పరిష్కారానికి విరుద్ధంగా ప్రభుత్వ చర్యలు!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

అనువాదం: నెల్లూరు నరసింహారావు
ప్రభాత్‌ పట్నాయక్‌
సెల్‌: 8886396999

బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్‌ పన్నును తగ్గించటం వల్ల ప్రభుత్వ ఖజానానుంచి 1.45లక్షల కోట్లు కార్పొరేట్‌ రంగానికి బదిలీచేసినట్టయింది. భారత ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న మందగమనాన్ని నిలువరించటానికి ఈ చర్య సరిపోదని చాలామంది భావిస్తున్నారు. ఇది కేవలం విషయాన్ని తక్కువగా అంచనా వేయటం కాదు. వాస్తవానికి ఇది పూర్తిగా తప్పుడు అవగాహన. ఆర్థిక వ్యవస్థలోని మందగమనాన్ని అధిగమించటానికి చేయవలసిన దానికి ఈ చర్య పూర్తిగా వ్యతిరేకమయింది. దీని ప్రభావంతో కష్టజీవులపైన మరింత భారం పడటమే కాకుండా సంక్షోభం మరింతగా తీవ్రతరమవుతుంది. దేశంలో సంపద, ఆదాయ పంపిణీ ఉన్నదానికంటే మరింత అపసవ్యంగా మారుతుంది. నిజానికి సంక్షోభాన్ని అధిగమించటానికనే పేరుతో ప్రభుత్వం తీసుకున్న చర్య ఆర్థిక విషయాలలో ప్రభుత్వానికి ఎంత అజ్ఞానం ఉందో, గుత్త పెట్టుబడిని నిస్సిగ్గుగా సంపద్వంతం చేయటానికి అంత వర్గ పక్షపాతం కూడా ఉందని సూచిస్తోంది.
సమిష్టి డిమాండ్‌ తగినంతగా లేకపోవటమే సంక్షోభానికి కారణమనేది సుస్పష్టం. సమిష్టి డిమాండ్‌లో ఏర్పడిన ఈలోటును విత్త సాధనం ద్వారా ప్రభుత్వ జోక్యంతో రెండు రకాలుగా అధిగమించాలి. విత్తలోటు పెంచాలనే ఉద్దేశం లేకపోతే ఎవరైతే తమ ఆదాయంలో తక్కువగా ఖర్చు చేస్తారో వారిపై పన్ను విధించటం ద్వారా వచ్చిన ఆదాయాన్ని ప్రభుత్వ ఖజానాలోకి ప్రత్యక్షంగా చేరేలా చూడటం గానీ లేక ఎవరైతే తమ ఆదాయంలో చాలా భాగాన్ని వినిమయం చేస్తారో వారికి బదిలీగానీ చేయాలి.
ప్రస్తుతం కంపెనీలు తమ ఆదాయంలో ప్రత్యక్షంగా కానీ లేక పరోక్షం (డివిడెండ్ల రూపంలో)గా కానీ వినిమయంపై కష్టజీవులకంటే తక్కువగా వ్యయం చేస్తాయనేది అందరికీ తెలిసిందే. ఎందుకంటే కంపెనీలు పంచని లాభాలను అసలు వినిమయంపై వ్యయం చేయనే చేయవు. అంతేకాకుండా డివిడెండ్ల రూపంలో పంచబడ్డ ఆదాయం కంటే వేతనాల ద్వారా వచ్చే ఆదాయానికే ఎక్కువగా వినిమయంపై వ్యయం చేసే స్వభావం ఉంటుంది. కాబట్టి సమిష్టి డిమాండ్‌లోని కొరతను అధిగమించాలంటే కంపెనీలపైన పన్ను విధించి, దానిపై వచ్చిన ఆదాయాన్ని ప్రభుత్వ వ్యయాన్ని పెంచటానికిగానీ లేక బడ్జెటరీ బదిలీల ద్వారా కార్మికుల ఆదాయాన్ని పెంచటానికి గానీ ఉపయోగించాలి. కార్పొరేట్‌ రంగానికి పన్ను రాయితీలు ఇవ్వటం, తద్వారా తగ్గే ప్రభుత్వ ఆదాయంలో సమతౌల్యాన్ని సాధించటం కోసం విత్తలోటును పెంచకుండా ప్రభుత్వ వ్యయాన్ని కుదించటమో లేక కార్మికులపై మరింతగా పన్నులను విధించటమో చేస్తే అది చేయవలసినదానికి పూర్తి విరుద్ధంగా చేయటమే అవుతుంది. అలా చేయటంవల్ల తగ్గిన సమిష్టి డిమాండ్‌పై మరింతగా ప్రతికూల ప్రభావం పడి సంక్షోభం తీవ్రమవుతుంది.
