హిందీ పెత్తనం చెల్లదు..

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

నాగటి నారాయణ

విద్య, వైద్యం, ఉద్యోగం, ఆర్థిక మాంద్యం తదితర మౌలిక సమస్యలను మరుగు పరుస్తూ ప్రజల దృష్టిని మరల్చడానికి కొత్త సమస్యలను సృష్టించడమే మోడీ-షా నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న పని. బీజేపీ పెత్తందారీ అమ్ముల పొదిలోని మరో విధ్వంసక అస్త్రం హిందీ ఆధిపత్యాన్ని సంధిస్తోంది.

ఇటీవల రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 370 రద్దు చేసి కాశ్మీర్‌ ప్రజల ప్రత్యేక ప్రతిపత్తి దెబ్బతీశారు. ఆగస్ట్‌ 18న ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ల సంగతిని పరిశీలించాలని ఆరెస్సెస్‌ అధినేత మోహన భాగవత్‌ ప్రకటించారు. దానిపైన ప్రతిపక్షాలతో పాటు ఎన్డీఏలోని కొందరు భాగస్వాముల నుంచీ వ్యతిరేకత వ్యక్తం కావడంతో ‘అబ్బే అదేం లేదు లెమ్మని’ ఆర్‌ఎస్‌ఎస్‌ సర్దుబాటు ప్రకటన చేసింది. కేంద్ర హౌమ్‌ మంత్రి అమిత్‌ షా హిందీ భాషా ఆధిపత్యాన్ని బరిలోకి దించారు. దానిపైన వెంటనే తమిళనాడు, పుదుచ్చేరి, కర్నాటక, పశ్చిమ్‌ బంగా రాష్ట్రాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకగ్రీవంగా వ్యతిరేకించాయి. కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్‌ హిందీని జాతీయభాషగా చేయాలనేది అత్యధిక భారతీయుల మాతృభాషలపైన యుద్ధం ప్రకటించడమేనని వ్యాఖ్యానించారు. దక్షిణాది సినీరంగంలోని కొందరు అగ్రశ్రేణి నటులు, వివిధ రంగాల ప్రముఖులు కూడా అసమ్మతీ ఆందోళనా వ్యక్తం చేశారు. పరిస్థితిని గమనించిన అమిత్‌ షా ఒకడుగు వెనక్కి వేసినట్టుగా మరో ప్రకటన చేశారు. ‘ప్రాంతీయ భాషలపైన హిందీని రుద్దుతామని అనలేదు. మాతృభాష తర్వాత రెండో భాషగా హిందీని నేర్చుకోవాలని మాత్రమే విజ్ఞప్తి చేశాను’ అని ఒకడుగు వెనక్కి వేసారు. అది అబద్ధం. త్రిభాషా విధానంలో హిందీ రెండో భాషగా 1968 నుంచే అమల్లో వున్న విషయం తెలియనిదేమీ కాదు.

