దళిత పరిశోధక విద్యార్థులపై వివక్ష

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

డా. చింతకింది కాశీం

ఆర్‌జీఎన్‌ఎఫ్‌ వలన ఈ పదిహేనేళ్లలో కనీసం ముప్పై వేల ఎస్సీ కుటుంబాలు, పది వేల ఎస్టీ కుటుంబాలు ఇంకో ఇరవై వేల బీసీ, మైనార్టీ కుటుంబాలు బాగుపడ్డాయి. పరిశోధనలు జరగటం మాత్రమే కాకుండా, సూక్ష్మ స్థాయిలో కుటుంబాలు కూడా మెరుగయ్యాయి. పరోక్షంగా మరో లక్ష కుటుంబాలు ప్రయోజనం పొందాయి. ఉపరితలంలోని ఈ సామాజిక మార్పును అంగీకరించలేని వర్గాలకు ఇది నచ్చలేదు.

 దేశ వ్యాపితంగా వివిధ విశ్వవిద్యాలయాలలో పరిశోధన చేస్తున్న ఎస్సీ, ఎస్టీ పరిశోధక విద్యార్థులకు అందుతున్న రాజీవ్‌గాంధీ నేషనల్‌ ఫెలోషిప్స్‌ (ఆర్‌జీఎన్‌ఎఫ్‌)ను కేంద్ర ప్రభుత్వం మూడేళ్లుగా ఎస్సీలకు నిలిపివేసి, ఎస్టీ విద్యార్థులకు మాత్రమే విడుదల చేస్తున్నది. ఎస్సీ విద్యార్థులకు ఆగిపోవడానికి కారణాలుగా ప్రభుత్వ వర్గాల నుంచి ఏ సమచారమూ లేదు. ఫలితంగా ఆ వర్గానికి చెందిన విద్యార్థులలో ఆందోళన మొదలైంది. ఎస్సీ స్కాలర్స్‌ ఆయా విశ్వవిద్యాలయాలలో తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. రాజ్యాంగ ఫలాలను సకాలంలో లబ్ధిదారులకు అందించటంలో విఫలమైన పాలకవర్గాలు ఈ నిరసనలను విజ్ఞాపనలుగా గుర్తించి సానుకూల దృష్టితో సమస్యను పరిష్కరించాలి. అలా కాకుండా రాజకీయ, సామాజిక కోణంలో ఆలోచించి వైరి వర్గాల అలజడిగా పరిగణిస్తే ఆందోళనలు మరింత ముందుకు వెళ్లవచ్చు.

 విశ్వవిద్యాలయాలలో జరిగే పరిశోధనలకు ప్రపంచ వ్యాపిత గుర్తింపు ఉంటుంది. పరిశోధనల ఫలాలు దేశమంతా అందుతాయి. ఏ దేశంలోనైనా భిన్న సామాజిక సమూహాల ప్రవేశంతోనే పరిశోధన రంగం వికసిస్తుంది. కానీ, భారతదేశంలో కొన్ని సమూహాలు వేల సంవత్సరాలుగా విద్యకు, మేధో రంగానికి దూరం చేయబడ్డాయి. వైదిక వాఙ్మయం పేరిట చలామణి అయిన వ్యవస్థలు మానవ సమానత్వ భావనను అంగీకరించలేదు. అందుకే మన దేశంలో ప్రపంచం గర్వించదగిన ప్రయోగాలు, పరిశోధనలు, ఫలితాలు రాలేదు. మెజార్టీ ప్రజల ఆలోచనలు చాలారోజుల వరకు విద్యకు ఆవల ఉండిపోయాయి. శాస్త్ర సాంకేతిక రంగమంటే ఒకటి రెండు వర్గాలకే పరిమితమైన స్థితి నేటికి ఉంది. బహుళ ఆలోచనలకు పరిమితులు లేని సమాజంలో పరిశోధనలు జరిగినప్పుడే సమాజ గమనం ముందుకు వెళ్తుంది. బ్రిటిష్‌ అనంతర భారతదేశంలో దళితులు రాజ్యాంగ వ్యవస్థలు కల్పించిన ఫలితాలను పొందడానికి చాలా కాలం పట్టింది.