ఒకవేళ కార్పొరేట్‌ రంగానికి ఇస్తున్న పన్ను రాయితీలను విత్తలోటుతో సమకూరిస్తే సంక్షోభం తీవ్రతరం కాదు. ఎందుకంటే బడా పెట్టుబడిదారులకు ఇస్తున్న రాయితీలకు అవసరమైన వనరుల కోసం ఎవరిపైనా పన్ను విధించటం లేదు గనుక సంక్షోభం తీవ్రతరం కాదు. అయితే పన్ను రాయితీలతో ప్రభుత్వ ఆదాయంలో ఏర్పడే కుదింపును విత్త లోటుతో భర్తీ చేయవలసి వచ్చినప్పుడు కనీసం ఐదు విషయాలను గమనంలో పెట్టుకోవలసిన అవసరం ఉంటుంది.
మొదటిది, ఒకవేళ ఇక్కడ కూడా పన్ను రాయితీల కారణంగా తగ్గిన ప్రభుత్వ ఆదాయాన్ని కొంతవరకు విత్తలోటు ద్వారా, మరికొంత ప్రభుత్వ వ్యయాన్ని కుదించటం ద్వారా గానీ లేక కార్మికులకు చేసే బదిలీలను తగ్గించటం ద్వారా గానీ లేక కార్మికులపై అదనపు పన్నులను విధించటం ద్వారాగానీ పూడిస్తే (ఒకవేళ విత్తలోటుతో పూడ్చే మొత్తం తక్కువగా వుంటే) అప్పటికీ సమిష్టి డిమాండ్‌ తగ్గుతుంది.
రెండవది, ఒకవేళ సమిష్టి డిమాండ్‌ అసలు తగ్గకుండా ఉండటానికి కార్పొరేట్లకు ఇచ్చిన పన్ను రాయితీ మొత్తాన్ని విత్తలోటుతో భర్తీ చేసినప్పుడు కూడా అదే మొత్తాన్ని కార్మికులకు అందేలా చేస్తే లేక ప్రభుత్వమే ప్రత్యక్షంగా వ్యయం చేస్తే పెట్టుబడిదారుల చేతుల్లో ఆ మొత్తం ఉన్నప్పటికంటే చాలా ఎక్కువగా సమిష్టి డిమాండ్‌ పెరుగుతుంది. వేరేవిధంగా చెప్పాలంటే ప్రభుత్వం పన్ను రాయితీల రూపంలో బడా పెట్టుబడిదారులకు అందజేయనున్న 1.45లక్షల కోట్ల రూపాయలతో పంపిణీకి సంబంధించిన సమస్య ఏర్పడటం అటుంచి సమిష్టి డిమాండ్‌ బలోపేతం కానేకాదు.
మూడవది, బడా పెట్టుబడిదారులకు ఇంత పెద్ద మొత్తాన్ని అందజేయటంవల్ల ఇతర మార్గాలన్నింటికంటే తక్కువగా సమిష్టి డిమాండ్‌ ప్రభావితం అవటమే కాకుండా అది అసలు బలోపేతం కానేకాదు. లాభాలకు వేతనాలకంటే తక్కువగా వినిమయంపై వ్యయం చేసే స్వభావం ఉండటమే కాక అది ఒక నిర్దిష్ట కాలంలో వాస్తవంలో సున్నా స్థాయిలో ఉంటుంది. కొంతకాలం తరువాత కార్పొరేట్‌ సంస్థలు పెరిగిన తమ లాభాల నుంచి పంచే డివిడెండ్లతో వినిమయం పెరుగుతుందనేది నిజమే. కానీ అప్పటికే సంక్షోభం తన స్వీయ భారం కారణంగా మరింతగా తీవ్రతరం అయివుంటుంది. వేరేమాటల్లో చెప్పాలంటే కార్పొరేట్లకు ఇచ్చే పన్ను రాయితీల వల్ల ఒక నిర్దిష్ట కాలంలో సమిష్టి డిమాండ్‌ ఏమాత్రం పెరగదు. మనం సంక్షోభ నివారణ చర్యల గురించి చర్చించేటప్పుడు అదే ప్రధానమవుతుంది.
