ఒకే దేశం ఒకే ఎన్నిక నినాదం వెనుక అసలు వాస్తవాలు
[avatar user=”[email protected]” size=”thumbnail” align=”right”]- బి. భాస్కర్[/avatar]
ఎన్నికల్లో రెండోసారి గెలిచిన వెంటనే నరేంద్ర మోడీ ఒకే దేశం – ఒకే ఎన్నిక నినాదాన్ని సాకారం చేసేందుకు సంకల్పించారు. ఒకే దేశం ఒకే పన్ను పేరిట అవకతవకల జీఎస్టీని ప్రజలపై రుద్దిన మోడీ తన తొలి ఇన్నింగ్స్ లోనే ఈ అంశాన్ని చర్చకు పెట్టారు. ఇప్పుడు అందుకు అవసరమైన రాజ్యాంగ సవరణ కోసం కసరత్తు మొదలుపెట్టారు. అఖిల పక్ష పార్టీలతో చర్చల ప్రక్రియ ఈ వ్యూహంలో భాగమే. లా కమిషన్ ముసాయిదా నివేదిక ప్రధాని ప్రయత్నానికి కొమ్ముకాసేదిగా ఉన్నది. దేశంలో ఏడాది పొడవునా ఎక్కడో ఓ చోట ఎన్నికలు జరుగుతున్నాయని దీనివల్ల అధిక వ్యయము, ఎన్నికల కోడ్ అమలు వల్ల ప్రజా సంక్షేమ, అభివృద్ధి పనుల నిలిపివేత, సర్కారు కార్యకలాపాల స్తంభన జరుగుతున్నదని అందువల్ల లోక్ సభ, అన్ని రాష్ట్రాల శాసన సభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ఈ సమస్యలన్నీ పోతాయని మోడీ సర్కార్ నమ్మబలుకుతున్నది. ఇందుకోసం రాజ్యాంగంలోని ఆర్టికల్ 172 సవరణకు తహతహ లాడుతున్నది. రాజ్యసభలో తగిన సంఖ్యాబలం లేనందున వల్ల ఈ చర్చల ప్రక్రియ ప్రారంభించింది కానీ లేకుంటే ఏకపక్షంగా బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేసిఉండేది. 30 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకుగాను 18 చోట్ల ఎట్లాగు బిజెపి దాని మిత్రపక్షాల ప్రభుత్వాలు ఉండనే ఉన్నాయి.
మనకు స్వాతంత్రం వచ్చాక 1951- 1952 లో తొలి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. 1968లో కొన్ని అసెంబ్లీల రద్దు, 1970 లోక్ సభ రద్దు దాకా లోక్ సభ రాష్ట్రాల శాసనసభల ఎన్నికలు కలిసే నిర్వహించబడ్డాయి. అప్పటి నుంచి లోక్ సభ రాష్ట్రాల శాసనసభల ఎన్నికలు ఆయా షెడ్యూల్‌లకు అనుగుణంగా జరుగుతున్నాయి.
ఏక పార్టీ నియంతృత్వానికి దారి: మనది భిన్న జాతులు, సంస్కృతులు భాషలు ప్రాంతాలు గల బహుళ బహుజన సమాజం. దేశవ్యాప్త కాంగ్రెస్ ఆధిపత్యానికి గండికొడుతూ ఆయా ప్రాంతాల, సంస్కృతుల, సామాజిక శక్తుల నాయకత్వంలో ప్రాంతీయ పార్టీలు ఏర్పడ్డాయి. ఆయా రాష్ట్రాలలో అధికారానికి వచ్చాయి. తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి, వైయస్ఆర్ కాంగ్రెస్, డి.ఎం.కె, ఏ.ఐ.డి.ఎం.కె, జార్ఖండ్ ముక్తి మోర్చా, సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, అకాలీదళ్, అసోం గణపరిషత్… ఇలా చెప్పుకుంటూ పోతే స్థానిక ప్రాంతాలు, సముదాయాల ఆకాంక్షలకు అనుగుణంగా కేంద్ర ఆధిపత్యానికి నిరసనగా తమ ప్రాంత సముదాయాల ఉన్నతి లక్ష్యంగా వివిధ పార్టీలు ఆవిర్భవించాయి. సుహల్దేవ్ పార్టీ వంటి సబల్ టరన్ పార్టీలోచ్చాయి. కమ్యూనిస్టు పార్టీల నాయకత్వంలో లెఫ్ట్ ఫ్రంట్, లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్లు కేరళ, బెంగాల్ లను పాలించాయి. కాంగ్రెస్ నియంతృత్వానికి వ్యతిరేకంగా సోషలిస్టు నాయకుడు డాక్టర్ రామమనోహర్ లోహియా స్ఫూర్తితో పలు ఉత్తరాది రాష్ట్రాలలో