కాశ్మీర్లో ఈయూ ఎంపీల పర్యటన

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

-ఆహ్వానించిన మోడీ ప్రభుత్వం
– తీవ్రంగా ఖండించిన లెఫ్ట్‌, కాంగ్రెస్‌
– వాస్తవాలను వెల్లడించాలి : మెహబూబా ముఫ్తీ కూతురు ట్వీట్‌

న్యూఢిల్లీ : జమ్మూకాశ్మీర్‌లో అంతా బాగుందనే అభిప్రాయం కల్పించడానికి మోడీ సర్కార్‌ ప్రయత్నాలు ప్రారంభించింది. మనదేశంలోని రాజకీయ పక్షాలవారిని, కాశ్మీరీ రాజకీయ నాయకుల్ని సైతం స్వేచ్ఛగా తిరగనీయని మోడీ సర్కార్‌, ఈయూ ఎంపీలను కాశ్మీర్‌లో పర్యటించాల్సిందిగా ఆహ్వానించింది. యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ)కు చెందిన 27 మంది ఎంపీలు మంగళ వారం కాశ్మీర్‌లో పర్యటించనున్నారు. ఈసందర్భంగా వారు సోమవారం ఢిల్లీలోని ప్రధాని నివాసంలో మోడీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ను కలిశారు. దీనిపై పీఎంఓ ఓ ప్రకటన విడుదల చేస్తూ.. జమ్మూకాశ్మీర్‌ విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయానికి వారు మద్దతిస్తారని భావిస్తున్నట్టు పేర్కొంది. కాగా ఈ విషయంలో మోడీ సర్కారు తీరును లెఫ్ట్‌ పార్టీలు, కాంగ్రెస్‌ తీవ్రంగా ఖండించాయి. భారత్‌లో ఉన్న పార్టీలు, నాయకులు అక్కడి వాస్తవ పరిస్థితులు తెలుసుకునేందుకు వెళ్తే అనుమతి నిరాకరిస్తున్న మోడీ సర్కారు.. విదేశాలకు చెందిన ఎంపీలను ఎలా అనుమతిస్తుందని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రశ్నించారు. సుప్రీంకోర్టు అనుమతితోనే తాను శ్రీనగర్‌కు వెళ్లానని గుర్తుచేశారు. సీపీఐ జనరల్‌ సెక్రెటరీ డి.రాజా స్పందిస్తూ.. జమ్మూకాశ్మీర్‌లో మానవహక్కుల ఉల్లంఘనపై ప్రపంచదేశాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వాటిని బుజ్జగించడానికే మోడీ సర్కారు ఈ విధంగా వ్యవహరిస్తున్నదని అన్నారు. కాశ్మీర్‌లో అంతా ప్రశాంతంగా ఉందని కేంద్రం చెబుతుండగా.. అక్కడ వాస్తవ పరిస్థితులు మాత్రం దీనికి విరుద్ధంగా ఉన్నాయని రాజా తెలిపారు. ఈయూ ఎంపీల పర్యట నపై కాంగ్రెస్‌ స్పందిస్తూ.. ఇది ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేయడమేనని పేర్కొంది. కాశ్మీర్‌కు వెళ్లాలంటే భారతీయ నాయకులు సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వస్తుందనీ, కానీ విదేశీ ఎంపీలకు మాత్రం పీఎంఓ ఘన స్వాగతం పలుకుతుందని ఆ పార్టీ నాయకుడు జైరాం
రమేశ్‌ అన్నారు. అయితే ఇదే విషయంపై గృహనిర్బంధంలో ఉన్న కాశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ కూతురు ఇల్తిజా జావేద్‌ ట్విట్టర్‌లో స్పందిస్తూ ‘ఎంపీల బృందానికి ప్రజలు, స్థానిక మీడియాతో మాట్లాడే అవ కాశం దొరుకుతుందని ఆశిస్తున్నా. ఇప్పటికైనా జమ్మూకాశ్మీర్‌కు ప్రపం చానికి అడ్డుగా ఉన్న ఇనుపకంచెలను తొలగించాలి. ఈ మేరకు ఎంపీలు పారదర్శకంగా వ్యవహరించాలి’ అని పేర్కొన్నారు. గతవారం పలువురు యూఎస్‌ చట్టసభ్యులు కాశ్మీర్‌లో పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈయూ ఎంపీలు ఇక్కడ పర్యటిస్తుండటం గమనార్హం.
సొపొర్‌లో గ్రనేడ్‌ దాడి.. 15 మందికి గాయాలు
ఈయూ ఎంపీల పర్యటనకు ఒక్కరోజు ముందే బారాముల్లా జిల్లా సోపోర్‌ పట్టణంలో ఉగ్రవాదులు విసిరిన గ్రనేడ్‌ దాడిలో పదిహేను మంది సాధారణ పౌరులు గాయపడ్డారు. పట్టణంలోని ఓ బస్‌స్టాండ్‌లో ప్రయాణికులు బస్‌కోసం వేచి చూస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. రెండ్రోజుల క్రితం శ్రీనగర్‌ జిల్లా కరన్నగర్‌ ఏరియాలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఆరుగురు భద్రతా సిబ్బంది గాయపడిన విషయం తెలిసిందే. కాగా, ఎంపీల పర్యటన నేపథ్యంలో అధికారులు రాష్ట్రంలో హైఅలర్ట్‌ ప్రకటించారు.

Courtesy: NT..

RELATED ARTICLES

Latest Updates