రాష్ట్రానికి దోమకాటు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

  • భారీగా పెరుగుతున్న జ్వరపీడితులు
  • ఉమ్మడి 10 జిల్లాల్లో మూడు చోట్లే మలేరియా అధికారులు
  • భర్తీకి నోచుకోని కీటక జనిత వ్యాధుల నియంత్రణాధికారుల పోస్టులు
  • కొరవడిన పర్యవేక్షణ
  • బుధవారం ఒక్క రోజే రాష్ట్రంలో 50 డెంగీ కేసుల నమోదు
  • హైదరాబాద్ లో ఓ చిన్నారి మృతి

రాష్ట్రవ్యాప్తంగా దోమకాటు సంబంధిత జ్వర పీడితుల సంఖ్య భారీగా నమోదవుతోంది. నియంత్రణ చర్యలకు మంత్రులు, అధికారులు ఆదేశాలు జారీచేస్తున్నా.. ఆయా విభాగాల్లో సిబ్బంది కొరతతో ఆచరణకు నోచుకోని పరిస్థితి నెలకొంది. దోమలను, జ్వరాలను అరికట్టలేని దుస్థితి వేధిస్తోంది. ఈ నెల 4న ఒక్క రోజే రాష్ట్రంలో 50 డెంగీ కేసులు నమోదు కావడం, ఓ చిన్నారి మృతి చెందడం పరిస్థితికి అద్దం పడుతోంది.

కీటక నియంత్రణకు వైద్య ఆరోగ్యశాఖలో ప్రత్యేక వ్యవస్థ ఉంది. ఏళ్లుగా ఈ విభాగంలో అధికారులను భర్తీ చేయకపోవడం తీవ్ర సమస్యగా పరిణమించింది. దాదాపు 50 ఏళ్ల కిందట ఆరోగ్యశాఖలో మలేరియా నివారణ వ్యవస్థ ఏర్పాటైంది. తర్వాత డెంగీ, చికున్గన్యా తదితర దోమకాటు జబ్బులు పెరిగిపోవడంతో.. ఈ అధికారులను కీటక జనిత వ్యాధుల నియంత్రణ వ్యవస్థ పరిధిలోకి తీసుకొచ్చారు. దోమల నివారణ చర్యలు, ప్రజల్లో అవగాహన కల్పించడం, బాధితులకు మెరుగైన వైద్యమందించడం ఈ విభాగం విధుల్లో భాగమే. పరిధి పెరిగిన నిష్పత్తిలో కీటక జనిత వ్యాధుల నియంత్రణాధికారుల సంఖ్య పెరగకపోవడం, ఖాళీలను భర్తీ చేయకపోవడంతో నివారణ, అవగాహన కార్యక్రమాలు తగ్గిపోయాయి.

క్షేత్రస్థాయిలో ప్రత్యేక సిబ్బంది ఏరి?

20 ఏళ్ల కిందటి వరకూ మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ (ఎంపీహెచ్ఏ) పోస్టుల్లో పురుష, మహిళా అభ్యర్థులను తీసుకునేవారు. పురుష ఉద్యోగులు దోమల వ్యాధుల నివారణ, అవగాహన, చికిత్సల్లో చురుగ్గా ఉండేవారు. ప్రతి 5 వేల జనాభాకు ఒకరు చొప్పున పనిచేస్తూ.. సీజనల్ వ్యాధుల నివారణ చర్యల్లో పాలుపంచుకునేవారు. గ్రామాల్లో మలేరియా అనుమానితుల నుంచి రక్తనమూనాలు సేకరించి పరీక్షలకు పంపించేవారు. 2001 నుంచి ఎంపీ హెచ్ఏ పురుష అభ్యర్థుల నియామకాలను ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో కీటక జనిత వ్యాధులపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టే పరిస్థితి తగ్గిపోయింది.

కీటక జనిత వ్యాధుల నియంత్రణ వ్యవస్థలో ఖాళీలిలా..

  • అదనపు సంచాలకులు: ఏళ్లుగా భర్తీకి నోచుకోని ఈ పోస్టును వారం క్రితమే భర్తీ చేశారు.
  • ఉపసంచాలకులు: ఈ పోస్టు ఆరేళ్లుగా ఖాళీగా ఉంది.
  • జిల్లా నియంత్రణాధికారులు: ఉమ్మడి పది జిల్లాల్లో.. 1 జిల్లాల్లో ఈ అధికారులు లేరు. కొత్త జిల్లాలకు ఈ పోస్టులను మంజూరు చేయలేదు.

డెంగీతో చిన్నారి మృతి

హైదరాబాద్ లాలాపేట పరిధి లక్ష్మీనగర్ యాదవబస్తీలో డెంగీ జ్వరంతో చిన్నారి (4) మృతి చెందింది. నాలుగు రోజుల క్రితం బాలిక జ్వరం బారిన పడింది. స్థానికంగా చికిత్స చేయించినప్పటికీ ఫలితం లేకపోవడంతో రెండు రోజుల క్రితం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున బాలిక మృతి చెందింది.

(COURTECY EENADU)

RELATED ARTICLES

Latest Updates