అడవి ఆమె ఇల్లు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

————————————-చల్లపల్లి స్వరూపరాణి

నీటిలో బతికే చేప వొడ్డుమీదకొస్తే ఎలా బతకలేదో అనాదిగా అడవిలో నివసిస్తూ అక్కడి పరిసరాలతో మమేకమయ్యే ఆదివాసుల పరిస్థితి కూడా అంతే.

మధ్య యుగాలలో  రాజ్యం తన సైనిక అవసరాలకోసం లౌక్యంగా వారిని కావలి గాళ్ళగా సరిహద్దు అటవీ ప్రాంతాలలో ఉపయోగించుకుని అవసరం లేనప్పుడు నిర్దాక్షిణ్యంగా అణచి వేసింది. ఆధునిక కాలంలో వారిని వలస ప్రభుత్వం నేరస్థుల జాతులుగా ముద్రవేసి మైదానాలలోని గిరిజనేతరులకు వారిపట్ల ద్వేషాన్ని, ఏహ్య భావాన్ని పెంచి పోషించింది. స్వతంత్ర్యానంతరం ప్రభుత్వాలు కూడా అభివృద్ధి పేరున వారి జీవితాలతో పరాచికాలాడుతున్నాయి. భారీ జల విద్యుత్ ప్రాజెక్టుల పేరున, ఖనిజాల తవ్వకం, పరిశ్రమల ఏర్పాటు పేరున  వారిని తమ పరిసరాలనుంచి  తరిమి అనేకసార్లు నిర్వాసితులను చేసిన చరిత్ర ఉంది. వారు అనేక పోరాటాల ద్వారా అడవి మీద సాధించుకున్న హక్కులను కూడా ఖాతరు చెయ్యకుండా ప్రత్యేక ఆర్ధిక మండళ్ళ పేరున అడవి బిడ్డల్ని తమ ఆవాసాల నుంచి బైటికి పంపుతున్నారు. ఈ క్రమంలో ప్రతిఘటించిన ఆదివాసులపై తిరుగుబాటుదారులని, అడవిలో నక్సలైట్లకు సహకరిస్తున్నారనే నెపంతో వారిని అంతమొందించిన సంఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి. అయితే ఆదివాసులను అభివృద్ధి పేరున అడవి నుంచి తరిమివేసే వ్యవహారం రానురానూ క్రితం కంటే మరింత దుర్మార్గంగా  మారుతుంది. ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు దానికి తాజా నిదర్శనం అనుకోవచ్చు.