నాలుగవది, సమిష్టి డిమాండ్‌ మీద ఎటువంటి ప్రభావం ఉన్నప్పటికీ, దానిపై అసలు ప్రభావమే లేనప్పటికీ బడా పెట్టుబడిదారులకు విత్త లోటుతో రాయితీలు ఇవ్వటంవల్ల సమాజంలో ఆదాయ, సంపదల పంపిణీ అనివార్యంగా మరింతగా క్షీణిస్తుంది. విత్తలోటు అంటే ప్రభుత్వం అప్పు చేయటం. సంపద ఎవరి చేతుల్లో పోగుపడి వుందో వారే దీనికి ప్రతిరూపం. వాస్తవికంగా ఆలోచిస్తే విత్తలోటును విదేశీ అప్పుతో భర్తీ చేయలేం. దీనితో సంపదను పెంచుకున్నవాళ్ళు దేశంలోని పెట్టుబడిదారులే అయివుంటారు. కాబట్టి ఇటువంటి విత్తలోటుతో పెట్టబడిదారుల చేతుల్లోకి ప్రభుత్వం ద్వారా సంపద చేరటంతో ఆవశ్యకంగా సంపద అసమానతలు మరింతగా పెరుగుతాయి.
అంతిమంగా విత్తలోటు పెరగటం వల్ల భారత ఆర్థిక వ్యవస్థలోకి వచ్చే పెట్టుబడుల ప్రవాహాలు తగ్గుతాయి. ఎందుకంటే పెట్టుబడులు, వాణిజ్యాలపై ప్రభుత్వం నియంత్రణలను విధించాలనుకోవటం లేనందున కరెంటు ఖాతా లోటును పూడ్చటానికి కావలసిన ఫైనాన్స్‌ దొరకటం కష్టమౌతుంది. కార్పొరేట్‌ పన్ను తగ్గించటంతో పాటుగా విదేశీ పెట్టుబడులకు కూడా కొన్ని రాయితీలను ప్రకటించారనేది నిజం. బడ్జెట్‌లో పేర్కొన్న పెంచబడిన సర్‌చార్జి విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులు అమ్మే సెక్యూరిటీలకు క్యాపిటల్‌ గెయిన్స్‌ పన్ను వర్తించదు. వేరేమాటల్లో చెప్పాలంటే బడ్జెట్‌ కి ముందున్న పరిస్థితిని పునరుద్ధరించారు. అంటే ప్రభుత్వం లోటు బడ్జెట్‌ను ఆశ్రయించక పోవటంవల్ల కార్పొరేట్‌ పన్ను తగ్గినందున సమిష్టి డిమాండ్‌ స్థాయి పడిపోతుంది. ఆవిధంగా పైన వాదించినట్టుగా సంక్షోభం మరింతగా తీవ్రతరం అవుతుంది.
ఇప్పటిదాకా మనం వినిమయం ద్వారా సమిష్టి డిమాండ్‌లో ఏర్పడే చలనాల గురించి మాట్లాడుకున్నాం. పన్ను రాయితీ పెట్టుబడులకు ప్రేరకంగా మారటంతో సమిష్టి డిమాండ్‌ బలోపేతం అవుతుందనే వాదన ముందుకు వస్తుంది. అయితే ఈ వాదనలో ఏమాత్రం పసలేదు. ఇప్పటికే ఉన్న పెట్టుబడిపై వాస్తవంలో లాభం రేటు ఎంత ఉన్నప్పటికీ అదనంగా మరికొంత పెట్టుబడి జతవ్వాలంటే ఆశించిన స్థాయిలో లాభాల రేటు ఉండాలి. ఇది ఆశించిన డిమాండ్‌ పెరుగుదలపై ఆధారపడి ఉంటుంది.
