కస్సు.. బస్సు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

 • రాయితీలకు నిధుల్లేవు.. విలీనం ఊసే లేదు
 • సర్కారుపై ఆర్టీసీ కార్మిక సంఘాల ఆగ్రహం
 • బడ్జెట్‌లో ఆర్టీసీకి నయా పైసా ఇవ్వలేదు!
 • గత ఏడాది రూ.975 కోట్లు ఇచ్చిన సర్కారు
 • ఏపీలో రాయితీలకూ బడ్జెట్‌లో నిధులు
 • సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసేశారు!
 • తెలంగాణలో ఎందుకు చేయరంటున్న సంఘాలు
 • టీఎ్‌సఆర్టీసీ ఆస్తుల విలువ 50 వేల కోట్లు
 • సంస్థ నష్టాలు ఏటా సగటున 1000 కోట్లు
 • సమ్మె నోటీసు ఇచ్చిన కార్మిక సంఘాలు
 • విలీనంతో ఉద్యోగ భద్రత.. కార్మికుల ధీమా

రైతు బంధు, కల్యాణలక్ష్మి వంటి పథకాలను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. వాటిని ఆంధ్రప్రదేశ్‌ తదితర రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారని చెప్పుకొంది! ఇప్పుడు పరిస్థితి తిరగబడింది! ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు! ఇప్పుడు తెలంగాణలోనూ దాన్ని అమలు చేయాలన్న డిమాండ్‌ పెరుగుతోంది! ఏపీతో పోలిస్తే, తెలంగాణలో ఆర్టీసీకి ఆస్తులు ఎక్కువగా ఉన్నాయని, అక్కడి కంటే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం ఇక్కడే ఎక్కువ అవసరమని.. ఎందుకు విలీనం చేయరని ఆర్టీసీ కార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఏపీలో బస్సు పాసులు, ఇతర రాయితీలకు బడ్జెట్‌లో నిధులు కూడా కేటాయించారని.. తెలంగాణలో తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆర్టీసీకి నయా పైసా కేటాయించలేదని ఆక్షేపిస్తున్నాయి.

హైదరాబాద్‌, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): బస్సు పాసుల రీయింబర్స్‌మెంట్‌ సహా పలు పద్దుల కింద ఆర్టీసీకి ప్రభుత్వం ఏటా రూ.650 కోట్ల దాకా చెల్లిస్తుంటుంది. గత బడ్జెట్‌లో ఆర్టీసీకి రూ.975.55 కోట్లు కేటాయించిన తెలంగాణ సర్కారు.. ఈ సారి కేటాయింపులేమీ చేయలేదు. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఆర్టీసీని ఆదుకోవాల్సిన ప్రభుత్వం.. బడ్జెట్‌లో కనీసం ఒక్క పైసా కూడా కేటాయించలేదంటూ కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. ఇలాగైతే సంస్థ కోలుకునేదెలా? అని నిలదీస్తున్నాయి. టీఎ్‌సఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో ఇప్పటికే ఎంప్లాయీస్‌ యూనియన్‌, తెలంగాణ జాతీయ మజ్దూర్‌ యూనియన్‌ సమ్మె నోటీసులు ఇచ్చాయి. మరో ప్రధాన యూనియన్‌ తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ నోటీసు ఇవ్వనుంది.

ఏపీఎ్‌సఆర్టీసీకి దాదాపు రూ.30 వేల కోట్ల ఆస్తులు ఉంటే.. టీఎ్‌సఆర్టీసీ ఆస్తులు రూ.50 వేల కోట్లపైనే! ఖాళీ స్థలాలు, బస్సు డిపోలు, బస్టాండ్ల స్థలాలతోపాటు బస్‌ భవన్‌, కల్యాణ మండపం, బస్సు బాడీ యూనిట్లు, వర్క్‌షా్‌పల స్థలాలు తెలంగాణలోనే ఎక్కువ. హైదరాబాద్‌లోనే చాలా ఖాళీ స్థలాలు ఉన్నాయి. విలీనం చేసుకుంటే వీటిని ప్రభుత్వం వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఇక ఏపీతో పోలిస్తే.. ఇక్కడి సంస్థకు అప్పులు తక్కువే. అక్కడ రూ.6 వేల కోట్లకుపైగా అప్పులుంటే ఇక్కడ రూ.4 వేల కోట్ల పైచిలుకు ఉన్నాయి. రూ.1.89 లక్షల కోట్ల అప్పులు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి రూ.4 వేల కోట్ల అప్పులు తీర్చడం కష్టం కాదని కార్మిక సంఘాలు అంటున్నాయి. రూ.50 వేల కోట్ల ఆస్తులు కలిసి వస్తున్నప్పుడు ఆ మాత్రం అప్పులు తీర్చలేదా? అని ప్రశ్నిస్తున్నాయి.