1927అటవీ చట్టం వారిని నేరస్తులుగా పరిగణిస్తే 2006 అటవీ చట్టం  2005 డిసెంబర్ 13 కి పూర్వం నుంచి అడవుల్లో నివసించే ఆదివాసులకు వారి వారి అధీనంలో ఉండే భూములలో నివసించే హక్కుని గుర్తించింది. అయితే  2019 కొత్త అటవీ చట్టం ఆదివాసులు 2005 డిసెంబర్ కి పూర్వం మూడు తరాలుగా వారు అక్కడ నివసిస్తున్నట్టు ఆధారాలు చూపించాలని పేర్కొంటుంది. దీని ప్రకారం ఒక తరానికి 25 సంవత్సరాల వ్యవధిని నిర్ణయిస్తూ మొత్తం 75 సంవత్సరాల నుంచి అక్కడ నివసిస్తున్నట్టు ఆదివాసులు నిరూపించుకోవల్సి వస్తుంది. అక్షరజ్ఞానం, బైట సమాజంతో, అధికార యంత్రాంగంతో సంబంధాలు లేని ఆటవికులకు ఇది చాలా గడ్డు పరీక్ష. అలా ధ్రువీకరించబడనివారిని సదరు అటవీ భూముల్లో అనధికారికంగా సంచరించే నేరస్థుల కింద పరిగణిస్తారు. అనధికారికంగా సంచరించే వారి వలన అడవుల్లో నివసించే వన్యప్రాణులకు రక్షణ ఉండదని వారిని కటినంగా శిక్షించాలని కొత్త చట్టం పేర్కొంటుంది. తాజా 2019 అటవీ విధానం ఆదివాసుల పాలిట ఇదివరకటికంటే మారణాయుధం కాబోతుంది. ఈ విధానాన్ని రూపొందించినవారికి మనుషుల కంటే జంతువుల మీదే ప్రేమ ఎక్కువని అనేక ఉదంతాలు ఇప్పటికే రుజువు చేశాయి. ఆదివాసుల జీవితాలను తీవ్రమైన అభద్రతకు గురిచేసే ఈ విధానాన్ని సమర్ధించుకోవడానికి వన్యప్రాణి సంరక్షణను ప్రభుత్వం సాకుగా చూపిస్తున్నప్పటికీ బడా కార్పోరేట్ సంస్థలకు అడవులను, అక్కడి సహజ వనరైన ఖనిజ సంపదను దోచిపెట్టదానికే ఈ దారుణానికి వొడికడుతున్నారనేది బహిరంగ రహస్యమే. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం దేశవ్యాప్తంగా అడవుల్లో నివసించే ఆదివాసుల్లో సుమారు  13 లక్షల మంది ఆదివాసుల జీవితాలు రోడ్డున పడబోతున్నాయి.  కోర్టు తీర్పుని గౌరవించి ఆదివాసులు తమ ఆవాసాలనుంచి బైటికి వెళ్ళకపోతే వారిపై కేసులు నమోదు చేసే అధికారంతో పాటు వన్యప్రాణుల సంరక్షణ కోసం నియమించబడే అటవీ అధికారులకు షూట్ ఎట్ సైట్ అనే అధికారాన్ని, ఆయుధాలను కూడా ప్రభుత్వం కట్టబెట్టడం, వారికోసం అడవుల్లో లాకప్ లు నిర్మించడం అనే నిర్ణయం ఆదివాసుల పట్ల ప్రభుత్వ వైఖరికి తార్కాణం. గతంలో క్రిమినల్ ట్రైబ్స్ చట్టం ప్రకారమే కాక తర్వాత కూడా పోలీసులు అయినదానికీ కానిదానికీ మైదాన ప్రాంతాల ఆదివాసీలను, అటవీ సరిహద్దు గ్రామాల ఆదివాసులను నిర్బంధించి జైళ్లలో పెట్టి కనీసపు విచారణ కూడా జరపకుండా సంవత్సరాల తరబడి వారిని నిర్బంధంలో మగ్గిపోయేలా చేశారు. అయితే  సుప్రీంకోర్టు తీర్పును చూస్తే ఇకపై ఆదివాసులతో జైళ్ళు కిక్కిరిసిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఈ సంవత్సరం జులై 24న ఆదివాసుల ఏరివేతపై తుదినిర్ణయం రాబోతుంది.