 ప్రభుత్వం, దానికొక నిర్మాణం, తమ మనుగడ కోసం అది కల్పించే అవకాశాలు తెలియని లోకంలో దళితులను ఉంచారు. అంబేడ్కర్‌ సాధించి పెట్టిన హక్కుల స్పృహ కూడా మెజార్టీ దళితులకు 1970 వరకు లేదు. విద్య,- ఉద్యోగాలలో రిజర్వేషన్‌ ఫలాలను అందుకోవాలనే చైతన్యం చాలా ఆలస్యంగా పొందిన దళితులు ఉన్నత విద్యారంగంలోకి 90వ దశకంలో ప్రవేశించారు. అంటే 1950లో రాజ్యాంగం అమలులోకి వస్తే ఈ వర్గాలు విశ్వవిద్యాలయ స్థాయి విద్యను అందుకోవడానికి నలభై ఏళ్లు పట్టింది. ఆ నాటికైనా శ్రమ జీవితం నుంచి పొందిన జ్ఞానాన్ని జోడించి పరిశోధనలు చేయడానికి దళిత విద్యార్థులకు ఆర్థిక వెసులుబాటు లేదు. పీజీ స్థాయి విద్యతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొత్త సామాజిక సమూహాలు, వారి ఆలోచనలు పరిశోధనలలోకి ప్రవేశించాలంటే ఆ విద్యార్థులకు ఫెలోషిప్స్‌ ఇవ్వాలనే డిమాండ్‌ ఎప్పటి నుంచో ఉండింది. తగిన పోరాటం లేకపోయినా మేధావి వర్గంలో చర్చ నడిచింది.

2004లో కాంగ్రెస్‌ పార్టీ యూపీఏ పేరుతో కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పరిచింది. ప్రాంతీయ పార్టీలు ఏర్పడడం, బహుజన సమాజ్‌వాది పార్టీ పుట్టడం, అస్తిత్వ ఉద్యమాలు ముందుకు వచ్చి అగ్రకుల పాలకపార్టీల మీద విమర్శ పెట్టడం, మేధావి వర్గంలో విప్లవ శక్తులకు మద్దతు పెరగడం లాంటి అననుకూల పరిస్థితి ఒకవైపు ఉండగా.. ప్రజల ప్రయోజనాలను ప్రతిబింబించే అభివృద్ధి నమూనా కాంగ్రెస్‌ పార్టీ వద్ద లేకపోయింది. పైగా బహుళజాతి కంపెనీలకు అనుకూలమైన ఆర్థిక విధానాలను రూపొందించింది. స్థూలంగా ఈ అయిదు కారణాల వలన దేశంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రభ తగ్గిపోయింది. ముఖ్యంగా నెహ్రూ కాలం నుంచి ఆ పార్టీకి బలమైన ఓటు బ్యాంకుగా ఉన్న ఎస్సీ, ఎస్టీ వర్గాలు దూరం జరగటం మొదలైంది. ఇట్లాంటి వాతావరణంలో 2004లో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో యూపీఏ అధికారంలోకి వచ్చింది.

 దూరమైన ఈ సమూహాలను దగ్గరకు చేసుకొనే నష్ట నివారణ చర్యలను కాంగ్రెస్‌లోని కొందరు ప్రజాస్వామిక వాదులు ఆపార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సూచించారు. దాని కోసం ఒక కార్యాచరణను రూపొందించాలని కూడా భావించారు. అందులో భాగంగానే 2004 జూన్‌ 4న సోనియా గాంధీ చైర్మన్‌గా నేషనల్‌ అడ్వైజరీ కౌన్సిల్‌(ఎన్‌ఏసీ) ఏర్పాటైంది. నేషనల్‌ కామన్‌ మినిమమ్‌ ప్రోగ్రాంలో భాగంగానే ఎన్‌ఏసి ఏర్పడింది. ‘మన్మోహన్‌ సింగ్‌ మంత్రివర్గం ఉండగా ఎన్‌ఏసి పేరిట మరో రాజ్యాంగేతర మంత్రివర్గాన్ని సోనియాగాంధీ రూపొందించుకున్నారని ఆనాటి ప్రతిపక్షాలు విమర్శించాయి. అయినా, ఎన్‌ఏసికి చట్టబద్దత కల్పించుకొని తాను సంకల్పించిన పనులను చేశారు సోనియా. ఎన్‌ఏసి సభ్యులుగా అరుణ్‌రాయ్‌, ప్రొఫెసర్‌ స్వామినాథన్‌, లోక్‌సత్తా జయప్రకాశ్‌ నారాయణ మొదలైన ప్రజాస్వామిక, ఉదారవాదులు ఉండటం వలన కొన్ని అయినా ప్రజలకు మేలు చేసే అంశాలు ఆచరణలోకి వచ్చాయి. వాటిలో ఒకటి రాజీవ్‌ గాంధీ నేషనల్‌ ఫెలోషిప్‌.

