– ఢిల్లీ అల్లర్లపై అరుంధతీరారు
న్యూఢిల్లీ : దేశరాజధానిలో చోటుచేసుకున్న అల్లర్లు, సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్ వ్యతిరేక ఆందోళనలపై బీజేపీ వ్యవహరిస్తున్న తీరుపై ప్రముఖ రచయిత్రి అరుంధతీరారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది భారత్కు పట్టిన కరోనా వైరస్ అని ఆమె అభివర్ణించారు. ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద జరిగిన ధర్నాలో పాల్గొన్న అరుంధతీరారు మాట్లాడుతూ… ప్రధాని మోడీది ఫాసిస్టు పాలన అని ఆరోపించారు. ఢిల్లీ ఘటనలో చనిపోయినవారంతా ఫాసిస్టు ప్రధాని పాలనలో బాధితులేనని విమర్శలు చేశారు. 18 ఏండ్ల క్రితం గుజరాత్‌లోనూ ఆయన ఇదే విధంగా నరమేధానికి పాల్పడ్డారని చెప్పారు. ఢిల్లీ అల్లర్లకు బీజేపీ నాయకుల రెచ్చగొట్టే ప్రసంగాలే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఫాసిస్టులకు, ఫాసిజానికి వ్యతిరేకంగా పోరాడుతున్న వారి మధ్య పోరు అని అన్నారు. కేంద్రం తీసుకొచ్చిన సీఏఏ, ప్రతిపాదిత ఎన్నార్సీ, ఎన్పీఆర్‌ల ప్రధాన ఉద్దేశం ప్రజలను మత ప్రకారం విడదీయడమేనని చెప్పారు. అవి రాజ్యాంగానికి వ్యతిరేకమని అన్నారు. ‘రాజ్యాంగాన్ని కొంతవరకు విబేధించొచ్చు లేదా అంగీకరించవచ్చు.
కానీ అది ఉనికిలో లేకుండా చేయడం అంటే ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయడమే. బహుశా వారి లక్ష్యం కూడా ఇదే. ఇది భారత్కు పట్టిన కరోనా వైరస్. దీనివల్ల మేం అనారోగ్యానికి గురయ్యాం’ అని ఆమె తెలిపారు.
Courtesy: NT