అడవుల్లో నివసించే ఆదివాసులు అక్కడి పరిసరాల్లో భాగం అనుకోవచ్చు. అందుకేనేమో ఆస్ట్రేలియా దేశపు  ఆదివాసులను అక్కడి చట్టాలు అడవుల్లో వుండే జంతు వ్రుక్షజాలంలో వారు భాగం అన్నట్టు పరిగణిస్తాయి. ఇది కొంత విపరీతంగా అనిపించినప్పటికీ ఆదివాసులు తమ పరిసరాలతో మమేకమవ్వడం అనేది సహజం. వారికి మైదానం ప్రాంతాల గిరిజనేతరులతో భౌగోళికంగా సంబంధాలు ఉండకపోవడం వలన వారంటే ఒకరకమైన బిడియం ఉంటుంది. నల్లమల అటవీ ప్రాంతంలో జీవించే చెంచులకు ఇతరులతో కనీసం మాట్లాడడం అలవాటు, ఇష్టం ఉండదు. సాధారణంగా ఆదివాసులు ఇతరులను అంత తేలికగా నమ్మరు. వారిది స్వచ్చమైన మనసు. కల్లా కపటం తెలీని వెర్రిబాగుల మనుషులు. రేపటి కోసం ఆహారం, సంపద కూడబెట్టుకోవడం అడవుల్లో జీవించే గిరిజనులకు తెలీదు. ఆహార సేకరణ దశలోనే ఇంకా కొన్ని తెగలు ఉన్నాయి. ప్రాధమికంగా ఆదివాసులకు వ్యవసాయం పట్ల ఆసక్తి ఉండదు. అడవి వారికి ఆదరించే అమ్మ, కాపాడే దైవం.  రోగమోచ్చినా, రొష్టు వచ్చినా వారు అడవుల్లో దొరికే ఆకు పసర్లు, వన మూలికల పైనే ఆధారపడతారు. వారి ఆర్ధిక వ్యవస్థ కూడా చాలా సింపుల్ గా ఉంటుంది. వేటాడిన జంతువుల మాంసం, అడవిలో గాలించిన కందమూలాలతో పాటు అరుదుగా వారు పోడు వ్యవసాయం చేసి పండించిన తృణ ధాన్యాలు వీరి ఆహారం. వేటాడిన జంతు మాంసాన్ని గూడెంలో ఉండే వారంతా సమానంగా పంచుకుంటారు. ఆ రకంగా వారిది ఆదిమ సామ్యవాదం (primitive socialism) అనుకోవచ్చు. సాధారణంగా ఒక్కో గిరిజన గూడెంలో పదీ, ఇరవై కుటుంబాల కంటే ఎక్కువ ఉండవు. వారు సేకరించిన అటవీ వస్తువులైన తేనె, చింతపండు, కరక్కాయలు, ఇప్పపూలు మొదలైన వాటిని గిరిజన కో ఆపరేటివ్ స్టోర్లలో ఇచ్చి వాటికి బదులు అడవిలో దొరకని తమకు అవసరమైన బట్టలు, నూనె వంటి సరుకులు తీసుకెళ్ళే వస్తుమార్పిడి విధానం చాలా గిరిజన ప్రాంతాల్లో ఇంకా అమలులో ఉంది. గిరిజనాభివృద్ధి సంస్థల యాజమాన్యం కింద పనిచేసే ఆ స్టోర్లలో కూడా నిర్వాహకులు అభం శుభం తెలియని గిరిజనులను మోసం చేస్తూ ఉంటారు.

ఆదివాసీ స్త్రీలు తమ ఆవాసాలతో మరింతగా పెనవేసుకుని ఉంటారు. వారి సమాజంలో స్త్రీలది ముఖ్యమైన స్థానమే కాక స్త్రీలు గిరిజన సంస్కృతికి, సంప్రదాయాలకు ప్రతినిధులుగా, వాటిని ఒక తరం నుంచి మరో తరానికి చేరవేసే వారధుగా ఉంటారు. లంబాడీ, సవర, జాతాపు వంటి కొన్ని తెగల స్త్రీల వస్త్రధారణ, కట్టు, బొట్టు వారి ప్రత్యేక సంస్కృతికి చిహ్నంగా ఉంటుంది. ఆదివాసీ కుటుంబాలు ఎక్కువగా మాతృస్వామిక వ్యవస్థ తాలూకు లక్షణాలను కలిగి ఉండడం విశేషం. వారి మతాచారాలు కూడా స్త్రీ కేంద్రంగా ఉంటాయి. స్త్రీ దేవతలను పూజించి వారికి జాతరలు, పండగలు చేస్తారు.  గతంలో వారు తమ గణాలకు నాయకురాళ్ళుగా ఉన్నట్టు వారి చరిత్ర చెబుతుంది. చాలా తెగలలో స్త్రీ, పురుషులిద్దరూ వేటకు వెళ్తారు. అయితే పితృస్వామిక లక్షణాలు ప్రస్పుటంగా కనిపించే కొన్ని ఆదివాసీ తెగలలో స్త్రీ, పురుషుల మధ్య శ్రమ విభజన జరిగి స్త్రీలు కేవలం చెట్లనుంచి కాయలు, పండ్లు, దుంపలు మాత్రమే సేకరించాల్సి ఉంటుంది. ఆదివాసీ స్త్రీలు మొదట వ్యవసాయపు పనులు చేసినట్టు తెలుస్తుంది. ఇప్పటికీ కోయ, సవర వంటి ఆదివాసీ తెగలలో వారి స్త్రీలు వ్యవసాయం చేస్తే పురుషులు సోమరిపోతులవలే కాలక్షేపం చేస్తుంటారు. స్త్రీలు తమ జీవితంలోని ప్రతిదానికి అడవిపైన, అందులో దొరికే వనరులపైన ఆధారపడతారు. వన మూలికలు, ఆకు పసర్లతో వైద్యం చెయ్యడంలో ఆదివాసీ స్త్రీలు నేర్పరులు. వారికి తేలు కాటు, పాముకాటు, జ్వరం, విరేచనాలు, వాంతులు వంటి ఆరోగ్య సమస్యలతో పాటు ప్రసవం, కటుంబ నియంత్రణలకు కూడా ఏ రకమైన మూలికలు అవసరమౌతాయో స్త్రీలకు తెలుసు. వారు అడవిలో మందు మొక్కలను గుర్తించడంలో నేర్పరులు. అలాగే జంతువుల, పక్షుల స్వభావాలు, వాటి అరుపులు తెలుసు. ఏ పక్షి అరుపు దేనికి సంకేతమో స్త్రీ, పురుషులిద్దరూ పసిగట్టగలరు.