 ఉన్నత విద్యలోకి ఇప్పుడిప్పుడే ప్రవేశిస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం విద్యార్థుల కోసం ఈ ఫెలోషిప్‌ను ప్రవేశపెట్టారు. వేల సంవత్సరాలుగా విద్యకు దూరమైన ఈ సామాజిక సమూహాలకు ఆర్థిక చేయుతనివ్వటం వలన పరిశోధనా రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తాయని ఆ కౌన్సిల్‌ సభ్యులు భావించారు. ఘనీభవించిన పరిశోధన రంగం ద్రవస్థితిలోకి రావటానికి అట్టడుగు వర్గం నుంచి వచ్చిన పరిశోధకులు కృషి చేస్తారని కూడా వాళ్లు ఆశించారు. ‘విద్య, పరిశోధనలలోకి కింది వర్గాలను ప్రోత్సహించటం, పరిశోధనలో నాణ్యతను పెంచి జ్ఞాన సమాజం వైపు ప్రయాణించాలని’ ఆర్‌జీఎన్‌ఎఫ్‌ లక్ష్యంగా ప్రకటించారు. దీన్ని 2005–-06 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించారు. మొదట్లో ఎస్సీ విద్యార్థులకు మాత్రమే పరిమితం చేసిన ఈ ఫెలోషిప్‌కు పీజీ స్థాయిలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేసేవాళ్లు. తర్వాతి కాలంలో పీహెచ్‌డీలో చేరిన విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలనే నియమాన్ని తీసుకొచ్చారు. ప్రతీ సంవత్సరం దేశ వ్యాపితంగా 2000 ఫెలోషిప్‌ను ఇవ్వాలని ప్రభుత్వం భావించింది. దీనిని కొన్నాళ్లకు ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు కూడా విస్తరించారు.

 సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఆర్‌జీఎన్‌ఎఫ్‌ నిర్వహణ ఉండేది. ఎంపిక విధానాన్ని యూజీసీ పర్యవేక్షించేది. ఈ ప్రక్రియ 2017 వరకు నిరాటంకంగా కొనసాగింది. ఈ ఇరవై ఏళ్లలో ఎందరో పరిశోధకులు ఈ ఫెలోషిప్‌ను ఉపయోగించుకొని నాణ్యమైన పరిశోధనలు చేసారు. సమాజాన్ని, రాజకీయార్థిక విధానాలను, ప్రకృతి శాస్త్రాలను కొత్త దృష్టితో విశ్లేషించే పద్ధతి పరిశోధనా రంగంలోకి ప్రవేశించింది. సాహిత్యంలోనైతే బ్రాహ్మణీయ భావజాలానికి ప్రత్యామ్నాయ ఆలోచనలు పరిశోధనలోకి వచ్చాయి. పరిశోధన పరికరాలు మారిపోయాయి. విశ్లేషణ పద్ధతిలో కూడా మార్పులు వచ్చాయి. ఫెలోషిప్‌ రావటం వలన పరిశోధకులకు ఆర్థిక వెసులుబాటు లభించింది. అధ్యయనం కోసం పుస్తకాలు సొంతంగా సమకూర్చుకున్నారు. పరిశోధిత అంశానికి సంబంధించి క్షేత్ర పర్యటనలు చేయడానికి గతంలో ఉండిన ఆర్థిక లేమిని ఈ కాలం పరిశోధకులు అధిగమించారు. ఉత్పత్తి కులాల నుంచి వచ్చిన వీరు అధ్యయనం, పరిశోధనతో పాటు తమ సామాజిక బాధ్యతగా సామాజిక ఉద్యమాలలో పాల్గొంటూ, నాయకత్వం వహించారు. ముఖ్యంగా మార్క్స్‌, అంబేడ్కర్‌ ఆలోచనల ఆధారంగా విశ్వవిద్యాలయాల రాజకీయాలను ప్రభావితం చేసారు.

 ఫెలోషిప్‌ పొందిన పరిశోధకులు తమ సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తూనే, వైయక్తిక స్థాయిలో కుటుంబ అస్తిత్వాన్ని నిలబెట్టుకున్నారు. వేల సంవత్సరాలుగా సంపదకు, సామాజిక హోదాకు, విద్యకు దూరమైన వర్గాల కుటుంబాలకు ఫెలోషిప్‌ల ద్వారా మేలు జరిగింది. సొంత గ్రామాలలో ఉండడానికి ఇళ్లు లేక చదువుకునే వాతావరణం ఉండేది కాదు. ఫెలోషిప్‌ వచ్చాక ఉన్నదాంట్లో కొంత మేరకైనా సొంత ఇళ్లను నిర్మించుకునే అవకాశం ఏర్పడింది. తల్లిదండ్రుల అనారోగ్య సమస్యలకు పరిష్కారంగా మెరుగైన వైద్యం అందించ గలిగారు. మధ్యలో ఆగిపోయిన తోబుట్టువుల పెళ్లిళ్లు చేయడమే కాకుండా, తాము కూడా వివాహాలు చేసుకున్నారు. ఈ ఫెలోషిప్‌లు లేకపోతే ఇన్ని వేల కుటుంబాలు సామాజిక సంక్షోభంలో పడిపోయేవి.

