ని 80 వేలుగా మార్చివేశారు. వందల కోట్ల కుంభకోణంలో సీనియర్ ఐఏఎస్ చక్రం తిప్పినట్లు కార్మిక శాఖ కార్మికుల యూనియన్ ఆరోపిస్తోంది. అధికారిపై ఆరోపణలకు తగ్గ ఆధారాలు ఉన్నట్లు వెల్లడించారు. ఈఎ్‌సఐ కుంభకోణం విలువ రూ.300 కోట్లని చెబుతున్నారు. ఐఏఎస్, దేవికారాణి, నాగలక్ష్మి ముగ్గురూ కలిసి 20 జూలై 2019న సాయంత్రం 6-9 మధ్యప్రాంతంలో సనత్‌నగర్‌లోని సెంట్రల్ డ్రగ్స్ స్టోర్స్(సీడీఎస్) సెక్షన్‌కు వెళ్లి రికార్డుల ట్యాంపరింగ్‌కు పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. సీసీటీవిలో మొత్తం రికార్డు అయ్యాయని, సెక్యూరిటీ సిబ్బందిని విచారించిన వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. కొన్ని సంవత్సరాలుగా గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతున్న మందుల కొనుగోలు గోల్‌మాల్ వ్యవహారం వాటాల విషయంలో తలెత్తిన వివాదాల కారణంగానే బయటకు పొక్కినట్లు సమాచారం. డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్ మనస్పర్థల కారణంగానే ఈవిషయం బయటపడిందని తెలిసింది.
నాయిని అల్లుడి పేరు… ఖండించిన కుటుంబం…ఈఎ్‌సఐసీ మందుల కుంభకోణంలో మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాసరెడ్డి పేరు, మంత్రి కార్యాలయంలో అధికారులుగా పనిచేసిన వారి మరికొందరి పేర్లు వినిపిస్తున్నాయి. రాజకీయ పార్టీలు, మాజీ అధికారుల పాత్ర కూడా ఉన్నదని, దీనిపై సమగ్ర విచారణ అవసరమని అంటున్నారు. తనపై ఆరోపణలను రాంనగర్ డివిజన్ కార్పొరేటర్, మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అల్లుడు వి.శ్రీనివా్‌సరెడ్డి ఖండించారు. నాయినిమంత్రిగా కొనసాగిన సమయంలో ఈఎ్‌సఐ మందుల కొనుగోలు ఆర్డర్ ఇప్పినట్లు వచ్చిన ఆరోపణలు అవాస్తవమన్నారు. తాను ఈఎ్‌సఐ కంపెనీ కార్మిక సంఘం అధ్యక్షుడిగా పని చేయలేదని చెప్పారు. తన పాత్ర ఉందని తేలితే తాను ఏ శిక్షకైనా సిద్ధమని సవాల్ విసిరారు, కొంత మంది వ్యక్తులు కావాలనే తనపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కుంభకోణంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎం.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. రూ.11 కోట్లు మాత్రమే అక్రమాలు జరిగినట్లు పేర్కొనడం తప్పని, రూ.800 కోట్ల విలువ మందులు, చికిత్స సామగ్రి కొనుగోలు చేశారని చెప్పారు. మందులను సరఫరా చేసేందుకు కొన్ని ఏజెన్సీలు పుట్టుకొచ్చాయని ఆరోపించారు.
పోలీసుల అత్యుత్సాహం…ఉస్మానియా ఆసుపత్రిదగ్గర పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. అత్యవసర విభాగం తలుపులను మూసివేసి నిందితులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. 45 నిమిషాల పాటు కాజువాల్టీ తలుపులను మూసివేయడంతో అప్పుడే వచ్చిన రోగులకు ఏంజరుగుతుందో అర్థంకాలేదు. కాజువాల్టీలో విద్యుత్ సరఫరా నిలిచిపోయినప్పటికీ తలుపులు తెరువలేదు. విధులలో ఉన్న ఆర్‌ఎంవోను తీసుకువెళ్లి నిందితులకు సకల మర్యాదలతో వైద్య పరీక్షలు నిర్వహించడాన్ని తోటి రోగులు తప్పుపట్టారు.
Courtesy Andhrajyothi