పీవీ, ఎన్టీఆర్‌ సమాధుల్ని కూల్చేయండి

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

 మజ్లిస్‌ ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌  వివాదాస్పద వ్యాఖ్యలు

హైదరాబాద్‌: ఆక్రమణలను తొలగించేందుకు చట్టం తెస్తున్నామని చెప్పిన సీఎం కేసీఆర్‌.. హుస్సేన్‌సాగర్‌పై ఉన్న ఆక్రమణల గురించి మాట్లాడతారా అని మజ్లిస్‌ ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ ప్రశ్నించారు. వరదలతో నగరం అతలాకుతలమైందని… ప్రజలను ఆదుకోవాలంటూ తాము డిమాండ్‌ చేస్తే.. చెరువులను ఆక్రమించి ఇళ్లుకట్టుకున్నందుకే ఈ దుస్థితి వచ్చిందంటూ సీఎం చెబుతున్నారని విమర్శించారు. హుస్సేన్‌సాగర్‌ నిర్మించినప్పుడు 4,700 ఎకరాలుండగా.. ప్రస్తుతం 700 ఎకరాలు కూడా లేదని చెప్పారు. హుస్సేన్‌సాగర్‌ వద్ద ఉన్న మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు, ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టీ రామారావు సమాధులను కూల్చేయాలని, ట్యాంక్‌బండ్‌పై ఉన్న విగ్రహాలనూ తొలగించాలని ఈ సందర్భంగా  అక్బరుద్దీన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎర్రగడ్డ డివిజన్‌లో మంగళవారం రాత్రి జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. గ్రేటర్‌ ప్రజలకు సేవలందిస్తున్న బల్దియా ప్రధాన కార్యాలయం కూడా నాలాను ఆక్రమించి కట్టారని ఆరోపించారు. అక్కడున్న ఆక్రమణలపై మాట్లాడని ప్రభుత్వ అధికారులు బడుగుబలహీన వర్గాల ఇళ్లను కూల్చేందుకు ఆగమేఘాలపై వస్తారని విమర్శించారు.

ఎప్పుడిస్తారు.. రెండు పడకల ఇళ్లు?
తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఇస్తామంటూ చెబుతోందని, నగరంలో పేదలందరికీ ఎప్పుడు ఇస్తారో చెప్పాలని అక్బరుద్దీన్‌ డిమాండ్‌ చేశారు. మాయమాటలు చెబుతున్న తెరాస నాయకులు ఈ విషయంలో ఇంకా ఎన్నిరోజులు ప్రజలను మభ్యపెడతారంటూ విమర్శించారు.

కిషన్‌రెడ్డిని బర్తరఫ్‌ చేయాలి: అసదుద్దీన్‌
హైదరాబాద్‌లో పాకిస్థాన్‌, బర్మా రోహింగ్యాలు ఉంటున్నట్లయితే కిషన్‌రెడ్డిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ డిమాండ్‌ చేశారు. భోలక్‌పూర్‌ ఎంఐఎం అభ్యర్థి గౌసుద్దీన్‌ తరఫున బుధవారం ఎన్నికల సభలో ఆయన మాట్లాడారు. పాతనగరంలో కాదు, ప్రధానమంత్రి మోదీకి దమ్ముంటే చైనాపై  సర్జికల్‌ స్ట్రైక్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.

Courtesy Eenadu

RELATED ARTICLES

Latest Updates