ఉదాహరణకు కార్లకున్న డిమాండ్‌లో స్తబ్దత ఏర్పడుతుందని ఆశిస్తున్నారనుకుందాం. అస్తిత్వంలోవున్న ఉత్పాదక సామర్థ్యం ఇప్పటికే ఈ డిమాండ్‌కు అనుగుణంగా ఉన్నందున కార్లను ఉత్పత్తిచేసే కంపెనీలు అదనంగా పెట్టుబడులు పెట్టవు. ఎందుకంటే అలా అదనంగా పెట్టుబడి పెడితే లాభం రేటులో పెరుగుదల ఏమీ ఉండదు. ఇప్పటికే పెట్టిన పెట్టుబడిపై వచ్చే వాస్తవ లాభం రేటు 10శాతమైనా లేక 20శాతమైనా లేక 50శాతమైనా ప్రస్తుత పరిస్థితిలో తేడా ఏమీ రాదు. ఎందుకంటే అదనంగా పెట్టాలనుకునే పెట్టుబడిపై ఆశిస్తున్న లాభం రేటు సున్నాగానే ఉంది గనుక. కాబట్టి కార్పొరేట్‌ పన్ను రాయితీలతో ఇప్పటికే పెట్టిన పెట్టుబడిపై వచ్చే వాస్తవ లాభం రేటు పెరుగుతుందే తప్ప వాటి ప్రభావం నూతనంగా పెట్టే పెట్టుబడులపై ఉండదు.
అంతేకాకుండా అలాంటి పన్ను రాయితీలకయ్యే వ్యయాన్ని పూడ్చటానికి మరొకచోట ప్రభుత్వ వ్యయాన్ని ఎంత తగ్గిస్తారో లేక కష్టజీవుల ఆదాయాన్ని ఏమేరకు కుదింపునకు గురిచేస్తారో ఆ మేరకు సమిష్టి డిమాండ్‌ నికరంగా తగ్గుతుంది. మరిన్ని పన్ను రాయితీల కారణంగా అస్తిత్వంలోవున్న పెట్టుబడులపై వచ్చే పన్ను అనంతర లాభాలు పెరగటంవల్ల నూతనంగా వచ్చే పెట్టుబడులు తగ్గిపోతాయి.
డిమాండ్‌ కొరత కాకుండా తరచుగా నిధుల కొరతవుండే చిన్నతరహా పరిశ్రమల రంగానికి పన్ను రాయితీలను గనుక ఇచ్చినట్టయితే మిగతా విషయాలు అలానేవున్నా అది పెట్టుబడులు పెరగటానికి దారితీసేది. అయితే ఈ రాయితీలను ఫైనాన్స్‌ కొరత కాకుండా పూర్తిగా డిమాండ్‌ కొరతవున్న కార్పొరేట్‌ రంగానికి ఇవ్వటం జరుగుతోంది. మిగిలిన విషయాలు అలానే ఉన్నప్పుడు కొత్త పెట్టుబడులను ఇది అసలు ప్రభావితం చేయదు. అటువంటి పన్ను రాయితీల పర్యవసానంగా తగ్గిన సమిష్టి డిమాండ్‌ని పరిగణనలోకి తీసుకున్నప్పుడు నికరంగా పెట్టుబడులు తగ్గుతాయి.
కాబట్టి మోడీ ప్రభుత్వ ‘ప్రేరక’ చర్య దుష్ప్రభావం కారణంగా ఆర్థిక వ్యవస్థలో ఒకవైపు ఆదాయ, సంపదల పంపిణీ క్షీణిస్తుండగా మరోవైపు ఉత్పత్తి, ఉద్యోగితలు దెబ్బతింటాయి. అయితే ఈ ప్రభుత్వ చర్య మనల్ని ఏమాత్రం ఆశ్చర్యపరచదు. ఎందుకంటే దానికి అర్థశాస్త్రం పట్ల ఏమాత్రం అవగాహన లేదు.

RELATED ARTICLES

Latest Updates