 ఇట్లా ఆర్‌జీఎన్‌ఎఫ్‌ వలన ఈ పదిహేనేళ్లలో కనీసం ముప్పై వేల ఎస్సీ కుటుంబాలు, పది వేల ఎస్టీ కుటుంబాలు ఇంకో ఇరవై వేల బీసీ, మైనార్టీ కుటుంబాలు బాగుపడ్డాయి. పరిశోధనలు జరగటం మాత్రమే కాకుండా, సూక్ష్మ స్థాయిలో కుటుంబాలు కూడా మెరుగయ్యాయి. పరోక్షంగా మరో లక్ష కుటుంబాలు ప్రయోజనం పొందాయి. దేశ ప్రగతిలో వాళ్లు కూడా పాక్షికంగానైనా భాగమయ్యే అవకాశం లభించింది. అట్టడుగు వర్గాలలోని కుటుంబాలు ప్రధాన స్రవంతిలోకి వచ్చారు. ఉపరితలంలోని ఈ సామాజిక మార్పును అంగీకరించలేని వర్గాలకు ఇది నచ్చలేదు. విద్య, సామాజిక ఆవరణలో వచ్చిన చలనం ప్రగతి నిరోధకుల ముందు అనేక ప్రశ్నలను ఉంచింది.

ఆర్‌జీఎన్‌ఎఫ్‌ను క్రమం తప్పకుండా ఈ వర్గాలకు అందించాలనే చిత్తశుద్ధి ఆనాటి కాంగ్రెస్‌కైనా ఈ నాటి బీజేపీకైనా ఉంటే కింద చెప్పినట్లు కొన్ని విధాన నిర్ణయాలు జరిగి ఉండేవి. కానీ, జరుగనందున ఈ వర్గాల నుంచి చట్టసభలకు ఎన్నికైన ప్రతినిధులు బాధ్యతతో వ్యవహరించాలి. తమ వర్గం ప్రజల హక్కులను కాపాడేందుకు నడుం బిగించాలి.

 యూజీసీ సంవత్సరానికి రెండుసార్లు నెట్‌ పరీక్షను నిర్వహించి మెరిట్‌ విద్యార్థులకు జేఆర్‌ఎఫ్‌ను ఇస్తుంది. యూజీసీ స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ కావడం వలన కేంద్ర బడ్జెట్‌లో దీనికి అధికారికంగా కేటాయింపులు జరుగుతున్నాయి. ఆ డబ్బును ఫెలోషిప్‌ల రూపంలో క్రమం తప్పకుండా ఇస్తున్నారు కాబట్టి ఆర్‌జీఎన్‌ఎఫ్‌ను ఆయా మంత్రిత్వ శాఖల నుంచి విడదీసి యూజీసీకి అప్పగించి దానికి కావల్సిన డబ్బును కేంద్ర బడ్జెట్‌నుంచి కేటాయించాలి. ప్రచారం కోసం పాలసీని ప్రవేశపెడుతున్న పాలకులు, వాటి అమలు జరగాలంటే నిధుల కేటాయింపును చిత్తశుద్ధిగా చేయాలి. నిధులను నిబద్ధతతో ఆయా వర్గాలకే ఖర్చుచేయాలి.

 పాలకులు కింది వర్గాల విద్యార్థుల మేలు కోసం నిధుల కేటాయింపులు, విడుదల, ఉపయోగం సరైన పద్ధతిలో చేయరు. ఆ సందర్భంలో రిజర్వేషన్‌ ఫలాలతో ఎంపికైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజా ప్రతినిధులు ప్రభుత్వం, అధికారుల మీద ఒత్తిడి తీసుకురావాలి. చట్ట సభలలో ఈ అలసత్వం మీద మేధోపరమైన చర్చలు చేయాలి. ప్రజాస్వామ్యంలో అంతిమ వేదికైన ప్రజాక్షేత్రంలోకి ఈ ప్రజాప్రతినిధులు వెళ్లాలి. తమ ఓట్లతో ఎన్నికైన ప్రభుత్వాలు తమ పిల్లల విద్య కోసం నిధులు కేటాయించడం లేదనీ, విడుదల చేయటం లేదనీ వారికి అర్థమయ్యేలా చెప్పి చైతన్యం చేయాలి.

అసోసియేట్‌ ప్రొఫెసర్‌
ఉస్మానియా విశ్వవిద్యాలయం

RELATED ARTICLES

Latest Updates