హౌడీ మోడీ’ అసలు రహస్యం..!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

* దెబ్బతిన్న మోడీ
* ఇమేజ్‌ను పెంచుకునే ప్రయత్నం
* ప్రవాస భారతీయుల ఓట్ల కోసం ట్రంప్‌
* పెద్దగా లేని దౌత్యపరమైన ప్రయోజనాలు

న్యూఢిల్లీ : అమెరికాలోని హూస్టన్‌ నగరంలో ఆదివారం ‘హౌడీ మోడీ’ కార్యక్రమం జరిగింది. ఈకార్యక్రమానికి అటు అమెరికా, ఇటు భారత్‌లోనే కాక అంతర్జాతీయంగా కూడా పెద్ద ఎత్తున ప్రచారం ఇచ్చారు. చాలా హడావిడిని సృష్టించారు. మీడియా కూడా గత కొద్ది రోజుల నుండి ఈ కార్యక్రమం గురించే మాట్లాడుతోంది. ప్రధాని మోడీ దాదాపు రెండు సంవత్సరాల తరువాత అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని టెక్సాస్‌ రాష్ట్రంలో నివసిస్తున్న ప్రవాస భారతీయులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కూడా హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమం వలన దేశానికి అటు వాణిజ్యపరంగా, ఇటు దౌత్యపరంగా ఏం ప్రయోజ నం కలుగుతుందనే దానిపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. జమ్ముకాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370ని రద్దు చేయడం ద్వారా బిజెపి సర్కార్‌ తీరుపై అనేక విమర్శలు వస్తున్నాయి. రాజ్యాంగ ప్రసాదించిన హక్కులను కాలరాయడంపై మేధావులు, విశ్లేషకులు మండిపడుతున్నారు. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వలన ప్రస్తుతం దేశంలో ఆర్థిక మాంద్యం తీవ్రంగా ఉంది. ప్రజల కొనుగోలు శక్తి పడిపోయి డిమాండ్‌ తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో ఈ రెండు సందర్భాల వలన మోడీ ఇమేజ్‌పై దెబ్బ పడింది. ఈ నేపథ్యంలో వీటి నుంచి దేశంతో పాటు అంతర్జాతీయంగా జరుగుతున్న చర్చను పక్కదారి పట్టించేందుకు మోడీ ఈ కార్యక్రమాన్ని ఉపయోగించు కున్నారు. పెద్దయెత్తున హంగామాగా ఈ హౌడీ మోడీ కార్యక్రమాన్ని నిర్వహించ డం ద్వారా మీడియా, ప్రజల దృష్టిని కాశ్మీర్‌, మాంద్యం అంశాలపై నుంచి మళ్లించేందుకు ప్రయత్నించారు. దీంతో పాటు ఇది వరకు భారత ప్రధానులెవ్వరూ అమెరికా అధ్యక్షుడితో కలిసి బహిరంగ సమావేశంలో పాల్గొనలేదు. మొదటిసారిగా ట్రంప్‌తో కలిసి మోడీ పాల్గొంటున్న ఈ సమావేశం ద్వారా తన ఇమేజ్‌ను తిరిగి పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారనే వాదన వినిపిస్తోంది.

