కుటుంబాన్నే మింగిన డెంగీ

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

24 రోజుల్లో నలుగురు కుటుంబసభ్యుల మృతి

  • ఆస్పత్రిలో బిడ్డకు జన్మనిచ్చి ప్రాణాలు విడిచిన తల్లి
  • మొత్తంగా భార్యాభర్తలు, కూతురు, తాత బలి
  • కుటుంబంలో మిగిలింది ఇద్దరే ఇద్దరు
  • రెండ్రోజుల పసిగుడ్డు, ఏడేళ్ల బాలుడు
  • ఆ శిశువు పరిస్థితి విషమం!
  • భార్యాభర్తలు, వారికి ఏడేళ్ల కొడుకు, ఆరేళ్ల కూతురు. ఆ ఇంటి పెద్దకు కొండంత భరోసాగా తాత. ఆ ఇల్లాలు నిండు గర్భిణి కావడంతో త్వరలోనే ఇంట్లోకి కొత్త అతిథి రానున్నాడనే సంబురం ఆ కుటుంబసభ్యుల్లో! ఇలా ఉన్నంతలో సంతోషంగా గడుపుతున్న ఆ కుటుంబం కథ కేవలం నెలరోజుల్లో తారుమారైంది. మాయదారి డెంగీ ఆ ఇంట్లో కల్లోలం రేపింది. ఒకరి వెంట మరొకరిని మంచం పట్టించి.. 24 రోజుల వ్యవధిలో నాలుగు నిండు ప్రాణాలను బలితీసుకుంది. ఆ నిండు కుటుంబాన్ని చిదిమేసింది. ఈ నెల 6న ఇంటి పెద్దను బలితీసుకున్న డెంగీ.. బుధవారం ఆయన భార్య ప్రాణాలను కబళించింది. ఆస్పత్రిలో ప్రసవించిన మరుసటి రోజే ఆమె ప్రాణాలను విడిచింది. ఆ ఇంట్లో ఇప్పుడు మిగిలింది ఇద్దరే ఇద్దరు. ఒకరు మంగళవారం జన్మించిన నవజాత శిశువు, మరొకరు ఏడేళ్ల వయసున్న కుమారుడు. ఆ దంపతులతో పాటు వారి కూతురు, తాత డెంగీ వ్యాధి బారిన పడి ప్రాణాలు విడిచారు.

మంచిర్యాల జిల్లా కేంద్రంలో నివసిస్తున్న ఓ కుటుంబానిదీ విషాదం. మంచిర్యాలలోని శ్రీశ్రీ నగర్‌కు చెందిన గుడిమల్ల రాజగట్టు (30), సోని (25) దంపతులకు శ్రీ వికాస్‌ (7), శ్రీ వర్షిణి (6) పిల్లలు. రాజగట్టుకు తాత 74ఏళ్ల లింగయ్య ఉన్నాడు. పట్టణంలోని ఓ ప్రైవేటు స్కూల్లో టీచర్‌గా రాజగట్టు పనిచేస్తున్నాడు. శ్రీ వికాస్‌ 2వ తరగతి, శ్రీ వర్షిణి ఒకటో తరగతి చదువుతున్నారు. సోని నిండు గర్భిణి. నెలక్రితం రాజగట్టుకు తీవ్ర జ్వరం రావడంతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరాడు. అది తగ్గకపోవడం.. రక్త పరీక్షలో డెంగీ లక్షణాలు కనిపించడంతో కరీంనగర్‌లో ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈనెల 6న రాజగట్టు మృతిచెందాడు. కొద్దిరోజులకే లింగయ్యకు కూడా డెంగీ వ్యాధి సోకింది. ఈ నెల 20న ఆయన కన్నుమూశాడు. ఆ తర్వాత 8 రోజులకే.. అంటే 28న డెంగీతోనే పాప శ్రీవర్షిణి మరణించింది. కన్నబిడ్డ చనిపోయిన రోజే తీవ్ర జ్వరంతో బాధపడుతన్న సోనిని సికింద్రాబాద్‌లోని యశోదా ఆస్పత్రిలో చేర్పించారు. ఆ మరుసటి రోజే సోని మగబిడ్డకు జన్మనిచ్చింది. బుధవారం మృతిచెందింది. ఆమె డెంగీతో చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

2.5లక్షలిస్తే తప్పమృతదేహం ఇవ్వం..సోని వైద్య ఖర్చుల కింద యశోదా ఆస్పత్రిలో ఇప్పటికే కుటుంబసభ్యులు రూ.లక్ష కట్టారు. మరో రూ.2.5లక్షలు చెల్లించాల్సి ఉందని.. ఆ డబ్బు కట్టేదాకా మృతదేహాన్ని ఇవ్వబోమని కుటుంబసభ్యులకు ఆస్పత్రి యాజమాన్యం స్పష్టం చేసింది. అంత డబ్బు కట్టలేని స్థితిలో కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మృతదేహం కోసం ఆస్పత్రి వద్దే పడిగాపులు పడుతున్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావు ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని కుటుం బ సభ్యులు ప్రయత్నిస్తున్నారు.

ఒంటరైన శ్రీ వికాస్‌.. ఇంక్యుబేటర్‌లో తమ్ముడు!…డెంగీతో తండ్రి, ముత్తాత, చెల్లి, తల్లి మృతిచెందడంతో రాజగట్టు-సోని దంపతుల కుమారుడు వికాస్‌ ఒంటరిగా మిగిలాడు. అతడి తమ్ముడైన రెండ్రోజుల పసిగుడ్డును ఇంక్యూబేటర్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆ శిశువు పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉందని వైద్యులు పేర్కొన్నారు.

హోటల్‌ కాదు.. ఆస్పత్రే!…రాష్ట్రంలో డెంగీ, విష జ్వరాల విజృంభణకు ఈ దృశ్యమే నిదర్శనం. వికారాబాద్‌లోని మిషనరీ ఆస్పత్రిలో రోగులు కిక్కిరిసిపోవడంతో స్థలం లేక ఇలా గొడుగులు ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు. చూడటానికి హోటల్‌ లాగా కనిపిస్తున్న ఈ గొడుగుల కింద రోగులను కూర్చోబెట్టి సెలైన్లు ఎక్కిస్తున్నారు.వికారాబాద్‌

డెంగీతో ముగ్గురు మృతి…ఖమ్మం జిల్లా రేపల్లెవాడకు చెందిన తేజావత్‌ వెంకా (55), మంచిర్యాల జిల్లా కోమటిచేనుకు చెందిన జాడి మల్లయ్య (65), మంచిర్యాలకు చెందిన ఆకుదారి రాజశ్రీ (19) డెంగీతో బాధపడుతూ ప్రాణాలు విడిచారు. నిర్మల్‌కు చెందిన నవీన్‌ (20), మెదక్‌ వాసి కావ్య (15) విష జ్వరాలతో మృతిచెందారు.

Courtesy Andhrajyothi..

RELATED ARTICLES

Latest Updates