విలీనంతోనే కొత్త రూటు!ఏపీతో పోలిస్తే.. తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ ఆటోనే దిక్కు! బస్సు సౌకర్యం లేకపోవడంతో ఆటోలు కిక్కిరిసి ప్రయాణిస్తూ ఉంటాయి కూడా! అంతేనా, కొన్నిచోట్ల హైవేలపైనా ఆటోలు పరుగులు తీస్తున్నాయి. ప్రమాదాలకు గురై ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే, తెలంగాణలోని పల్లెపల్లెకూ బస్సును నడపాలని కొత్త రాష్ట్రం ఏర్పడినప్పుడు ప్రభుత్వం సంకల్పించింది. రాష్ట్రంలో ఎలాంటి బస్సు సౌకర్యం లేని గ్రామాలు 910 ఉన్నాయని సర్వేలో తేల్చింది. అష్టకష్టాలు పడి 2015లో మాత్రమే 70 కొత్త రూట్లలో బస్సులను ప్రారంభించింది. ఇంకా 840 రూట్లు బస్సుకు దూరమే. వాస్తవానికి, ఆర్టీసీ వద్ద సరిపడా బస్సులు లేవు. ఉన్న బస్సులనే కొత్త రూట్లకు సర్దాల్సి వస్తోంది. పల్లె వెలుగు బస్సుల్లో అత్యధికం కాలం తీరిపోయినవే. అప్పుల్లో కూరుకుపోయిన యాజమాన్యం కొత్త బస్సులను కొనుగోలు చేయలేకపోతోంది. ఈ నేపథ్యంలో విలీనం జరిగితే.. ప్రభుత్వమే ప్రత్యేకంగా బడ్జెట్‌ కేటాయించి కొత్త బస్సులను కొనుగోలు చేస్తుందనే అభిప్రాయాలు ఉన్నాయి. పూర్తిస్థాయిలో ఓ మంత్రి, ముఖ్య కార్యదర్శి అధీనంలో ఉండడం ద్వారా పర్యవేక్షణ; తనిఖీలకు అవకాశం ఉంటుందని కార్మిక సంఘాలు చెబుతున్నాయి.

కార్మికులకు వచ్చేదేంటి!?విలీనం చేయడం ద్వారా ఆర్టీసీ కార్మికుల వేతనాలు భారీగా పెరుగుతాయన్న అభిప్రాయాలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు ఆర్టీసీ కార్మికుల కంటే 18 శాతం ఎక్కువగా ఉన్నాయి. విలీనమైతే ఈ వ్యత్యాసం ఉండదు. పైగా కార్మికులకు ఉద్యోగ భద్రత ఏర్పడుతుందని, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా చూస్తారని సంఘాలు చెబుతున్నాయి. అందుకే విలీనం చేయాలంటూ డిమాండ్‌ చేస్తున్నాయి. అయితే ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత ఆర్టీసీని ప్రభుత్వ ఆపరేటర్‌గానే కొనసాగించాలని.. జాతీయం చేసిన రూట్లను వేలం వేయడం, ఇతర ప్రైవేటు ఆపరేటర్లకు రూట్లను అప్పగించడం వంటి చర్యలు చేపడితే ఊరుకోబోమని హెచ్చరిస్తున్నాయి. రాష్ట్రంలో 3,720 రూట్లలో ఆర్టీసీ బస్సులు నడుపుతోందని, వీటిలో నడిచే బస్సులపై రవా ణా శాఖ చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నాయి.

విలీనం చేయాల్సిందేఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాల్సిందే. మేం మొదటి నుంచీ ఇదే డిమాండ్‌తో ఉన్నాం. దీనిపై సమ్మె నోటీసు కూడా ఇచ్చాం. కానీ, ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. చైర్మన్‌, ఎండీలను ఇప్పటి వరకు నియమించలేదు. విలీనమైతే.. కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారతారు. ఉద్యోగ భద్రత ఉంటుంది.

ఏడాదికి టీఎస్‌ఆర్టీసీ వ్యయాలు (రూ. కొట్లలో)
అధికారులు, సిబ్బంది జీతభత్యాలు 2400
డీజిల్‌ కోసం 1400
అద్దె బస్సుల నిర్వహణ 930
మోటార్‌ వెహికిల్‌ ట్యాక్స్‌ 200
టైర్లు, ఇతర స్పేర్‌పార్ట్స్‌ కోసం 200
కరెంటు చార్జీలు, ఇతర ఖర్చులు 195
ప్రమాదాల ఎక్స్‌గ్రేషియాలు 250
అప్పులపై వడ్డీలు 180
సంవత్సర మొత్తం వ్యయం 5755

ఆర్టీసీ ఇక్కడ.. అక్కడ..
తెలంగాణ ఆంధ్రప్రదేశ్‌
కార్మికులు 50401 51952
అప్పులు రూ.4301 కోట్లు రూ.6925 కోట్లు
సొంత బస్సులు 8326 9472
అద్దె బస్సులు 2163 2515
ఆస్తులు 50,000 కోట్లు 30,000 కోట్లు
రోజువారీ ఆదాయం రూ.11 కోట్లు రూ.13 కోట్లు

 

కె.హన్మంతు ముదిరాజ్‌, టీజేఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.

Courtesy Andhrajyothi…

 

RELATED ARTICLES

Latest Updates