మనిషి సంచార జీవనం గడిపే దశ నుంచి స్థిర నివాసం ఏర్పరచుకే దశకు మారడానికి ప్రధాన కారణం స్త్రీలే అని మానవ పరిణామ క్రమం చెబుతుంది. స్త్రీలు తమ శరీర ధర్మాలకు అనుకూలంగా స్థిర నివాసం కావాలని కోరుకోవడం, కని,పెంచే స్త్రీ తన బిడ్డల పోషణ కొరకు ఆహారోత్పత్తి వైపు ద్రుష్టి పెట్టడం, అందులో భాగంగా వ్య్యవసాయాన్ని కనిపెట్టడం అనే పరిణామాలు చోటుచేసుకున్నాయని ఆంత్రోపాలజీ అధ్యయనాలు వివరిస్తున్నాయి. అయితే మానవ జీవనంలో జరిగే ప్రధాన సంక్షోభాలైన ప్రక్రుతి వైపరిత్యాలు, యుద్ధాలు, దురాక్రమణల వలన ప్రజల రోజువారీ జీవనం దుర్భరమై వారు తమ నివాస స్థలాలు మారుతుంటారు. అలాగే దేశాలు విడిపోయినప్పుడు కూడా ప్రజల నివాస స్థలాన్ని ఒకచోట నుంచి మరో చోటికి మారవలసిన తప్పనిసరి పరిస్టితి ఏర్పడుతుంది. అటువంటి సంక్లిష్ట పరిస్థితిలో అందరికంటే తీవ్రమైన అభద్రతకు గురయ్యేది ఆయా సమూహాల స్త్రీలే. ‘నాగరిక సమాజం’ అని భావించే  స్త్రీల పరిస్థితి నివాస ప్రాంతాల మార్పు జరిగినప్పుడు అంతటి అభద్రతకు గురైతే అన్నెం పున్నెం ఎరగని, తమ పరిసరాలకు అంటి పెట్టుకుని జీవించే ఆదివాసి స్త్రీల పరిస్థితిని యిక ఊహించలేము. ఆదివాసులు అడవి నుంచి బైటకెళ్తే అందరికంటే ఆదివాసీ స్త్రీల జీవితం కల్లోలమౌతుంది. ప్రకృతితో ముడిపడి ఉండే వారి జీవితం ప్రశ్నార్ధకమౌతుంది. తమ పరిసరాల్లో సహజంగా వారికి లభించే రక్షణ వ్యవస్థ చిన్నాభిన్నమౌతుంది. వారి జీవనోపాధికి గండి పడుతుంది. వ్యవసాయంపైన ఆసక్తి చూపని ఆదివాసీ తెగలు అప్పుడప్పుడు కొండవాలుల్లో చేసే పోడు వ్యవసాయం కూడా లేకుండా ఆహార సమస్యతో అలమటిస్తారు. వేట, ఆహార సేకరణలకు అలవాటు పడిన వారికి బతకడానికి మరొక పని చేతకాదు. ఆధునిక జీవితంలో ఉండే ఆరోగ్య సౌకర్యాలను అందిపుచ్చుకునే చొరవ వారికి ఉండదు. ప్రకృతికి దూరమయ్యాక అన్ని రకాలుగా వారి జీవితం దుర్భరమౌతుంది. కొంతకాలంగా ప్రభుత్వ పర్యాటక విధానం వలన ఆదివాసుల ఆవాసాలు అనేకరకాలుగా కలుషితమై వారి సంస్కృతి విధ్వంసానికి గురౌతుంది. అడవి లోపల పర్యాటక శాఖవారు ఏర్పాటు చేసిన రిసార్టుల్లో దిగే యాత్రికుల నుండి ఇప్పటికే ఆదివాసీ స్త్రీలు అనేక వేధింపులు, లైంగిక దోపిడీలకు గురౌతున్నారు. వారు పారేసిన ప్లాస్టిక్ సంచులు, తిని పారేసే ప్లేటులు, గ్లాసులు, వాటర్ బాటిళ్ళు, మద్యం సీసాలతో  అడవి కలుషితమౌతుంది. పౌష్టికాహార లోపం, కనీస ఆరోగ్య సౌకర్యాల లేమితో అసలే అంతంత మాత్రంగా ఉండే వారి జీవన ప్రమాణాలు ఇతరుల జోక్యం వలన మరింత క్షీణిస్తాయి. బైట సమాజంలోని మధ్య తరగతి స్త్రీ సగటు జీవిత కాలం 54 సంవత్సరాలు కాగా సగటు ఆదివాసీ స్త్రీ జీవన ప్రమాణం సుమారు 30 సంవత్సరాలకు మించి ఉండదు. ఇక పిల్లలు, వృద్ధుల పరిస్థితి చెప్పనవసరం లేదు. వారంతా తమ పరిసరాలలో దొరికే కంద మూలాలు, కాయలు, పండ్లు వంటి ఆహారాన్ని కూడా కోల్పోయే పరిస్థితి వస్తుంది.

