జ్వరాలతో జేబు గుల్ల

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

– ఖమ్మం జిల్లాలో పిండుకున్న మొత్తం రూ.180 కోట్లు
– జిల్లావ్యాప్తంగా నెల రోజుల్లో 2.30 లక్షల మందికిపైగా రోగులు
– ప్రభుత్వాస్పత్రిలో 50 వేల మంది.. మిగతా వారు ప్రయివేటులో వైద్యం
– డెంగ్యూ బూచీతో అడ్డగోలుగా దోపిడీ
– ఆరోగ్య శాఖ మంత్రి పర్యటించినా మారనితీరు
మా బాబుకు జ్వరం వస్తే ఖమ్మంలోని ప్రయివేటు ఆస్పత్రిలో పరీక్షలు చేయించాం. డెంగ్యూ పాజిటివ్‌ వచ్చిందన్నారు. ఆస్పత్రిలో అడ్మిట్‌ చేయిస్తే ఖర్చు తడిసి మోపెడైంది. వారం తర్వాత డిశ్చార్జి చేసేసరికి రూ.70 వేల బిల్లయ్యింది’ అని ఖమ్మంకు చెందిన న్యాయవాది మర్రి ప్రకాశ్‌ ఆశ్చర్యపోయారు.’నాకు డెంగ్యూ వచ్చిందన్నారు. ఐదురోజులు ఆస్పత్రిలో ఉంచి రూ.45వేలు చెల్లించాలన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో డబ్బులు చెల్లించి ఇంటికి చేరాను. నాతో పాటు అదే ఆస్పత్రిలో ప్లేట్‌లెట్లు తగ్గినట్టు చెబుతున్న రోగులు వందమందికి పైగానే ఉన్నారు’ అని సింగరాయపాలెం పి నరేష్‌ కంగుతిన్నాడు.

ఖమ్మం జిల్లాలో వైద్యం పేరిట అడ్డగోలు దోపిడీ జరుగుతున్నది. కేవలం నెల రోజుల్లో ఏకంగా రూ.180 కోట్లకుపైగా వైద్య వ్యాపారం జరిగిందంటే అతిశయోక్తి కాదు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు సుమారు 2.30లక్షల మంది వివిధ రకాల జ్వరాలతో మంచం పట్టగా అందులో 50వేల మంది ప్రభుత్వాస్పత్రిలోనే చికిత్స పొందారు. ప్రయివేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందిన లక్షా 80 వేల మంది రోగులకు సగటున ఒకరికి రూ.10 వేలు లెక్కకట్టినా రూ.180 కోట్లు ఖర్చవడం గమనార్హం. అయితే విషజ్వరాల బారిన పడిన ఒక వ్యక్తి 50వేల రూపాయలు తగ్గకుండా బిల్లు చెల్లిస్తున్నాడంటే ఖమ్మం జిల్లాలో నెలరోజుల్లోనే వైద్యం ఖర్చు వెయ్యి కోట్ల వరకు చేరిందని అర్థమవుతున్నది.

నెలరోజుల్లోనే లక్షల మందికి ఫీవర్‌: ఖమ్మం జిల్లా కేంద్రంలో సుమారు 250 ఆస్పత్రులున్నాయి. ఖమ్మం, మహబూబాబాద్‌, సూర్యాపేట, భద్రాద్రి, కృష్ణా, భూపాలపల్లి జిల్లాలకు చెందిన రోగులు నగరంలోని వివిధ ఆస్పత్రులకు ఎక్కువగా వస్తుంటారు. వాటితో పాటు ఖమ్మం ప్రభుత్వ ప్రధాన వైద్యశాల కూడా ఉంది. నిత్యం ఈ ఆస్పత్రికి కనీసం 1500 నుంచి 1800మంది వరకూ రోగులు వస్తున్నారు. ప్రధానమైన 10 ఆస్పత్రుల్లో నిత్యం 1200 మందికి తగ్గకుండా రోగులు చికిత్స కోసం ఆశ్రయిస్తున్నారు. మిగిలిన ఆస్పత్రులకు సగటున 4800 మంది చొప్పున వస్తున్నారు. ఈ లెక్కన అన్ని ప్రయివేటు ఆస్పత్రుల్లో కలిపి సుమారు లక్షా 80వేల మంది రోగులు రావడం గమనార్హం. ప్రభుత్వ ఆస్పత్రికి ఒక్క నెలలోనే 50వేల మంది రోగులు వచ్చారు.