సంయుక్త విధాయక్ దళ్ సర్కార్లు ఏర్పడ్డాయి. ఏక పార్టీ ఆధిపత్యానికి గండిపడిన తర్వాత కేంద్రంలోనూ సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. వీటిల్లో పలు సర్కారులు మధ్యలో పతనం చెందగా మధ్యంతర ఎన్నికలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఒకే దేశం ఒకే ఎన్నిక ఉద్దేశం మంచి చెడుల్ని బేరీజు వేయవలసిన అవసరం ఉన్నది. ఏ నినాదం వెనుక ఏ కుట్ర ఉన్నది బయటపెట్టాల్సి ఉన్నది. ఇప్పటికే మోడీ పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని అధ్యక్ష తరహా పద్ధతిలో నిర్వహిస్తున్నారు. అన్ని అధికారాలు ఆయన చుట్టూనే కేంద్రీకృతమయ్యాయి. బహుళత్వం అధికంగా ఉన్న భారతదేశంలో పార్లమెంటరీ విధానమే మంచిదని రాజ్యాంగ నిర్మాతలు భావించారు. అందుకు అనుగుణంగానే రాజ్యాంగాన్ని రచించారు. కాంగ్రెస్ ముక్త్ భారత్ పేరిట మోడీ నేడు ప్రతిపక్షాల ముక్త భారత్ కు వ్యూహం పన్నారు. ఇందుకు ఒకే దేశం ఒకే ఎన్నిక ముఖ్య అస్త్రం కానున్నది. ఈ తరహాలో దేశమంతటా ఒకేసారి లోక్ సభ రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికలు నిర్వహిస్తే ఆదిపత్య జాతీయ పార్టీలకు భారీ లాభం చేకూరుతుందని సెంటర్ ఫర్ డెవలపింగ్ సొసైటీస్ కి చెందిన ప్రొఫెసర్ సంజయ్ కుమార్ అభిప్రాయపడ్డారు. 1999లో 68 శాతంగా ఉన్న ఈ సరళి 2014 ఎన్నికల నాటికి 86 శాతానికి చేరుకుందని ఎన్నికల విశ్లేషకుడు ప్రవీణ్ చక్రవర్తి అంచనా వేశారు. అంటే 90 శాతం ఆధిపత్యం బిజెపికే లభించే అవకాశం ఉందన్నమాట. ఇది భిన్నత్వాన్ని కాల రాశి సమాజాన్ని హిందుత్వరీకరించడమే. సావర్కర్ ఆశయం ఇదే కదా మరి. ఇక తరచూ ఎన్నికల వల్ల ధన ప్రవాహం గురించి విశ్లేషిద్దాం.
ఎన్నికల సంస్కరణలు అవసరం: ఎన్నికల్లో నిబంధనలను అతిక్రమించి అభ్యర్థులు పదులు, వందల కోట్ల ధనాన్ని వెచ్చిస్తున్నారు. నిజానికి దీన్ని అరికట్టాలన్న సంకల్పం ప్రభుత్వానికి గనక ఉంటే జస్టిస్ తార్కుండే కమిటీ వంటి కమిటీల సిఫార్సు అయిన పబ్లిక్ ఫండింగ్ విధానం ప్రవేశపెట్టేదే. అప్పుడు అభ్యర్థులు ఎవరు స్వంతంగా ఖర్చు పెట్టుకోవడానికి వీలు పడదు. ఇంకా ఓట్లు కొనుగోలు వంటి పోకడల్ని అడ్డుకట్ట వేయడానికి ఎన్నికల కమిషన్ కఠిన నిఘా పెట్టవచ్చు. కమిషన్ అధికారాలు పెంచవచ్చు. ఎన్నికల నిర్వహణ ప్రక్రియ నెలల తరబడి సాగకుండా అతి తక్కువకు కుదించటం, ఎన్నికల కోడ్‌ను ఆధునికరించడం, ఎన్నికల తరుణంలో రోజువారీ సాధారణ పరిపాలనకు ఆటంకం ఏమి లేకుండా చేయటం కష్టమేమీ కాదు. ఇక కేంద్రంలోగానీ, రాష్ట్రాల్లోగానీ ప్రభుత్వాలు మధ్యలో పడిపోతే అప్పుడు రాష్ట్రపతి, గవర్నర్ పాలనను సుదీర్ఘ కాలం పెడతారా? ఇది అత్యంత అప్రజాస్వామిక చర్య. అందువల్ల ఒకే దఫా ఎన్నికల ప్రతిపాదనలు మాని సమగ్ర ఎన్నికల సంస్కరణలు, దామాషా పద్ధతి వంటివి అమలు చేయటం ఉత్తమం. దళిత బహుజనులను బలవంతంగా హిందుత్వీకరించే ఆర్ఎస్ఎస్ ఎజెండాలో ఒక భాగమే ఈ ఎన్నికల కుట్ర. ప్రతిపక్షాలు ప్రగతిశీల శక్తులు ఐక్యంగా నిలిచి సంఘ పరివార్ హిందూ రాజ్యస్థాపన కుట్రలను చేధించాలి.
(రచయిత సీనియర్ జర్నలిస్ట్)