ఎన్నికల్లో లబ్ధి కోసం ట్రంప్‌
ఇకపోతే ట్రంప్‌ అంశాన్ని పరిశీలిస్తే.. వచ్చే ఏడాదిలో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌కు ఎదురీత తప్పదని పలు నివేదికలు చెబుతున్నాయి. ఇప్పటికే డెమొక్రటిక్‌ పార్టీకి చెందిన జోరు బిడెన్‌ 2020 ఎన్నికలకు సంబంధించి ముందంజలో ఉన్నారని, ప్రస్తుతం ఆయనకు రెండంకెల ఓట్ల శాతం ఆధిక్యం ఉందని పామర్‌ నివేదిక పేర్కొంది. టెక్సాస్‌ నగరంలో ప్రవాస భారతీయులు అధిక సంఖ్యలో ఉంటారు. గత ఎన్నికల్లో టెక్సాస్‌ రాష్ట్రంలో ట్రంప్‌కు చెందిన రిపబ్లికన్‌ పార్టీ 9 శాతం మెజార్టీ సాధించింది. అయితే గత మూడు సంవత్సరాలుగా ట్రంప్‌ అనుసరిస్తున్న నిరంకుశ విధానాల వలన ఆయనపై ఈ ప్రాంతంలో కూడా వ్యతిరేకత పెరిగింది. గత కొన్నేళ్లుగా ఈ రాష్ట్రంలో భౌగోళిక పరిస్థితులు మారాయి. ఇక్కడి వలస వచ్చి చేరుతున్న వాళ్లలో అత్యధికులు ఆసియా అమెరికన్లు ఇంకా ముఖ్యంగా భారతీయులు ఉన్నారు. సాధారణంగా ప్రవాసభారతీయులు డెమోక్రాట్లకు మద్దతుగా ఉంటారు. ఈ నేపధ్యంలో టెక్సాస్‌ రాష్ట్రంలో తన కాళ్ల కిందకు నీళ్లు వస్తున్నాయని గమనించిన ట్రంప్‌ రానున్న ఎన్నికల్లో మోడీని వినియోగించుకొని ప్రవాస భారతీయుల ఓట్లను పొందే వ్యూహంలో ఉన్నారని సమాచారం. అందుకే ఆయన ఈ కార్యక్రమానికి వస్తున్నా రని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

ట్రంప్‌ ఈ సమాy దేశానికి హాజరుకావడం ద్వారా కాశ్మీర్‌ అంశంపై తమకు అమెరికా మద్దతు ఉందని చెప్పుకునేందుకు మోడీ ప్రచారం చేసుకునే అవకాశం కూడా ఉంది. కానీ, ట్రంప్‌ గత వ్యవహార శైలిని పరిశీలిస్తే ఆయన సందర్భాను సారంగా వ్యవహరిస్తారనే అంశం స్పష్టమౌతోంది. ఇంతకు ముందు సౌదీ అరేబియా రాజుతో సఖ్యతగా మెలిగిన ఇటీవల ఆ దేశానికి చెందిన చమురు కేంద్రాలపై దాడులు జరిగితే తగిన విధంగా స్పందించలేదు. అది వారి అంతర్గత విషమయని, తాము జోక్యం చేసుకోవాలంటే తమకు కొంత నజరానా చెల్లించాల్సి ఉంటుందని సెలవిచ్చారు. దీంతో పాటు ఇప్పటివరకూ ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజిమెన్‌ నేతన్యాహూతో చెట్టపట్టాలు వేసుకొని తిరిగిన ట్రంప్‌ సరిగ్గా అక్కడ ఎన్నికలు జరిగే నాటికి హ్యాండ్‌ ఇచ్చారు.

ఇలా గత అనుభవాలను పరిశీలిస్తే ట్రంప్‌ అనే వ్యక్తి అంత నమ్మదగిన స్నేహితుడిగా కనిపించడం లేదు. దీనికితోడు గత అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్‌ అభ్యర్ధి హిల్లరీ క్లింటన్‌కు మోడీ సర్కార్‌ మద్దతు ఇచ్చింది. అయితే అప్పుడు ట్రంప్‌ విజయం సాధించారు. రానున్న ఎన్నికల్లో ట్రంప్‌కు ఎదురీత తప్పదని ఇప్పటికే పలు సర్వేలు ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్‌కు మద్దతుగా వ్యవహరించడం భారత్‌కు దౌత్యపరంగా ఎంతవరకూ లాభం అనే అంశంపై మోడీ సర్కార్‌ అలోచించిందా అనే ప్రశ్న తలెత్తుతోంది.

Courtesy Prajasakthi…

RELATED ARTICLES

Latest Updates