”ప్రపంచ గుర్తింపు కోసం భారత దేశానికి ఒక జాతీయ భాష అంటూ ఉండాలి. దేశంలో ఎక్కువ మంది మాట్లాడే హిందీనే జాతీయ భాష కాగలదు. దేశాన్ని ఐక్యం చేయగల అవకాశం హిందీ భాషకే ఉన్నది. కాబట్టి దేశమంతటా హిందీ భాషను ప్రమోట్‌ చేయాలి” అని అమిత్‌ షా అనడం అంగీకారయోగ్యంగా లేదు. ఇప్పుడు ప్రపంచంలో భారత దేశానికి గుర్తింపు లేదా? దేశం ఐక్యంగా లేదా? బహుళభాషల సమాహారం, విభిన్న సంస్కృతుల వైవిధ్య భరితం, భిన్నత్వంలో ఏకత్వం భారత దేశ విశిష్టత అని సగర్వంగా చెప్పుకుంటున్నది తప్పా? ‘ఒక దేశం ఒక భాష’ అంటూ హిందీని నెత్తికెత్తుకుంటే వందలాది భాషలు ఏంకావాలి? ఇప్పటికే అనేక చిన్న భాషలు అంతరించి పోతున్నాయి. హిందీకి పట్టం గడితే మిగిలిన భాషలు తెల్లమొహం వేయక తప్పదు. కనీసం యాభై శాతం ఓట్లు రాకపోయినా పోటీ చేసిన వారిలో ఎక్కువ ఓట్లు వచ్చిన వారినే గెలిచినట్టుగా ప్రకటిస్తున్నట్టు ఎక్కువ మంది మాట్లాడగలిగే భాష కాబట్టి హిందీని జాతీయ భాష చేయాలనడం కూడా సమంజసం కాదు. హిందీ కంటే ఇతర భారతీయ భాషలు మాట్లాడే వారే ఎక్కువగా వున్నట్టు 2011 సెన్సెస్‌ ద్వారా తెలుస్తోంది.
రాజ్యాంగం ఎనిమిదో షెడ్యూల్‌లో పేర్కొన్న 22 భాషలతో పాటు మరో 3.98కోట్లు (3.29శాతం) మంది వివిధ రకాల భాషలు (భిలి, గోండి, ఖండేశీ, తుళు, కురుఖ్‌ వగైరా) మాట్లాడేవారు ఉన్నారు. భాషల విషయంలో ముఖ్యమైన అంశం భారతీయుల్లో 12.50 కోట్ల (10శాతం) మంది ఇంగ్లీష్‌ మాట్లాడే వారున్నారనే విషయాన్నీ గమనించాలి. హిందీ తర్వాత ఎక్కువ మంది మాట్లాడగలిగే భాషే కాదు, ప్రపంచంలో అమెరికా తర్వాత ఇంగ్లీషు మాట్లాడే రెండో పెద్ద దేశం భారత్‌. ‘ప్రతి దేశానికీ జాతీయ భాష ఉంటుంది. మన దేశానికి లేకపోతే ఎట్లా?’ అని అంటున్నారు. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, నేపాల్‌, ఫిన్లాండ్‌ లాంటి కొన్ని దేశాలు మాత్రమే జాతీయభాషలని చెప్పుకుంటు న్నాయి. తప్ప అభివృద్ధి చెందిన వాటిలో జపాన్‌, సింగపూర్‌ మినహా అనేక దేశాలు జాతీయభాషలుగా ప్రకటించుకో లేదు. కాకపోతే అధికార భాషలు (పరిపాలనలో, పార్లమెంటులో, న్యాయస్థానాల్లో వాడబడేవి) దాదాపు అన్ని దేశాల్లోనూ ఉన్నాయి. అవి భారత దేశంలోనూ ఉన్నాయి. ది అఫీషియల్‌ లాంగ్వేజస్‌ యాక్ట్‌ 1963, ది అఫీషియల్‌ లాంగ్వేజస్‌ రూల్స్‌ 1976 ప్రకారం ఇండియన్‌ యూనియన్‌లో హిందీ, ఇంగ్లీష్‌ అఫీషియల్‌ లాంగ్వేజస్‌. రాష్ట్రాల్లో అధికార భాషలుగా 21 ఉన్నాయి. బీహార్‌, చత్తీస్‌గఢ్‌, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్‌, జార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఉత్తర ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో హిందీ, మిగిలిన రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఆయా ప్రాంతీయ భాషలు అధికార భాషలుగా ఉన్నాయి. కాగా రాజ్యాంగం ఎనిమిదో షెడ్యూల్లో లేకపోయినా ఇంగ్లీష్‌ ఇండియన్‌ యూనియన్‌తో పాటు అరుణాచల్‌ప్రదేశ్‌, మేఘాలయ, నాగాలాండ్‌ రాష్ట్రాల్లో, కేంద్ర పాలిత ప్రాంతమైన చండీఘర్‌లో అధికార భాషగా, గోవా, సిక్కిం, త్రిపుర, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలైన ఢిల్లీ, పుదుచ్చేరి, అండమాన్‌ నికోబర్‌ దీవులు, లక్ష ద్వీప్‌లలో సహ అధికార భాషగా మరో ఐదు రాష్ట్రాల్లో అదనపు అధికార భాషగా కూడా ఉంది.

భాష భావాల వ్యక్తీకరణకు, మానవ జాతుల అస్తిత్వానికి సంబంధించిన సున్నితమైన విషయం. భారత దేశం ఒకే జాతి కాదు, బహుళ జాతుల సమైక్య జీవనం. అందుకే బహుళ భాషలు ఉన్నాయి. మాతృభాషతో పాటు ఇతర భాషల్ని నేర్చుకోవడం అనేది వ్యక్తుల అవసరాన్ని బట్టి ఉంటుంది. ఏజెన్సీ ఏరియాల్లో, మారుమూల గ్రామాల్లో నివసించే వారికి స్థానిక భాష తప్ప యితర భాషల అవసరం అంతగా వుండదు. కానీ భాష భావ వ్యక్తీకరణతో పాటు బతుకుతెరువుకూ తోడ్పడాలి. అందువలన దేశంలో, ప్రపంచంలో ఎక్కడైనా బతకడానికి అవసరమైన భాషలు కూడా నేర్చుకోవాలి. అందుకోసమే స్థానిక భాషతో పాటు ఇంగ్లీష్‌ భాష నేర్చుకోవాల్సి వస్తోంది. స్థానిక ప్రభుత్వ ఉద్యోగాలకు స్థానిక భాష చాలు. దేశంలోని యితర ప్రాంతాల్లో, ప్రపంచంలోని యితర దేశాల్లో పనిచేయడానికి ఇంగ్లీష్‌ అనివార్యం. ప్రయివేట్‌ రంగంలో, కార్పొరేట్‌ కంపెనీల్లో ఉద్యోగాలకు కావాల్సింది ఇంగ్లీష్‌ భాషే కదా. ప్రయివేట్‌ స్కూళ్ళు, కాలేజీల్లో ఉద్యోగాలకు కూడా ఇంగ్లీష్‌ కావాలి. కనుక జీవిత అవసరాలకు మాతృ, స్థానిక భాష, ఇంగ్లీష్‌ కావాలి. కానీ ఇంగ్లీష్‌ భాషను విస్మరించాలనేది బీజేపీ సంకల్పం. దేశంలో పరాయి భాషల ప్రాబల్యాన్ని తగ్గించడానికి కూడా హిందీ నేర్చుకోవాలని అమిత్‌ షా ఉపదేశంలో ఉన్నది.

