– మోడీ అయిదేళ్ల పాలన ఫలితం – ఓటింగ్ సరళి చెప్పిన నిజం
[avatar user=”[email protected]” size=”thumbnail” align=”right”] బి .భాస్కర్ [/avatar]
నరేంద్ర మోడీ ప్రధానిగా రెండోసారి మళ్లీ ఎన్నికయ్యాక దేశంలో వరుసగా విద్వేష దాడులు చోటుచేసుకుంటున్నాయి.
సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అనే నినాదం ఓట్టి బూటకమని గత అయిదేళ్లలో పాలన, ఎన్నికల అనంతర ప్రస్తుత పరిస్థితులు మళ్లీ మళ్లీ నొక్కి చెబుతున్నాయి. ఇందుకు మూల కారణం ఆర్ఎస్ఎస్ హిందుత్వ సిద్ధాంతంలోనే ఉన్నది. 2019 లోక్ సభ ఓటింగ్ సరళిని పరిశీలిస్తే అది విశ్వ స్పష్టమవుతున్నది. సబ్ కా సత్ – సబ్ కా వికాస్ అంటే దేశంలోని అన్ని మతాల ప్రజల పట్ల సమదృష్టి ఉండాలి. భారత రాజ్యాంగ మౌలిక సూత్రం ఇది. అయితే ఆచరణలో బిజెపి ఇందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నది. మైనార్టీలను రెండో తరగతి పౌరులుగా చూస్తున్నది. సంఘ పరివార్ విద్వేష దాడులే ఇందుకు ఉదాహరణ.. 2019 ఎన్నికల ఓటింగ్ సరళిని సెంటర్ ఫర్ స్టడీస్ ఆన్ డెవలప్ ఇన్ సొసైటీస్ సంస్థ దేశవ్యాప్తంగా అధ్యయనం జరిపింది. ఈ సర్వే వివరాలు దేశంలో నెలకొన్న మత విభజన వాతావరణాన్ని తెలియజేస్తున్నది. 2014లో 36 శాతం మంది హిందువులు బిజెపికి ఓటు వేయగా ప్రస్తుతం ఈ సంఖ్య 44 శాతానికి పెరిగింది. అదే ఎన్డీఏ కైతే 51 శాతం మంది హిందువులు ఓటేశారు. అలాగే హిందూ బీసీలను తీసుకుంటే 44 శాతం దళితులు 34 శాతం మంది భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారు. సంఘ పరివార్ సోషల్ ఇంజనీరింగ్ ఫలితమిది. గత ఎన్నికలతో పోలిస్తే దళితులు పది పాయింట్లు ఆదివాసీలు 7 పాయింట్లు బిజెపికి అధికంగా ఓటేశారు. అదే ముస్లింల అయితే 8 శాతం, క్రైస్తవులు 11% బిజెపికి ఓటు వేశారు. ముస్లిం ఓట్లు ఎక్కువగా ఉన్న అస్సాం, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, రాష్ట్రాలలో మత విద్వేష వాతావరణాన్ని కలిగించి బిజెపి గత ఎన్నికల కన్నా అధిక శాతం హిందువుల ఓట్లు పొందింది. లోక్ నీతి, సి ఎస్ డి ఎస్ సర్వే ప్రకారం 10 శాతం కన్నా తక్కువ ముస్లిం జనాభా ఉన్నచోట బిజెపికి 45 శాతం హిందూ ఓట్లు వచ్చాయి. అదే 20 నుండి 40 శాతం ముస్లిం జనాభా ఉన్న ప్రాంతాల్లో 59 శాతం హిందూ ఓట్లు వచ్చాయి. దేశంలో మెజార్టీ హిందువులు బిజెపి అంటే తమకు అభిమానమని చెప్పగా అయిదుగురిలో నలుగురు ముస్లింలు తాము ఆ పార్టీని వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. తన ఐదేళ్ల పాలనలో మోడీ సబ్ కా సత్ నినాదం బూటకమని పై అధ్యయనం రుజువు చేస్తున్నది. గత 5ఏళ్లుగా, నేటికీ కొనసాగుతున్న విద్వేష దాడులు దీన్ని రుజువు చేస్తున్నాయి.
– (రచయిత సీనియర్ జర్నలిస్టు)