తెలంగాణలో వర్ధిల్లిన సంప్రదాయ విరుద్ధ చింతనాధోరణులు, లౌకిక వ్యవస్థలే ఆ ప్రాంత విశిష్టతను సమున్నతంగా నిలబెట్టాయని చరిత్ర మనకు స్పష్టం చేస్తోంది. ఆ విశిష్ట వారసత్వం వల్లే ఉత్తర భారతావని సామ్రాజ్యవాద, అణచివేత రాజకీయాలకు తెలంగాణ ఎదురొడ్డి నిలిచింది. ఆ వారసత్వాన్ని విస్మరించినా, త్యజించినా తెలంగాణ తన విశిష్టతను కోల్పోతుంది.
ఈఏడాది సార్వత్రక ఎన్నికల అనంతరం భారతీయ జనతా పార్టీ, దాని మాతృసంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తెలంగాణపై దృష్టి సారించాయి. సమీప భవిష్యత్తులో, కాకుంటే తదుపరి అసెంబ్లీ ఎన్నికల నాటికైనా గోల్కొండలో బీజేపీ పాగా వేయనున్నదనే ప్రచారం జోరుగా సాగుతోంది. తెలంగాణ జనాభాలో ముస్లింలు అత్యధిక సంఖ్యలో ఉన్నారు గనుక మత ప్రాతిపదికన ఓటర్లలో సునాయాసంగా చీలికలు తీసుకురావచ్చని బీజేపీ భావిస్తున్నట్టుగా వున్నది. అలా అయితే గత ఎన్నికలలో కేరళ అనుభవాల నుంచి ఆ పార్టీ ఎటువంటి పాఠాలు నేర్చుకోలేదని చెప్పాలి.
ముస్లిం, క్రైస్తవ జనాభా గణనీయంగా ఉండడంతో పాటు వామపక్ష రాజకీయ సంప్రదాయం బలంగా ఉన్న రాష్ట్రం కేరళ. తెలంగాణ సమాజంలో సైతం మైనారిటీ మతస్థులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. సాయుధ రైతాంగ పోరాట కాలం నుంచీ వామపక్ష రాజకీయాల ప్రభావం అమితంగా ఉన్న ప్రాంతమిది. కనుక తెలంగాణలో కూడా బీజేపీకి కేరళ అనుభవమే పునరావృతమయ్యే అవకాశం ఎంతైనా వున్నది. మరో ముఖ్యమైన వాస్తవమేమిటంటే తెలంగాణకు, నాగరికత తొలి దినాల నుంచి ఒక భిన్నమైన చారిత్రక సంప్రదాయం వున్నది. లౌకిక, హేతుబద్ధ నాగరికతా సంప్రదాయాలు ఈ గడ్డపై వర్థిల్లాయి. ఈ విశిష్ట వారసత్వం వల్లే ఉత్తర భారతావని సాంస్కృతిక ఆధిపత్యాన్ని, రాజకీయ సామ్రాజ్యవాదాన్ని తెలంగాణ వ్యతిరేకించింది. తెలంగాణ కు ప్రత్యేకమైన రాజకీయ వ్యవస్థల మూలాలు స్వయం నిర్ణయాధికారం, సామ్రాజ్యవాదేతర విలువలలో ఉన్నాయి.
దక్కన్ పీఠభూమికి ఉత్తర భారతావని సామ్రాజ్యవాదం మౌర్యుల కాలంలో వచ్చింది. శాతవాహనులకు పూర్వం దక్కన్ ప్రాంతంలో మౌర్య సామ్రాజ్యం విస్తరిల్లింది. దక్కన్‌ను మౌర్యులు నేరుగా పరిపాలించారా లేక పాలనాధికారాలను స్థానిక సామంతులకు వదిలేసి కేవలం లాంఛన ప్రాయమైన ఆధిపత్యాన్ని మాత్రమే చెలాయించారా అన్నది స్పష్టంగా తెలియదు. గుప్త చక్రవర్తులు సైతం దక్కన్ రాజ్యాలను జయించారు గానీ వాటిని తమ సామ్రాజ్యంలో కలుపుకోలేదు. ప్రతీకాత్మక ఆధిపత్యంతో వారు తృప్తిపడ్డారు. దక్కన్లో తమ సామ్రాజ్యాలను సుస్థిరంగా విస్తరింపచేయడంలో ఢిల్లీ సుల్తాన్లు, మొగల్ చక్రవర్తులు కూడా విఫలమయ్యారు. అలాగే రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం కూడా తన పరిధిలోకి దక్కన్‌ను, ముఖ్యంగా తెలంగాణను పూర్తిగా తీసుకోలేక పోయింది.
