మనుషులు మామిడికాయలు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

#మనుషులు_మామిడికాయలు

(మానవ హక్కుల వేదిక సభ్యులుగా యేడిద రాజేష్, ముత్యాల శ్రీనివాస్, నామాడి శ్రీధర్ నేనూ కల్సి చేసిన నిజనిర్దారణకి సంబంధించిన సంక్షిప్త స్పందన ఇది. పూర్తి నివేదిక కాదు.)

బిక్కి శీను వ్యవసాయ కూలీ, వయసు 32 భార్య, ఇద్దరు పసికూనలు. అత్తగారింటికి వెళ్ళి దారిలో మటన్ కొనుక్కుని మామిడికాయతో ఇంటికొచ్చి వండుకుందామని ఆశపడి, దార్లో ఎలాగూ గాలివాన వర్షం కురుస్తోంది కాబట్టి పడ్డ కాయలు ఏరుకున్నాడు. రాలిపడ్డ మామిడికాయలకు మనిషి ప్రాణాల్ని తీసేంత శక్తి ఈ దేశంలో ని కులాధిపత్యానికి ఉందనే విషయం గ్రహించేలోపే అతడి ప్రాణాలు గాల్లో కల్సిపోయాయి. మామిడి తోట కౌలుకి తీసుకున్న ఇద్దరు (ఒకరు ఒసి కాపు, మరొకరు బిసి శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన వారు) శీనుని తోట దగ్గర కొట్టడమే కాక ఏకంగా పంచాయతి ఆఫీసుకి తీసుకొచ్చి చిత్రవధ చేసి హత్య చేసారు.

అది కూడా మామూలుగా కాదు. ఒళ్ళంతా కర్రలతో కుళ్ళబొడిచీ, మర్మాంగాలి, వృషనాల పై కొట్టీ, గుద మార్గంలో కర్రలు దూర్చి, విచక్షణారహితంగా చితక్కొట్టీ చంపారు.(చూసిన బంధువుల వెర్షనేకానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇంకా రాలేదు) అతడికీ, వీళ్ళకీ అసలు పరిచయం లేదు సరికదా అంతకుముందు మొహంకూడా చూడలేదు. పాత కక్షలు కూడా ఏవీ లేవు. అయినప్పటికీ ఈ దేశంలో మనుషుల్ని ప్రేమించే , గౌరవించే రాజ్యాంగాన్ని అమలు చేయడం కష్టంకానీ ద్వేషింపజేసేందుకు మనుస్మృతి ఎల్లప్పుడూ అమల్లోనే ఉంటుందనడానికి ఈ సంఘటన ఒక పరాకాష్ట.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందనీ, రాజ్యాంగం ముందు అందరూ సమానమేనని రాత్రీపగలూ గొంతులు చించుకునే దేశంలో , రాజ్యాంగ వ్యవస్థ స్వరూపమైన ప్రభుత్వ కార్యాలయంలో పట్టపగలు మిట్టమధ్యాహ్నం వేళ గ్రామస్తులందరి ముందు సాక్షాత్తూ అధికారులతో కల్సి దళితుడి ప్రాణాలు తీసి, దానిని ఆత్మహత్య గా చిత్రీకరించడం, అమలులో ఉంది రాజ్యాంగం కాదు మనుస్మృతనే నిజాన్ని మరోసారి నిరూపించింది. కులాహంకారం, భూస్వామ్య వాసనలు మన గ్రామాల్లో కాలాతీతమనే వాస్తవం మహమ్మద్ అఖ్లక్ హత్య మొదలు అశీఫా హత్య వరకూ అడుగడుగునా రుజువౌతూనే ఉంది.