వెయ్యి దాటిన డెంగ్యూ కేసులు: జిల్లాలో ఇప్పటికే దాదాపు 50మందికిపైగా విషజ్వరాలతో మృతిచెందిన విషయం తెలిసిందే. ఒక్క ప్రభుత్వ వైద్య శాలలోనే ఏకంగా 1007 మంది రోగులకు డెంగ్యూ పాజిటివ్‌ నిర్ధారించారు. అయితే ఇక్కడ బెడ్లులేక పేదలు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయివేటు ఆస్పత్రుల్లో చేరుతున్నారు. దీన్ని ఆసరా చేసుకుని ప్రయివేటు ఆసుపత్రుల్లోనూ బెడ్లు ఖాళీ లేవని చెప్పి సాధారణ బెడ్‌కు 2,500 నుంచి రూ4వేల వరకు, ప్రత్యేక గదులుంటే రూ.6వేల వరకు వసూలు చేస్తున్నారు. దీంతో సామాన్యులపై లక్షలాది రూపాయలు భారం పడుతున్నది. ప్రయివేటు ఆస్పత్రికి వెళ్తే చాలు డాక్టరుఫీజు, టెస్టులకే మూడు, నాలుగు వేల రూపాయలు చెల్లిస్తున్నారు. ఈ నెల రోజుల్లో చికిత్స పొందిన వారు ఎవరూ ఆస్పత్రిలో పదివేలకు తక్కువగా బిల్లుతో బయటపడిన వారు లేరు. సరాసరిగా ఒక్కో పేషెంట్‌ రూ.10వేలు ఖర్చు చేసినా ప్రయివేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందినవారు పెట్టిన ఖర్చు రూ.180కోట్లు ఉంటుంది.

బెడ్‌ దొరికితే అదే పదివేలు: నగరంలోని ఏ ఒక్క ఆస్పత్రిలోనూ బెడ్డు ఖాళీగా లేదు. విషజ్వరంతో వచ్చిన వారు బెడ్లులేక కిడ్నీ, గుండె, చాతీ, తదితర ప్రత్యేక ఆస్పత్రుల్లోనూ చేరుతుండటం పరిస్థితికి అద్దం పడుతోంది. బెడ్‌ దొరక్కపోతే వైద్యం అందక ప్రాణాలు పోతాయన్న భయంతో రోగులు ఎంతకైనా డబ్బులు చెల్లించేందుకు వెనుకాడటం లేదు. చింతకాని మండలంలోని నాగులవంచ, పాతర్లపాడు, ఖమ్మం కార్పొరేషన్‌ పరిధిలోని గుదిమళ్ల, ముదిగొండ మండలం బాణాపురం, తదితర గ్రామాల్లో 70శాతం ప్రజలు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

మంత్రి చెప్పినా మారని తీరు: ఇటీవల మంత్రి ఈటల రాజేందర్‌ జిల్లా అధికారులతో కలెక్టరేట్‌లో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి డెంగ్యూ పేరిట జరుగుతున్న ప్రచారాన్ని, ప్రయివేటు ఆస్పత్రుల దోపిడీని అరికట్టాలని ఆదేశించారు. పేదలను ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చేలా అవగాహన పెంచాలని సూచించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌ పలుమార్లు అధికారులతో సమావేశాలు నిర్వహించి, జిల్లా పలుప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. అయినా కిందిస్థాయి అధికారులు పట్టించుకున్న దాఖలాల్లేవని రోగులు, ప్రజలు ఆరోపిస్తున్నారు.

ఆందోళన చెందవద్దు : కళావతీభాయి, డీఎంహెచ్‌ఓ: డెంగ్యూపేరిట జరిగే ప్రచారం నమ్మి ఆందోళన చెందవద్దు. అనవసర వైద్య ఖర్చులతో ఆర్థికంగా నష్టపోవద్దు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగానే వైద్యపరీక్షలు, మందులు ఇస్తారు. వినియోగించుకోవాలి. జ్వరంతో ఉన్నప్పుడు సాధారణంగా ప్లేట్‌లెట్లు తగ్గుతాయి. అది డెంగ్యూ అని భయపడొద్దు.

జిల్లాలో హెల్త్‌ ఎమర్జెన్సీని ప్రకటించాలి : నున్నానాగేశ్వరరావు, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి
రోజురోజుకూ జ్వరపీడి తులు పెరుగుతుండటంతో జిల్లా లో హెల్త్‌ఎమర్జెన్సీని ప్రకటిం చాలి. ఈ మేరకు సీపీఐ(ఎం) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన చేప ట్టార. ప్రయివేటు ఆస్పత్రు ల్లో పేదలను డెంగ్యూ పేరిట దోపిడీ చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలి. సిబ్బందిని భర్తీ చేయాలి.

Courtesy NavaTelangana..

 

RELATED ARTICLES

Latest Updates