
మోడీ నేతృత్వంలోని బిజెపి వరుసగా రెండోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత తాజాగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. అయితే ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ అంకెల గారడీ చేశారు. ప్రస్తుత, గత బడ్జెట్లలో కేంద్ర ప్రభుత్వ ఆదాయ, వ్యయాలకు సంబంధించిన వాస్తవ గణాంకాలను సీతారామన్ తన తాజా బడ్జెట్ ప్రసంగంలో విస్మరించారు. దీనిపై దేశ ప్రజలు, విశ్లేషకులు, మేధావులు విస్తృతంగా చర్చించారు. ఈ గణాంకాల ఆధారంగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన బడ్జెట్లో వారి ఆర్థిక ప్రాధాన్యతలపై ప్రజలు ఒక అంచనాకు వస్తారు. అయితే దీనిపై వస్తున్న విమర్శలకు సీతారామన్ స్పందిస్తూ బడ్జెట్‌కు సంబంధించి ఇచ్చే సప్లిమెంటరీ మెటీరియల్‌లో అన్ని గణాంకాలు ఉంటాయని, కాబట్టి ప్రసంగంలో వాటన్నంటినీ చదవాల్సిన పనిలేదని ఆమె చెప్పుకొచ్చారు. అయితే ప్రజలందరూ ఆమె మెటీరియల్లోకి వెళ్లి ప్రభుత్వ ఆదాయ, వ్యయ గణాంకాల గురించి తెలుసుకోలేరు కదా.. అయితే బడ్జెట్ ప్రసంగంలో ఈ గణాంకాల విస్మరణ వెనుక ఒక కారణం ఉంది. బడ్జెట్ పత్రాల్లో ఇచ్చిన అంకెలు, గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయ, వ్యయాలతో పోల్చితే అవి కేవలం తప్పుదారి పట్టించేవిగానే కాదు తప్పుడు గణాంకాలని తెలుస్తోంది. దీనికి తాజా బడ్జెట్‌కు ముందు ప్రవేశపెట్టిన 2018-19 ఆర్థిక సర్వే ఆధారంగా నిలుస్తోంది. దీనికి చెందిన వాల్యూమ్-2లోని పేజీ ఎ59లోని టేబుల్ 2.5 ఆదాయ వ్యయాలకు సంబంధించిన గణాంకాలను అందిస్తోంది. ఆ టేబుల్లోని చివరి కాలమ్‌లో 2018-19 సంవత్సరానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ సొంత లెక్కల ప్రకారం వాస్తవ మొత్తాలను వెల్లడిస్తోంది. ఈ సర్వేను ఫిబ్రవరి లేదా మార్చిలో కాకుండా జులైలో తీసుకొచ్చినందున 2019, మార్చి 31తో ముగిసిన అర్థిక సంవత్సరం యొక్క వాస్తవ ఆదాయ, వ్యయాలను లెక్కించేందుకు మంత్రిత్వ శాఖకు తగినంత సమయం దొరికింది. ఈ గణాంకాలను కాగ్ ద్వారా వెలువడే గణాంకాలు కాబట్టి అవి దాదాపు సరైనవిగా ఉండాల్సి ఉంది.
బడ్జెట్ ప్రసంగంలో ప్రభుత్వం వెల్లడించిన ఆదాయ, వ్యయ లెక్కలు పూర్తి లోపాలు, భారీ వ్యత్యాసాలతో కూడుకొని ఉన్నాయి. అయితే అవి బడ్జెట్ పత్రాల్లో మాత్రం లేవు. ఆర్థిక సర్వే ప్రకారం 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సవరించిన అంచనాలకు, ప్రభుత్వం ఆ సంవత్సరంలో చెప్పిన వాస్తవ ఆదాయ, వ్యయ గణాంకాలకు పొంతన కనిపించకపోవడం ఇక్కడ గమనించాల్సిన అంశం. మొత్తం గణాంకాలన్నీ ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి వస్తాయి. కానీ ఈ డేటాను ప్రభుత్వం బడ్జెట్ పత్రాల్లో చూపలేదు. ప్రభుత్వం చెప్పిన పన్ను ఆదాయ లెక్కల్లో ఈ తేడాలు స్పష్టంగా కనిపిస్తాయి. మొత్తం పన్నుల నుంచి వచ్చే ఆదాయం సవరించిన అంచనాల కంటే రూ.1,65,176 కోట్లు (13.5 శాతం) తక్కువగా ఉంది. జిఎస్టి పన్ను వసూళ్లలో వచ్చిన కొరత కారణంగానే ఈ వ్యత్యాసం ఏర్పడింది. ప్రభుత్వం యొక్క మొత్తం వ్యయం సవరించిన అంచనాల కంటే రూ.1,45,813 కోట్లు(13.4 శాతం) తక్కువగా ఉంది.అయితే ఈ లెక్కలేవీ కూడా ప్రజలకు వినిపించిన బడ్జెట్ ప్రసంగాల్లో కనిపించవు., వినిపించవు. చెప్పిన వాస్తవ గణాంకాల ప్రకారం సవరించిన అంచనాల్లో చెప్పిన దానికంటే ద్రవ్యలోటు జిడిపిలో 3.45 శాతం ఉండాలి. కానీ 3.3 శాతమే ఉందని ప్రభుత్వం తాజా బడ్జెట్లో ప్రకటించింది. ప్రభుత్వం చెప్తున్న ఈ వాస్తవ గణాంకాలు సరైనవి అని అనుకుంటే, 2018-19 సవరించిన అంచనాలు ఎంతమాత్రం సరికావు. దీంతో గత వ్యయాలపై ఇది తీవ్ర వివాదానికి దారితీస్తుంది. గత సంవత్సరం పన్ను నుంచి వచ్చే ఆదాయం తగ్గడంతో ప్రజలపై వెచ్చించే ఖర్చులపై కూడా ప్రభుత్వం కోతలు విధించింది. అయితే ఏ అంశానికి, ఎంత మొత్తంలో కోత విధించిందో ఎలా తెలుసుకోవాలనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ విషయాలన్నింటిపై ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. కానీ అది ప్రభుత్వం చేయకపోవడంతో తాజాగా బడ్జెట్లో చేసిన కేటాయింపులపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. పలానా అంశాలపై ప్రభుత్వం ఏకపక్షంగా కోతలు విధిస్తే దానికి ఖచ్చితంగా ప్రజల దృష్టికి తీసుకురావాలి. మునుపటి సవరించిన అంచనాలు, వాస్తవ గణాంకాలను బహిరంగంగా చెప్పకపోవడం అసంబద్ధం. ఇది పార్లమెంట్, ప్రజలను ఖచ్చితంగా మోసం చేసినట్లే అవుతుంది. సత్యాన్ని దాచేందుకు ప్రభుత్వం ఎంచుకున్న విధా నం అయితే ప్రభుత్వం నుంచి ఇకపై వచ్చే గణాంకాలను ప్రజలు ఎలా విశ్వసించ గలరు అని పాలకులు తమకు తాము ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది.
(ప్రజాశక్తి సౌజన్యంతో..)