అందుకే బాధితులకి ఆర్ధికంగా చేయూతనిచ్చో, అతడి భార్యకో ప్రభుత్వోధ్యోగం, పిల్లలకి చదువులనే డిమాండు లతో ఆగిపోకుండా దేశవ్యాప్తంగా పెట్రేగుతున్న ఆధిక్యత కులోన్మాద, మతోన్మాద సంస్కృతికి అడ్డుకట్ట వేసే కార్యక్రమం ప్రత్యామ్నాయ సంస్కృతి నిర్మాణంలో భాగంగా రూపొందించుకోవడం అవసరమనే భావన కలగజేయడం ఎంత ముఖ్యమో ప్రజాస్వామ్య సంస్థలు సైతం గుర్తించడం ఇందులో ప్రధాన భూమిక.అలా కాకపోతే ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి.

మృతుడి కుటుంబంతో రాజీబేరాలకి చివరిదాకా ప్రయత్నం చేసిన నిందితులు, ఆధిపత్య శక్తులు కేసును నీరుకార్చడానికి చేయని ప్రయత్నం లేదు. గొల్లలమామిడాడ దళిత ఐక్యతకి చిహ్నంగా హత్య జరిగిన గ్రామంలో ఒక్కరు కూడా సహకరించకపోయినా, పోలీసులు అధికారులతో కుమ్మకై కనీసం మంచినీళ్ళివ్వకుండా , మృతుడ్ని చూడనివ్వకుండా , ఘటన జరిగిన స్థలానికి కుటుంబ సభ్యులని కూడా అనుమతించకుండా దుర్మార్గంగా వ్యవహరించినా మొక్కవోని చైతన్యంతో మాలమాదిగలు సుమారు రెండొందల పైచిలుకు జనం కుండపోత వర్షంలో ధర్నా చేసి 302 సెక్షన్ తో కేసు నమోదు చేసి ఎఫ్, ఐ. ఆర్ నమోదు చేసేదాకా నిరసన వ్యక్తం చేసి ఉద్యమించిన తీరు ప్రజాఉద్యమాల ఐక్యతకి తిరుగులేని చిహ్నం. మనుషుల ప్రాణాల్ని తీసేయడం మామిడికాయలు కోయడమంత సులువు కాదనడానికి సంకేతం.

నిన్న నిజనిర్ధారణకి హత్య జరిగిన గ్రామానికి వెళితే గ్రామస్తులు స్పందించిన తీరు విస్మయం కల్గించింది. సింగంపల్లి మొదలు రంగం పేట పోలీసుల వరకూ తిరిగినా బాధితుల్ని కల్సే వరకూ సరైన సమాచారం కూడా అందలేదు. ఘటన జరిగిన రోజు రాత్రి ఊరంతా విద్యుత్ నిలుపుచేసారంటే, కులాధిపత్యానికి మొత్తం వ్యవస్థ మౌనం రూపంలో ఇచ్చే మద్దతు ఎంత స్థాయిలో ఉంటుందో తెలుసుకోడానికి ఇదో ఉదాహరణ.

దేశవ్యాప్తంగా దళితబహుజన ఆదివాసీ మైనారిటీలు స్త్రీల పై నిత్యం జరుగుతున్న దారుణాల్లో భాగంగా సమాజం మొత్తం అమలవుతున్న దుర్మార్గమయిన ఆధిపత్య అమానవీయ సంస్కృతి పై పోరాటం చేయడంతో పాటూ ప్రజాస్వామిక రాజ్యాంగ విలువల్ని బలోపేతం చేయడానికి నిబద్ధతగా ప్రయత్నం చేయడమే ప్రజా ఉద్యమాల తక్షణ కర్తవ్యం.

ఘటన జరిగినప్పుడు వచ్చే ప్రజా స్పందన సాధారణంగా చట్టపరమైన విచారణలో కొనసాగదు. అలా కాకుండా, నిందితులకి శిక్షలు పడేలా చేయడంతోపాటు భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఒక బలమైన ప్రజాస్వామిక విలువల నిర్మాణానికి నడుం కట్టడం ప్రజాస్వామ్య శక్తుల బాధ్యత.

– written by Gourav M

RELATED ARTICLES

Latest Updates