ఈ సుదీర్ఘ చరిత్రను నిశితంగా పరిశీలిస్తే తెలంగాణ మొదటి నుంచీ రాజకీయ చైతన్యం పరిపూర్ణంగా ఉన్న ప్రాంతమని మనకు అర్థమవుతుంది. శాతవాహనుల నుంచి అసఫ్ జాహీల దాకా దక్కన్ రాజవంశాలన్నీ తెలంగాణలోనే ఆవిర్భవించాయి. ఈ ప్రాంతమే కేంద్రంగా రాజ్యాలను నిర్మించాయి. తెలంగాణ/దక్కనీ పాలకులు ఉత్తర భారతావని సామ్రాజ్యవాద రాజకీయాలను ఎదిరించి, సవాల్ చేసి, తమ సొంత రాజకీయ అస్తిత్వాన్ని కాపాడుకున్నారు. దక్కన్ ముస్లిం పాలకులు స్థానిక సంస్కృతులను ఆదరించారు. వాటిని సమున్నతం చేశారు. ఏ దక్కన్ ముస్లిం పాలకుడూ ఉత్తరాది ముస్లిం పాలకుల వలే జిజియా పన్ను విధించలేదు. ఢిల్లీ పాలకులతో దక్కన్ రాజులు వ్యూహాత్మక సంబంధాలను నెరపారు. ఉత్తరాది సామ్రాజ్యవాదులు బలంగా ఉన్నప్పుడు వారికి విధేయులుగా ఉండడం, ఆ చక్రవర్తులు బలహీనపడ్డప్పుడు స్వతంత్రంగా వ్యవహరించడం దక్కన్ పాలకులకు మొదటినుంచి ఒక ఆనవాయితీగా ఉన్నది. దక్కన్ పాలకుల స్వతస్సిద్ధ స్వతంత్ర ధోరణులపై ఉత్తరాది సామ్రాజ్యవాద పాలకులకు బాగా తెలుసు కనుకనే తాము జయించిన దక్కన్ రాజ్యాలను తమ సామ్రాజ్యంలో కలుపుకోలేదు.
యుద్ధంలో ఓడిపోయిన రాజులే తిరిగి తమ రాజ్యాన్ని పాలించుకోవడానికి ఉదారంగా అనుమతినిచ్చారు. తమ ఆధిపత్యాన్ని అంగీకరించి, వార్షిక కప్పం చెల్లిస్తే చాలు అని మాత్రమే ఉత్తరాది సామ్రాజ్యవాదులు డిమాండ్ చేసేవారు. దక్కన్ రాజ్యాలను తమ సామ్రాజ్యంలో కలుపుకోవడానికి ప్రయత్నించిన ఉత్తరాది సామ్రాజ్యాలు ఎంతో కాలం మనుగడ సాగించలేక పోయాయన్నది ఒక వాస్తవం. మొగల్ చక్రవర్తుల విషయంలో ఇది మరింత వాస్తవం. గోల్కొండను జయించి, సామ్రాజ్యంలో కలుపుకున్న కొద్ది కాలానికే మొగల్ సామ్రాజ్యం విచ్ఛిన్నమవడం ప్రారంభమయింది. సామ్రాజ్యవాద ఆధిపత్యాన్ని, అణచివేత రాజకీయాలను ప్రతి ఘటించడమనేది తెలంగాణలో ఒక స్వతస్సిద్ధ సంప్రదాయం. ఈ ప్రాంతంలో విస్తరిల్లిన బౌద్ధం, వీర శైవం, సూఫీ ధర్మం ఆ సంప్రదాయాన్ని పరిపుష్టం చేశాయి. బౌద్ధ, జైన మతాలు క్రీ.శ. 11వ శతాబ్ది వరకు తెలంగాణ ప్రజల జీవన ప్రస్థానాన్ని పలు విధాల ప్రభావితం చేశాయి. వీర శైవం, 12 వ శతాబ్ది నుంచి ఆ సంప్రదాయాన్ని కొనసాగించింది. వీరశైవం వ్యాప్తికి కారకులైన కమరెల్లి ఎల్లన్న, మల్లన్న, రాజన్న, వీరభద్రుడు మొదలైనవారిని తెలంగాణ ప్రజలు ఆరాధిస్తారు. విజయనగర చక్రవర్తుల ప్రభావంతో రాచకొండ వెలమ పాలకులు వైష్ణవాన్ని తెలంగాణ గడ్డకు తీసుకు వచ్చారు. సూఫీ ధర్మం తెలంగాణ సంస్కృతిని సమున్నతం చేసింది. ఇస్లాంలోని మితవాద విలువలు, సంప్రదాయాలను సూఫీలు తిరస్కరించారు. సమత్వ భావనను పెంపొందించారు. సూఫీల బోధనలతో ప్రభావితులైన తెలంగాణ సమాజపు అట్టడుగు కులాల వారు పెద్ద సంఖ్యలో ఇస్లాంలో చేరిపోయారు. గమనార్హమైన విషయమేమిటంటే ఉత్తర భారతావనిలో వలే దక్కన్లో నిర్బంధ మత మార్పిడులు జరగలేదు.