భాష భావ వ్యక్తీకరణతో పాటు భావావేశాన్ని, భావోద్వేగాన్ని కూడా కలిగిస్తుంది. ఇతర భాషల్ని నిర్బంధంగా రుద్దాలని చూస్తే ఏ భాషా సహించదు. పశ్చిమ పాకిస్థాన్‌ నుంచి విడిపోయి తూర్పు పాకిస్థాన్‌ బంగ్లాదేశ్‌గా ఏర్పడడానికి భాష ముఖ్యమైన కారణమనే విషయాన్ని కేంద్ర పాలకులు తెలుసుకోవాలి. ఆ దేశంలో 85శాతం మంది ముస్లిములే అయినా అధికార భాష ఇంగ్లీష్‌. భారత దేశాన్ని ”ఇండియన్‌ యూనియన్‌” అంటారనే విషయం తెలిసిందే. వివిధ రాష్ట్రాలతో కూడిన యూనియన్‌. పరిపాలనలో కొన్ని విషయాల్లోనే యూనియన్‌ (కేంద్ర) ప్రభుత్వానికి అధికారాలు ఉన్నాయి. భాషల విషయంలో రాష్ట్రాలపైన కేంద్రానికి అధికారం లేదు. అయినా కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వల్లనే త్రిభాషా సూత్రాన్ని హిందీయేతర రాష్ట్రాలే భరిస్తున్నాయి. హిందీ రాష్ట్రాల్లో హిందీయేతర రాష్ట్రాల భాషల్ని మాత్రం నేర్పడం లేదు. ఇంటెగ్రిటీ బాధ్యత హిందీయేతర రాష్ట్రాలదేనా? ‘1965 నుంచి కేంద్ర ప్రభుత్వ అధికార భాషగా హిందీ ఒక్కటే ఉంటుంది, ఇంగ్లీష్‌ ఉండదు’ అని ఆనాటి కేంద్ర ప్రభుత్వం అనడం వల్లనే తమిళనాడులో హిందీ వ్యతిరేక ఉద్యమం చెలరేగింది. ఆ రాష్ట్ర పాఠశాలల్లో తమిళం, ఇంగ్లీష్‌ రెండు భాషలే నేర్పుతున్నారు. ‘దక్షిణ భారత హిందీ ప్రచార సభ’ కేంద్రాన్ని చెన్నైలోనే ఏర్పాటు చేసినా ఫలితం లేకపోయింది.
హిందీ జాతీయ భాష కాదని 2010లో గుజరాత్‌ హైకోర్టు తీర్పు చెప్పింది, హిందీని జాతీయ భాషగా ప్రకటించాలనే ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని 2016లో సుప్రీంకోర్ట్‌ తోసిపుచ్చింది. ముగిసిన విషయాన్ని ముందుకు తేవడం అనవసరం. లేని సమస్యను సృష్టించడం తగని పని. ఐక్యత పేరుతో హిందీని జాతీయ భాషగా రుద్దితే అది అనైక్యతకే దారితీస్తుంది. గతం కంటే యిప్పుడు దక్షిణ, ఈశాన్య రాష్ట్రాలు ప్రతిఘటించే అవకాశం ఎక్కువ. దేశ సమగ్రతకే సవాలుగా మారే ప్రమాదం దాపురిస్తుంది. కాబట్టి హిందీ పెత్తనం చెల్లదు. హిందీతో పాటు అన్ని భాషల్నీ సమాదరించి అభివృద్ధి చేస్తేనే దేశ ఐక్యత, సమగ్రతకు భరోసా.

భాష మాట్లాడేవారు శాతం భాష మాట్లాడేవారు శాతం
1. హిందీ 52.84 కోట్లు 46.63 12. అస్సామీ 1.53 కోట్లు 1.26
2. బెంగాలీ 9.72 ” 8.03 13. మైథిలి 1.36 ” 1.12
3. మరారీ 8.30 ” 6.86 14. సంతాలీ 73.68 లక్షలు 0.61
4. తెలుగు 8.11 ” 6.70 15. కాశ్మిరీ 67.98 ” 0.56
5. తమిళం 6.90 ” 5.70 16. నేపాలీ 29. 26 ” 0.24
6. గుజరాతీ 5.55 ” 4.58 17. సింధు 27. 72 ” 0.23
7. ఉర్దూ 5.08 ” 4.19 18. డోగ్రీ 25.97 ” 0.21
8. కన్నడ 4.37 ” 3.61 19. కొంకణ 22.57 ” 0.19
9. ఒరియా 3.75 ” 3.10 20. మణిపురి 17. 61 ” 0.15
10. మలయాళం 3.48 ” 2.88 21. బోడో 14.83 ” 0.12
11. పంజాబీ 3.31 ” 2.74 22. సంస్కృతం 24.08 వేలు —

సెల్‌: 9490300577

RELATED ARTICLES

Latest Updates