తరతరాలుగా సమాజం దృష్టిలో ‘ఇతరులు’గా మాత్రమే గాక నేరస్తులుగా పరిగణించబడే ఆదివాసుల జీవితం ఇప్పుడు నాలుగు రోడ్ల కూడలిలో నిలబడి ఉంది. మన ప్రాచీన నాగరికతకు చిహ్నాలుగా అనాదిగా పాతకాలపు పనిముట్లను, సాంకేతికతను వాడుతూ మన పక్కనే అడవిలో లేత చిగురుటాకుల మాదిరి అమాయకంగా జీవనం సాగిస్తున్న ఆదివాసుల హక్కుల పరిరక్షణ కోసం అందరూ మాట్లాడాల్సిన సమయం వచ్చింది. వారికి కనీసపు మానవ హక్కులున్నయనే విషయాన్ని కూడా గుర్తించకుండా వారి పట్ల ప్రభుత్వం చేపడుతున్న విధానాలను వ్యతిరేస్తూ ప్రజలు, ప్రజాస్వామికవాదులు గొంతెత్తాలి. ‘నాగరిక సమాజం’ ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వాలు ఆదివాసుల పట్ల అనాగరికంగా వ్యవరించడం వారి జీవించే హక్కును కాలరాయడమేనని గుర్తించాలి. వారికి తెల్సిన సంప్రదాయ వృత్తుల్ని ప్రోత్సహిస్తూ సరైన జీవనోపాధి కల్పించాలి. వారి బతుకులను చిన్నాభిన్నం చేసే అటవీ చట్టాలను వెనక్కి తీసుకుని ఆదివాసులు తమ ఆవాసాలలో తమకిష్టమైన స్వేచ్చాయుతమైన జీవనం కొనసాగించుకునే అవకాశం కల్పించాలి.  నీరు, అడవిలో తాము నివసించే భూమి అడవి బిడ్డల హక్కు. ముఖ్యంగా అడవంటే వారి ఇల్లు అని ప్రభుత్వాలు గుర్తించాలి.

చల్లపల్లి స్వరూపరాణి                                                 

(Matruka Sowjanyamtho..)

RELATED ARTICLES

Latest Updates