ప్రాచీన, మధ్య యుగాలలో సంప్రదాయ విరుద్ధ, లౌకిక సమాజంగా వర్ధిల్లిన తెలంగాణ ఆధునిక కాలంలో మతతత్వ రాజకీయాలలో ఎలా చిక్కుకున్నది? ఇదే ఇప్పుడు మన ముందున్న ప్రశ్న. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరం ఒక మతోన్మాద ప్రాంతమనే కళంకానికి గురయింది. ఇదొక నిరాధార నింద. నిశితంగా పరిశీలిస్తే, హైదరాబాద్ మతతత్వ నగరమనడంలో ఒక రాజకీయ దురుద్దేశం స్పష్టంగా గోచరిస్తుంది. హైదరాబాద్ మతతత్త్వ నగరమనడం ముస్లింలను మతోన్మాదులని ఆరోపించడమే. ఈ సాకుతో ముస్లింలను క్రూరంగా అణచివేయవచ్చు. మతతత్వ నెలవు అనే అపప్రథకు హైదరాబాద్‌ను గురిచేయడం ఒక కుత్సిత రాజకీయ కార్యక్రమం. తెలంగాణలో ఆధునిక మతతత్త్వ రాజకీయాల చరిత్రను పరిశీలిస్తే ఆ కుత్సిత రాజకీయాలు తెలంగాణ సమాజం నుంచి గాక వెలుపలి ప్రాంతాల నుంచి వచ్చినట్టు మనకు విశదమవుతుంది. 1920ల్లో యావద్భారతదేశమూ మతోన్మాద రాజకీయాలతో కకావికలు అవుతుండగా ఒక్క తెలంగాణలో మాత్రమే మత సామరస్యం పరిపూర్ణంగా వర్ధిల్లింది.
హైదరాబాద్ సంస్థానంలో తొలి మతతత్వ సంఘటన 1948లో హైదరాబాద్‌లోని ధూల్‌పేటలో సంభవించింది. ఆ సంఘటనలో మజ్లిస్ నాయకుడైన బహదూర్ యార్ జంగ్ బంధువు ఒకరిని మరట్వాడా ప్రాంత ఆర్య సమాజ్ కార్యకర్త ఒకరు చంపివేయడం జరిగింది. ఈ సంఘటన హైదరాబాద్ ముస్లింలలో తీవ్ర కలవరం కలిగించింది. తీవ్ర భయాందోళనలు వ్యక్తమయ్యాయి. తమను తాము రక్షించుకోవడానికి ముస్లింలు రాజకీయంగా సంఘటితమవ్వడం ప్రారంభమయింది. అయితే ముస్లింలకు వ్యతిరేకంగా మరాట్వాడాకు చెందిన ఆర్య సమాజికులు, ఇతర హిందూ సంస్థల వారు మరింత తీవ్ర స్థాయిలో సంఘటితమయ్యారు. భారత ప్రభుత్వ సైనిక చర్య ఫలితంగా నిజాం నవాబు ప్రభుత్వం పతనమయిన సందర్భంలో మరట్వాడా ప్రాంతంలో మతోన్మాద హింసాకాండ తీవ్ర స్థాయిలో చోటు చేసుకోవడానికి ఆక్కడి అర్యసమాజ్, ఇతర హిందూ సంస్థల కార్యకర్తలే ప్రధాన కారకులు. భారత జాతీయ కాంగ్రెస్‌కు చెందిన స్థానిక నాయకులు, కార్యకర్తలు కూడా ఆ అల్లర్లలో చురుగ్గా పాల్గొన్నారనేది తోసిపుచ్చలేని వాస్తవం.
ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించిన తరువాత హైదరాబాద్‌లో మతతత్త్వ ఉద్రిక్తతలు కొత్త రూపు సంతరించుకున్నాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఠాల మధ్య కుమ్ములాటలు మతోన్మాదాన్ని రెచ్చగొట్టడానికి దారితీశాయి. ముఖ్యంగా 1970 దశకం ద్వితీయార్ధంలో హైదరాబాద్‌లో సంభవించిన మతతత్త్వ అల్లర్లకు కాంగ్రెస్ నాయకుల మధ్య కుమ్ములాటలే ప్రధాన కారణం. హిందువులు, ముస్లింల మధ్య నెలకొనివున్న విభేదాలను కాంగ్రెస్ నాయకులు ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారు తమ పార్టీ ప్రభుత్వాలను కూల్చివేసేందుకు ఉపయోగించుకున్నారు.
ఏటా గణేశ్, దసరా, మొహర్రం ఉత్సవాలు జరిగే సందర్భాలలో హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా ధూల్ పేట, హూస్సేనీ అలం ప్రాంతాలలో ఉద్రిక్తతలు చోటు చేసుకోవడం పరిపాటి అయింది. హిందూ పర్వదినాల వేడుకలను బీజేపీ, సంఘ్ పరివార్ సంస్థల సహకారంతో మార్వాడీలు, గుజరాతీలు, స్థానిక యాదవ సంఘాల వారు నిర్వహించేవారు. మతపరమైన పండుగలకు సంబంధించిన ఈ వేడుకలలో రాజకీయ నిరుద్యోగుల జోక్యంతో అవి తరచు మతతత్త్వ అల్లర్లకు ఆలవాలమయ్యేవి.
ప్రస్తుత సందర్భంలో కూడా ఒక సమాంతర పరిణామం చోటు చేసుకొంటున్నది. ప్రజలు జరుపుకునే మత పరమైన వేడుకలకు భారతీయ జనతా పార్టీని ఆహ్వానిస్తున్న వారు లేదా ఆ పార్టీలో చేరుతున్న వారు రాజకీయ నిరుద్యోగులైన నాయకులే కావడం గమనార్హం. తెలంగాణ ప్రజలు ఇటువంటి రాజకీయాలను హర్షించరన్న వాస్తవాన్ని ఆ రాజకీయ నిరుద్యోగులు అర్థం చేసుకోవడం లేదు. ఈ తప్పుడు అవగాహన వల్లే ప్రజల ఉత్సవాలలో వారు జోక్యం చేసుకుంటున్నారు. తమ రాజకీయ ఉత్థానానికి భారతీయ జనతా పార్టీ ఒక అవకాశాన్ని కల్పించగలదని వారు విశ్వసిస్తున్నారు. అయితే బీజేపీ కేవలం ఒక రాజకీయ పార్టీ కాదని, ఆర్యన్ హిందూ సాంస్కృతిక సామ్రాజ్యవాదపు రాజకీయ- సాంస్కృతిక భావజాలం, ఉద్యమానికి అదొక ప్రతినిధి అన్న విషయాన్ని వారు అర్థం చేసుకోవాలి.
తెలంగాణలో వర్ధిల్లిన సంప్రదాయ విరుద్ధ చింతనాధోరణులు, లౌకిక వ్యవస్థలే ఆ ప్రాంత విశిష్టతను సమున్నతంగా నిలబెట్టాయని చరిత్ర మనకు స్పష్టం చేస్తోంది. ఆ విశిష్ట వారసత్వం వల్లే ఉత్తర భారతావని సామ్రాజ్యవాద, అణచివేత రాజకీయాలకు తెలంగాణ ఎదురొడ్డి నిలిచింది. ఒక విధంగా తెలంగాణ ప్రజలు కొత్త విలువలు, విశ్వాసాలను అనుసరించడంలో చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకుంటారు. ఏ కొత్త విలువలూ, విశ్వాసాలనూ వారు గుడ్డిగా అనుసరించరు. తమ వివేచన ప్రాతిపదికన మాత్రమే వాటి మంచి చెడ్డలపై ఒక అంచనాకు వస్తారు. ఈ చింతనా ధోరణి మాత్రమే ఆర్యన్ హిందూ సాంస్కృతిక సామ్రాజ్యవాద విజృంభణ నుంచి తెలంగాణను కాపాడగలదు. అలా కాకుండా ఆ సాంస్కృతిక సామ్రాజ్యవాదాన్ని ఆహ్వానిస్తే తెలంగాణ తన విశిష్టతను కోల్పోతుంది.
ప్రొఫెసర్ భంగ్యా భూక్యా
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం